ప్రజల హక్కులపై దాడి
మా పోరాటం కేవలం రాష్ట్రం కోసమే కాదు.. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు
సీమాంధ్రులది గుత్తాధిపత్య పోరు
ఆర్థిక ప్రయోజనాల కోసమే బిల్లును
అడ్డుకుంటున్నారని వ్యాఖ్య
వారిపై శాశ్వత అనర్హత
వేటు వేయాలి: మాడభూషి శ్రీధర్
ఢిల్లీ టీజేఎఫ్ సదస్సులో కోదండరాం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ పోరాటం.. ఒక రాష్ట్ర ఏర్పాటు కోసం, అభివృద్ధి కోసం జరుగుతున్న పోరు మాత్రమే కాదని, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకునేందుకు జరుగుతున్న పోరాటమని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా చట్టాలు చేయాల్సిన చోట... తమ ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు పెట్టుబడిదారీ వర్గం జరిపిన దాడిగా ఇటీవలి లోక్‌సభలో దాడి ఘటనను ఆయన అభివర్ణించారు. ‘పార్లమెంటుపై దాడి-జాతికి అవమానం’ అంశంపై తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన సదస్సులో కోదండరాం మాట్లాడారు. ‘‘అనేక అంశాలపై చర్చించి, చట్టం చేసే వ్యవస్థపై జరిగిన దాడి అంటే అది ప్రజల హక్కులపై జరిగిన దాడి. ప్రజాస్వామ్యానికి పొంచి ఉన్న ప్రమాదానికి ఇది సంకే తం. రాజ్యాంగం ప్రకారం ప్రజలకు స్వేచ్ఛ, రిజర్వేషన్లు, సంక్షేమం అందించాల్సిన పార్లమెంటుపై జరిగిన ఈ దాడి కేవలం తెలంగాణ బిల్లును ఆపడానికి జరిగిన ప్రయత్నం మాత్రమే కాదు... ఏదైనా చేయగలమన్న నమ్మకంతో జరిపిన దాడి ఇది..’’ అని పేర్కొన్నారు. సమావేశంలో కోదండరాం ప్రసంగం ఆయన మాటల్లోనే..
సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్న తెలంగాణను ప్రత్యేకంగా ఉంచాలని ఫజల్ అలీ కమిషన్ చెప్పినా వినకుండా 1956లో ఆంధ్రలో విలీనం చేశారు. తెలంగాణకు అప్పుడు ఇచ్చిన రక్షణ ఒప్పందాలన్నీ ఉల్లంఘనకు గురి కావడం వల్లే ఉద్యమం ప్రారంభమైంది.
తెలంగాణ ఉద్యమాన్ని ఒక ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుగా మాత్రమేగాక... బలమైన కార్పొరేట్ వర్గానికి వ్యతిరేకంగా, వెనుకబడిన వర్గాలకోసం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం జరుగుతున్న పోరాటంగా చూడాలి.
1968 తరువాత జరిగిన మలివిడత ఉద్యమం, అనంతర పరిణామాలు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి కారణమయ్యాయి. ఈ వర్గాలపై గుత్తాధిపత్యం కోసమే కోస్తాంధ్రకు చెందిన ఆర్థిక రాజకీయ వర్గం ఇప్పుడు ప్రయత్నం చేస్తోంది.
ప్రపంచీకరణ నేపథ్యంలో కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలు, రియల్‌ఎస్టేట్ వ్యాపారులతో కూడిన ఈ కొత్త తరహా రాజకీయ వర్గం తమ ఆర్థిక ప్రయోజనాల కోసం... బలహీన వర్గాల ఆశలను చర్చించడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదు. లోక్‌సభలో దాడిని కూడా ఇదే కోణం నుంచి చూడాలి..
రిజర్వేషన్ ద్వారా ఎన్నికైన కొంత మంది ఎంపీలు తప్ప.. సీమాంధ్ర ఎంపీలందరూ ఆ ఆర్థిక రాజకీయ వర్గానికి చెందిన వారే. ప్రభుత్వం కూడా వారికి లెసైన్సులు ఇచ్చేందుకు, చౌకగా భూములు కట్టబెట్టేందుకు, కాంట్రాక్టులు ఇచ్చేందుకు సహకరిస్తోంది.
తెలంగాణ రాష్ట్రం వస్తే ఆ సమాజంపై అధికారం కోల్పోతామన్న భయంతో వారు బిల్లును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పార్టీలను డబ్బుతో ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీడియాను కూడా మేనేజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
శాశ్వతంగా అనర్హత వేటు వేయాలి..
చట్టాన్ని రక్షిస్తామని, రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటామని ప్రమాణం చేసిన ఈ ప్రజాప్రతినిధులు సాక్షాత్తు పార్లమెంటులోనే వాటిని ఉల్లంఘిస్తే ఎలాగని కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ పేర్కొన్నారు. వారిపై శాశ్వతంగా అనర్హత వేటు వేసి, చట్టసభలకు మళ్లీ పోటీ చేయకుండా చేయాలన్నారు.
చర్చల ద్వారా పరిష్కారం జరుగుతుందని నమ్మకం లేకుంటే పార్లమెంటుకు రావొద్దని సత్యశోధక్ సమాజ్ ప్రతినిధి సునీల్ సర్దార్ సూచించారు.
ద్రౌపది వస్త్రాపహరణం రీతిలో పార్లమెంటులో తెలంగాణకు అన్యాయం జరిగిందని బుందేల్‌ఖండ్‌కు చెందిన సామాజిక కార్యకర్త సంకల్ప్‌సింగ్ వ్యాఖ్యానించారు.
సమావేశంలో సీపీఐఎంల్ న్యూడెమోక్రసీ కార్యదర్శి అపర్ణ, గాంధీపీస్ మిషన్ ప్రతినిధి సురేందర్‌కుమార్, జేఎన్‌యూ ప్రొఫెసర్ శ్రీనివాస్, టీజాక్ ఢిల్లీ కన్వీనర్ రామకృష్ణారెడ్డి, టీజేఎఫ్ ప్రతినిధులు క్రాంతికిరణ్, రమేశ్ హజారీ తదితరులు పాల్గొన్నారు.