( ఫైల్ ఫోటో )
ఢిల్లీ: టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. గతంలో అయ్యన్నపాత్రుడిపై నమోదైన ఓ ఫోర్జరీ కేసుకు సంబంధించి దర్యాప్తునకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్ ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.సెక్షన్ ఐపీసీ 467 కింద దర్యాప్తు చేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది.
కాగా, ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆయన కుమారుడు రాజేష్‌పై గతంలో ఫోర్జరీ కేసు నమోదైంది.. అయ్యన్నపాత్రుడు మంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాచపల్లి రిజర్వాయర్ పంట కాలువపై రెండు సెంట్లు మేర స్థలంలో అక్రమంగా ప్రహరి నిర్మాణం చేశారు.
అక్రమ నిర్మాణం.. సక్రమం చేసుకునేలా..
నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుడు ఇంటికి ఆనుకుని పంట కాలువ ఉంది. నిర్మాణ సమయంలో బిల్డింగ్ అనుమతి కోసం ఇచ్చిన దరఖాస్తులో కూడా తాము నిర్మించబోయే ఇంటికి దక్షిణం, పశ్చిమాన పంట కాలువ ఉందని స్పష్టంగా పేర్కొన్నారు. తీరా నిర్మాణం సమయం.. అది కూడా టీడీపీ అధికారంలో ఉన్న సమయం కావడంతో ఏకంగా పంట కాలువను ఆక్రమించి ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. ఇన్నాళ్లుగా గుట్టుగా ఉన్న ఈ వ్యవహారం వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బట్టబయలైంది. ప్రభుత్వ భూములను కాపాడుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన డ్రైవ్‌లో భాగంగా రెవెన్యూ యంత్రాంగం సర్వే చేసింది.
ఇందులో జలవనరుల శాఖకు చెందిన పంట కాలువను ఆక్రమించి అయ్యన్న కుటుంబ సభ్యులు ఇంటి నిర్మాణాన్ని చేపట్టారని సర్వేలో తేలింది. ఈ మేరకు చర్యలు తీసుకునేందుకు రెవెన్యూ యంత్రాంగం ఉపక్రమించింది. అక్రమంగా పంట కాలువలో నిర్మించిన నిర్మాణాన్ని కూలదోసేందుకు ప్రయత్నిస్తే తన నోటి దురుసుతో ఇష్టారాజ్యంగా ప్రవర్తించి అధికారులను అడ్డుకున్నారు. అదే సమయంలో అక్రమ నిర్మాణం కాదంటూ ఫోర్జరీ సంతకాలతో నిరంభ్యంతర పత్రం(ఎన్‌వోసీ)ను సృష్టించి.. సక్రమ నిర్మాణమేనని చెప్పుకునేందుకు యత్నించారు. తీరా సదరు అధికారి ఎన్‌వోసీలో ఉన్నది తన సంతకం కాదని స్పష్టం చేసి సీఐడీకి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకొచ్చింది.
ఫోర్జరీ సంతకాలు.. తప్పుడు స్టాంపు పేపర్లు
చింతకాయల విజయ్ పేరుతో నర్సీపట్నంలో అయ్యన్న కుటుంబ సభ్యులు 2017లో ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం నర్సీపట్నం మున్సిపాలిటీకి సర్వే నంబర్లు 277, 278/1లోని 387.33 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణానికి అనుమతి కోరుతూ దరఖాస్తు(సెటిల్‌మెంట్ డీడ్ నం–3660 ఆఫ్ 2017) చేశారు. దక్షిణం, పశ్చిమం వైపు పంట కాలువ ఉన్నట్టు పేర్కొన్నారు. అనంతరం ఈ కాలువను ఆక్రమించి మరీ నిర్మాణం చేపట్టారు. దీనిపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి పెట్టడంతో ఫోర్జరీ సంతకాలతో నిరంభ్యంతర సర్టిఫికెట్ (ఎన్‌వోసీ) సృష్టించడమే కాకుండా ఏకంగా కోర్టునే తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారు. 2019 ఫిబ్రవరి 25న ఇంటి నిర్మాణం కోసం ఎన్‌వోసీని జలవనరులశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మల్లికార్జున రావు సంతకంతో ఇచ్చినట్టుగా కోర్టులో సమర్పించారు.
దీనిని పరిశీలించిన ఈఈ ఎన్‌వోసీలో ఉన్నది తన సంతకం కాదని గుర్తించారు. అంతేకాకుండా దీనిపై కార్యాలయంలోని ఫైళ్లను పరిశీలించగా.. తాను ఇవ్వలేదని గుర్తించారు. కోర్టుకు సమర్పించిన ఎన్‌వోసీ పత్రాల్లో ఉన్న సంతకం తనది కాదని కూడా స్పష్టమైంది. ఈ నేపథ్యంలో తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని పేర్కొంటూ జలవనరులశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మల్లికార్జునరావు సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వాస్తవానికి వాగు, కెనాల్, నాలా, డ్రెయిన్ బౌండరీకి 9–10 మీటర్లలోపు ఎటువంటి నిర్మాణం చేపట్టరాదని ఏపీ బిల్డింగ్ చట్టం–2017 చెబుతోంది.
ఇందుకు అనుగుణంగా కెనాల్ బౌండరీని మొదటగా నిర్ణయించాల్సి ఉంటుంది. అసలు ఇక్కడ కెనాల్ బౌండరీని నిర్ణయించకుండా ఎన్‌వోసీ ఇవ్వడం సాధ్యం కాదు. అయినప్పటికీ తన పేరుతో ఎన్‌వోసీ ఇచ్చినట్టుగా కోర్టులో చూపారని ఈఈ మల్లికార్జునరావు పేర్కొన్నారు. అసలు ఆ డాక్యుమెంటులో ఉన్న సంతకం తన స్టయిల్‌లో చేసిన సంతకం కాదని.. సంతకం కింద తేదీ వివరాలు పేర్కొనడం కూడా ఫోర్జరీనేనని తెలిపారు. మరోవైపు కార్యాలయం సీల్ కూడా తమది కాదని కూడా స్పష్టం చేశారు. ఈ మేరకు సీఐడీకి 30 సెపె్టంబరు 2022లో ఈఈ ఫిర్యాదు చేయగా... దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఇన్‌స్పెక్టర్ పైడిరాజు విచారణ అధికారిగా తన నివేదికను సమర్పించారు. ఈ నివేదికలో ఫోర్జరీ ఎన్‌వోసీ వ్యవహారం స్పష్టంగా తేటతెల్లమైంది.
Comments
Please login to add a commentAdd a comment