
పెదకాకాని : పెదకాకాని మండలంలోని అగ్రిగోల్డ్ ఆస్తులపై సీఐడీ పోలీసులు విచారణ చేపట్టారు. నంబూరు గ్రామ శివార్లలో అగ్రిగోల్డ్ ప్రతినిధులు 2010లో భూములు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు సీఐడీ డీఎస్పీ రామారావు సిబ్బందితో శనివారం పెదకాకాని తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అగ్రిగోల్డ్ ప్రతినిధులు నంబూరులో సర్వే నంబర్ 175బీలో 2.10 ఎకరాలు, 178లో ఎకరం చొప్పున మొత్తం 3.10 ఎకరాలను కొనుగోలు చేసినట్టు గుర్తించారు.
ఆ భూమిలో 1.60 ఎకరాలను 2014లో వెర్‌టెక్స్ వెంచర్ నిర్వాహకులు కొనుగోలు చేశారని, అలానే 1.50 ఎకరాలను బొంతు శ్రీనివాసరెడ్డికి అమ్మి రిజిస్ట్రేషన్ కూడా చేశారని గుర్తించారు. అగ్రిగోల్డ్ సంస్థ ఖాతాదారులకు డిపాజిట్లు చెల్లించకుండా వివాదాల్లో ఉన్నప్పుడు కొనుగోళ్లు, అమ్మకాలు ఎలా చెల్లుతాయన్న అంశంపై చర్చించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఖాతాదారులకు డిపాజిట్లు చెల్లించకుండా మోసం చేసిన అగ్రిగోల్డ్ ఆస్తులు గుర్తించి బహిరంగ వేలం వేస్తామని సీఐడీ డీఎస్పీ రామారావు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment