లక్ ఎవరిదో?
ఉత్తర్రపదేశ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టేది ఎవరు?
ఉత్తరప్రదేశ్ అధికార పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకున్న నేపథ్యంలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి ఎవరనేది ప్రకటించకుండానే ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో ప్రస్తుత కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మొదలుకొని ఫైర్‌బ్రాండ్ ఎంపీ యోగీ ఆదిత్యనాథ్ వరకూ అనేకమంది సీఎం పదవి రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరందరిలో సీఎం పీఠం ఎవరిని వరిస్తుంది? ఎవరి బలమేంటి? బలహీనతలేంటి? అన్నది విశ్లేషిస్తే...
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
రాజ్‌నాథ్ సింగ్...
పార్టీ సీనియర్ నేత. ఆర్‌ఎస్‌ఎస్‌తోనూ దగ్గరి సంబంధాలున్న వ్యక్తి. 24 ఏళ్ల వయసులో జన్‌సంఘ్ జిల్లా అధ్యక్షుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రాజ్‌నాథ్ అంచలంచెలుగా యూపీ సీఎం స్థానానికి ఎదిగారు. రెండు దఫాలు సీఎంగానూ, పార్టీ అధ్యక్షుడిగానూ పనిచేసిన అనుభవముంది. కుల, మత రాజకీయాలకు ప్రాధాన్యమున్న యూపీలో అన్ని వర్గాల వారిని కలుపుకొనిపోగల నేతగా రాజ్‌నాథ్‌కు పేరుంది.
మనోజ్ సిన్హా...
ఘాజీపూర్ నుంచి పార్లమెంటుకు ఎంపికై కేంద్ర టెలికాం శాఖ మంత్రిగా పనిచేస్తున్న మనోజ్ సిన్హా విద్యావంతుడు. బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ చేసిన సిన్హా.. ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసిలో కీలక మార్పులు తీసుకురావడంలో ముఖ్యభూమిక పోషించారు. భూమిహార్ వర్గానికి చెందిన వాడు కావడం ఆయనకు ముఖ్యమంత్రి పదవి దక్కేందుకు అనుకూలమైన అంశం.
కేశవ్ ప్రసాద్ మౌర్య..
బీజేపీ యూపీ అధ్యక్షుడైన కేశవ్ ప్రసాద్ మౌర్యకు ఈ సారి సీఎం పదవి దక్కవచ్చన్న బలమైన వాదన ఉంది. 2014లో పార్లమెంట్‌కు ఎన్నికైన 47 ఏళ్ల మౌర్య 1990లో రామమందిరం ఆందోళనలో చురుగ్గా పాల్గొన్నారు. రాష్ట్రంలోని యాదవేతర ఓట్లను కొల్లగొట్టే లక్ష్యంతో ఓబీసీలలో కుశ్వాహ వర్గానికి చెందిన మౌర్యను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. పాలనాపరమైన అనుభవం లేకపోవడం ప్రతికూల అంశం. అనుభవం లేకపోయినా మౌర్యకు పదవి దక్కవచ్చునని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
యోగీ ఆదిత్యనాథ్...
వీరితోపాటు కరడుకట్టిన హిందుత్వవాది, వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లోకి ఎక్కే యోగీ ఆదిత్యనాథ్ కూడా ఈ పదవిపై కన్నేయడమే కాకుండా తనను ముఖ్యమంత్రిని చేయాల్సిందిగా మోదీని కోరారు కూడా. అయితే ఘోరఖ్‌నాథ్ మఠానికి అధిపతిగా, హిందూ యువవాహిని వంటి వివాదాస్పద సంస్థలకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఈ ఎంపీని.. మోదీ అందలమెక్కిస్తారా? అన్నది ప్రశ్న.
వీరితో పాటు బీజేపీ సీనియర్ నేతలు ఉమాభారతి కూడా రేసులో ఉన్నప్పటికీ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే పార్టీ నాయకత్వం ఈ సాధ్వీని పరిగణనలోకి తీసుకునే అవకాశాలు తక్కువే. మరోవైపు కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్న కల్‌రాజ్ మిశ్రా, సంతోష్ గంగ్వార్ వంటి వారు కూడా ఈ పదవిని ఆశిస్తున్నారు.