Seemandhra Employees Strike
-
16నే ఉపాధ్యాయ అర్హత పరీక్ష
‘టెట్’ నిర్వహణకు ఈసీ ఓకే ఉదయం 9.30 - 12 గంటల వరకు పేపర్-1 మధ్యాహ్నం 2.30 - 5 గంటల వరకు పేపర్-2 ఏప్రిల్ 2న ఫలితాల వెల్లడి... విద్యాశాఖ సన్నద్ధం సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈనెల 16న టెట్ నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. వాస్తవానికి గత నెల 9నే ఈ పరీక్ష నిర్వహించాల్సి ఉన్నప్పటికీ సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె కారణంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇలా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన టెట్‌ను నిర్వహించడానికి అనుమతి కోరుతూ విద్యాశాఖ ఇటీవల కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ)కి లేఖ రాసింది. టెట్ కేవలం అర్హత పరీక్షేనని, ఉద్యోగాల భర్తీకి సంబంధం లేదని విన్నవించింది. దీనిపై సీఈసీ సానుకూలంగా స్పందించింది. టెట్ నిర్వహణకు అభ్యంతరం లేదంది. దీంతో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినా.. టెట్ నిర్వహణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈనెల 16న ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు పేపర్-2 నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ బుధవారం వెల్లడించారు. ఏప్రిల్ 2న ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 4.49 లక్షల మంది అభ్యర్థులు టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే పరీక్షకు పది రోజులు కూడా సమయం లేకపోవడంతో సన్నద్ధం కావడం కష్టమని వారు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల తర్వాతే డీఎస్సీ: టెట్ నిర్వహణ పూర్తయినా డీఎస్సీ ప్రకటన ఎన్నికల తర్వాతే వెలువడనుంది. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఉద్యోగాల భర్తీకి అవకాశం ఉండదు. ఎన్నికల తర్వాతే రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా డీఎస్సీ నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది. -
టెట్ వాయిదా: పార్థసారధి
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 9న జరగాల్సిన ఈ పరీక్షను సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె కారణంగా వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. సంబంధిత అధికారులతో గురువారం జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం విద్యాశాఖ మంత్రి పార్థసారధి పరీక్ష వాయిదాకే నిర్ణయించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల ఆఖరులోగా నిర్వహిస్తామన్నారు. అయితే, ఉద్యోగుల సమ్మె ఈ నెల 21 వరకు కొనసాగే అవకాశం ఉండడం, 23న పంచాయతీ కార్యదర్శి నియామక పరీక్ష, ఫిబ్రవరి ఆఖర్లో ఎన్నికల షెడ్యూలు వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో టెట్ నిర్వహణ ప్రశ్నార్థకమేనని అధికారులు చెబుతున్నారు. డీఎస్సీ అనుమానమే!: టెట్ ఫలితాల తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. మంత్రి చెబుతున్నట్లు ఫిబ్రవరి ఆఖరులో టెట్ నిర్వహిస్తే దీని ఫలితాల అనంతరం డీఎస్సీ నోటిఫికేషన్ మార్చిలో వెల్లడించాలి. ఫిబ్రవరి నెలాఖరుకే ఎన్నికల షెడ్యూలు వెలువడితే ఇక డీఎస్సీ జరిగే అవకాశంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. -
సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె ప్రారంభం
