సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీ, పార్లమెంటుకు వచ్చినప్పుడు సీమాంధ్రుల సమస్యలు, అనుమానాలపై తప్పక స్పందిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర విభజన కోరుతున్నామే తప్ప ప్రజల మధ్య విభజనను కాదని పునరుద్ఘాటించారు. రాష్ట్ర సమైక్యతా పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో వివిధ సంఘాల నేతలు అశోక్‌బాబు, చంద్రశేఖర్‌రెడ్డి, సత్యనారాయణ, చలసాని శ్రీనివాసరావు, కారెం శివాజీ తదితరులు సోమవారమిక్కడ బీజేపీ నాయకులు కిషన్‌రెడ్డి, డాక్టర్ మల్లారెడ్డిని కలసి రాష్ట్ర విభజన బిల్లుపై చర్చించారు. బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు సీమాంధ్ర సమస్యలపై స్పందించాలని కోరారు.
అనంతరం అశోక్‌బాబు, కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన వ్యవహారంలో కేంద్రం మొండిగా వ్యవహరిస్తోందని, సీమాంధ్రుల మనోభావాలు పట్టించుకోకుండా అవమానిస్తోందని అశోక్‌బాబు విమర్శించారు. చిన్న రాష్ట్రాలకు కట్టుబడ్డ బీజేపీ సిద్ధాంతాన్ని తాము ప్రశ్నించడం లేదంటూనే ప్రస్తుత విభజన ఓ ప్రాంతానికి అన్యాయం చేసేదిగా ఉన్నందున నిలదీయమని కోరామన్నారు. దీనికి కిషన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారని చెప్పారు. రాజ్యాంగ పరిధికి లోబడే తెలంగాణ ఏర్పాటవుతుందని నమ్ముతున్నట్టు కిషన్‌రెడ్డి చెప్పారు.