
గాయపడిన వైఎస్సార్‌సీపీ నాయకులను పరామర్శిస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు
సాక్షి, వెంకటగిరి: టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరిన కౌన్సిలర్ చల్లా మల్లికార్జున అనుచరులైన నరిసింహులు, విజయకుమార్, ప్రసాద్‌లపై ఎమ్మెల్యే గన్‌మన్ సిరాజ్ కుటుంబసభ్యులు, పలువురు టీడీపీ నాయకులు దాడి చేసి గాయపరిచిన ఘటన మంగళవారం రాత్రి వెంకటగిరిలో చోటుచేసుకుంది. ఈ విషయంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులోని వివరాల మేరకు.. టీడీపీ నాయకుడు సుబ్బయ్య మంగళవారం రాత్రి వైఎస్సార్‌సీపీ నాయకుడు నరసింహులు ఇంటి వద్దకు వచ్చి ఉద్దేశపూర్వకంగా మూత్రవిసర్జన చేస్తుండడంతో నరిసింహులు ఇది పద్ధతి కాదని చెప్పాడు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నరసింహులు ఇంటికి సమీపంలో నివశిస్తున్న విజయకుమార్, ప్రసాద్‌లు సుబ్బయ్య చేసిన పని సరికాదని సర్ధిచెప్పే ప్రయత్నం చేయగా సుబ్బయ్య కుమారుడు వచ్చి టీడీపీ ఎమ్మెల్యే కె.రామకృష్ణ గన్‌మన్ సిరాజ్ కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. దీంతో వారు వచ్చి నరసింహులు, విజయకుమార్, ప్రసాద్‌లపై దాడి చేసి గాయపరిచారు. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దాడి విషయం తెలియగానే వైఎస్సార్‌సీపీ నేతలు దొంతు బాలకృష్ణ, శేతురాశి బాలయ్య, కౌన్సిలర్ మల్లికార్జున తదితరులు ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment