ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈనెల 16న టెట్ నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది.
‘టెట్’ నిర్వహణకు ఈసీ ఓకే
ఉదయం 9.30 - 12 గంటల వరకు పేపర్-1
మధ్యాహ్నం 2.30 - 5 గంటల వరకు పేపర్-2
ఏప్రిల్ 2న ఫలితాల వెల్లడి... విద్యాశాఖ సన్నద్ధం
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈనెల 16న టెట్ నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. వాస్తవానికి గత నెల 9నే ఈ పరీక్ష నిర్వహించాల్సి ఉన్నప్పటికీ సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె కారణంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇలా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన టెట్‌ను నిర్వహించడానికి అనుమతి కోరుతూ విద్యాశాఖ ఇటీవల కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ)కి లేఖ రాసింది. టెట్ కేవలం అర్హత పరీక్షేనని, ఉద్యోగాల భర్తీకి సంబంధం లేదని విన్నవించింది. దీనిపై సీఈసీ సానుకూలంగా స్పందించింది.
టెట్ నిర్వహణకు అభ్యంతరం లేదంది. దీంతో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినా.. టెట్ నిర్వహణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈనెల 16న ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు పేపర్-2 నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ బుధవారం వెల్లడించారు. ఏప్రిల్ 2న ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 4.49 లక్షల మంది అభ్యర్థులు టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే పరీక్షకు పది రోజులు కూడా సమయం లేకపోవడంతో సన్నద్ధం కావడం కష్టమని వారు ఆందోళన చెందుతున్నారు.
ఎన్నికల తర్వాతే డీఎస్సీ: టెట్ నిర్వహణ పూర్తయినా డీఎస్సీ ప్రకటన ఎన్నికల తర్వాతే వెలువడనుంది. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఉద్యోగాల భర్తీకి అవకాశం ఉండదు. ఎన్నికల తర్వాతే రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా డీఎస్సీ నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది.