అధిష్టానం దృష్టికి సమస్యలు తీసుకెళ్లే యత్నం
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర సమస్యలపై కేంద్ర నాయకత్వం వద్ద తమ వాదన వినిపించేందుకు బీజేపీ సీమాంధ్ర ఉద్యమ కమిటీ సమాయత్తమైంది. ఈ మేరకు పది డిమాండ్లతో వినతిపత్రాన్ని కూడా రూపొందించింది. శనివారం నుంచి జరిగే పార్టీ జాతీయ సమితి సమావేశాల్లో పాల్గొనేందుకు దేశ రాజధానికి చేరిన సీమాంధ్ర నేతలు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, సీనియర్ నేతలు ఎల్‌కే అద్వానీ, సుష్మాస్వరాజ్, అరుణ్‌జెట్లీ, నరేంద్ర మోడీని కలిసేందుకు సమయాన్ని కోరారు. అసెంబ్లీ స్పీకర్‌కు అందజేసిన సూచనల్లోనూ తమ ప్రాంత సమస్యలపై శ్రద్ధ కనబరచలేదన్న అసంతృప్తితో ఉన్న వీరు పార్లమెంటులో సవరణలు ప్రతిపాదించాలని విజ్ఞప్తి చేయనున్నారు. పోలవరం ప్రాజెక్టు, నూతన రాజధానిని ఎంత గడువులోగా నిర్మిస్తారో బిల్లులో లేదని, దీనిపై పట్టుబట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
గోదావరి నది నుంచి 150 టీఎంసీల నీటిని కృష్ణాకు తరలించాలని... ఏయే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తారో స్పష్టంగా పేర్కొనాలని, కడపలో నిర్మించాలనుకున్న బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ వివాదాల్లో చిక్కుకున్నందున ప్రత్యామ్నాయంగా మరో ప్రాజెక్టును చేపట్టాలని, జల వనరుల నిర్వహణకు నిర్ణయాధికారాలున్న స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని సీమాంధ్ర బీజేపీ నేతలు కోరుతున్నారు. పోలవరం ప్రాజెక్టు సజావుగా పూర్తి కావాలంటే భద్రాచలం డివిజన్‌ను ఆంధ్రాలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే వేదికైన పార్టీ జాతీయ కార్యవర్గ, జాతీయ సమితి సమావేశాల్లో పాల్గొనేందుకు బీజేపీ రాష్ట్ర నేతలు పెద్ద సంఖ్యలో వెళ్లారు. శుక్రవారం కార్యవర్గ భేటీకి కిషన్‌రెడ్డి, బండారు దత్తాత్రేయ, నల్లు ఇంద్రసేనారెడ్డి, ఎన్.రామచంద్రరావు, విద్యాసాగర్‌రావు, హరిబాబు, కె.లక్ష్మణ్ సహా 16 మంది హాజరుకాగా... శనివారం నుంచి జరిగే కౌన్సిల్ సమావేశాలకు సుమారు 450 మంది నేతలు హాజరవుతున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి ఎస్.కుమార్ తెలిపారు.
ఢిల్లీకి సీమాంధ్ర బీజేపీ నేతలు
Published Sat, Jan 18 2014 5:07 AM | Last Updated on Fri, Mar 29 2019 6:00 PM
Advertisement
Advertisement