రేపు ఢిల్లీలో సీఎం దీక్ష
* దీక్షకు సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
* వారిని రప్పించే బాధ్యత మంత్రులకు అప్పగింత
* వేదిక ఇందిరాగాంధీ స్మారక చిహ్నమైన శక్తిస్థల్
* బిల్లుపై సుప్రీం కోర్టుకు వెళ్లే యోచన?
* నేడు వార్‌రూమ్ భేటీకి కేంద్రమంత్రులు, సీఎం, పీసీసీ చీఫ్‌లు
సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట విభజన వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఢిల్లీలో దీక్ష చేయాలని సీమాంధ్ర కాంగ్రెస్‌నేతలు నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ఈ నెల ఐదో తేదీన ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్మారక చిహ్నమైన శక్తిస్థల్ వద్ద నిరసన దీక్షను చేపట్టనున్నట్లు సమాచారం. ఢిల్లీలో తాము చేపట్టాల్సిన కార్యక్రమాలపై ముఖ్యమంత్రి గత రెండురోజులుగా కొందరు మంత్రులు, ఇతర నేతలతో సమావేశమై చర్చించారు. బిల్లుకు మద్దతు పలకరాదని కోరేందుకు ఇతర పార్టీల నేతలను కలవాలా? లేదా? అన్న అంశంపై తర్జనభర్జనలు సాగించారు.
ఢిల్లీలో ఎంపీలతో భేటీ అయ్యాక తుది నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయానికి వచ్చారు. అలాగే బిల్లులోని లోపాలను ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టుకు విన్నవించాలన్న అంశంపైనా చర్చించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన విధివిధానాలు, ఇతర అంశాలను మరోసారి న్యాయనిపుణులతో చర్చించాకనే ముందుకు వెళ్దామని సీఎం చెప్పినట్లు సమాచారం.
* ప్రాథమికంగా నిర్ణయమైన కార్యక్రమాల ప్రకారం సీఎం నేతృత్వంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఈ నెల 5వ తేదీన ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్మారక చిహ్నమైన శక్తిస్థల్ వద్ద నిరసన దీక్షను చేపట్టనున్నారు. దీనికి సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యేలా చూడాలని, వారందరినీ ఢిల్లీకి రప్పించే ఏర్పాట్లను సీఎం తన కోటరీలోని మంత్రులకు అప్పగించారు.
* ఈ మేరకు సీమాంధ్ర ప్రాంత మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, గంటా శ్రీనివాసరావు, టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, సాకే శైలజానాధ్ తదితర మంత్రులు ఇతర నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హస్తినకు వెళ్లారు.
*రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఐదో తేదీకి ఖరారైన నేపథ్యంలో ఆ రోజు ఉదయం ఢిల్లీ వెళ్లాలని సీఎం భావించారు. అయితే అధిష్టానం పిలుపుతో ఒకరోజు ముందే మంగళవారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు.
* రాజ్యాంగపరంగానే కాకుండా న్యాయపరంగా కూడా బిల్లులో అనేక లోపాలున్నాయని రాష్ట్రపతికి విన్నవిస్తామని మంత్రి సాకే శైలజానాధ్, విప్ రుద్రరాజు పద్మరాజు తెలిపారు.
* అయితే పార్లమెంటుకు సంబంధం లేని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎంతమంది ఢిల్లీలో నిరసన దీక్షలకు దిగినా ఫలితం ఉండదని, ఎంపీలు కేంద్రమంత్రులపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు.
* ఈ నేపథ్యంలో బిల్లుకు వ్యతిరేకంగా కేంద్రమంత్రులెలా వ్యవహరిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఎంపీలకు తోడు సీమాంధ్ర కేంద్రమంత్రులు కూడ కలసివస్తేనే ఫలితం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
* నిరసన దీక్షలతోపాటు రాష్ట్రపతి వద్దకు తమతో కలసిరావాల్సిందిగా కేంద్రమంత్రులను కూడా కోరనున్నామని శైలజానాధ్ తెలిపారు. వారు కూడా తమతో వస్తారన్న నమ్మకముందని చెప్పారు.
* మరోవైపు విభజన బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్న కాంగ్రెస్ అధిష్టానం మంగళవారం రాత్రి వార్‌రూమ్‌లో రాష్ట్ర నేతలతో ఒక సమావేశం నిర్వహిస్తోంది. ఇందులో సీఎంతోపాటు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు.