'చిన్నమ్మ'కు ఛాన్స్ దొరుకుతుందా?
'ఈ చిన్నమ్మను గుర్తుపెట్టుకోండి'- లోక్సభలో తెలంగాణ బిల్లుపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ చేసిన వ్యాఖ్య ఇది. తనను తాను చిన్నమ్మగా చెప్పుకుంటూ తెలంగాణ ప్రజలకు ఈ విజ్క్షప్తి చేశారామె. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది ఒక్క సోనియా గాంధీ అనుకోవద్దని, ఈ చిన్నమ్మను కూడా గుర్తుపెట్టుకోవాలని సుష్మా కోరారు. అదే సమయంలో సీమాంధ్రుల డిమాండ్లను మర్చిపోవద్దని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
మాట నిలబెట్టుకునేందుకే తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చామని 'చిన్నమ్మ' తెలిపారు. తెలంగాణలో ఆత్మహత్యలను ఆపేందుకు ప్రత్యేక రాష్ట్రానికి మద్దతు ఇస్తామని వాగ్దానం చేశామని, దాన్ని ఇప్పుడు నిలుపుకుంటున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజల కలసాకారమయ్యేందుకు వచ్చిన బిల్లును వ్యతిరేకించి విశ్వాసఘాతుకానికి పాల్పడకూడదన్నదే తమ ఉద్దేశమని ఉద్ఘాటించారు. విపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నప్పటికీ తెలంగాణ ఏర్పాటుతో వారి కల నెరవేరాలనే బిల్లుకు మద్దతు ఇస్తున్నట్టు వెల్లడించారు.
ఇప్పటివరకు తెలంగానం ఆలపించిన 'చిన్నమ్మ' లోక్సభలో తొలిసారిగా సీమాంధ్రుల గురించి ప్రస్తావించారు. రాయలసీమ, కోస్తాంధ్రకు సంబంధించి నాలుగు ప్రధాన అంశాలను సుష్మా సభలో ప్రస్తావించారు. ఆదాయపరంగా కోస్తాంధ్ర, రాయలసీమ లోటును ఎవరు పూడుస్తారు అంటూ నిలదీశారు. ఉమ్మడి రాజధాని, పోలవరం ప్రాజెక్టు, గవర్నర్‌కు అధికారాల బదలాయింపుపైనా ప్రశ్నలు సంధించారు. సీమాంధ్రుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో యూపీఏ ప్రభుత్వం విఫలమైతే తాము అధికారంలోకి సీమాంధ్రుల సమస్యలు పరిష్కరిస్తామని హామీయిచ్చారు. వాగ్దానాన్ని నిలుపుకునేందుకు చిన్నమ్మకు యూపీఏ సర్కారు ఛాన్స్ ఇస్తుందో, లేదో చూడాలి.