ప్రతిధ్వనించిన సమైక్యహోరు: అశోక్‌బాబు
సాక్షి, హైదరాబాద్: సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు మేరకు సీమాంధ్ర జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలో కూడా దాదాపు అన్ని ప్రభుత్వ డెరైక్టరేట్లలోనూ సమైక్య హోరు ప్రతిధ్వనించిందని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. శుక్రవారం ఏపీఎన్జీవో భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర మంత్రులు ప్రతిపాదించిన సవరణలకు వీసమెత్తు విలువ కూడా లేదన్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు చెప్పారు.
శని, ఆదివారాల్లో కేంద్రమంత్రుల దిష్టి బొమ్మల దహనం, ఎంపీల ఇళ్లముందు ధర్నాలు, 10న బ్యాంకులతో సహా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల మూసివేత, 11న సినిమా థియేటర్లు, వాణిజ్య సంస్థల మూసివేత, 12న జాతీయ రహదారుల దిగ్భంధం.. తదితర ఆందోళన కార్యక్రమాలు చేయాలని ఉద్యోగ సంఘాలకు పిలుపునిచ్చారు. ఈనెల 17,18 తేదీల్లో ఛలో ఢిల్లీ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
రాష్ట్ర సమైక్యత కోసం రూ.వేలకోట్ల వేతనాలను త్యాగం చేసి ఉద్యోగులు నడిరోడ్డుపైకి వస్తుంటే, సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు సకల సౌకర్యాలు అనుభవిస్తుండడం సిగ్గుపడాల్సిన విషయమని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఉద్యోగుల సేవల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. పాఠశాల విద్యా డెరైక్టరేట్లో శుక్రవారం ఏపీఎన్జీవోలపై దాడి చేసిన టీఎన్జీవోలను వదిలి, ఏపీఎన్జీవోలను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఏపీఎన్జీవోల సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఫిబ్రవరి 21వరకు జరగనున్న సమైక్య సమ్మెకు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.