సమ్మెతో సీమాంధ్రలో స్తంభించిన పాలన: అశోక్‌బాబు | Seemandhra Paralysed with APNGOs Strike, says Ashok Babu | Sakshi
Sakshi News home page

సమ్మెతో సీమాంధ్రలో స్తంభించిన పాలన: అశోక్‌బాబు

Published Fri, Feb 7 2014 12:03 AM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM

సమ్మెతో సీమాంధ్రలో స్తంభించిన పాలన: అశోక్‌బాబు - Sakshi

సమ్మెతో సీమాంధ్రలో స్తంభించిన పాలన: అశోక్‌బాబు

* రెండు, మూడు రోజుల్లో మున్సిపల్, ఆర్టీసీ ఉద్యోగులూ సమ్మెలోకి..
* టెన్త్, ఇంటర్ పరీక్షలకు మినహాయింపు
* టెట్‌కు సహకరించం
* బిల్లు రాజ్యసభకు వెళ్లిందంటే.. సీమాంధ్ర కేంద్రమంత్రుల చేతగానితనంగా భావిస్తాం
 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఏపీఎన్జీవోల ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యోగుల నిరవధిక సమ్మె విజయవంతంగా కొనసాగుతోందని సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయన్నారు. సమ్మె నేపథ్యంలో అన్ని ప్రభుత్వ విభాగాల ఉద్యోగులు విధులను బహిష్కరించడంతో పాలనా వ్యవస్థ పూర్తిగా స్తంభించిందని చెప్పారు. అశోక్‌బాబు గురువారం ఏపీఎన్జీవో హోంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విషయాలివీ..

ఉద్యోగ సంఘాలతోపాటు రాజకీయ పక్షాలూ సహకరిస్తుండడంతో రానున్న రోజుల్లో సమ్మె ఉధృతం కానుంది.  
రెండు, మూడ్రోజుల్లో మున్సిపల్, ఆర్టీసీ ఉద్యోగులు కూడా సమ్మెలోకి  రానున్నారు.
     
* విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని టెన్త్, ఇంటర్ పరీక్షలకు సమ్మె నుంచి మినహాయింపు ఇచ్చాం. అయితే ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు మాత్రం సహకరించే ప్రసక్తి లేదని ఉన్నతాధికారులకు తేల్చిచెప్పాం.
     
* రాష్ట్ర సమైక్యతకోసం అన్ని వ్యవస్థలు ఉద్యమిస్తోంటే సీమాంధ్ర కేంద్రమంత్రులు కొందరు ఇంకా.. హైదరాబాద్‌ను యూటీ చేయాలని, భద్రాచలాన్ని సీమాంధ్రలో కలపాలని జీవోఎంకు విన్నవిస్తుండడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం. సమైక్యాంధ్ర మినహా మరే డిమాండ్‌కూ ఒప్పుకునేది లేదు.

విభజన బిల్లును దొడ్డిదారిన రాజ్యసభలో ప్రవేశపెట్టాలని యోచిస్తున్న కేంద్ర నిర్ణయాన్ని ఎంపీలు, కేంద్రమంత్రులు వ్యతిరేకించాలి. బిల్లు రాజ్యసభకు వెళ్లిందంటే.. కేంద్రమంత్రుల చేతగానితనంగా భావిస్తాం.
     
ఉద్యమంలో భాగంగా సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రుల ఇళ్ల వద్ద ధర్నాలు నిర్వహించి, వారిపై ఒత్తిడి పెంచుతాం.
రాజ్యసభ ఎన్నికల తర్వాత మరోమారు అఖిలపక్షం ఏర్పాటు చేసి.. రాజకీయ పక్షాల సహకారంతో రైల్‌రోకోలు, రహదారుల దిగ్బంధం, కేంద్రప్రభుత్వ కార్యాలయాల ముట్టడి వంటి కార్యక్రమాలు చేపడతాం.

10న అమలాపురం, తర్వాత చిత్తూరు, గుంటూరులలో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభలు నిర్వహిస్తున్నాం.
విలేకరుల సమావేశంలో ఏపీఎన్జీవో నేతలు ఎన్.చంద్రశేఖరరెడ్డి, పీవీవీ సత్యనారాయణ, కృపావరం, సీవీ రమణ, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, డాక్టర్స్ జేఏసీ కన్వీనర్ కడియాల రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement