ఇంకా ఆర్టీసీని విభజించకపోతే ఎలా?: కోదండరామ్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షతను విడనాడి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వ్యవహారాల్లో జోక్యం చేసుకొని తక్షణమే ఆర్టీసీని విభజించాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్ డిమాండ్ చేశారు. ఏపీ, తెలంగాణ విడిపోయినప్పటికీ ఆర్టీసీని ఎందుకు విభజించలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఆర్టీసీ యూనియన్ల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్టీసీ క్రాస్‌రోడ్ సమీపంలోని బస్ భవన్ నుంచి ఇందిరాపార్కు వరకూ భారీ ర్యాలీ, అనంతరం ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా ఇందిరా పార్కు వద్ద జరిగిన ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన కోదండరామ్ మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థ నిజాం కాలంనుంచే ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆ సంస్థకు చెందిన స్థిరాస్తుల్లో ఏపీ ప్రభుత్వం వాటా అడగడం అన్యాయమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆర్టీసీలో నియామకమైన ఏపీ అధికారులకు తెలంగాణ ప్రభుత్వానికి బాధ్యత లేదన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్లుగానే తెలంగాణ ఇంక్రిమెంట్లను ఆర్టీసీ కార్మికులకు సైతం ఇవ్వాలన్నారు. తెలంగాణ ఆర్టీసీ యూనియన్ల జేఏసీ కన్వీనర్ కె. రాజిరెడ్డి మాట్లాడుతూ కేంద్రం ఆర్టీసీని వెంటనే విభజించి, తెలంగాణ ఆర్టీసీకి ప్రత్యేక పాలక మండలిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో జేఏసీ చైర్మన్ నరేందర్, కో చైర్మన్ అబ్రహాం తదితరులు పాల్గొన్నారు.