విభజిస్తే కాంగ్రెస్ భూస్థాపితమే: అశోక్‌బాబు
విజయనగరం, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని విభజిస్తే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని ఏపీఎన్‌జీఓ అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు హెచ్చరించారు. మంగళవారం విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం పట్టణాల్లో సమైక్యాంధ్రకు మద్దతుగా జరిగిన భారీ బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. సమైక్యాంధ్రకు మద్దతుగా హైదరాబాద్‌లో పదిలక్షల మందితో మహాసభ నిర్వహించనున్నట్టు తెలిపారు. తెలంగాణవాదులు రవాణాను అడ్డుకుంటే కాలినడకనైనా వస్తారని చెప్పారు. హైదరాబాద్‌లో రక్షణ కల్పించాల్సింది సీమాంధ్రులకు కాదని, స్వార్థపూరిత ఆలోచనలున్న తెలంగాణా రాజకీయ నిరుద్యోగులకు మాత్రమేనని చెప్పారు.
తెలంగాణతో తమది అన్నదమ్ముల బంధం కాదని, నాటి ప్రధాని నెహ్రూ చెప్పినట్టు భార్యాభర్తల బంధమన్నారు. తెలంగాణ ఉద్యమం కంటే సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రస్థాయిలో జరుగుతోందని తెలిపారు. తెలంగాణలో నాయకులు చేపట్టిన ఉద్యమానికి ప్రజలు పూర్తిగా సహకరించలేదని, సీమాంధ్రలో ప్రజలే సమైక్యాంధ్ర కోసం ఉద్యమాన్ని చేపడుతున్నారన్నారు. సీమాంధ్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు అధిష్ఠానం వద్ద సమైక్యవాదాన్ని గట్టిగా వినిపించలేకపోతున్నారన్నారు. ఉద్యమంలో పాల్గొనని ప్రజాప్రతినిధులు చరిత్రహీనులుగా మిగిలి పోతారని తెలిపారు.
జేఏసీ నాయకులను అరెస్టు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుందన్నారు. ఎస్మా అస్త్రాన్ని ప్రయోగిస్తే నాలుగు లక్షల మంది ఉద్యమ ఊపిరిలో ప్రభుత్వం కొట్టుకుపోతుందని హెచ్చరించారు. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి విద్యుత్ ఉద్యోగులు కూడా సమ్మెలోకి దిగితే ఉద్యమం ఉధృతమవుతుందన్నారు. ఈనెల 30వతేదీ వరకు జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె కొనసాగిస్తామని అనంతరం హైదరాబాద్‌లో సమైక్యవాదులతో సమావేశం నిర్వహించి, తదుపరి నిర్ణయం ప్రకటిస్తామని అశోక్‌బాబు పార్వతీపురంలో విలేకరులకు తెలిపారు. జిల్లాలో జరిగిన సభల్లో ఆయనతో పాటు రాష్ట్ర జేఏసీ కార్యదర్శి ఎన్.చంద్రశేఖరరెడ్డి సమైక్యాంధ్ర జిల్లా చైర్మన్ పెద్దింటి అప్పారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం. వెంకటేశ్వరరెడ్డి, జేఏసీ మహిళా కన్వీనరు రత్నకుమారి, రాజ్యలక్ష్మి, జేఏసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రభూజి, డీజీ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.