బిల్లుపై చర్చ అభిప్రాయం కోసమే: కోదండరాం
ఆమనగల్లు, న్యూస్‌లైన్: శాసనసభలో ప్రస్తుతం తెలంగాణ బిల్లుపై జరుగుతున్న చర్చ కేవలం అభిప్రాయం కోసమేనని, ఈ విషయాన్ని సీమాంధ్ర ఎమ్మెల్యేలు గుర్తించాలని టీ-జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణ విముక్తి, ఈ ప్రాంత ప్రజల బాగు కోసమే ప్రత్యేక రాష్ట్రం అడుగుతున్నామని పునరుద్ఘాటించారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్లు మండలం కోనాపూర్‌లో బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్‌రాం విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ఒక భాష మాట్లాడే వారంతా ఒకే రాష్ట్రంలో ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు. బిల్లు ప్రతులను చించేయడమంటే రాజ్యాంగాన్ని అవమానపర్చడమే అవుతుందన్నారు. టీజీఏ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులపై దేశద్రోహం నేరం మోపి కేసులు నమోదు చేశారని, బిల్లు ప్రతులను దహనం చేసిన వారిపై కేసులు ఎందుకు పెట్టడంలేదని ప్రశ్నించారు.