అనంతపురం: జిల్లాలో సమైక్యఉద్యమాలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సీమాంధ్ర ఉద్యోగులు బుధవారం అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభించిన విషయం తెలిసిందే. జిల్లాలోని ఏపిఎన్జిఓ, రెవిన్యూ ఉద్యోగులు సమ్మె ప్రారంభించారు. పంచాయతీ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. న్యాయవాదులు విధులు బహిష్కరించారు. -
6 నుంచి సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె
-
6 నుంచి సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె
* నేడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసు * 7న రాజకీయ పార్టీలతో అఖిలపక్ష భేటీ * 10న అమలాపురంలో బహిరంగ సభ * 17, 18 తేదీల్లో చలో ఢిల్లీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులు మరోమారు సమ్మెబాట పట్టనున్నారు. ఎలాగైనా సరే టీ బిల్లును పార్లమెంటులో పెట్టాలనే కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 6వ తేదీ (5వ తేదీ అర్ధరాత్రి నుంచే) నుంచి నిరవధిక సమ్మెకు దిగాలని నిర్ణయించామని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు వెల్లడించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి సమ్మె నోటీసు ఇస్తామని తెలిపారు. సమ్మె ఒక్కరోజు ఆలస్యమైనా కేంద్రంలో పెనుమార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున అన్ని ఉద్యోగ సంఘాలు ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాయన్నారు. సమైక్య ఉద్యమ కార్యాచరణ ఖరారు కోసం సోమవారం ఏపీఎన్జీవో హోంలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక విస్తృతస్థాయి సమావేశం జరిగింది. 7 గంటలు జరిగిన ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అశోక్‌బాబు మీడియాకు తెలిపారు. * కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో.. ఈనెల 7నుంచి కొన్ని ప్రభుత్వ విభాగాల ఉద్యోగులు ఎన్నికల అధికారి పరిధిలోకి వెళ్లనున్నందున, ఈనెల 6నుంచే సమ్మె చేయాలని నిర్ణయించాం. * 7వ తేదీన అన్ని రాజకీయ పార్టీలతో మరోమారు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఉద్యమ ఉధృతానికి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం. * పరీక్షల సమయం అయినప్పటికీ ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు కూడా ఉద్యమంలో భాగస్వాములు కావాలి. * ఈనెల 16న బిల్లు పార్లమెంటుకు వచ్చే అవకాశం ఉన్నం దున 17, 18 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం చేపడతాం. * ఢిల్లీలో బలప్రదర్శన నిర్వహిస్తాం. అప్రజాస్వామికమైన బిల్లు గురించి బీజేపీ నేతలను కలిసి వివరిస్తాం. ళి ఈనెల 10న అమలాపురంలో భారీ బహిరంగ సభ. ఎంపీల భరతం పడతాం విభజనను వ్యతిరేకిస్తూ కొందరు ఎంపీలు ఈనెల 5న పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవే శపెడుతున్నారని, సీమాంధ్ర ఎంపీలెవరైనా అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలకని పక్షంలో వారి భరతం పడతామని అశోక్‌బాబు హెచ్చరించారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, జాతీయ రహదారుల దిగ్బంధం, విద్యుత్ నిలిపివేత, రైల్‌రోకో కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఏపీ ఒలంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో సమైక్య పరుగు(రన్ ఫర్ యూనిటీ ) నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ప్రతినిధులు ఎన్.