సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఫెయిలే
చిరంజీవి సహా మొత్తం సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులందరూ ఫెయిలయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే విషయంలో తాము ఇప్పటికే పరీక్ష రాశామని, అందులో పాసా, ఫెయిలా అనేది త్వరలోనే తెలుస్తుందని కాంగ్రెస్ పార్టీ నేత, కేంద్ర మంత్రి చిరంజీవి శనివారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. సమైక్యాంధ్ర కోసం తామంతా చిత్తశుద్ధితో కృషి చేశామని, మంత్రి పదవులను కూడా త్యజించామని ఆయన చెప్పినా, అదంతా డొల్ల వాదనేనని తేలిపోయింది. వాస్తవానికి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన అన్ని పార్టీల ఎంపీలు నిజాయితీగా రాజీనామాలు చేసి ఉంటే కేంద్ర ప్రభుత్వానికి తగినంత బలం ఉండేది కాదు, ఈ పాటికి పడిపోయి కూడా ఉండేది. ఏకంగా తొమ్మిది మందికి కేంద్ర మంత్రిపదవులు లభించిన వైనాన్ని చూస్తే, వీళ్లందరికీ పదవుల ఎర వేసి.. కేంద్రం ముందుగానే వీళ్లందరినీ జేబుల్లో వేసుకుందన్న ప్రచారం గట్టిగా ఉంది.
కేంద్రం ప్రభుత్వం నుంచి ఇంత స్థాయిలో ప్రకటన వచ్చిన తర్వాత కూడా కేంద్ర మంత్రుల నుంచి ఏమాత్రం స్పందన రాకపోవడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా కనపడుతోంది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ముందు కొంతమంది మంత్రులు తమ డిసెంట్ నోట్ ఇస్తామని చెప్పినట్లు సమాచారం వినిపించింది. దాన్ని కూడా కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు. దీన్ని బట్టి చూస్తే.. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు ఉత్త చవటలన్న విమర్శలు సీమాంధ్ర ప్రాంతంలో వినిపిస్తున్నాయి.
తమ ప్రాంతానికి చెందిన ప్రజల ప్రయోజనాలను ఏమాత్రం నెరవేర్చకుండా.. కేవలం మంత్రి పదవులను పట్టుకుని వేలాడటానికి, తమ సొంత ప్రయోజనాలు నెరవేర్చుకోడానికే మంత్రులు పెద్దపీట వేశారన్న విమర్శలు వినవస్తున్నాయి. తనకు మంత్రి పదవి రానంత వరకు సమైక్యాంధ్ర మంత్రాన్ని గట్టిగా జపించిన కావూరి సాంబశివరావు.. ఆ తర్వాత అసలు ఆ విషయాన్ని పట్టించుకోవడమే మానేశారు. మరో కేంద్ర మంత్రి పురందేశ్వరి కూడా ప్రభుత్వం తెలంగాణ ఇచ్చేస్తానంటుంటే ఇంకా సమైక్యాంధ్ర అంటూ పట్టుకుని వేలాడాలా అని వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి చూస్తే కేంద్ర మంత్రులు పోషించిన పాత్ర ఏంటన్నది తెలిసిపోతుంది.