
సీమాంధ్ర ఎమ్మెల్యేలపై టీఆర్‌ఎస్ దూకుడు
సభలో చొక్కా పట్టుకుంటారా.. ఇదేం దౌర్జన్యం: గాదె ఆగ్రహం
క్షమాపణకు కాంగ్రెస్, టీడీపీ డిమాండ్.. విచారం వ్యక్తం చేసిన ఈటెల
సాక్షి, హైదరాబాద్: టీ-బిల్లుపై చర్చ సందర్భంగా శుక్రవారం అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. టీఆర్‌ఎస్ సభ్యులు ఒకవైపు, సీమాంధ్ర ఎమ్మెల్యేలు మరోవైపు మోహరించడంతో సభలో యుద్ధవాతావరణం నెలకొంది. టీఆర్‌ఎస్ సభ్యులు ఒక దశలో కాంగ్రెస్ సభ్యులవైపు దూసుకువెళ్లి వారిని వెనక్కి నెట్టడం, దీనికి వారు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. అరుపులు, నినాదాలతో దద్దరిల్లి, కొంతసేపు సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగింది. సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డిని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య నెట్టివేయడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తమకు క్షమాపణ చెప్పాలని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు.
కాగా, డిప్యూటీస్పీకర్ సూచన మేరకు టీఆర్‌ఎస్ పక్ష నేత ఈటెల రాజేందర్ చింతిస్తున్నామని చెప్పడంతో ఈ వివాదం సద్దుమణిగింది. రాష్ట్రపునర్వ్యవస్థీకరణ బిల్లుపై శుక్రవారం శాసన సభలో టీఆర్‌ఎస్ తరపున ఈటెల రాజేందర్ మాట్లాడుతుండగా ఈ సంఘటన జరిగింది. పొట్టి శ్రీరాములు కూడా చిన్న రాష్ట్రాలకు మద్దతు ఇచ్చారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడే సమయంలోనే మోసం జరిగిందని, తెలంగాణ, ఆంధ్ర రాష్ర్టంగా పేరు పెట్టాల్సి ఉన్నా...తెలంగాణ పదాన్ని తొలగించారని, గడసరి వారితో అమాయక తెలంగాణ వారు తట్టుకోవడం కష్టమన్న నెహ్రూ అభిప్రాయం...వంటి విషయాలను ఈటెల ఉటంకించారు.
ఈ దశలో ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ జోక్యం చేసుకుని... చరిత్రను రాజేందర్ వక్రీకరిస్తున్నారని, ఇలాంటి రెచ్చగొట్టే వక్రీకరణల వల్లనే తెలంగాణలో వెయ్యి మంది అమాయకులు మృతి చెందారని ఆరోపించారు. దాంతో టీఆర్‌ఎస్ సభ్యుడు విద్యాసాగర్‌రావు ఆగ్రహించి ద్రోణంరాజు శ్రీనివాస్ వద్దకు వెళ్లి వాదనకు దిగారు. పరిస్థితిని గమనించిన కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి తదితరులు అక్కడికి వచ్చి వారిని సముదాయించారు. అయితే టీఆర్‌ఎస్ సభ్యుడు కావేటి సమ్మయ్య అకస్మాత్తుగా వారి వద్దకు వచ్చి గాదె వెంకట్‌రెడ్డితో పాటు మరికొందరని వెనక్కి నెట్టారు. దీంతో సభలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.
ఇదేసమయంలో గాదెకు మద్దతుగా సీమాంధ్ర కాంగ్రెస్ సభ్యులు,టీఆర్‌ఎస్ సభ్యులకు మద్దతుగా తెలంగాణ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. ఈ దశలో అరుపులు కేకలతో సభ దద్దరిల్లింది.దీంతో పరిస్థితి చే యి దాటిపోతుందని గ్రహించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే దామోదరరెడ్డి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హరీ్‌శ్ రావు, జూపల్లి కృష్ణారావు వంటి వారు ఇరు వర్గాలను శాంతింపజేశారు.అనంతరం గాదె వెంకటరెడ్డి మాట్లాడుతూ,‘ సభలో చొక్కా పట్టుకుంటారండి...ఇదేం సంస్కృతి ? ఇదేం దౌర్యన్యం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘వారితో తనకు క్షమాపణ చెప్పించాల’ని సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్‌ను కోరారు. దీంతో మంత్రి శైలాజానాథ్,ద్రోణంరాజు శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ, పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే...రేపు తెలంగాణ వచ్చిన తర్వాత సీమాంధ్రుల భద్రతకు ఎవరు భరోసా ఇస్తారని ప్రశ్నించారు. ఈ దౌర్జన్యాలను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
ఈ దశలో టీడీపీ సభ్యులు నరేంధ్ర , బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తదితరులు వారికి మద్దతుపలికారు. అంతేకాక టీఆర్‌ఎస్ సభ్యులు తీరును ఖండిస్తూ స్పీకర్ పోడియం వద్దకు చేరి నిరసన వ్యక్తం చేశారు. దురుసు ప్రవర్తనకు క్షమాపణ చెప్పించాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. దీంతో డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క జోక్యం చేసుకుని వాదనల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం సహాజం, సభలో అందరూ, హుందాగా ఉండాలని కోరారు. ఆయన సూచనతో ఈటెల రాజేందర్ ‘ఈ సంఘటనను మేం మర్యాద అని అన డం లేదు...జరిగిన దానికి చింతిస్తున్నామ’ని చెప్పారు. దాంతో వివాదం సద్దుమణిగింది.
18 నుంచీ మళ్లీ అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 18 నుంచీ శాసనసభ, శాసనమండలి తిరిగి ప్రారంభం కానున్నారుు. 17న ఏఐసీసీ సమావేశం ఉన్నందున ఆ రోజు శాసనసభ, శాసనమండలికి సెలవు ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు స్పీకర్, చైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఆమోదం తెలిపిన స్పీకర్ నాదెండ్ల మనోహర్, చైర్మన్ చక్రపాణి.. 18వ తేదీ నుంచి సభలు తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. 19వ తేదీ ఆదివారం కూడా సభలు జరుగుతాయని అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారామ్ శుక్రవారం విడుదల చేసిన బులెటెన్‌లో పేర్కొన్నారు.