
తెలంగాణలో నిరసన వెల్లువ
బిల్లు చింపివేతపై తెలంగాణలో ప్రదర్శనలు
సీమాంధ్ర ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలు దహనం
న్యూస్‌లైన్ నెట్‌వర్క్: తెలంగాణ ముసాయిదా బిల్లును శాసనసభ ఆవరణలో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు చింపివేయడాన్ని తెలంగాణవాదులు తీవ్రంగా నిరసించారు. శాసనసభ, శాసన మండలిలో సోమవారం ముసాయిదా బిల్లు ప్రతులను చింపివేయడంపై వారు మండిపడ్డారు. ఇది రాజ్యాంగ వ్యతిరేక చర్య అని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరచడమేనన్నారు. వారి చర్యలను నిరసిస్తూ తెలంగాణవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి సీమాంధ్ర ప్రజాప్రతినిధుల, నేతల దిష్టిబొమ్మలను దహనం చేశారు. వరంగల్ జిల్లా హన్మకొండలో టీఆర్‌ఎస్ యువజన విభాగం నేతలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. కాకతీయ యూనివర్సిటీ జేఏసీ ఆధ్వర్యంలో, పరకాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో, అలాగే టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సీమాంధ్ర ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలను దహనంచేశారు.
నిజామాబాద్, కామారెడ్డిల్లో న్యాయవాదులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో టీఆర్‌ఎస్ కార్యకర్తలు రాస్తారోకోలు చేశారు. కరీంనగర్ జిల్లాలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, టీజేఏసీల ఆధ్వర్యంలో కిరణ్, చంద్రబాబుతో సహా సీమాంధ్ర ప్రజాప్రతినిధుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. గోదావరిఖనిలో శాప్ మాజీ చైర్మన్ ఎం.ఎస్. రాజ్‌ఠాకూర్ ఆధ్వర్యంలో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. నల్లగొండ జిల్లా భవనగిరిలో వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. జిల్లా కేంద్రంలోనూ నిరసనలు హోరెత్తాయి. ఆదిలాబాద్ లోని టీడీపీ కార్యాలయంపై టీఆర్‌ఎస్ నేతలు రాళ్లు, టమోటాలు, కోడిగుడ్లతో దాడి చేశారు. టీడీపీ జెండాలను తగులబెట్టారు. ఈ సందర్భంగా పోలీసులకు, టీఆర్‌ఎస్ నాయకులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఖమ్మంలో టీఎన్జీవో ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులు నిరసన ప్రదర్శన చేశారు. సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నేతలు ఖమ్మం బైపాస్‌రోడ్డుపై నిరసన తెలిపారు. ఇల్లెందు, కొత్తగూడెంలలో కిరణ్, బాబుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. మెదక్ జిల్లాలో సీమాంధ్ర నేతల దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి, దహనం చేశారు. సిద్ధిపేట, సంగారెడ్డి, గజ్వేల్,అందోల్‌లో నిరసన ర్యాలీలు నిర్వహించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సీమాంధ్ర నేతల దిష్టిబొమ్మలను దహనం చేశారు. జిల్లా కేంద్రంలోని వైఎస్‌ఆర్ సీపీ కార్యాలయంపై తెలంగాణవాదులు దాడి చేశారు. బోర్డుతో పాటు ఫ్లెక్సీని చింపివేశారు. జెండాను తొలగించి, నిప్పు పెట్టారు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, వికారాబాద్, తాండూరు, శంషాబాద్, పరిగి నియోజకవర్గాల్లో తెలంగాణవాదులు ఆందోళనలు చేపట్టారు.
తెలంగాణ రాదేమోనని ఆగిన గుండె
సీమాంధ్రుల చర్యలతో తెలంగాణ రాదని మనస్తాపానికి చెందిన ఓ యువకుడు సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు. కరీంనగర్‌జిల్లా ఎల్కతుర్తి మండలం వల్భాపూర్‌నకు చెందిన వేమన(30) శ్రీరాజ రాజేశ్వర ఫార్మసీ కళాశాలలో పనిచేస్తున్నాడు. మధ్యాహ్నం టీవీలో సీమాంధ్ర ఎమ్మెల్యేలు తెలంగాణ బిల్లు ప్రతులను చింపివేయడం..దహనం చేయడాన్ని చూసి భావోద్వేగంతో కుప్పకూలిపోయి ప్రాణాలొదిలాడు.