seemandhra Problems
-
'చిన్నమ్మ'కు ఛాన్స్ దొరుకుతుందా?
'ఈ చిన్నమ్మను గుర్తుపెట్టుకోండి'- లోక్‌సభలో తెలంగాణ బిల్లుపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ చేసిన వ్యాఖ్య ఇది. తనను తాను చిన్నమ్మగా చెప్పుకుంటూ తెలంగాణ ప్రజలకు ఈ విజ్క్షప్తి చేశారామె. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది ఒక్క సోనియా గాంధీ అనుకోవద్దని, ఈ చిన్నమ్మను కూడా గుర్తుపెట్టుకోవాలని సుష్మా కోరారు. అదే సమయంలో సీమాంధ్రుల డిమాండ్లను మర్చిపోవద్దని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మాట నిలబెట్టుకునేందుకే తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చామని 'చిన్నమ్మ' తెలిపారు. తెలంగాణలో ఆత్మహత్యలను ఆపేందుకు ప్రత్యేక రాష్ట్రానికి మద్దతు ఇస్తామని వాగ్దానం చేశామని, దాన్ని ఇప్పుడు నిలుపుకుంటున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజల కలసాకారమయ్యేందుకు వచ్చిన బిల్లును వ్యతిరేకించి విశ్వాసఘాతుకానికి పాల్పడకూడదన్నదే తమ ఉద్దేశమని ఉద్ఘాటించారు. విపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నప్పటికీ తెలంగాణ ఏర్పాటుతో వారి కల నెరవేరాలనే బిల్లుకు మద్దతు ఇస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పటివరకు తెలంగానం ఆలపించిన 'చిన్నమ్మ' లోక్‌సభలో తొలిసారిగా సీమాంధ్రుల గురించి ప్రస్తావించారు. రాయలసీమ, కోస్తాంధ్రకు సంబంధించి నాలుగు ప్రధాన అంశాలను సుష్మా సభలో ప్రస్తావించారు. ఆదాయపరంగా కోస్తాంధ్ర, రాయలసీమ లోటును ఎవరు పూడుస్తారు అంటూ నిలదీశారు. ఉమ్మడి రాజధాని, పోలవరం ప్రాజెక్టు, గవర్నర్‌కు అధికారాల బదలాయింపుపైనా ప్రశ్నలు సంధించారు. సీమాంధ్రుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో యూపీఏ ప్రభుత్వం విఫలమైతే తాము అధికారంలోకి సీమాంధ్రుల సమస్యలు పరిష్కరిస్తామని హామీయిచ్చారు. వాగ్దానాన్ని నిలుపుకునేందుకు చిన్నమ్మకు యూపీఏ సర్కారు ఛాన్స్ ఇస్తుందో, లేదో చూడాలి. -
మా సమస్యలు పరిష్కరిస్తేనే ఓటేయండి!
* బీజేపీ జాతీయ నాయకత్వంపై సీమాంధ్ర నేతల ఒత్తిడి సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర సమస్యలు పరిష్కరించే వరకు విభజన బిల్లుకు పార్లమెంటులో మద్దతు ఇవ్వొద్దని బీజేపీ సీమాంధ్ర ఉద్యమ కమిటీ పార్టీ జాతీయ నాయకత్వాన్ని డిమాండ్ చేసింది. ఉద్యమ కమిటీ చైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు, తదితరులు బుధవారం పార్టీ సీనియర్ నేతలు వెంకయ్య నాయుడు, రవిశంకర్ ప్రసాద్‌ను కలసి బిల్లుకు పది సవరణలను సూచించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సజావుగా సాగాలంటే ముంపునకు గురయ్యే భద్రాచలం ప్రాంతాన్ని సీమాంధ్రలోనే కలపాలని కోరారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతల పర్యవేక్షణ బాధ్యతలను గవర్నర్‌కు అప్పగించే అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మరోపక్క పార్టీ జాతీయ కమిటీ సభ్యుడు హరిబాబు నాయకత్వంలో మరికొంతమంది గురువారం ఢిల్లీకి వెళుతున్నారు. అద్వానీ, సుష్మాస్వరాజ్, రాజ్‌నాథ్‌సింగ్‌లతో వీరు భేటీ కానున్నారు. సీమాంధ్ర నేతలకు పోటీగా తెలంగాణ బీజేపీ నేతలూ శుక్రవారం ఢిల్లీకి వెళుతున్నారు. -
ఢిల్లీకి సీమాంధ్ర బీజేపీ నేతలు
అధిష్టానం దృష్టికి సమస్యలు తీసుకెళ్లే యత్నం సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర సమస్యలపై కేంద్ర నాయకత్వం వద్ద తమ వాదన వినిపించేందుకు బీజేపీ సీమాంధ్ర ఉద్యమ కమిటీ సమాయత్తమైంది. ఈ మేరకు పది డిమాండ్లతో వినతిపత్రాన్ని కూడా రూపొందించింది. శనివారం నుంచి జరిగే పార్టీ జాతీయ సమితి సమావేశాల్లో పాల్గొనేందుకు దేశ రాజధానికి చేరిన సీమాంధ్ర నేతలు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ, సుష్మాస్వరాజ్, అరుణ్‌జెట్లీ, నరేంద్ర మోడీని కలిసేందుకు సమయాన్ని కోరారు. అసెంబ్లీ స్పీకర్‌కు అందజేసిన సూచనల్లోనూ తమ ప్రాంత సమస్యలపై శ్రద్ధ కనబరచలేదన్న అసంతృప్తితో ఉన్న వీరు పార్లమెంటులో సవరణలు ప్రతిపాదించాలని విజ్ఞప్తి చేయనున్నారు. పోలవరం ప్రాజెక్టు, నూతన రాజధానిని ఎంత గడువులోగా నిర్మిస్తారో బిల్లులో లేదని, దీనిపై పట్టుబట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గోదావరి నది నుంచి 150 టీఎంసీల నీటిని కృష్ణాకు తరలించాలని... ఏయే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తారో స్పష్టంగా పేర్కొనాలని, కడపలో నిర్మించాలనుకున్న బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ వివాదాల్లో చిక్కుకున్నందున ప్రత్యామ్నాయంగా మరో ప్రాజెక్టును చేపట్టాలని, జల వనరుల నిర్వహణకు నిర్ణయాధికారాలున్న స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని సీమాంధ్ర బీజేపీ నేతలు కోరుతున్నారు. పోలవరం ప్రాజెక్టు సజావుగా పూర్తి కావాలంటే భద్రాచలం డివిజన్‌ను ఆంధ్రాలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే వేదికైన పార్టీ జాతీయ కార్యవర్గ, జాతీయ సమితి సమావేశాల్లో పాల్గొనేందుకు బీజేపీ రాష్ట్ర నేతలు పెద్ద సంఖ్యలో వెళ్లారు. శుక్రవారం కార్యవర్గ భేటీకి కిషన్‌రెడ్డి, బండారు దత్తాత్రేయ, నల్లు ఇంద్రసేనారెడ్డి, ఎన్.రామచంద్రరావు, విద్యాసాగర్‌రావు, హరిబాబు, కె.లక్ష్మణ్ సహా 16 మంది హాజరుకాగా... శనివారం నుంచి జరిగే కౌన్సిల్ సమావేశాలకు సుమారు 450 మంది నేతలు హాజరవుతున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి ఎస్.కుమార్ తెలిపారు. -
సీమాంధ్ర సమస్యలపై నిలదీస్తాం: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీ, పార్లమెంటుకు వచ్చినప్పుడు సీమాంధ్రుల సమస్యలు, అనుమానాలపై తప్పక స్పందిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర విభజన కోరుతున్నామే తప్ప ప్రజల మధ్య విభజనను కాదని పునరుద్ఘాటించారు. రాష్ట్ర సమైక్యతా పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో వివిధ సంఘాల నేతలు అశోక్‌బాబు, చంద్రశేఖర్‌రెడ్డి, సత్యనారాయణ, చలసాని శ్రీనివాసరావు, కారెం శివాజీ తదితరులు సోమవారమిక్కడ బీజేపీ నాయకులు కిషన్‌రెడ్డి, డాక్టర్ మల్లారెడ్డిని కలసి రాష్ట్ర విభజన బిల్లుపై చర్చించారు. బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు సీమాంధ్ర సమస్యలపై స్పందించాలని కోరారు. అనంతరం అశోక్‌బాబు, కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన వ్యవహారంలో కేంద్రం మొండిగా వ్యవహరిస్తోందని, సీమాంధ్రుల మనోభావాలు పట్టించుకోకుండా అవమానిస్తోందని అశోక్‌బాబు విమర్శించారు. చిన్న రాష్ట్రాలకు కట్టుబడ్డ బీజేపీ సిద్ధాంతాన్ని తాము ప్రశ్నించడం లేదంటూనే ప్రస్తుత విభజన ఓ ప్రాంతానికి అన్యాయం చేసేదిగా ఉన్నందున నిలదీయమని కోరామన్నారు. దీనికి కిషన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారని చెప్పారు. రాజ్యాంగ పరిధికి లోబడే తెలంగాణ ఏర్పాటవుతుందని నమ్ముతున్నట్టు కిషన్‌రెడ్డి చెప్పారు. -
ఢిల్లీలో సీమాంధ్రవాణి వినిపించాం:మురళీకృష్ణ
న్యూఢిల్లీ: ఢిల్లీలో జాతీయ పార్టీల నేతలందరికీ సీమాంధ్ర వాణి వినిపించామని సీమాంధ్ర ఉద్యోగుల సెక్రటేరియట్ కన్వీనర్ మురళీకృష్ణ చెప్పారు. తమ ఢిల్లీ పర్యటన సంతృప్తికరంగా జరిగినట్లు తెలిపారు. జాతీయ నేతలకు సీమాంధ్రుల పరిస్థితులను వివరించినట్లు చెప్పారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో సెప్టెంబర్ 7న హైదరాబాద్‌లో సభ నిర్వహించి తీరుతామన్నారు. సభలో అన్ని పార్టీల నేతలను పాల్గొనాలని కోరినట్లు తెలిపారు.