తెనాలిఅర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం మహోన్నత లక్ష్యంతో గ్రామాల అభివృద్ధికి ప్రతిపాదించిన స్మార్ట్ గ్రామాల దత్తతపై ఈనెల 17కు పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అధికారులను ఆదేశించారు. తెనాలి రెవెన్యూ డివిజన్‌లోని వివిధ శాఖల అధికారులతో మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని పొదుపు భవన్‌లో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రామాన్ని ఏదో ఒక సంస్థగాని, ఎన్‌ఆర్‌ఐలుగాని, నాయకులు గాని దత్తత తీసుకునేలా అధికారులు కృషి చేయాలని, తహశీల్దార్, ఎంపీడీవోలు చొరవ చూపాలన్నారు. స్మార్ట్ విలేజ్ 20 అంశాలతో కూడిన అభివృద్ధి ప్రణాళికగా చెప్పారు. రోడ్డు ప్రమాదాలపై మాట్లాడుతూ జిల్లాలో సంవత్సరానికి 1000 మంది మృత్యువాత పడుతున్నారన్నారు. ప్రమాదాల నివారణకు రవాణాశాఖ కఠినంగా వ్యవహరించాలని, వాహనచోదకులు ఈనెల 16 నుంచి విధిగా హెల్మెట్ ధరించాలని పేర్కొన్నారు. ఆటోల్లో అధికలోడు, మద్యం సేవించి వాహనాలు నడపటం వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ట్రాక్టర్లు, ఆటోల్లో లౌడ్‌స్పీకర్లను నిషేదించాలని ఆదేశించారు.
నీరు-చెట్టుపై మాట్లాడుతూ మన జిల్లాలో 33శాతం అడవుల విస్తీర్ణం ఉండాలని, అయితే కేవలం 14.5శాతం మాత్రమే ఉన్నాయన్నారు. ప్రతి గ్రామంలో 10 వేల నుంచి 15వేల మొక్కలు పెంచేందుకు జూన్ నాటికి సన్నాహాలు చేయాలన్నారు. డ్వాక్రా గ్రూపుల బ్యాంక్ లింకేజి డివిజన్‌లో 11 మండలాల్లో పురోగతి లేదన్నారు.
ఎంపీడీవోలు, డీఆర్‌డీఏ ఏరియా కోఆర్డినేటర్లు, డీపీఎంలూ దీనిపై దృష్టిసారించాలని ఆదేశించారు. రుణాల రికవరీ కూడా మందగించిందని, దీనిని వేగవంతం చేసి బ్యాంకర్లకు సహకరించాలని కోరారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం మార్చి 31 నాటికి పూర్తికావాలన్నారు. పింఛన్ల పంపిణీకి పోస్టాఫీస్ అందుబాటులో లేని ప్రాంతాల్లో సమస్యలపై ఆరా తీశారు. గృహనిర్మాణానికి సంబంధించి 98 శాతం ఆధార్ అనుసంధానం, జియో ట్యాంగింగ్ 90 శాతం పూర్తయ్యిందన్నారు. అనంతరం మాతా శిశుమరణాలపై వైద్య ఆరోగ్య సిబ్బందితో సమీక్షించారు.
శిశువుల మరణాలకు సంబంధించి సరైన కారణాలు దృవీకరించని అధికారులపై కఠినంగా వ్యవహరించాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. శిశుమరణాలపై పరిశీలనకు హైపవర్ కమిటీని ఏర్పాటు చేయాలని డీఎంహెచ్‌వో పద్మజారాణిని ఆదేశించారు. కార్యక్రమంలో ఏజేసీ ఎం. వెంకటేశ్వరరావు, సీపీవో శ్రీనివాసులు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ గోపాలకృష్ణ, మహిళా శిశు సంక్షేమశాఖ జిల్లా పీడీ ఎంజే నిర్మల, ఆర్డీవో జి.నరసింహులు, డీఎల్పీవో ఎంవీఎస్ సుబ్రహ్మణ్యం, ఆర్‌డబ్ల్యూస్ ఈఈ భానుప్రసాద్, ఆర్టీవో కేవీ రామారావు, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు, పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.
17లోగా స్మార్ట్ గ్రామాల దత్తతపై నివేదిక
Published Wed, Mar 11 2015 4:18 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement