ఆగిన ఎస్‌ఎస్ కెనాల్ నిర్మాణ పనులు, అభివృద్ధికి నోచుకోని ఎన్టీఆర్ కాలనీ
సాక్షి, వెంకటగిరి: ముఖ్యమంత్రి తమ ప్రాంతంలో పర్యటించి సమస్యల పరిష్కారంపై హమీ ఇచ్చారంటే ఆ ప్రాంతవాసులకు ఆనందమే.. ఆనందం. చిరకాల సమస్యలతోపాటు తమ వ్యక్తిగత సమస్యలూ పరిష్కారం అవుతాయని వారి భావన. ఇదే వెంకటగిరీయుల్లోనూ కనిపించింది. అయితే నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా జన్మభూమి కార్యక్రమంలో భాగంగా డక్కిలి, వెంకటగిరిలో వరదలు పోటెత్తిన సమయంలో 2015 నవంబర్ నెలలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించి ఇచ్చిన హమీలకు ఏళ్లు గడుస్తున్నా మోక్షం లభించని దుస్థితి. దీంతో చంద్రబాబు హామీలను నమ్మలేం అంటూ స్థానికులు పెదవి విరుస్తున్నారు.
సమన్వయం లేక ఆగిన ఎస్‌ఎస్ కెనాల్
జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు సాగునీటి నిల్వలు అందించడంతోపాటు తాగునీటి సమస్యను దూరం చేయాలన్న సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.350 కోట్లు అంచనా వ్యయంతో తెలుగుగంగ అధికారుల పర్యవేక్షణలో మూడు ప్యాకేజీలుగా పనులు విభజించి ప్రారంభించారు. కాలువ నిర్మాణం చేపట్టే ప్రాంతాల్లో పలు చోట్ల అటవీ అనుమతులు రావాల్సి ఉన్నా అప్పట్లో అటవీశాఖ మంత్రిగా పనిచేసిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కె రామకృష్ణల మధ్య సమన్వయం లేక ప్రాజెక్ట్ ప్రశ్నార్థకం అయింది. కాలువ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం సకాలంలో అందక పనులు నత్తనడకన సాగాయి. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు నీటిని పంపి అక్కడ నుంచి తెలుగుగంగ ద్వారా తమళనాడు ప్రజల దాహార్తిని తీర్చుతున్న చందంగా కండలేరు జలాలను ఎస్‌ఎస్ కెనాల్‌కు అందించేందుకు వీలుగా నియోజకవర్గంలోని అల్లూరుపాడు వద్ద రూ.230 కోట్లతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఎస్‌ఎస్ కాలువ నిర్మాణ పనుల్లో జాప్యం కారణంగా ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ పనులు ఎప్పటికీ పూర్తవుతాయోనని స్థానికులు ఎదురు చూస్తున్నారు.
తప్పుడు కేసులు.. అరదండాలు
జిల్లాలో ఎక్కడా లేని విధంగా ప్రశ్నించిన స్వపక్ష నేతలపైనా పోలీసు కేసులు పెట్టించి జైల్లో కూర్చోపెట్టించిన చరిత్ర వెంకటగిరికే సొంతం. అధికారపార్టీకి చెందిన టీడీపీ కౌన్సిలర్ మంచి బాబు కౌన్సిల్ సమావేశాల్లో అధికారుల తీరు, కమీషన్‌ల వ్యవహరంపై ప్రశ్నించినందుకే పెన్షన్ వ్యవహరంలో కేసు నమోదు చేయించి బేడీలు వేయించారు. ఇక విపక్షానికి చెందిన నాయకుల మీద అయితే ఐదేళ్లలో లెక్కలేనన్ని తప్పుడు కేసులు నమోదు చేయించారు. వెంకటగిరి మండలం సిద్ధవరం గ్రామానికి చెందిన సుమారు 57 యాదవ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలవారికిపై సామూహికంగా కేసులు పెట్టించిన సంఘటన వెంకటగిరిలో సంచలనం రేపింది. వివాదరహితులైన వెంకటగిరి రాజా కుటుంబీకులు సైతం ‘నిన్ను నమ్మం బాబూ’ అంటూ టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరడం నియోజకవర్గంలో రాజకీయ సంచలనానికి కేంద్ర బిందువయింది. ఐదేళ్లలో చేసిన పాపాలే శాపాలై పచ్చపార్టీ నేతలకు బుద్ధి చెప్పేందుకు అందరూ రంగం సిద్ధం చేసుకుని పనిచేస్తున్నారు.
ఎన్టీఆర్ మోడల్ కాలనీ ఊసే మరిచారు!
సీఎం చంద్రబాబు నాయుడు అదే సంవత్సరం నవంబర్ 20వ తేదీన ఆ కాలనీలో పర్యటించి హామీల వర్షం కురిపించారు. తెలుగుదేశం వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేరుతో ఉన్న కాలనీ అభివృద్ధిని తన బాధ్యతగా తీసుకుని తక్షణమే డ్రెయినేజీలు, సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించి మోడల్‌కాలనీగా మార్చేస్తానని తెలిపారు. ఇది జరిగి సరిగ్గా 40 నెలలు గడిచింది. అయినా ఆ హామీకి సంబంధించి పురోగతి లేకుండా పోయింది. సీఎం హమీల అమలులో ప్రధానభూమిక పోషించాల్సిన అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యే రామకృష్ణ, అధికారులు ప్రతిపాదనలు పంపి చేతులు దులుపుకున్నారు. ఏళ్లు గడుస్తున్నా సీఎం హమీ అమలుకాకపోవడంతో ఆ ప్రాంతంవాసుల్లో తీవ్ర నిరాశ అలముకుంది.
సీఎం సారు రావడంతో తమ కాలనీ రూపురేఖలు మారుతాయని భావించామని, అయితే ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనుషులు లేని చోట రోడ్లు వేసిన స్థానిక టీడీపీ నాయకులు ఏళ్ల తరబడి వర్షం వస్తే మోకాల్లోతు నీళ్లలో నడవాల్సిన ప్రాంతాన్ని విస్మరించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే తాము సీఎం హమీ మేరకు రూ.16 కోట్లతో ప్రతిపాదనలు పంపామని అధికారులు చేతులు దులుపుకున్నారు. ఇక వెంకటగిరి నుంచి నాయుడుపేట మండలం వరకూ ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మిస్తామని ఇచ్చిన హామీకి దిక్కులేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నేతన్నల హమీలదీ అదే దారి!
అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకున్న చేనేత రంగం పాలకుల నిర్లక్ష్యం కారణంగా నేడు కళాహీనంగా మారింది. శ్రమకు తగ్గ కూలీ లేకపోవడం, మార్కెట్‌లో ముడిసరుకు ధరలు చుక్కలు తాకడం, ప్రభుత్వ పథకాలు దరిచేరకపోవడం వెరసి చేనేతలు మగ్గాన్ని వీడి ఇతర వృత్తుల్లోకి వెళుతున్నారు. గతంలో ప్రభుత్వం చేనేత కార్మికులకు నెలకు రూ.1000 వంతున ఇస్తున్న సిల్క్ సబ్సిడీని గత 7 నెలలుగా చెల్లించకుండా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో చేనేత కార్మికులకు నెలకు రూ.2000 ఇస్తామని హమీలు ఇస్తున్న చంద్రబాబును ఎలా నమ్మాలని చేనేత కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఇక నేతన్నల కుటుంబానికి నెలకు 150 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ, వర్షాకాలంలో పనిదినాలు కోల్పోతున్నందుకు నెలకు రూ.2000 వంతున 2 నెలలకు రూ.4000 పరిహారం వంటివి నమ్మదగ్గ హామీలు కాదని వారు పెదవి విరుస్తున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ హామీ అమలు సైతం మరిచిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment