సుష్మా స్వరాజ్ వ్యాఖ్యల్ని వక్రీకరిస్తున్నారు: కోదండరామ్
తెలంగాణపై బీజేపీది స్పష్టమైన వైఖరి అని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరామ్ అన్నారు.
హైదరాబాద్: తెలంగాణపై బీజేపీది స్పష్టమైన వైఖరి అని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరామ్ అన్నారు. బీజేపీ సీనియర్ సుష్మాస్వరాజ్ మాటలను వక్రీకరించారని కోదండరామ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఎలాంటి అనుమానాలకు తావులేదని ఆయన మీడియాకు చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యేంత వరకు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణ మద్దతు గురించి కాంగ్రెస్ పార్టీ తమకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ మండిపడిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఆపార్టీకి చెందిన కొందరు నేతలు వ్యతిరేకిస్తున్నారు, మరికొందరు సమర్ధిస్తున్నారు అని సుష్మా అన్నారు. విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద ప్రమాణాలను పాటిస్తోందని సుష్మా స్వరాజ్ ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ బిల్లుకు మద్దతు తెలుపకపోవచ్చనే ఊహాగానాలపై కోదండరామ్ స్పందించారు.