ఏపీఎన్జీవోల సభలకు జాతీయ పార్టీల నేతలు
సాక్షి, హైదరాబాద్: ‘‘రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ విషయాన్ని అన్ని జాతీయ పార్టీల నేతల దృష్టికీ తీసుకెళ్తాం. పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలని కోరతాం’’అని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు చెప్పారు. సమైక్యానికి మద్దతుగా తాము నిర్వహించబోయే సమావేశాలకు ఆయా పార్టీల నేతలను కూడా ఆహ్వానిస్తున్నట్టు శుక్రవారం వెల్లడించారు.
హైదరాబాద్ గుడిమల్కాపూర్‌లో శనివారం నిర్వహించే సభ ఏర్పాట్లను పరిశీలించాక విలేకరులతో మాట్లాడారు. సభకు ఉద్యోగులతోపాటు సమైక్యాన్ని కోరుతున్న సంఘాల సభ్యులు, పార్టీల నేతలు ఐదు వేల మంది వస్తారన్నారు. విభజన జరగాలంటే రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘన తప్పదన్నారు. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.
రాష్ట్ర పార్టీల నేతలనూ పిలిచాం
పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా సభకు హాజరు కావాల్సిందిగా కాంగ్రెస్ నేతలు మండలి బుద్ధప్రసాద్, తులసి రెడ్డి, దేశం నేతలు పయ్యావుల కేశవ్, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డిలతోపాటు మజ్లిస్, సీపీఎం నేతలను ఆహ్వానించినట్టు అశోక్‌బాబు వెల్లడించారు. కొద్దిరోజుల్లో తిరుపతి, మదనపల్లిల్లో కూడా ఈ తరహా సభలు నిర్వహించనున్నామని, వాటికి జాతీయ పార్టీల అధ్యక్షులను ఆహ్వానిస్తున్నామని వెల్లడించారు.
విభజన తథ్యమన్నట్టుగా సీమాంధ్ర ప్రాంత కేంద్రమంత్రులు, ఎంపీలు అంటున్నా తాము మాత్రం చివరికంటా పోరాటం చేస్తామని, అసెంబ్లీకి ముసాయిదా బిల్లు వచ్చిన వెంటనే మరోసారి సమ్మెకు దిగుతామని పేర్కొన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించినా తమ ఉద్యమానికి వచ్చే నష్టమేదీ లేదని, ఆయన సమైక్యవాదిగా ఉన్నంతమాత్రాన తమకు ఒరిగిందేమీ లేదని పేర్కొన్నారు. ఈ నెల 17న ఉయ్యూరు, ఏలూరులలో రైతు సభలు, 19న పాలకొల్లులో, 28న కడపలో సభలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వచ్చే సమ్మెను గాంధేయమార్గంలో కాకుండా నేతాజీ పంథాలో నిర్వహించాలని ఉద్యోగ సంఘాలకు సూచించినట్టు సీమాంధ్ర మేధావుల సంఘం అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు పేర్కొన్నారు.