అమరులకు అంకితం: కోదండరాం
సాక్షి, న్యూఢిల్లీ: అనేక పరిస్థితుల మధ్య తెలంగాణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిందని, బిల్లు ఆమోదించడంపై సంతోషకరమని తెలంగాణ రాజ కీయ జేఏసీ చైర్మన్ కోదండరాం పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు. ఈ విజయం ప్రాణత్యాగాలు చేసుకున్న అమరవీరులకే అంకితమని స్పష్టం చేశారు. రాజ్యసభలోనూ బిల్లు ఆమోదం పొందాలన్నారు. ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
‘‘ఇది ప్రజా విజయం. చెప్పరానంత సంతోషంగా ఉంది. ప్రాంతాలుగా విడిపోతున్నాం.. కానీ ఆంధ్ర ప్రాంత ప్రజల తో సోదర భావంతో ఉంటాం. యూపీఏ ప్రభుత్వానికి, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్, బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీకి, మీడియాకు కృతజ్ఞతలు చెబుతున్నాం. తెలంగాణకోసం కేసీఆర్ ఎంతో కృషిచేశారు. ఆయన మాలో భాగం కాబట్టి కృతజ్ఞతలు అని చెప్పడంలేదు’’ అని చెప్పారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, సీపీఐ నేత సురవరం సుధాకర్‌రెడ్డికి, ఇతర నేతలకు కృతజ్ఞతలు చెప్పారు.
సీమాంధ్రను గుజరాత్‌లా తీర్చిదిద్దుతాం
రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందిన సమయంలో ఇరుప్రాంత ప్రజలు సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. విభజన పూర్తయిన తర్వాత ఇరు ప్రాంతాలకు రానున్న రోజుల్లో బీజేపీ న్యాయం చేస్తుంది. సీమాంధ్రను గుజరాత్‌లా తీర్చిదిద్దుతాం. కేవలం మా మద్దతు కారణంగానే తెలంగాణ ఏర్పడబోతోంది
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
సహజసిద్ధంగానే వచ్చింది
రాష్ట్రపునర్‌వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభ ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం. తెలంగాణ ఏర్పాటు యాదృచ్ఛికమో, అప్రజాస్వామికంగానో వచ్చింది కాదు. అభివృద్ధి నినాదంతో మొదలైన ఉద్యమం రాజకీయ నినాదంగా మారింది. రాష్ట్రం ఏ ఒక్క పార్టీతోనో రాలేదు. సహజసిద్ధంగానే ఏర్పాటైంది. ఇది కచ్చితంగా రాజకీయ నిర్ణయమే
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ, పల్లా వెంకటరెడ్డి, కె.రామకృష్ణ,
ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖర్, రాంనరసింహారావు
క్రెడిట్ అమరవీరులదే
బిల్లు ఆమోదం క్రెడిట్ అంతా తెలంగాణ అమరులదే. ఈ విజయంలో టీఆర్‌ఎస్, బీజేపీ కృషి మరువలేనిది. వారికి ధన్యవాదాలు. కొన్ని రోజులుగా తెలంగాణ ఏర్పాటుపై అనేక సందేహాలున్నా చివరికి కల నిజమైంది. తెలంగాణ కోసం నేనూ, కేసీఆర్ తీవ్రంగా కష్టపడ్డాం. చివరకు సాధించాం. తెలంగాణకు మంచి విజన్ ఉన్న సీఎం అవసరం
- ఎంపీ విజయశాంతి
సోనియాగాంధీ కృషితోనే..
సోనియాగాంధీ కృషి వల్ల తెలంగాణ ప్రజల అరవై ఏళ్ల కల నెరవేరింది. బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించిన నేపథ్యంలో తెలంగాణ ప్రజలందరికీ అభినందనలు చెబుతున్నా.
-పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్
తెలంగాణ రాష్ట్రానికి జేజేలు
శాంతి, సహనం, చైతన్యం, పోరాటం, ముఖ్యంగా అమరుల త్యాగాలతో సిద్దించిన తెలంగాణ రాష్ట్రానికి జేజేలు. అమరులకు జోహార్లు. రాష్ట్రాలుగా విడిపోయినా.. మానవ సంబంధాలు పెంచుకుంటూ.. తెలుగుజాతి ఒక్కటిగా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ
- డెరైక్టర్ ఎన్. శంకర్
సోనియాకు గుణపాఠం చెప్పాలి
సీమాంధ్ర ఎంపీలను సస్పెండ్ చేసి, పూర్తి స్థాయిలో చర్చ జరపకుండా, ఓటింగ్ నిర్వహించకుండా కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై విభజన బిల్లును ఆమోదించడం దుర్మార్గపు చర్య. బీజేపీ.. మాట మార్చి బిల్లుకు ఆమోదం తెలపడం సిగ్గుచేటు. తెలుగు జాతి బీజేపీని క్షమించదు. నియంతగా వ్యవహరించిన సోనియాకు తగిన గుణపాఠం చెప్పేరోజు దగ్గర్లోనే ఉంది. కాంగ్రెస్, బీజేపీ దుర్మార్గపు చర్యలకు నిరసనగా బుధవారం బంద్‌ను జయప్రదం చేయాలి.- ఏపీ రాష్ట్ర పరిరక్షణ వేదిక కోఆర్డినేటర్ వి.లక్ష్మణరెడ్డి