సాక్షి, వెంకటగిరి: ప్రజాస్వామ్యాన్ని అపçహాస్యం చేసేలా ప్రభుత్వ సంక్షేమ పథకాలను తమ సొంత పార్టీ మనుషులకే అందేలా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలు ఐదేళ్లుగా రాజకీయ రాక్షస మూకల కమిటీలుగా మారాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో నెగ్గిన ప్రజాప్రతినిధులు, ఎన్నో కఠిన పరీక్షల్లో పాసై ప్రభుత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులను ఉత్సవ విగ్రహాలుగా మార్చాయి. జన్మభూమి కమిటీల పెత్తనాన్ని ప్రశ్నించలేక జనం సైతం బాధితులుగా మిగిలిపోయారు. ఐదేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో పాలన సాగించింది జన్మభూమి కమిటీలే. అధికారుల సాయంతో ప్రజాప్రతినిధులు పాలన సాగించాల్సి ఉండగా గతంలో రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీ సభ్యులు వ్యవస్థలో రాజ్యాంగేతర శక్తులుగా రెచ్చిపోయారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. పటిష్టంగా వ్యవహరించాల్సిన అధికార వ్యవస్థ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో జన్మభూమి కమిటీలకు దాసోహం అయిందని స్థానికులు చెబుతున్నారు.
వ్యవస్థలను అపహాస్యం చేస్తూ..
ప్రభుత్వ పథకాల అమల్లో ఈ కమిటీలదే పెత్తనం కావడంతో ప్రజాస్వామ్య వ్యవస్థనే పరిహాసం చేసేలా బాబు వ్యవహరించారు. టీడీపీ కార్యకర్తలతో ఏర్పాటయిన జన్మభూమి కమిటీలు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించి కేవలం అధికారపార్టీ వారికే పథకాలను అందిస్తూ మిగిలిన వారికి తీవ్రంగా అన్యాయం జరిగింది. సబ్సిడీ రుణం మంజూరు కావాలన్నా, పింఛన్‌కు అర్హత సాధించాలన్నా, చివరికి రేషన్‌కార్డు మంజూరు కావాలన్నా క్షేత్రస్థాయిలో జన్మభూమి కమిటీ సభ్యుల ఆమోదం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ప్రభుత్వ తీరుపై వ్యతిరేకతకు బీజం పడింది. అధికారులు సైతం జన్మభూమి కమిటీ సభ్యులు ఎంపిక చేసిన వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరించారు.
అర్హులైన బాధితులు అధికారులను నేరుగా సంప్రదించి తమ గోడు విన్నవించుకున్నా స్పందించని ఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజల పరిస్థితి మరీ దారుణంగా మారింది. ప్రతిపక్షపార్టీ సానుభూతిపరులు అని తెలిస్తే చాటు ప్రభుత్వ పథకాలకు అర్హులు కాదని తేల్చిచెబుతూ ఏళ్ల తరబడి వస్తున్న పింఛన్‌లు నిలిపివేసిన వైనం సర్వత్రా విమర్శలు పాల్జేసింది. అనేక సార్లు వారు అధికారులకు తెలిపినా పట్టించుకున్న దాఖలాలు లేవు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాతే ఈ పరిస్థితి అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్హులయిన వారికి పింఛన్ మంజూరు చేయాలని జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా వారు కూడా జన్మభూమి కమిటీ సిఫార్సు లేనిదే ఏమి చేయలేని పరిస్థితిని కల్పించారు. దీంతో అధికార పార్టీపై వ్యతిరేకత రోజురోజుకూ పెరిగింది. జన్మభూమి కమిటీల పెత్తనం గ్రామీణ ప్రాంతాలకే పరిమితం కాలేదు. మున్సిపాలిటీ పరిధిలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. నిర్దాక్షిణ్యంగా తొలగించేస్తున్నారు.
జన్మభూమి కమిటీలను రద్దు చేయాలి
వెంటనే జన్మభూమి కమిటీలను రద్దు చేయాలి. నిరంకుశత్వంతో కూడిన అప్రజాస్వామిక విధానాలకు భిన్నంగా పారదర్శకతతో నిండిన ప్రజాస్వామిక చర్యలను చేపట్టాలి. దీనికి అస్మదీయుల ప్రయోజనాలే కీలకమని భావిస్తే బాధిత ప్రజానీకం తమ సమయం వచ్చినప్పుడు చెప్పే గుణపాఠానికి నాయకులు సిద్ధపడాలని ప్రజలంటున్నారు.
అర్హత ఉన్నా పింఛన్ రావడం లేదు
ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు బొమ్మిరెడ్డి కాంతమ్మ. రాపూరు మండలం సిద్ధవరానికి చెందిన ఆమెకు 69 సంవత్సరాల వయసు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పింఛన్ వస్తుండేది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆమె అందిస్తున్న పింఛన్ రద్దు చేశారు. పింఛన్ పునరుద్ధరించాలని పలుమార్లు అధికారులకు దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ మంజూరు చేయలేదు. జన్మభూమి కమిటీ సభ్యుల నిర్వాకం మూలంగానే తనకు వస్తున్న పింఛన్‌ను నిలుపదల చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం మారి జన్మభూమి కమిటీలు రద్దు అయితే తప్ప తనకు పింఛన్ అందదని ఆమె చెపుతున్నారు.
గూడు చెదిరినా.. గుండె కరగలేదు
ఈ ఫొటోలో కనబడుతున్న మహిళ పి.ఈశ్వరమ్మ, మున్సిపాలిటీ పరిధిలో 9వ వార్డు వీవర్స్‌కాలనీలో నివాసం ఉంటుంది. ఆమెకు ఉన్న చిన్నపాటి రేకుల ఇంటిలో కుమారుడు, పిల్లలతో కలసి నివాసం ఉంటుంది. ఆమె జీవనం సాగిస్తున్న ఇళ్లు చిన్నపాటి వర్షం పడితేచాలు ఇళ్లు అంతా ఉరిసి తడిసిపోతుంది. దీంతో తమకు పక్కా గృహం మంజూరుచేయాలని పలు మార్లు ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులకు విన్నవించుకుంది. అయినప్పటికీ జన్మభూమి కమిటీ సభ్యులయిన టీడీపీ నాయకుల ఆమోదం పొందిన వారికి మాత్రమే ఇళ్లు మంజూరు చేస్తున్నారు తప్ప ఇళ్లు మంజూరుకు అన్నివిదాల అర్హత ఉన్న పేదలకు ఇళ్లు మాత్రం మంజూరు చేయలేదు. దీంతో వి«ధిలేక పలిగిన రేకుల ఇంటిలోనే గాలం వెలదీస్తున్నామని వాపోయారు.
శాపంగా మారిన జన్మభూమి కమిటీలు
ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి డక్కిలి మండలం మార్లగుంట గ్రామానికి చెందిన ఈగ లక్ష్మయ్య. భార్యా భర్తలు ఇద్దరు 70 ఏళ్లకుపై బడిన వయోవృద్ధులు. ఒక్కరికైనా పింఛన్ మంజూరు చేయాలని అధికారులకు మొరపెటుకున్నా, జన్మభూమి సభల్లో అర్జీలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. నాకు పింఛన్ ఇచ్చేందుకు జన్మభూమి కమిటీలు అడ్డుచెపుతున్నారని అంటున్నారు. గిరిజనులమనే కనికరం కూడా లేకుండా ప్రభుత్వ పథకాల్లోనూ రాజకీయం చేస్తున్న జన్మభూమి కమిటీలే శాపంగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
రుణాల్లోనూ రాజకీయమే
ఈ ఫొటోలో కనబడుతున్న మహిళ పేరు పి.శ్రీదేవి. మున్సిపాలిటీ పరిధిలోని ఉపాధ్యాయనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఇటీవల ప్రభుత్వం ద్వారా మంజూరుచేస్తున్న సబ్సిడీ రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే వైఎస్సార్‌సీపీ సానుభూతిపరురాలు కావడంతో జన్మభూమి కమిటీ సభ్యులు ఉద్దేశపూర్వకంగా ఆమె పేరుతో అర్హుల జాబితా తొలగించారు. రుణం పొందేందుకు అర్హత ఉన్న జన్మభూమి కమిటీ సభ్యులు అవతారమెత్తిన టీడీపీ నాయకుల అరచకాలకు ఆమె లబ్ధి పోయినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment