నీరసంగా నిర్మల్ | Nirmal as weakness | Sakshi
Sakshi News home page

నీరసంగా నిర్మల్

Published Thu, Feb 11 2016 11:26 PM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM

Nirmal as weakness

నిర్మల్ గ్రామాల్లో కానరాని పారిశుధ్యం
ఎంపికచేసి చేతులుదులుపుకున్న వైనం
పూర్తికాని వ్యక్తిగత మరుగుదొడ్లు

 
స్మార్ట్ సిటీ.. స్మార్ట్ విలేజ్ అంటూ ఊహాలోకాల్లో విహరిస్తున్న పాలకులు దేశానికి పట్టుగొమ్మలైన పల్లెల్లో అభివృద్ధిని మాత్రం గాలికొదిలేస్తున్నారు. నిర్మల్ పురస్కారాల ఎంపిక సమయంలో చేస్తున్న హడావుడి ఆ తర్వాత కనిపించడం లేదు. ఎంపిక సందర్భంగా ఇచ్చే నిధులతో హడావుడిగా పనులు చేసి అందిన కాడికి బొక్కేయడం తప్ప గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు పట్టించుకున్న పాపానపోవడం లేదు.పేరుకు నిర్మల్ పురస్కార గ్రామాలే అయినప్పటికీ అపారిశుధ్యంలో ఇతర పంచాయతీలకు
 తామేమీ తీసిపోమన్నట్టుగా  తయారవుతున్నాయి.
 
విశాఖపట్నం: నిర్మల్ గ్రామాలంటే  చాలా అందంగా ఉంటాయని, పారిశుధ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుందని, అందరికీ వ్యక్తిగత మరుగుదొడ్లు ఉంటాయని అనుకుంటాం. కాని చాలా నిర్మల్ గ్రామాల్లో కనీస పారిశుధ్య పరిస్థితులు కూడా కనిపించడం లేదు.   జిల్లాలో 925 పంచాయతీలున్నాయి. 2008-09 నుంచి ఇప్పటివరకు 25 పంచాయతీలు నిర్మల్ పురస్కారాలకు ఎంపికయ్యాయి. 2013-14 ఆర్థిక సంవత్సరం కింద గతేడాది ఒక్క విశాఖ జిల్లాలోనే అత్యధికంగా 8 పంచాయతీలు నిర్మల్ పురస్కారాలకు ఎంపికయ్యాయి. ఇందుకోసం గతేడాది ఆగస్టు 22న విశాఖలో జరిగిన రాష్ర్ట స్థాయి నిర్మల్ పురస్కారాల పంపిణీ కార్యక్రమంలో ఆయా పంచాయతీలకు రూ.22 లక్షలు అందజేశారు. మార్చి-31నాటికి కనీసం వంద పంచాయతీలను బహిరంగ మల మూత్ర విసర్జన రహితం (ఓడీఎఫ్)గా ప్రకటించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ పంచాయతీల్లో 30 వేల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేయాలని  నిర్దేశించారు.

కానీ ఇప్పటివరకు  12 పంచాయతీల్లో మాత్రమే నూరు శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసి ఓడీఎఫ్ పంచాయతీలుగా ప్రకటించారు. ఈ పంచాయతీల పరిధిలో ఉన్న కుటుంబాల ఆధారంగా సుమారు 5 వేల వ్యక్తిగత మరుగు దొడ్లను నిర్మించగలిగారు. దీంతో ఈ పంచాయతీలకు మాత్రమే 2015 -16 ఆర్థిక సంవత్సరం కింద నిర్మల్ పురస్కారాలు దక్కనున్నాయి. మిగిలిన స్వచ్ఛ గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. స్థలా భావం వల్ల చాలా మంది మరుగుదొడ్ల నిర్మాణానికి దూరంగా ఉంటే.. లబ్ధిదారుల ఎంపికలో..బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండడం వలన మరుగుదొడ్ల నిర్మాణం ముందుకు సాగడం లేదు.

పాత పరిస్థితులే పునరావృతం
ఇప్పటివరకు ప్రకటించిన 25 నిర్మల్ పురస్కార గ్రామాల్లో కూడా  పాత పరిస్థితులే పునరావృతమవుతున్నాయి. పురస్కారాలకు ఎంపికైన గ్రామాలతో ఇక మా పనైపోయిందన్నట్టుగా ఉంది  అధికారులు తీరు. నూరు శాతం వ్యక్తిగత మరుగుదొడ్లు కలిగి.. బహిరంగ మల మూత్రవిసర్జన కు తావు లేని విధంగా పారిశుధ్యాన్ని మెరుగుపర్చిన పంచాయతీలను నిర్మల్ పురస్కారాలకు ఎంపిక చేస్తారు. గ్రామాల్లో సాలిడ్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కోసం ఆయా పంచాయతీలు చేస్తున్న కృషిని కూడా పరిగణన లోకి తీసుకుంటారు. ఎంపిక సమయంలో అధికారులు చూపిస్తున్న శ్రద్ధ ఆ తర్వాత ఆ పంచాయతీలపై చూపించడం లేదు. ఎంపిక సమయంలో పాటించే ప్రామాణికాలు ఆ తర్వాత  అమలవుతున్నది లేనిది పట్టించుకునే నాధుడు లేడు. నిర్మల్ పురస్కారాలకు ఎంపికైన గ్రామాల్లోనే కాదు.. ఈ ఏడాది స్వచ్ఛ గ్రామాలుగా ఎంపికచేసిన పంచాయతీల్లో కూడా  పారిశుధ్య పరిస్థితులు  అంతంతమాత్రం గానే ఉన్నాయి.  ఇవన్నీ పేరుకే బహిరంగ మల మూత్ర విసర్జన రహిత గ్రామాలు.  నూరు శాతం మరుగుదొడ్లు కలిగి ఉండాలన్న ప్రాథమిక నిబంధన కూడా ఎంపిక తర్వాత అధికారులు పట్టించుకోవడం లేదు.  దీంతో ఈ గ్రామాల్లో పారిశుధ్యం అధ్వానంగా తయారవుతోంది.  గురువారం జిల్లా వ్యాప్తంగా నిర్మల్ పురస్కా రాలకు ఎంపికైన, స్వచ్ఛ గ్రామాలుగాప్రకటించిన గ్రామాల్లో సాక్షి బృందం పర్యటిస్తే ఏ గ్రామం చూసినా ఏమూన్నది గర్వకారణం అన్నట్టు  అక్కడ పరిస్థితులు దర్శనమిచ్చాయి.  

లక్ష్యానికి దూరంగా మరుగుదొడ్ల నిర్మాణం
ఉదాహరణకు పాయకరావుపేట మండలంలో 2012-13 ఆర్థిక సంవత్సరం కింద గతేడాది నిర్మల్ పురస్కారానికి ఎంపికైన  కొత్తూరు పంచాయతీలో  119 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యం  కాగా ఇప్పటివరకు కేవలం 62 మరుగుదొడ్లు నిర్మాణం పూర్తి చేశారు. సీసీరోడ్లు నిర్మాణం, తాగునీటి పథకాలకు రూ.2 లక్షలు, పారిశుధ్య నిర్వహణకు కేటాయించారు. నేటికీ గ్రామంలో సరైన డ్రైనేజి వ్యవస్థలేక పోవడంతో పాటుగ్రామస్తుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇక పంచాయతీ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది.   రాజగోపాలపురం పంచాయతీలో 157 వ్యక్తిగత మరుగుదొడ్లు లక్ష్యం కాగా కేవలం 84 నిర్మాణం జరిగాయి. ఇక్కడ డ్రైనేజీల నిర్మాణం జరగ లేదు. కేశవరంలో నూరుశాతం మరుగు దొడ్ల నిర్మాణం జరిగినా తాగునీటి పథకాలు, పారిశుధ్య నిర్వహణ  అధ్వానంగా ఉంది. అచ్యుతాపురం మండలంలో నిర్మల్ పురస్కా రాలకు ఎంపికైన ఇరువాడ, జంగులూరు, దొప్పెర్ల, చీమలాపల్లి, ఎర్రవరం, ఆవసోమవరం పంచాయతీల్లో ఎంపిక సమయంలో చూపినంత చిత్తశుద్ధి ప్రస్తుతం కన్పించడం లేదు. ఆవసోమవరంలో రోడ్డు , కమ్యూనిటీ భవనం, పంచాయతీ భవనం శిథిలమయ్యాయి. చెత్తబండి పాడైపోయింది. చీమలాపల్లిలో గ్రామానికి సమీపంలోనే చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. ఇక్కడ డ్రైనేజీసమస్య  ఉంది.  జంగులూరు, దొప్పెర్ల, ఎర్రవరం పంచాయతీలలో పారిశుధ్యం కార్మికులకు జీతాలు ఇవ్వడానికి నిధులు లేక ఇబ్బందిపడుతున్నారు.

వీటికి భిన్నంగా మునగపాక మండలంలో నిర్మల్ పురస్కారానికి ఎంపికైన అరబుపాలెంలో పారిశుధ్య పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి.13వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామంలో రైతుల ప్రయోజనార్థం రెండు కల్వర్టులు, 27 కొళాయిల దిమ్మలు, బట్టలు ఉతుక్కునేందుకు వీలుగా దిమ్మలు, తాగునీటి ఇబ్బందులు లే కుండా నూతనంగా పైప్‌లైన్ ఎక్స్‌టెన్సన్ పనులు చేపట్టారు. రూ 2లక్షల వ్యయంతో దళితవాడలో సీసీ రోడ్డు నిర్మాణం పనులు చేపట్టారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement