సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెతో స్తంభించిన సచివాలయం | Secretariat bandh due to seemandhra employees strike | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 4 2013 9:10 AM | Last Updated on Thu, Mar 21 2024 6:14 PM

రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగడంతో సచివాలయం కార్యకలాపాలు మంగళవారం స్తంభించిపోయాయి. తెలంగాణ ఉద్యోగులు కూడా ఆందోళనలో ఉండటంతో వివిధ విభాగాలు బోసిపోయాయి. అయితే మంగళవారం సచివాలయంలో 67 శాతం మంది విధులకు హాజరయ్యారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ‘సచివాలయంలో 3,016 మంది ఉద్యోగులు ఉండగా, 2,015 మంది మంగళవారం విధులకు హాజరయ్యారు. 35 మంది హాజరుపట్టీలో సంతకాలు చేసి విధులు నిర్వహించలేదు. 516 మంది సంతకాలు చేయకుండా ఆందోళనల్లో పాల్గొన్నారు. 344 మంది విధులకు రాలేదు. 98 మంది సెలవులో ఉన్నారు’ అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సచివాలయం హుందాతనం కాపాడండి: సీఎస్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన పరిపాలనా కేంద్రమైన సచివాలయం హుందాతనాన్ని కాపాడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి ఉద్యోగులను కోరారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన సచివాలయ ఉద్యోగులతో ఆయన మంగళవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సచివాలయంలో ర్యాలీలు, ఆందోళనలు ఆపాలని శాంతియుతంగా ఒక నిర్దిష్ట ప్రదేశంలో నిరసనలు నిర్వహించుకోవాలని తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగ సంఘాలకు సూచించారు. జే బ్లాక్ వద్ద తెలంగాణ ఉద్యోగులు, అమ్మవారి గుడి వద్ద సీమాంధ్ర ఉద్యోగులు వేర్వేరుగా నిరసన వ్యక్తం చేయాలంటూ సీఎస్ చేసిన ప్రతిపాదనకు ఉద్యోగ సంఘాలు అంగీకరించాయి. అంతకుముందు సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు సచివాలయంలో వేర్వేరుగా నిరసనలు, ర్యాలీలు నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటనను కేంద్రం వెనక్కి తీసుకోవాలని సీమాంధ్ర ఉద్యోగులు నినదించగా, విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ ఉద్యోగులు కోరారు. 95% మంది సమ్మెలో: సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం 95 శాతం మంది సీమాంధ్ర ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారని, మిగిలిన వారు కూడా బుధవారం నుంచి సమ్మెలో భాగస్వాములవుతారని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం కన్వీనర్ యు. మురళీకృష్ణ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు ప్రకటనను వెనక్కి తీసుకునేంతవరకూ సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తప్పుడు లెక్కలతో సమ్మె ప్రభావాన్ని తగ్గించి చూపేందుకు తెలంగాణ ఉద్యోగ సంఘాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. అదనపు విధులు నిర్వహిస్తాం: తెలంగాణ ఉద్యోగులు సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడం వల్ల ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోకుండా అవసరమైతే తామంతా అదనపు విధులు నిర్వహిస్తామని తెలంగాణ ఉద్యోగులు చెప్పారు. సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెకు ప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలుస్తోందని తెలంగాణ ఉద్యోగుల సమన్వయ సంఘం కన్వీనర్ నరేందర్‌రావు ఆరోపించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement