seemandhra MLAs
-
రేపు ఢిల్లీలో సీఎం దీక్ష
-
రేపు ఢిల్లీలో సీఎం దీక్ష
* దీక్షకు సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు * వారిని రప్పించే బాధ్యత మంత్రులకు అప్పగింత * వేదిక ఇందిరాగాంధీ స్మారక చిహ్నమైన శక్తిస్థల్ * బిల్లుపై సుప్రీం కోర్టుకు వెళ్లే యోచన? * నేడు వార్‌రూమ్ భేటీకి కేంద్రమంత్రులు, సీఎం, పీసీసీ చీఫ్‌లు సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట విభజన వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఢిల్లీలో దీక్ష చేయాలని సీమాంధ్ర కాంగ్రెస్‌నేతలు నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ఈ నెల ఐదో తేదీన ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్మారక చిహ్నమైన శక్తిస్థల్ వద్ద నిరసన దీక్షను చేపట్టనున్నట్లు సమాచారం. ఢిల్లీలో తాము చేపట్టాల్సిన కార్యక్రమాలపై ముఖ్యమంత్రి గత రెండురోజులుగా కొందరు మంత్రులు, ఇతర నేతలతో సమావేశమై చర్చించారు. బిల్లుకు మద్దతు పలకరాదని కోరేందుకు ఇతర పార్టీల నేతలను కలవాలా? లేదా? అన్న అంశంపై తర్జనభర్జనలు సాగించారు. ఢిల్లీలో ఎంపీలతో భేటీ అయ్యాక తుది నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయానికి వచ్చారు. అలాగే బిల్లులోని లోపాలను ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టుకు విన్నవించాలన్న అంశంపైనా చర్చించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన విధివిధానాలు, ఇతర అంశాలను మరోసారి న్యాయనిపుణులతో చర్చించాకనే ముందుకు వెళ్దామని సీఎం చెప్పినట్లు సమాచారం. * ప్రాథమికంగా నిర్ణయమైన కార్యక్రమాల ప్రకారం సీఎం నేతృత్వంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఈ నెల 5వ తేదీన ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్మారక చిహ్నమైన శక్తిస్థల్ వద్ద నిరసన దీక్షను చేపట్టనున్నారు. దీనికి సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యేలా చూడాలని, వారందరినీ ఢిల్లీకి రప్పించే ఏర్పాట్లను సీఎం తన కోటరీలోని మంత్రులకు అప్పగించారు. * ఈ మేరకు సీమాంధ్ర ప్రాంత మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, గంటా శ్రీనివాసరావు, టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, సాకే శైలజానాధ్ తదితర మంత్రులు ఇతర నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హస్తినకు వెళ్లారు. *రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఐదో తేదీకి ఖరారైన నేపథ్యంలో ఆ రోజు ఉదయం ఢిల్లీ వెళ్లాలని సీఎం భావించారు. అయితే అధిష్టానం పిలుపుతో ఒకరోజు ముందే మంగళవారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. * రాజ్యాంగపరంగానే కాకుండా న్యాయపరంగా కూడా బిల్లులో అనేక లోపాలున్నాయని రాష్ట్రపతికి విన్నవిస్తామని మంత్రి సాకే శైలజానాధ్, విప్ రుద్రరాజు పద్మరాజు తెలిపారు. * అయితే పార్లమెంటుకు సంబంధం లేని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎంతమంది ఢిల్లీలో నిరసన దీక్షలకు దిగినా ఫలితం ఉండదని, ఎంపీలు కేంద్రమంత్రులపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. * ఈ నేపథ్యంలో బిల్లుకు వ్యతిరేకంగా కేంద్రమంత్రులెలా వ్యవహరిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఎంపీలకు తోడు సీమాంధ్ర కేంద్రమంత్రులు కూడ కలసివస్తేనే ఫలితం ఉంటుందని అంచనా వేస్తున్నారు. * నిరసన దీక్షలతోపాటు రాష్ట్రపతి వద్దకు తమతో కలసిరావాల్సిందిగా కేంద్రమంత్రులను కూడా కోరనున్నామని శైలజానాధ్ తెలిపారు. వారు కూడా తమతో వస్తారన్న నమ్మకముందని చెప్పారు. * మరోవైపు విభజన బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్న కాంగ్రెస్ అధిష్టానం మంగళవారం రాత్రి వార్‌రూమ్‌లో రాష్ట్ర నేతలతో ఒక సమావేశం నిర్వహిస్తోంది. ఇందులో సీఎంతోపాటు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. -
కిరణ్ విభజనవాదే: సీమాంధ్ర ఎమ్మెల్యేలు
విభజన బిల్లుపై ఓటింగ్ కోసం వైఎస్ విజయమ్మ పట్టుపట్టినా ముఖ్యమంత్రి కిరణ్ మాత్రం ముందుకు రాలేదని పలువురు సీమాంధ్ర ఎమ్మెల్యేలు విమర్శించారు. అసెంబ్లీ లాబీల్లో వారు విలేకరులతో మాట్లాడారు. కనీసం తన అభిప్రాయాన్ని చెప్పడానికి కూడా సీఎం ముందుకు రాలేదని, దాంతో ఆయన చిత్తశుద్ధిపై అనుమానాలు తలెత్తుతున్నాయని వారు అన్నారు. విభజనను మరోసారి వ్యతిరేకించే అవకాశం వచ్చినా ఏఐసీసీ భేటీకి సీఎం డుమ్మాకొట్టారని, అసెంబ్లీ లేకపోయినా కూడా ఆయన వెళ్లలేదని విమర్శించారు. ఆరుగురు సీమాంధ్ర ఎంపీలకు పాసుల నిరాకరణ అంతా డ్రామాయేనని, రెన్యువల్ చేసుకోని సభ్యులకు పాస్‌లు రాలేదని వారు చెప్పారు. సాంకేతికమైన అంశాన్ని దాచి విభజన వ్యతిరేకించినందుకు పాసులు రాలేదని వారు ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు సీఎం కిరణ్‌పై ఉన్న భ్రమలన్నీ తొలగిపోతున్నాయని, ఇన్నాళ్లుగా ఆయనను నమ్ముకుని మోసపోయామని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి హైకమాండ్ మనిషని, ఆయన విభజనవాదేనన్న విషయం అర్థమవుతోందని సీమాంధ్ర ఎమ్మెల్యేలు అన్నారు. -
'సీమాంధ్ర ఎమ్మెల్యేలపై వివక్ష చూపిస్తున్నట్లుగా ఉంది'
హైదరాబాద్: తాము ఏఐసీసీ సభ్యులుగా ఉన్నప్పటికీ రేపటి ఢిల్లీ సదస్సుకు ఆహ్వానం అందలేదని సీమాంధ్ర ఎమ్మెల్యేలు తెలిపారు. సీమాంధ్రలో కాంగ్రెస్ ఇక లేదని హైకమాండ్ భావిస్తున్న కారణంగానే తమను పిలవక పోవడానికి కారణమై ఉండవచ్చిన ఎమ్మెల్యేలు జేసీ దివాకర్ రెడ్డి, గాదె వెంకటరెడ్డిలు తెలిపారు. అందుకు సీమాంధ్ర ఎమ్మెల్యేల పట్ల వివక్షత చూపుతున్నట్లుగా కనబడుతోందన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలో ఇతర సీమాంధ్ర ఎమ్మెల్యేలతో మాట్లాడిన తరువాత దానికి తగ్గ ప్రణాళిక సిద్ధం చేస్తామని వారు స్పష్టం చేశారు. విభజన బిల్లుపై అసెంబ్లీలో తరగతుల వారీగా ఎమ్మెల్యేలు అభిప్రాయం చెప్పాలని రాష్ట్రపతి కోరామన్నారు. ఆ ప్రకారం చర్చించేందుకు గుడువు పెంచాలని కోరతామని వారు తెలిపారు. ఆ మేరకు సీఎం, సభ కూడా గడువు పెంచాలని రాష్ట్రపతికి సూచించే అవకాశం ఉందన్నారు. -
బిల్లుపై చర్చ అభిప్రాయం కోసమే: కోదండరాం
ఆమనగల్లు, న్యూస్‌లైన్: శాసనసభలో ప్రస్తుతం తెలంగాణ బిల్లుపై జరుగుతున్న చర్చ కేవలం అభిప్రాయం కోసమేనని, ఈ విషయాన్ని సీమాంధ్ర ఎమ్మెల్యేలు గుర్తించాలని టీ-జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణ విముక్తి, ఈ ప్రాంత ప్రజల బాగు కోసమే ప్రత్యేక రాష్ట్రం అడుగుతున్నామని పునరుద్ఘాటించారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్లు మండలం కోనాపూర్‌లో బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్‌రాం విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ఒక భాష మాట్లాడే వారంతా ఒకే రాష్ట్రంలో ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు. బిల్లు ప్రతులను చించేయడమంటే రాజ్యాంగాన్ని అవమానపర్చడమే అవుతుందన్నారు. టీజీఏ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులపై దేశద్రోహం నేరం మోపి కేసులు నమోదు చేశారని, బిల్లు ప్రతులను దహనం చేసిన వారిపై కేసులు ఎందుకు పెట్టడంలేదని ప్రశ్నించారు. -
సీమాంధ్ర ఎమ్మెల్యేలపై టీఆర్ఎస్ దూకుడు
సభలో చొక్కా పట్టుకుంటారా.. ఇదేం దౌర్జన్యం: గాదె ఆగ్రహం క్షమాపణకు కాంగ్రెస్, టీడీపీ డిమాండ్.. విచారం వ్యక్తం చేసిన ఈటెల సాక్షి, హైదరాబాద్: టీ-బిల్లుపై చర్చ సందర్భంగా శుక్రవారం అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. టీఆర్ఎస్ సభ్యులు ఒకవైపు, సీమాంధ్ర ఎమ్మెల్యేలు మరోవైపు మోహరించడంతో సభలో యుద్ధవాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ సభ్యులు ఒక దశలో కాంగ్రెస్ సభ్యులవైపు దూసుకువెళ్లి వారిని వెనక్కి నెట్టడం, దీనికి వారు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. అరుపులు, నినాదాలతో దద్దరిల్లి, కొంతసేపు సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగింది. సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డిని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య నెట్టివేయడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తమకు క్షమాపణ చెప్పాలని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. కాగా, డిప్యూటీస్పీకర్ సూచన మేరకు టీఆర్ఎస్ పక్ష నేత ఈటెల రాజేందర్ చింతిస్తున్నామని చెప్పడంతో ఈ వివాదం సద్దుమణిగింది. రాష్ట్రపునర్వ్యవస్థీకరణ బిల్లుపై శుక్రవారం శాసన సభలో టీఆర్ఎస్ తరపున ఈటెల రాజేందర్ మాట్లాడుతుండగా ఈ సంఘటన జరిగింది. పొట్టి శ్రీరాములు కూడా చిన్న రాష్ట్రాలకు మద్దతు ఇచ్చారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడే సమయంలోనే మోసం జరిగిందని, తెలంగాణ, ఆంధ్ర రాష్ర్టంగా పేరు పెట్టాల్సి ఉన్నా...తెలంగాణ పదాన్ని తొలగించారని, గడసరి వారితో అమాయక తెలంగాణ వారు తట్టుకోవడం కష్టమన్న నెహ్రూ అభిప్రాయం...వంటి విషయాలను ఈటెల ఉటంకించారు. ఈ దశలో ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ జోక్యం చేసుకుని... చరిత్రను రాజేందర్ వక్రీకరిస్తున్నారని, ఇలాంటి రెచ్చగొట్టే వక్రీకరణల వల్లనే తెలంగాణలో వెయ్యి మంది అమాయకులు మృతి చెందారని ఆరోపించారు. దాంతో టీఆర్ఎస్ సభ్యుడు విద్యాసాగర్‌రావు ఆగ్రహించి ద్రోణంరాజు శ్రీనివాస్ వద్దకు వెళ్లి వాదనకు దిగారు. పరిస్థితిని గమనించిన కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి తదితరులు అక్కడికి వచ్చి వారిని సముదాయించారు. అయితే టీఆర్ఎస్ సభ్యుడు కావేటి సమ్మయ్య అకస్మాత్తుగా వారి వద్దకు వచ్చి గాదె వెంకట్‌రెడ్డితో పాటు మరికొందరని వెనక్కి నెట్టారు. దీంతో సభలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఇదేసమయంలో గాదెకు మద్దతుగా సీమాంధ్ర కాంగ్రెస్ సభ్యులు,టీఆర్ఎస్ సభ్యులకు మద్దతుగా తెలంగాణ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. ఈ దశలో అరుపులు కేకలతో సభ దద్దరిల్లింది.దీంతో పరిస్థితి చే యి దాటిపోతుందని గ్రహించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే దామోదరరెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీ్‌శ్ రావు, జూపల్లి కృష్ణారావు వంటి వారు ఇరు వర్గాలను శాంతింపజేశారు.అనంతరం గాదె వెంకటరెడ్డి మాట్లాడుతూ,‘ సభలో చొక్కా పట్టుకుంటారండి...ఇదేం సంస్కృతి ? ఇదేం దౌర్యన్యం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘వారితో తనకు క్షమాపణ చెప్పించాల’ని సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్‌ను కోరారు. దీంతో మంత్రి శైలాజానాథ్,ద్రోణంరాజు శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ, పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే...రేపు తెలంగాణ వచ్చిన తర్వాత సీమాంధ్రుల భద్రతకు ఎవరు భరోసా ఇస్తారని ప్రశ్నించారు. ఈ దౌర్జన్యాలను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈ దశలో టీడీపీ సభ్యులు నరేంధ్ర , బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తదితరులు వారికి మద్దతుపలికారు. అంతేకాక టీఆర్ఎస్ సభ్యులు తీరును ఖండిస్తూ స్పీకర్ పోడియం వద్దకు చేరి నిరసన వ్యక్తం చేశారు. దురుసు ప్రవర్తనకు క్షమాపణ చెప్పించాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. దీంతో డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క జోక్యం చేసుకుని వాదనల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం సహాజం, సభలో అందరూ, హుందాగా ఉండాలని కోరారు. ఆయన సూచనతో ఈటెల రాజేందర్ ‘ఈ సంఘటనను మేం మర్యాద అని అన డం లేదు...జరిగిన దానికి చింతిస్తున్నామ’ని చెప్పారు. దాంతో వివాదం సద్దుమణిగింది. 18 నుంచీ మళ్లీ అసెంబ్లీ సాక్షి, హైదరాబాద్: ఈ నెల 18 నుంచీ శాసనసభ, శాసనమండలి తిరిగి ప్రారంభం కానున్నారుు. 17న ఏఐసీసీ సమావేశం ఉన్నందున ఆ రోజు శాసనసభ, శాసనమండలికి సెలవు ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు స్పీకర్, చైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఆమోదం తెలిపిన స్పీకర్ నాదెండ్ల మనోహర్, చైర్మన్ చక్రపాణి.. 18వ తేదీ నుంచి సభలు తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. 19వ తేదీ ఆదివారం కూడా సభలు జరుగుతాయని అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారామ్ శుక్రవారం విడుదల చేసిన బులెటెన్‌లో పేర్కొన్నారు. -
దిక్కుమాలిన రాజకీయం
అసెంబ్లీలో చంద్రబాబు వైఖరిపై వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు సభలో సీమాంధ్ర ఎమ్మెల్యేలతో సమైక్యాంధ్ర అనిపిస్తున్నారు తెలంగాణ ఎమ్మెల్యేలతో విభజన ప్లకార్డులు పట్టిస్తున్నారు సోనియా గీసిన గీత దాటకుండా కిరణ్ మోసం చేస్తున్నారు రాష్ట్రం ఐక్యంగా ఉన్నప్పుడే కృష్ణా నీళ్లు.. మహారాష్ట్ర, కర్ణాటక అవసరాలు తీరితేగాని కిందికిరాని పరిస్థితి మధ్యలో ఇంకొక రాష్ట్రం తెస్తే నీళ్లకు దిక్కేది? వైఎస్ వెళ్లిపోయాక ప్రజలను పట్టించుకునేవారే లేరు సీఎం కాగానే ‘అమ్మ ఒడి’ పథకంపైనే నా రెండో సంతకం పథకం కింద పిల్లలను బడికి పంపే తల్లి ఖాతాలో డబ్బులేస్తాం ‘సమైక్య శంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఇవాళ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు చూస్తుంటే చాలా బాధనిపిస్తోంది. ఇదే గడ్డమీద పుట్టిన చంద్రబాబు తన పార్టీకి చెందిన సీమాంధ్ర ఎమ్మెల్యేలతో సమైక్యాంధ్ర అనిపిస్తారు. మళ్లీ ఆయనే తెలంగాణ ఎమ్మెల్యేలతో రాష్ట్రాన్ని విభజన చేయండీ అని ప్లకార్డులు పట్టిస్తారు. ఓట్లు పోతాయని, సీట్లు పోతాయని ఇటువంటి దిక్కుమాలిన, నీతిమాలిన రాజకీయాలు చేయాలా!’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. మరోవైపు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇవాళ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ఆలోచన పక్కనబెట్టి సోనియా గాంధీ గీసిన గీత దాటకుండా ప్రజలను మోసం చేస్తూ పోతున్నారని విమర్శించారు. ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించటాన్ని నిరసిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా తలపెట్టిన ‘సమైక్య శంఖారావం’ యాత్ర మూడో విడత, రెండో రోజు సోమవారం చిత్తూరు జిల్లా మదనపల్లె నియోజకవర్గంలో కొనసాగింది. నీరుగట్టువారిపల్లిలో జరిగిన బహిరంగ సభకు భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. ఈ ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే.. పేదరికాన్ని దగ్గరగా చూశాను.. ‘‘ఇవాళ రాజకీయాలు చెడిపోయాయి. చదరంగం ఆడుతున్న ట్టు.. ఒక మనిషిని తీసుకొని వెళ్లి జైల్లో పెట్టడం, మరో మని షిని తప్పించడం, ప్రాంతాలను విడగొట్టి ఓట్లు, సీట్లు సంపాదించుకునే రాజకీయాలను చూస్తున్నప్పుడు బాధనిపిస్తోంది. రాజకీయాలంటే ప్రతి పేదవాని గుండె చప్పుడు వినాలి.. ప్రతి పేదవాని మనసు ఎరగాలి. చనిపోయిన తరువాత తన ఫొటో ప్రతి పేదవాని ఇంట్లో ఉండాలని ఆరాటపడటమే రాజకీయం అంటే. రాష్ట్రంలో పేదరికాన్ని దగ్గర నుంచి చూసి న నాయకుడు ఎవరైనా ఉన్నారా? అంటే అది నేను మాత్రమేనని గర్వంగా చెప్పగలను. ఓదార్పు యాత్ర చేస్తున్నప్పుడు ప్రతి పేద కుటుంబం బాధలూ చూశాను. దాదాపు 700 గుడిసెలకు వెళ్లాను. చిన్నచిన్న పిల్లలను వాళ్లు తమతో పాటు పనులకు తీసుకుపోవడం చూశాను. చాలా సందర్భాల్లో ఆ తల్లిదండ్రులను అడిగా... ‘అమ్మా..! చిన్నచిన్న పిల్లలచేత కూడా పనులు చేయిస్తుంటే.. పేదరికం ఎలా పోతుంది? వీళ్లు చదువుకుంటేనే కదమ్మా పేదరికం పోతుంది’ అని నేను అన్నప్పుడు వాళ్లు చెప్పిన మాటలు వింటే నా గుండె బరువెక్కింది. ‘‘అన్నా... మేం కూడా మా పిల్లలను చదివించుకోవాలనే ఆశపడుతున్నాం.. కానీ మొదట కడుపు నిండితేనే కదన్నా.. పిల్లల చదువు గురించి ఆలోచన చేసేది’’ అని వాళ్లు చెప్పిన మాటలు ఇప్పటికీ నా గుండెలను పిండి వేస్తూనే ఉంటాయి. ప్రతి అక్కా, చెల్లెమ్మలకు నేను మాటిచ్చి చెప్తున్నా. చాలా సందర్భాల్లో కూడా నేను ఈ మాట చెప్పా. ముఖ్యమంత్రిని అయిన తరువాత నేను పెట్టబోయే రెండో సంతకం గొప్ప సంతకం. ఆ గొప్ప సంతకం ‘అమ్మ ఒడి’ అనే పథకానికి శ్రీకారం చుడుతుంది. ఆ పథకం కింద ప్రతి తల్లి చేయాల్సింది ఏమిటంటే తన పిల్లలను బడికి పంపడమే. బడికి పంపిన పిల్లాడిని ఇంగ్లిష్ మీడియం స్కూళ్లో మేం చదివిస్తాం. చదివించడమే కాదు... ఆ పిల్లాడిని ఇంజనీర్నో.. డాక్టర్నో చేస్తాం.. కలెక్టర్ లాంటి పెద్దపెద్ద చదువులు చదివిస్తాం. అలా బడికి పంపినందుకు ప్రతి పిల్లాడికి రూ.500 చొప్పున, ఒక్కో కుటుంబానికి ఇద్దరు పిల్లలకు రూ.1,000 తల్లి అకౌంటులోనే పడుతుంది. ఎందుకు ఆ డబ్బు వేస్తున్నామంటే.. తన పిల్లలను బడికి పంపినందుకు ఆ తల్లి ఈ నెల ఎలా బతకాలి? ఇల్లు ఎలా గడవాలి? అనే ఆలోచన చేయకూడదు. అందుకే ప్రతి నెలా అమ్మ అకౌంటులోనే డబ్బు వేస్తాం. వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం, ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఇల్లు కట్టివ్వడం.. ఇలాంటివి సునాయాసంగా జరిగిపోతాయని చెప్తున్నా. మధ్యలో మరో రాష్ట్రం తెస్తే నీళ్లెలా ఇస్తారు? ఇవాళ ఇక్కడికి వస్తున్నప్పుడు దారిపొడవునా రైతన్నలు నన్ను చూడటం కోసం వస్తున్నారు. వారిని నీళ్ల పరిస్థితి ఏమిటన్నా అని అడిగాను. 1,000 అడుగులు బోరు వేసినా నీళ్లు పడుతాయో.. పడవో తెలియని అధ్వాన పరిస్థితుల్లో మేం ఉన్నామని ఆ రైతన్నలు చెప్పారు. ఈ మదనపల్లెలో చూస్తే.. రూపాయో... రెండు రూపాయలో పెట్టి నీళ్లు కొనుక్కునే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో గాలేరి నగరి, సుజల స్రవంతి, హంద్రీ నీవా ఇలా ప్రతి ప్రాజెక్టునూ పూర్తి చేసుకోవాలని ఆలోచన చేసేవారే కరువయ్యారు. రాష్ట్రం ఐక్యంగా ఉన్నప్పుడే కృష్ణా నీళ్లు.. మహారాష్ట్ర అవసరాలు తీరిన తరువాత, కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లు నిండిన తరువాత గాని కిందికి రాని పరిస్థితి. మధ్యలో ఇంకొక రాష్ట్రం తీసుకొని వస్తే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు సముద్రపు నీళ్లు తప్ప మంచి నీళ్లు ఎక్కడ ఉన్నాయి? అని సోనియాగాంధీని, చంద్రబాబును, కిరణ్‌కుమార్ రెడ్డిని అడుగుతున్నా. వైఎస్ వెళ్లిపోయాక రూపాయి రుణమైనా వచ్చిందా? ఇక్కడే దాదాపు 30 వేల మంది చేనేత కార్మికులు అప్పుల్లో ఉన్నారు. రూ.320 కోట్లు చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేస్తూ నాడు వైఎస్సార్ సంతకం చేశారు. ఇవాళ ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయిన తరువాత ఒక్క రూపాయి అయినా లోన్ వచ్చిందా? మాకు లోన్ వచ్చిందని ఒక్క చెయ్యి కూడా లేవదు. అంటే ఆ ఒకే ఒక వ్యక్తి వెళ్లిపోయిన తరువాత ఈ రాష్ట్రంలో చేనేత కార్మికుల గురించిగాని, రైతుల గురించిగాని, చదువుకుంటున్న పిల్లల గురించిగాని ఆలోచన చేసే వ్యక్తి ఎవరూ లేకుండా పోయారు. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. తెలుగువారి ఆత్మగౌరవానికి, ఢిల్లీ అహంకారానికి మధ్య ఆ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో మనందరం కలసికట్టుగా ఒక్క తాటిమీదకు వద్దాం.. 30 ఎంపీ స్థానాలు మనమే గెలుచుకుందామని గట్టిగా చెప్తున్నా. ఈ రాష్ట్రాన్ని ఎవరైతే సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెడదాం.’’ జగన్మోహన్రెడ్డి వెంట యాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ నారాయణస్వామి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఏఎస్ మనోహర్, పార్టీ నేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తదితరులున్నారు. విభజిస్తే 2 రాష్ట్రాలూ నాశనమే ఆలోచన చేయాల్సిన మన పాలకులకు బుర్ర లేకుండా పోతోంది. దేశంలో 28 రాష్ట్రాలుంటే.. మన రాష్ట్ర బడ్జెట్ మూడో స్థానంలో ఉంది. ఒక్కసారి రాష్ట్రాన్ని విభజిస్తే అప్పుడు ఒక రాష్ట్రం తొమ్మిదో స్థానం కోసం.. మరో రాష్ట్రం 13వ స్థానం కోసం పోటీ పడతాయి. విభజిస్తే రెండు రాష్ట్రాలు కూడా నాశనమయ్యే పరిస్థితి కనిపిస్తున్నా ఈ పాలకులు పట్టించుకోవడం లేదు. రాష్ట్రం బాగుపడాలంటే ఎయిర్‌పోర్టులు, సీపోర్టులు ఒక్కటిగా ఉండాలి. మహానగరాలు, సముద్ర తీరాలు ఒక్కటిగా ఉండాలి.. వాటిని విడదీస్తే అభివృద్ధి ఎలా ఉంటుంది? - వైఎస్ జగన్ రెండు కుటుంబాలకు ఓదార్పు సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు జిల్లాలో సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు అడుగడుగునా నీరాజనం పలుకుతున్నారు. సోమవారం ఉదయం తంబళ్లపల్లె నియోజకవర్గంలోని అంగళ్లు నుంచి బయలుదేరిన జగన్ తట్టివారిపల్లెలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి నీరుగట్టువారిపల్లెకు చేరుకున్నారు. ఇక్కడి సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జగన్‌ను చూడ్డానికి అడుగడుగునా జనం పోటెత్తడంతో నాలుగు గంటల ఆలస్యంగా సాయంత్రం ఐదు గంటల సమయంలో ఆయన మదనపల్లె పట్టణంలోని గొల్లపల్లె చేరుకున్నారు. ఇక్కడ కంచుకొమ్మల వెంకటరామయ్య కుటుంబాన్ని ఓదార్చారు. అక్కడి నుంచి గంగపురం చేరుకునేసరికి రాత్రి పది గంటలు దాటింది. గంగపురంలో చెనిక్కాయల గుర్రప్ప కుటుంబాన్ని ఓదార్చారు. సోమవారం రాత్రి 11 గంటల తరువాత జగన్మోహన్రెడ్డి పీలేరు నియోజకవర్గంలోని వాల్మీకిపురం చేరుకుని మాజీ శాసనసభ్యుడు చింతల రామచంద్రారెడ్డి ఇంట బస చేశారు. -
బిల్లుపై చర్చించకుంటే సీమాంధ్రలకే నష్టం: కేటీఆర్
-
బిల్లుపై చర్చించకుంటే సీమాంధ్రలకే నష్టం: కేటీఆర్
అసెంబ్లీలో తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని, ఎన్నిరోజులు వీలైతే అన్ని రోజులు సభను నడపాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ గురువారం స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను కోరారు. ఎలాంటి వాయిదాలు వేయకుండా నిరవధికంగా తెలంగాణ బిల్లుపై చర్చ జరిగే విధంగా సభను నడపాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చించాల్సిన సీమాంధ్ర ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ బిల్లుపై చర్చ జరగకుంటే నష్టపోయేది సీమాంధ్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సభను నిరవధికంగా వాయిదా వేయడానికి తాము ఒప్పుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణవాదుల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. టీవీ చర్చల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ పాల్గొంటున్న సీమాంధ్ర నేతలు సభలో చర్చకు ఎందుకు సహకరించటం లేదని ప్రశ్నించారు. -
తెలంగాణలో నిరసన వెల్లువ
బిల్లు చింపివేతపై తెలంగాణలో ప్రదర్శనలు సీమాంధ్ర ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలు దహనం న్యూస్‌లైన్ నెట్వర్క్: తెలంగాణ ముసాయిదా బిల్లును శాసనసభ ఆవరణలో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు చింపివేయడాన్ని తెలంగాణవాదులు తీవ్రంగా నిరసించారు. శాసనసభ, శాసన మండలిలో సోమవారం ముసాయిదా బిల్లు ప్రతులను చింపివేయడంపై వారు మండిపడ్డారు. ఇది రాజ్యాంగ వ్యతిరేక చర్య అని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరచడమేనన్నారు. వారి చర్యలను నిరసిస్తూ తెలంగాణవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి సీమాంధ్ర ప్రజాప్రతినిధుల, నేతల దిష్టిబొమ్మలను దహనం చేశారు. వరంగల్ జిల్లా హన్మకొండలో టీఆర్ఎస్ యువజన విభాగం నేతలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. కాకతీయ యూనివర్సిటీ జేఏసీ ఆధ్వర్యంలో, పరకాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో, అలాగే టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీమాంధ్ర ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలను దహనంచేశారు. నిజామాబాద్, కామారెడ్డిల్లో న్యాయవాదులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ కార్యకర్తలు రాస్తారోకోలు చేశారు. కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, టీజేఏసీల ఆధ్వర్యంలో కిరణ్, చంద్రబాబుతో సహా సీమాంధ్ర ప్రజాప్రతినిధుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. గోదావరిఖనిలో శాప్ మాజీ చైర్మన్ ఎం.ఎస్. రాజ్‌ఠాకూర్ ఆధ్వర్యంలో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. నల్లగొండ జిల్లా భవనగిరిలో వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. జిల్లా కేంద్రంలోనూ నిరసనలు హోరెత్తాయి. ఆదిలాబాద్ లోని టీడీపీ కార్యాలయంపై టీఆర్ఎస్ నేతలు రాళ్లు, టమోటాలు, కోడిగుడ్లతో దాడి చేశారు. టీడీపీ జెండాలను తగులబెట్టారు. ఈ సందర్భంగా పోలీసులకు, టీఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఖమ్మంలో టీఎన్జీవో ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులు నిరసన ప్రదర్శన చేశారు. సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నేతలు ఖమ్మం బైపాస్‌రోడ్డుపై నిరసన తెలిపారు. ఇల్లెందు, కొత్తగూడెంలలో కిరణ్, బాబుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. మెదక్ జిల్లాలో సీమాంధ్ర నేతల దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి, దహనం చేశారు. సిద్ధిపేట, సంగారెడ్డి, గజ్వేల్,అందోల్‌లో నిరసన ర్యాలీలు నిర్వహించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీమాంధ్ర నేతల దిష్టిబొమ్మలను దహనం చేశారు. జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్ సీపీ కార్యాలయంపై తెలంగాణవాదులు దాడి చేశారు. బోర్డుతో పాటు ఫ్లెక్సీని చింపివేశారు. జెండాను తొలగించి, నిప్పు పెట్టారు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, వికారాబాద్, తాండూరు, శంషాబాద్, పరిగి నియోజకవర్గాల్లో తెలంగాణవాదులు ఆందోళనలు చేపట్టారు. తెలంగాణ రాదేమోనని ఆగిన గుండె సీమాంధ్రుల చర్యలతో తెలంగాణ రాదని మనస్తాపానికి చెందిన ఓ యువకుడు సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు. కరీంనగర్జిల్లా ఎల్కతుర్తి మండలం వల్భాపూర్నకు చెందిన వేమన(30) శ్రీరాజ రాజేశ్వర ఫార్మసీ కళాశాలలో పనిచేస్తున్నాడు. మధ్యాహ్నం టీవీలో సీమాంధ్ర ఎమ్మెల్యేలు తెలంగాణ బిల్లు ప్రతులను చింపివేయడం..దహనం చేయడాన్ని చూసి భావోద్వేగంతో కుప్పకూలిపోయి ప్రాణాలొదిలాడు. -
సీమాంధ్ర ఎమ్మెల్యేల తీరుపై నిరసనలు
సాక్షి, సంగారెడ్డి: రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లును సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన సందర్భంగా సీమాంధ్ర నేతలు వ్యవహరించిన తీరుపై జిల్లాలో టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సీమాంధ్ర ఎమ్మెల్యేలు పోటీపడి ముసాయిదా బిల్లును చించివేయడంపై మండిపడ్డారు. టీఆర్ఎస్ అధినాయకత్వం పిలుపు మేరకు ఆ పార్టీ నేతలు జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించి సీమాంధ్ర నేతల దుశ్చర్యలను ఎండగట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసనలు తెలిపారు. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌రెడ్డి, రామలింగారెడ్డి ఆధ్వర్యంలో మెదక్‌లో స్థానిక ఐబీ అతిథి గృహం నుంచి బస్ డిపో వరకు సీమాంధ్ర నేతల దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, సీఎం కిరణ్ కుమార్‌రెడ్డిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిద్దిపేటలో టీఆర్ఎస్ నేత, మునిసిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. సంగారెడ్డిలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చింతాప్రభాకర్ ఆధ్వర్యంలో స్థానిక ఐబీ అతిథి గృహం నుంచి కొత్త బస్టాండు వరకు భారీ ర్యాలీ నిర్వహించి కిరణ్, చంద్రబాబుల దిష్టిబొమ్మలకు నిప్పుపెట్టారు. టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్ నేతృత్వంలో గజ్వేల్‌లో స్థానిక వివేకానంద చౌక్ వద్ద టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు సీమాంధ్ర ఎమ్మెల్యేల దిష్టి బొమ్మలను దహనం చేశారు. అందోల్ నియోజకర్గ ఇన్చార్జి పి.కిష్టయ్య నేతృత్వంలో జోగిపేటలోని హనుమాన్ చౌరస్తాలో చంద్రబాబు దిష్టిబొమ్మను తగలబెట్టారు. పటాన్చెరు బస్టాండు ఎదురుగా టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో చంద్రబాబు, సీమాంధ్ర ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలను దహనం చేశారు. నారాయణ్‌ఖేడ్‌లో రాజీవ్ చౌరస్తా వద్ద సీమాంధ్ర ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలను దహనం చేశారు. దుబ్బాకలో స్థానిక బస్టాండు ఎదురుగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీమాంధ్ర నేతల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. -
ఐక్యంగా విభజన బిల్లును వ్యతిరేకిస్తాం: జెసి
హైదరాబాద్: అన్ని పార్టీలకు చెందిన సీమాంధ్ర శాసనసభ్యులు అందరూ కలిసి ఐక్యంగా విభజన బిల్లును వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి చెప్పారు. విభజన బిల్లు అసెంబ్లీకి రావడం ఆలస్యమైతే సమైక్య ఆంధ్ర తీర్మానాన్ని ప్రతిపాదిస్తామన్నారు. సీమాంధ్ర నేతలెవరూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్‌ను కలవాలని అనుకోవడంలేదని జెసి చెప్పారు. పార్టీపైన, పార్టీ అధినేత్రి సోనియా గాంధీపైన ఇటీవల కొద్ది రోజులుగా జెసి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజనకు ఆయన మొదటి నుంచి వ్యతిరేక వ్యక్తం చేస్తున్నారు. -
'సీమాంధ్రులు వ్యతిరేకించినా ఫలితం ఉండదు'
హైదరాబాద్: యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఇష్టప్రకారం జరిగే విభజన అయినందున ఇది ఆగదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జెసి దివాకర రెడ్డి అన్నారు. తెలంగాణ బిల్లును అసెంబ్లీలో సీమాంధ్ర ఎమ్మెల్యేలు వ్యతిరేకించినా ఉపయోగం లేదని చెప్పారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా అవసరం లేదన్నారు. కొత్త రాజధాని ఏర్పరుచుకుని అక్కడి నుంచే సీమాంధ్ర పాలన సాగించాలన్న అభిప్రాయాన్ని జెసి వ్యక్తం చేశారు. పార్లమెంట్, కోర్టులు విభజనను అడ్డుకుంటాయనే ఆశలేదన్నారు. -
ఎమ్మెల్యేలు విభజన వ్యతిరేక లేఖలు ఇవ్వాలి: అశోక్‌బాబు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ఎమ్మెల్యేలందరూ రాష్ట్రపతికి లేఖలు ఇవ్వాలని ఏపీఎన్జీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు సూచించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. లేఖల ద్వారా పంపిన ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలంగాణ ముసాయిదా బిల్లుపై సంతకం చేసే ముందు రాష్ట్రపతి పరిగణనలోకి తీసుకొనే అవకాశం ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారన్నారు. త్వరలోనే ఎమ్మెల్యేలందరినీ కలిసి సమైక్యాంధ్రకు అనుకూలంగా లేఖలు ఇవ్వాలని కోరనున్నట్లు తెలిపారు. అసెంబ్లీ తీర్మానాన్ని కాదని కేంద్రం పార్లమెంట్లో ముందుకు వెళితే ఈజిప్ట్ తరహాలో సీమాంధ్రలో అంతర్యుద్ధం వస్తుందని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ ఈ నెల 26న హైదరాబాద్‌లో నిర్వహించనున్న సమైక్య శంఖారావం సభకు సిద్ధాంతపరంగా తమ మద్దతు ఉంటుందన్నారు. ఏపీఎన్జీఓస్ నేతలు చంద్రశేఖర్ రెడ్డి, పురుషోత్తం నాయుడు, బి.వి.రమణ, ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
సీమాంధ్ర కాంగ్రెస్ నేతల మూడు గంటల దీక్ష
రాష్ట్రాన్ని విభజించాలన్న కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని అంగీకరించేది లేదంటూ కొద్ది రోజుల కిందట ఢిల్లీలో హడావుడి చేసిన అదే పార్టీ సీమాంధ్ర నేతలు.. తాజాగా శాసనసభ ఆవరణను వేదికగా ‘మూడు గంటల దీక్ష’ చేశారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ ప్రాంత మంత్రులు కూడా పాల్గొన్నారు. సమైక్యాంధ్రప్రదేశ్ తప్ప ఎలాంటి ప్రత్యామ్నాయాలనూ ఒప్పుకోబోమంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర సమైక్యత కోసం సీమాంధ్ర ప్రజలు సాగిస్తున్న ఉద్యమానికి, ఏపీఎన్జీఓలు 7వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించనున్న సభకు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు మద్దతు ప్రకటించారు. తమ ఉద్యమాన్ని ఇక ఉధృతం చేస్తామని, వినాయకచవితి తరువాత హైదరాబాద్‌లో 48 గంటల నిరశన దీక్ష చేపడతామని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ, వైఎస్సార్సీపీలు ఓట్ల రాజకీయాలు చేస్తున్నాయని, యాత్రలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. ‘‘కొత్త రాజధానికి ఐదు లక్షల కోట్లు ఇవ్వాలని బేరం పెట్టిన చంద్రబాబు దానికి కట్టుబడి ఉన్నారా? గెలిపిస్తే ఆరు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తానని, విడిపోయిన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్తున్నారు. మీ మాటలు నమ్మడానికి ప్రజలు ఏమైనా అమాయకులనుకున్నారా? సీమాంధ్రలో టీడీపీ, వైఎస్సార్సీపీలు కొంగజపం చేస్తుంటే తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీలు కూడా దొంగనాటకాలే ఆడుతున్నాయి’’ అని విమర్శించారు. ఎన్.టి.రామారావుపై చెప్పులు వేయించిన చంద్రబాబు ఇప్పుడు ఆత్మగౌరవమనటం సిగ్గుచేటన్నారు. సీమాంధ్ర ప్రజలే కాకుండా తెలంగాణలోని 30 శాతం మంది ప్రజలు సమైక్యాన్నే కోరుకుంటున్నారని వివరించారు. రాష్ట్ర సమైక్యతను కొనసాగించాలని, విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని అధిష్టానాన్ని కోరటానికే తామీ దీక్ష చేపట్టామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. ఫోరం కన్వీనర్ సాకే శైలజానాథ్ మాట్లాడుతూ సీడబ్ల్యూసీ తీర్మానాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అనాలోచితంగా, దుర్మార్గమైన విభజన నిర్ణయం తీసుకుందని సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి విమర్శించారు. 2009 ఎన్నికలకు ముందు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో తెలంగాణపై ప్రకటన చేస్తూ రాష్ట్రంలోని భాగస్వాములందరినీ సంప్రదించాకనే నిర్ణయం తీసుకోవాలని స్పష్టంచేశారే తప్ప తెలంగాణ ఇచ్చేయాలనలేదని స్పష్టంచేశారు. ఉదయం పది గంటల నుంచి మూడు గంటల పాటు సాగిన దీక్షలో 18 మంది మంత్రులు, 48 మంది ఎమ్మెల్యేలు, 14 మంది ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు బాలరాజు, డొక్కా మాణిక్యవరప్రసాద్, టి.జి.వెంకటేశ్‌లు హాజరుకాలేదు. పొంగులేటి గులాబీలు: సీమాంధ్ర నేతల దీక్షా స్థలి వద్ద తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి కాసేపు హడావుడి చేశారు. సీమాంధ్ర నేతలకు గులాబీలు ఇచ్చి విభజనకు సహకరించాలని కోరబోయారు. దీనిపై మంత్రులు, ఇతర నేతలు అభ్యంతరపెట్టారు. కొందరు నేతలు గులాబీ పువ్వులను తిరిగి పొంగులేటిపైకే విసిరేయగా మరి కొందరు చెవిలో పెట్టుకొని నిరసన తెలిపారు. -
విభజిస్తే కాంగ్రెస్ భూస్థాపితమే: అశోక్‌బాబు
విజయనగరం, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని విభజిస్తే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని ఏపీఎన్జీఓ అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు హెచ్చరించారు. మంగళవారం విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం పట్టణాల్లో సమైక్యాంధ్రకు మద్దతుగా జరిగిన భారీ బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. సమైక్యాంధ్రకు మద్దతుగా హైదరాబాద్‌లో పదిలక్షల మందితో మహాసభ నిర్వహించనున్నట్టు తెలిపారు. తెలంగాణవాదులు రవాణాను అడ్డుకుంటే కాలినడకనైనా వస్తారని చెప్పారు. హైదరాబాద్‌లో రక్షణ కల్పించాల్సింది సీమాంధ్రులకు కాదని, స్వార్థపూరిత ఆలోచనలున్న తెలంగాణా రాజకీయ నిరుద్యోగులకు మాత్రమేనని చెప్పారు. తెలంగాణతో తమది అన్నదమ్ముల బంధం కాదని, నాటి ప్రధాని నెహ్రూ చెప్పినట్టు భార్యాభర్తల బంధమన్నారు. తెలంగాణ ఉద్యమం కంటే సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రస్థాయిలో జరుగుతోందని తెలిపారు. తెలంగాణలో నాయకులు చేపట్టిన ఉద్యమానికి ప్రజలు పూర్తిగా సహకరించలేదని, సీమాంధ్రలో ప్రజలే సమైక్యాంధ్ర కోసం ఉద్యమాన్ని చేపడుతున్నారన్నారు. సీమాంధ్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు అధిష్ఠానం వద్ద సమైక్యవాదాన్ని గట్టిగా వినిపించలేకపోతున్నారన్నారు. ఉద్యమంలో పాల్గొనని ప్రజాప్రతినిధులు చరిత్రహీనులుగా మిగిలి పోతారని తెలిపారు. జేఏసీ నాయకులను అరెస్టు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుందన్నారు. ఎస్మా అస్త్రాన్ని ప్రయోగిస్తే నాలుగు లక్షల మంది ఉద్యమ ఊపిరిలో ప్రభుత్వం కొట్టుకుపోతుందని హెచ్చరించారు. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి విద్యుత్ ఉద్యోగులు కూడా సమ్మెలోకి దిగితే ఉద్యమం ఉధృతమవుతుందన్నారు. ఈనెల 30వతేదీ వరకు జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె కొనసాగిస్తామని అనంతరం హైదరాబాద్‌లో సమైక్యవాదులతో సమావేశం నిర్వహించి, తదుపరి నిర్ణయం ప్రకటిస్తామని అశోక్‌బాబు పార్వతీపురంలో విలేకరులకు తెలిపారు. జిల్లాలో జరిగిన సభల్లో ఆయనతో పాటు రాష్ట్ర జేఏసీ కార్యదర్శి ఎన్.చంద్రశేఖరరెడ్డి సమైక్యాంధ్ర జిల్లా చైర్మన్ పెద్దింటి అప్పారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం. వెంకటేశ్వరరెడ్డి, జేఏసీ మహిళా కన్వీనరు రత్నకుమారి, రాజ్యలక్ష్మి, జేఏసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రభూజి, డీజీ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
చిదంబరంను కలిసిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు
-
సీమాంధ్ర ఎమ్మెల్యేలను బుజ్జగిస్తున్న బొత్స
-
కెసిఆర్ వ్యాఖ్యల పై APNGOల మండిపాటు