చంద్రశేఖరరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, పీవీవీ సత్యనారాయణ, చలసాని శ్రీనివాసరావు, ఫణిపేర్రాజు, రవీంద్రకుమార్, కుమార్ చౌదరి యాదవ్, కృష్ణయాదవ్, నిర్మలాకుమారి, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సమ్మెను వ్యతిరేకిస్తున్నాం సీమాంధ్ర జ్యుడీషియల్ ఎంప్లాయీస్ జేఏసీ ప్రకటన సాక్షి, విజయవాడ: ఈ నెల ఆరు నుంచి రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు పి. ఆశోక్‌బాబు ఇచ్చిన సమ్మె పిలుపును వ్యతిరేకిస్తున్నట్లు సీమాంధ్ర జ్యుడీషియల్ ఎంప్లాయీస్ జేఏసీ తెలిపింది. తాము సమ్మె విరమించే సమయంలో విభజన నిర్ణయాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యతను రాజకీయ నాయకులకి అప్పగించామని తెలిపింది. -
నిధుల్లేక నీరసం
మార్కాపురం, న్యూస్‌లైన్: పంచాయతీల పాలకవర్గాలను నిధుల కొరత వేధిస్తోంది. జిల్లాలోని 1020 పంచాయతీల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఎంపీడీఓలు, ఖజానాశాఖ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, డివిజనల్ పంచాయతీ అధికారులు సమ్మెలో ఉండటంతో నిధులున్నా ఉపయోగించుకోలేకపోతున్నారు. మార్కాపురం, కందుకూరు, ఒంగోలు డివిజన్లలో 155 పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో ప్రభుత్వం వీటికి ప్రత్యేక నిధులు విడుదల చేయాల్సి ఉంది. అవి కూడా ఆగిపోయాయి. పంచాయతీలకు 13వ ఆర్థిక సంఘం నిధులు, వృత్తిపన్ను, సీనరేజి పన్ను, ప్రత్యేక గ్రాంట్లను ప్రభుత్వం విడుదల చేస్తోంది. వీటితో పంచాయతీల్లో రోడ్లు, డ్రెయినేజీ, తాగునీటి సౌకర్యం, వీధిలైట్ల నిర్వహణ వంటి అభివృద్ధి పనులు చేపడతారు. సమ్మెతో నిలిచిన పనులు: రాష్ట్రాన్ని విభజిస్తూ సీడబ్ల్యూసీ తీర్మానం చేయడంతో సీమాంధ్ర జిల్లాల్లో ఉద్యోగులందరూ ఆగస్టు మొదటి వారం నుంచి సమ్మె బాట పట్టారు. దీంతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి. బ్లీచింగ్ చల్లాలన్నా, కాలువల్లో పూడిక తీయాలన్నా, తాగునీటి పైపు లైన్లు మరమ్మతులు చేయించాలన్నా, వీధి లైట్లు వెలిగించాలన్నా పంచాయతీల్లో బిల్లులు కాకపోవడంతో సొంత నిధులు వెచ్చించి పనులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలే పంచాయతీ ఎన్నికల్లో ఖర్చు ఎక్కువై సర్పంచ్‌లు అప్పుల పాలు కాగా, ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు అదనపు ఖర్చులుగా మారాయి. ఇప్పటికిప్పుడు ఇంటి పన్నులు వసూలు చేయాలన్నా పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో లేకపోవడంతో ఎలా వసూలు చేయాలని సర్పంచ్‌లు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం సర్పంచ్ల పరిస్థితి దయనీయంగా మారింది. వర్షాలు కురుస్తుండటంతో సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. బ్లీచింగ్ పౌడర్ చల్లాలంటే ప్రతి పంచాయతీలో కనీసం రూ. 3 వేలు ఖర్చవుతోంది. తీర్మానాలు లేకుండా సొంత డబ్బులు ఖర్చు పెడితే రేపటి పరిస్థితి ఏమిటని సర్పంచ్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రభుత్వం ఏకగ్రీవమైన పంచాయతీల్లో, నోటిఫైడ్ పంచాయతీలకు రూ. 10 లక్షలు, నాన్ నోటిఫైడ్ పంచాయతీలకు రూ. 5 లక్షలను ప్రత్యేక గ్రాంట్‌గా విడుదల చేసింది. ఏకగ్రీవమైన పంచాయతీల్లో సర్పంచ్‌లు ఈ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ దఫాలో కూడా ఏకగ్రీవమైన వాటికి ఇదే మొత్తంలో నిధులు విడుదల కావచ్చని భావిస్తున్నప్పటికీ ప్రభుత్వ సిబ్బంది సమ్మెలో ఉండటంతో నిధులందలేదు. పంచాయతీల్లో పనిచేస్తున్న స్వీపర్లు, బిల్ కలెక్టర్లు, మెకానిక్‌లకు రెండు నెలల నుంచి సర్పంచ్‌లు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. -
ఏపీ ఎన్జీవోల సమ్మె తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ!
హైదరాబాద్ : సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె విషయంలో హైకోర్టు వెలువరించనున్నతీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నేడు హైకోర్టులో జరుగుతున్న విచారణ తుది అంకమేనని న్యాయనిపుణులు భావిస్తున్నారు. హైకోర్టులో దాఖలైన పిల్‌పై విచారణ జరుగుతోంది. పిల్ దాఖలు చేసిన పిటిషనర్లతో పాటు, ప్రతివాదులుగా ఉన్న సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తమ వాదనలు ధర్మాసనం ముందు వినిపించాయి. అందరినీ తమ వాదనలను శుక్రవారం రాతపూర్వకంగా ఇవ్వాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కళ్యాణజ్యోతిసేన్ గుప్తా, కె.చంద్రభానులతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. శుక్రవారం వాదనలను లిఖితపూర్వకంగా కోర్టుకు సమర్పించేందుకు సిద్ధమయ్యారు. వీటిని పరిశీలించే ధర్మాసనం వెంటనే తీర్పు వెల్లడిస్తుందా? మళ్లీ వాయిదా వేస్తుందా? అన్నది చర్చనీయాంశంగా మారింది. సీమాంధ్ర ఉద్యోగులు ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనన్న ఆతృత కనిపిస్తోంది. మరోవైపు సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపడుతున్న విషయం తెలిసిందే. -
సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెతో స్తంభించిన సచివాలయం
-
సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెతో స్తంభించిన సచివాలయం
రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగడంతో సచివాలయం కార్యకలాపాలు మంగళవారం స్తంభించిపోయాయి. తెలంగాణ ఉద్యోగులు కూడా ఆందోళనలో ఉండటంతో వివిధ విభాగాలు బోసిపోయాయి. అయితే మంగళవారం సచివాలయంలో 67 శాతం మంది విధులకు హాజరయ్యారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ‘సచివాలయంలో 3,016 మంది ఉద్యోగులు ఉండగా, 2,015 మంది మంగళవారం విధులకు హాజరయ్యారు. 35 మంది హాజరుపట్టీలో సంతకాలు చేసి విధులు నిర్వహించలేదు. 516 మంది సంతకాలు చేయకుండా ఆందోళనల్లో పాల్గొన్నారు. 344 మంది విధులకు రాలేదు. 98 మంది సెలవులో ఉన్నారు’ అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సచివాలయం హుందాతనం కాపాడండి: సీఎస్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన పరిపాలనా కేంద్రమైన సచివాలయం హుందాతనాన్ని కాపాడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి ఉద్యోగులను కోరారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన సచివాలయ ఉద్యోగులతో ఆయన మంగళవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సచివాలయంలో ర్యాలీలు, ఆందోళనలు ఆపాలని శాంతియుతంగా ఒక నిర్దిష్ట ప్రదేశంలో నిరసనలు నిర్వహించుకోవాలని తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగ సంఘాలకు సూచించారు. జే బ్లాక్ వద్ద తెలంగాణ ఉద్యోగులు, అమ్మవారి గుడి వద్ద సీమాంధ్ర ఉద్యోగులు వేర్వేరుగా నిరసన వ్యక్తం చేయాలంటూ సీఎస్ చేసిన ప్రతిపాదనకు ఉద్యోగ సంఘాలు అంగీకరించాయి. అంతకుముందు సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు సచివాలయంలో వేర్వేరుగా నిరసనలు, ర్యాలీలు నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటనను కేంద్రం వెనక్కి తీసుకోవాలని సీమాంధ్ర ఉద్యోగులు నినదించగా, విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ ఉద్యోగులు కోరారు. 95% మంది సమ్మెలో: సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం 95 శాతం మంది సీమాంధ్ర ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారని, మిగిలిన వారు కూడా బుధవారం నుంచి సమ్మెలో భాగస్వాములవుతారని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం కన్వీనర్ యు. మురళీకృష్ణ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు ప్రకటనను వెనక్కి తీసుకునేంతవరకూ సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తప్పుడు లెక్కలతో సమ్మె ప్రభావాన్ని తగ్గించి చూపేందుకు తెలంగాణ ఉద్యోగ సంఘాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. అదనపు విధులు నిర్వహిస్తాం: తెలంగాణ ఉద్యోగులు సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడం వల్ల ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోకుండా అవసరమైతే తామంతా అదనపు విధులు నిర్వహిస్తామని తెలంగాణ ఉద్యోగులు చెప్పారు. సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెకు ప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలుస్తోందని తెలంగాణ ఉద్యోగుల సమన్వయ సంఘం కన్వీనర్ నరేందర్‌రావు ఆరోపించారు. -
సచివాలయం షట్‌డౌన్!
-
సచివాలయం షట్‌డౌన్!
* స్తంభించిన ప్రజా పాలన * మంత్రివర్గంలోనూ ప్రాంతాలవారీ విభజన * సంక్షేమ పథకాలు, కార్యక్రమాల సమీక్ష పట్టని సీఎం, మంత్రులు * ఇళ్ల వద్ద ప్రైవేటు ఫైళ్లు చూస్తున్న రాజీనామా చేసిన మంత్రులు * తెలంగాణ మంత్రుల్లోనూ నలుగురైదుగురే సచివాలయానికి.. * కేబినెట్ భేటీలూ నిర్వహించలేని పరిస్థితి.. సాధారణ ఫైళ్ల మందగమనం * సీమాంధ్రలో ‘ట్రెజరీలకు’ తాళాలతో 3 లక్షలమందికి జీతాలు బంద్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయానంతరం రాష్ట్రంలో ప్రజాపాలన దాదాపు స్తంభించింది. సామాన్య ప్రజలు, రైతుల గోడు పట్టించుకునే వారేలేరు. విభజన నిర్ణయం నేపథ్యంలో మంత్రివర్గం కూడా ప్రాంతాలవారీగా విడిపోయినట్టయ్యింది. ముఖ్యమంత్రితో పాటు సీమాంధ్ర మంత్రులు విభజన ప్రకటనను వ్యతిరేకిస్తుండగా.. తెలంగాణ మంత్రులు సహజంగానే స్వాగతిస్తున్నారు. అయితే ఈ ప్రభావం రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలపైన, ప్రజాపాలనపైన పడింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమలు, సమీక్షలకు బ్రేక్ పడింది. మరోవైపు ఉద్యోగుల సమ్మె కారణంగా సీమాంధ్రలోని 13 జిల్లాల్లో దాదాపు 3 లక్షల మందికి ఈ నెల జీతాలు అందని పరిస్థితి నెలకొంది. వాణిజ్య పన్నుల విభాగం ఉద్యోగుల సమ్మెతో సీమాంధ్ర నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయంలో గణనీయంగా కోత పడింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సహా మంత్రులు సమీక్షలకు దూరంగా ఉండటంతో ఆరోగ్యశ్రీ, రేషన్‌కార్డులు, సాగునీరు, ఇందిరమ్మ ఇళ్లు సంబంధిత సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రజలు వరద ముంపునకు గురైనా, రైతులు పంటలు కోల్పోయినా పట్టించుకునేవారే లేరు. ఇటీవల గోదావరి రెండుసార్లు ఉప్పొంగి ఇటు తెలంగాణ, అటు కోస్తాంధ్రలో లంక గ్రామాలను ముంచెత్తింది. ఆవైపు తొంగిచూసిన నాధుడే లేడు. కీలకాంశాలపై నిర్ణయం తీసుకునేందుకు కేబినెట్ భేటీలూ జరగడం లేదు. గతంతో రెండు నెలలకోసారి గానీ మంత్రివర్గ సమావేశాలను నిర్వహించని సీఎం రాష్ట్ర విభజన ప్రకటనకు కొద్దిరోజుల ముందే ప్రతి పక్షం రోజులకోసారి కేబినెట్‌ను సమావేశపరచాలనే నిర్ణయం తీసుకున్నారు. అయితే విభజన నిర్ణయం వెలువడటంతో ప్రస్తుతం మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. చివరిసారిగా గత నెల 19వ తేదీన ఈ భేటీ జరిగింది. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో సీఎం కిరణ్ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు సాధారణ ఫైళ్లను త్వరగా చూసి ఆమోదం తెలుపుతున్నారు. మరోపక్క విభజన నిర్ణయానికి నిరసనగా రాజీనామా చేసిన మంత్రులు, రాజీనామా చేయక పోయినా సచివాలయానికి రాని సీమాంధ్ర మంత్రులు వ్యక్తిగత అంశాలు, విజిలెన్స్, ఏసీబీ సంబంధిత ఫైళ్లను ఇళ్లకే తెప్పించుకుని ఆమోదం తెలుపుతున్నారు. మంత్రి శైలజానాథ్ విద్యాశాఖకు సంబంధించిన కాలేజీల రెన్యూవల్ ఫైళ్లను ఆమోదించారు. పురపాలక శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి కూడా తన నివాసానికి ఫైళ్లు తెప్పించుకుని, అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇలా రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాజీనామా చేసిన డజనుకు పైగా సీమాంధ్ర మంత్రులు గతంలో తెలంగాణ మంత్రుల విధానాన్నే అనుసరిస్తూ ఇళ్ల దగ్గర నుంచే ఫైళ్లపై సంతకాలు చేస్తున్నారు. ఇక తెలంగాణకు చెందిన మంత్రులు కూడా సాధారణ అంశాల ఫైళ్లకు ఆమోదం తెలుపుతున్నారు. అయితే వీరు కూడా పెద్దగా సచివాలయం వైపు రావడం లేదు. గురువారం నలుగురైదుగురు తెలంగాణ మంత్రులు మినహా ప్రజాప్రతినిధులెవ్వరూ సచివాలయానికి రాలేదు. పంచాయతీరాజ్ మంత్రి జానారెడ్డి, భారీనీటి పారుదల మంత్రి సుదర్శన్‌రెడ్డితో సమావేశం కాగా, పంచాయతీరాజ్ శాఖ పనులు ఉండడంతో స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి జానారెడ్డితో భేటీ అయ్యారు. ఉదయం వెలవెల.. సాయంత్రం కళకళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి మీ-సేవలో, 14వ ఆర్థిక సంఘం.. వంటి అంశాలపై అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నా.. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు పాలన కంటే రాష్ట్ర విభజనపై చర్చకే సమయం కేటాయిస్తున్నారు. వారి వద్ద పనిచేసే సిబ్బంది కూడా ఉదయం ఆందోళనల్లో పాల్గొంటూ మధ్యాహ్నం నుంచి పనిచేస్తున్నారు. ఉద్యోగుల ఆందోళనలతో బ్లాకులు ఉదయం బోసిపోతూ కనిపించినా, మధ్యాహ్నం తరువాత కళకళలాడుతున్నాయి. దీని వల్ల గతంలో కన్నా ఫైళ్ల కదలిక తగ్గినప్పటికీ సాధారణ ఫైళ్లు కదులుతున్నాయి. మరోవైపు విభజన నిర్ణయానంతరం సచివాలయానికి వివిధ పనులపై వచ్చే సందర్శకుల సంఖ్య తగ్గిపోయింది. మంత్రులెవరూ రాకపోవడంతో సందర్శకుల సంఖ్య గత నాలుగు రోజుల నుంచి మరీ తగ్గిపోయింది. విభజన ప్రకటనకు ముందు ప్రతిరోజూ 2,500 నుంచి 3,000 మంది వరకు వచ్చేవారు. అయితే సోమవారం 322 మంది, మంగళవారం 343 మంది, బుధవారం 360 మంది సందర్శకులు సచివాలయానికి వచ్చారు. గురువారం సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు రక్తదాన శిబిరం నిర్వహించగా తెలంగాణ ఉద్యోగులు శాంతిర్యాలీ నిర్వహించారు. దీంతో సచివాలయంలోకి సందర్శకులను అనుమతించడం లేదంటూ ప్రధాన ద్వారం వద్ద ఏకంగా బోర్డు ఏర్పాటు చేశారు. 3 లక్షల మందికి జీతాలు అందవు.. సీమాంధ్ర లోని 13 జిల్లా ఖజానా కార్యాలయాలతో పాటు 194 ఉప ఖజానా కార్యాలయాల ఉద్యోగుల సమ్మెతో ఈ నెల 13వ తేదీ నుంచి ఆ కార్యాలయాల తాళాలే తీయడం లేదు. దీంతో ఖజానా కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఉద్యోగుల జీత భత్యాలకు సంబంధించి ప్రతి నెలా 20వ తేదీ నుంచి బిల్లులు స్వీకరిస్తారు. 25వ తేదీ నుంచి బిల్లుల మంజూరు ప్రక్రియ ప్రారంభమై 1వ తేదీ నాటికి బాం్యకు ఖాతాల్లో జీతాలు క్రెడిట్ అవుతాయి. కానీ ప్రస్తుతం ఉద్యోగుల సమ్మె కారణంగా జీత భత్యాల బిల్లులు తీసుకునే సిబ్బందే లేకుండా పోయారు. దీంతో 13 జిల్లాల్లోని మూడు లక్షల మందికి పైగా ఉద్యోగులకు వచ్చే నెల 1న జీతాలు అందని పరిస్థితి ఏర్పడింది.