సచివాలయం షట్‌డౌన్! | Seemandhra Employees Strike Effect: Andhra Pradesh Secretariat Shutdown | Sakshi
Sakshi News home page

సచివాలయం షట్‌డౌన్!

Published Fri, Aug 23 2013 1:18 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

ఉద్యోగులు లేక బోసిబోయిన సచివాలయం 'డి'బ్లాక్ లోని కార్యాలయం - Sakshi

ఉద్యోగులు లేక బోసిబోయిన సచివాలయం 'డి'బ్లాక్ లోని కార్యాలయం

* స్తంభించిన ప్రజా పాలన
* మంత్రివర్గంలోనూ ప్రాంతాలవారీ విభజన
* సంక్షేమ పథకాలు, కార్యక్రమాల సమీక్ష పట్టని సీఎం, మంత్రులు
* ఇళ్ల వద్ద ప్రైవేటు ఫైళ్లు చూస్తున్న రాజీనామా చేసిన మంత్రులు
* తెలంగాణ మంత్రుల్లోనూ నలుగురైదుగురే సచివాలయానికి..
* కేబినెట్ భేటీలూ నిర్వహించలేని పరిస్థితి.. సాధారణ ఫైళ్ల మందగమనం
* సీమాంధ్రలో ‘ట్రెజరీలకు’ తాళాలతో 3 లక్షలమందికి జీతాలు బంద్
 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయానంతరం రాష్ట్రంలో ప్రజాపాలన దాదాపు స్తంభించింది. సామాన్య ప్రజలు, రైతుల గోడు పట్టించుకునే వారేలేరు. విభజన నిర్ణయం నేపథ్యంలో మంత్రివర్గం కూడా ప్రాంతాలవారీగా విడిపోయినట్టయ్యింది. ముఖ్యమంత్రితో పాటు సీమాంధ్ర మంత్రులు విభజన ప్రకటనను వ్యతిరేకిస్తుండగా.. తెలంగాణ మంత్రులు సహజంగానే స్వాగతిస్తున్నారు. అయితే ఈ ప్రభావం రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలపైన, ప్రజాపాలనపైన పడింది.

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమలు, సమీక్షలకు బ్రేక్ పడింది. మరోవైపు ఉద్యోగుల సమ్మె కారణంగా సీమాంధ్రలోని 13 జిల్లాల్లో దాదాపు 3 లక్షల మందికి ఈ నెల జీతాలు అందని పరిస్థితి నెలకొంది. వాణిజ్య పన్నుల విభాగం ఉద్యోగుల సమ్మెతో సీమాంధ్ర నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయంలో గణనీయంగా కోత పడింది.
 
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సహా మంత్రులు సమీక్షలకు దూరంగా ఉండటంతో ఆరోగ్యశ్రీ, రేషన్‌కార్డులు, సాగునీరు, ఇందిరమ్మ ఇళ్లు సంబంధిత సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రజలు వరద  ముంపునకు గురైనా, రైతులు పంటలు కోల్పోయినా పట్టించుకునేవారే లేరు. ఇటీవల గోదావరి రెండుసార్లు ఉప్పొంగి ఇటు తెలంగాణ, అటు కోస్తాంధ్రలో లంక గ్రామాలను ముంచెత్తింది. ఆవైపు తొంగిచూసిన నాధుడే లేడు. కీలకాంశాలపై నిర్ణయం తీసుకునేందుకు  కేబినెట్ భేటీలూ జరగడం లేదు.

గతంతో రెండు నెలలకోసారి గానీ మంత్రివర్గ సమావేశాలను నిర్వహించని సీఎం రాష్ట్ర విభజన ప్రకటనకు కొద్దిరోజుల ముందే ప్రతి పక్షం రోజులకోసారి కేబినెట్‌ను సమావేశపరచాలనే నిర్ణయం తీసుకున్నారు. అయితే విభజన నిర్ణయం వెలువడటంతో ప్రస్తుతం మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. చివరిసారిగా గత నెల 19వ తేదీన ఈ భేటీ జరిగింది. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో సీఎం కిరణ్ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు సాధారణ ఫైళ్లను త్వరగా చూసి ఆమోదం తెలుపుతున్నారు.

మరోపక్క విభజన నిర్ణయానికి నిరసనగా రాజీనామా చేసిన మంత్రులు, రాజీనామా చేయక పోయినా సచివాలయానికి రాని సీమాంధ్ర మంత్రులు వ్యక్తిగత అంశాలు, విజిలెన్స్, ఏసీబీ సంబంధిత ఫైళ్లను ఇళ్లకే తెప్పించుకుని ఆమోదం తెలుపుతున్నారు. మంత్రి శైలజానాథ్ విద్యాశాఖకు సంబంధించిన కాలేజీల రెన్యూవల్ ఫైళ్లను ఆమోదించారు. పురపాలక శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి కూడా తన నివాసానికి ఫైళ్లు తెప్పించుకుని, అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు.

