* నేడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసు
* 7న రాజకీయ పార్టీలతో అఖిలపక్ష భేటీ
* 10న అమలాపురంలో బహిరంగ సభ
* 17, 18 తేదీల్లో చలో ఢిల్లీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులు మరోమారు సమ్మెబాట పట్టనున్నారు. ఎలాగైనా సరే టీ బిల్లును పార్లమెంటులో పెట్టాలనే కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 6వ తేదీ (5వ తేదీ అర్ధరాత్రి నుంచే) నుంచి నిరవధిక సమ్మెకు దిగాలని నిర్ణయించామని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు వెల్లడించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి సమ్మె నోటీసు ఇస్తామని తెలిపారు. సమ్మె ఒక్కరోజు ఆలస్యమైనా కేంద్రంలో పెనుమార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున అన్ని ఉద్యోగ సంఘాలు ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాయన్నారు. సమైక్య ఉద్యమ కార్యాచరణ ఖరారు కోసం సోమవారం ఏపీఎన్జీవో హోంలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక విస్తృతస్థాయి సమావేశం జరిగింది. 7 గంటలు జరిగిన ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అశోక్‌బాబు మీడియాకు తెలిపారు.
* కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో.. ఈనెల 7నుంచి కొన్ని ప్రభుత్వ విభాగాల ఉద్యోగులు ఎన్నికల అధికారి పరిధిలోకి వెళ్లనున్నందున, ఈనెల 6నుంచే సమ్మె చేయాలని నిర్ణయించాం.
* 7వ తేదీన అన్ని రాజకీయ పార్టీలతో మరోమారు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఉద్యమ ఉధృతానికి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం.
* పరీక్షల సమయం అయినప్పటికీ ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు కూడా ఉద్యమంలో భాగస్వాములు కావాలి.
* ఈనెల 16న బిల్లు పార్లమెంటుకు వచ్చే అవకాశం ఉన్నం దున 17, 18 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం చేపడతాం.
* ఢిల్లీలో బలప్రదర్శన నిర్వహిస్తాం. అప్రజాస్వామికమైన బిల్లు గురించి బీజేపీ నేతలను కలిసి వివరిస్తాం. ళి ఈనెల 10న అమలాపురంలో భారీ బహిరంగ సభ.
ఎంపీల భరతం పడతాం
విభజనను వ్యతిరేకిస్తూ కొందరు ఎంపీలు ఈనెల 5న పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవే శపెడుతున్నారని, సీమాంధ్ర ఎంపీలెవరైనా అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలకని పక్షంలో వారి భరతం పడతామని అశోక్‌బాబు హెచ్చరించారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, జాతీయ రహదారుల దిగ్బంధం, విద్యుత్ నిలిపివేత, రైల్‌రోకో కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఏపీ ఒలంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో సమైక్య పరుగు(రన్ ఫర్ యూనిటీ ) నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ప్రతినిధులు ఎన్.చంద్రశేఖరరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, పీవీవీ సత్యనారాయణ, చలసాని శ్రీనివాసరావు, ఫణిపేర్రాజు, రవీంద్రకుమార్, కుమార్ చౌదరి యాదవ్, కృష్ణయాదవ్, నిర్మలాకుమారి, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
సమ్మెను వ్యతిరేకిస్తున్నాం
సీమాంధ్ర జ్యుడీషియల్ ఎంప్లాయీస్ జేఏసీ ప్రకటన
సాక్షి, విజయవాడ: ఈ నెల ఆరు నుంచి రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు పి. ఆశోక్‌బాబు ఇచ్చిన సమ్మె పిలుపును వ్యతిరేకిస్తున్నట్లు సీమాంధ్ర జ్యుడీషియల్ ఎంప్లాయీస్ జేఏసీ తెలిపింది. తాము సమ్మె విరమించే సమయంలో విభజన నిర్ణయాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యతను రాజకీయ నాయకులకి అప్పగించామని తెలిపింది.