ఇలా రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాజీనామా చేసిన డజనుకు పైగా సీమాంధ్ర మంత్రులు గతంలో తెలంగాణ మంత్రుల విధానాన్నే అనుసరిస్తూ ఇళ్ల దగ్గర నుంచే ఫైళ్లపై సంతకాలు చేస్తున్నారు. ఇక తెలంగాణకు చెందిన మంత్రులు కూడా సాధారణ అంశాల ఫైళ్లకు ఆమోదం తెలుపుతున్నారు. అయితే వీరు కూడా పెద్దగా సచివాలయం వైపు రావడం లేదు. గురువారం నలుగురైదుగురు తెలంగాణ మంత్రులు మినహా ప్రజాప్రతినిధులెవ్వరూ సచివాలయానికి రాలేదు. పంచాయతీరాజ్ మంత్రి జానారెడ్డి, భారీనీటి పారుదల మంత్రి సుదర్శన్‌రెడ్డితో సమావేశం కాగా, పంచాయతీరాజ్ శాఖ  పనులు ఉండడంతో స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి జానారెడ్డితో భేటీ అయ్యారు.

ఉదయం వెలవెల.. సాయంత్రం కళకళ
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి మీ-సేవలో, 14వ ఆర్థిక సంఘం.. వంటి అంశాలపై అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నా.. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు పాలన కంటే రాష్ట్ర విభజనపై చర్చకే సమయం కేటాయిస్తున్నారు. వారి వద్ద పనిచేసే సిబ్బంది కూడా ఉదయం ఆందోళనల్లో పాల్గొంటూ మధ్యాహ్నం నుంచి పనిచేస్తున్నారు. 

ఉద్యోగుల ఆందోళనలతో బ్లాకులు ఉదయం బోసిపోతూ కనిపించినా, మధ్యాహ్నం తరువాత కళకళలాడుతున్నాయి. దీని వల్ల గతంలో కన్నా ఫైళ్ల కదలిక తగ్గినప్పటికీ సాధారణ ఫైళ్లు కదులుతున్నాయి. మరోవైపు విభజన నిర్ణయానంతరం సచివాలయానికి వివిధ పనులపై వచ్చే సందర్శకుల సంఖ్య తగ్గిపోయింది. మంత్రులెవరూ రాకపోవడంతో సందర్శకుల సంఖ్య గత నాలుగు రోజుల నుంచి మరీ తగ్గిపోయింది.

విభజన ప్రకటనకు ముందు ప్రతిరోజూ 2,500 నుంచి 3,000 మంది వరకు వచ్చేవారు. అయితే సోమవారం 322 మంది, మంగళవారం 343 మంది, బుధవారం 360 మంది సందర్శకులు సచివాలయానికి వచ్చారు. గురువారం సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు రక్తదాన శిబిరం నిర్వహించగా తెలంగాణ ఉద్యోగులు శాంతిర్యాలీ నిర్వహించారు. దీంతో సచివాలయంలోకి సందర్శకులను అనుమతించడం లేదంటూ ప్రధాన ద్వారం వద్ద ఏకంగా బోర్డు ఏర్పాటు చేశారు.
 
3 లక్షల మందికి జీతాలు అందవు..
సీమాంధ్ర లోని 13 జిల్లా ఖజానా కార్యాలయాలతో పాటు 194 ఉప ఖజానా కార్యాలయాల ఉద్యోగుల సమ్మెతో ఈ నెల 13వ తేదీ నుంచి ఆ కార్యాలయాల తాళాలే తీయడం లేదు. దీంతో ఖజానా కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఉద్యోగుల జీత భత్యాలకు సంబంధించి ప్రతి నెలా 20వ తేదీ నుంచి బిల్లులు స్వీకరిస్తారు.

25వ తేదీ నుంచి బిల్లుల మంజూరు ప్రక్రియ ప్రారంభమై 1వ తేదీ నాటికి బాం్యకు ఖాతాల్లో జీతాలు క్రెడిట్ అవుతాయి. కానీ ప్రస్తుతం ఉద్యోగుల సమ్మె కారణంగా జీత భత్యాల బిల్లులు తీసుకునే సిబ్బందే లేకుండా పోయారు. దీంతో 13 జిల్లాల్లోని మూడు లక్షల మందికి పైగా ఉద్యోగులకు వచ్చే నెల 1న జీతాలు అందని పరిస్థితి ఏర్పడింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement