seemandhra central ministers
-
సభను అడ్డుకుంటాం: సీమాంధ్ర కేంద్రమంత్రులు
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై నేడు లోక్‌సభలో చర్చ జరగనున్ననేపథ్యంలో సభ కార్యకలాపాలను అడ్డుకుంటామని సీమాంధ్ర కేంద్రమంత్రులు మంగళవారం స్పష్టం చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు బిల్లుపై చర్చ చేపట్టి సాయంత్రం కల్లా ముగించాలని ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 21తో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో బిల్లు ఆమోదం పొందేందుకు చాలా తక్కువ సమయం ఉంది. అందుకోసం ప్రభుత్వం ఒక రోజు లోక్‌సభలో, మరో రోజు రాజ్యసభలో బిల్లుపై చర్చ చేపట్టి ఆమోదం పొందెలా ప్రభుత్వం తన చర్యలను ముమ్మరం చేసింది. అయితే రాష్ట్ర విభజనపై సీమాంధ్ర కేంద్రమంత్రులు నిన్న రాత్రి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భం సదరు కేంద్ర మంత్రులు చేసిన ప్రతిపాదనలపై రాహుల్ మౌనం దాల్చినట్లు సమాచారం. అంతేకాకుండా రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనదైన శైలిలో ముందుకు వెళ్తుంది. అయితే సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు చేసిన ప్రతిపాదనలు అధిష్టానం నిర్ద్వందంగా తొసిపుచ్చుతున్న సంగతి తెలిసిందే. దాంతో సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో సభా కార్యక్రమాలను అడ్డుకోవాలని సీమాంధ్ర కేంద్రమంత్రులు నిర్ణయించారు. -
'కేంద్ర మంత్రులను బర్తరఫ్ చేయండి'
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఆరుగురు కాంగ్రెస్ ఎంపీలను సస్పెన్షన్ చేసినట్లే ఆ ప్రాంత కేంద్రమంత్రులను కూడా బర్తరఫ్ చేయాలని బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ ప్రకాశ్ జవదేకర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం పార్లమెంట్ ఆవరణలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వైఖరి ఏమిటో గతంలో తాము ఏం చెప్పామో ప్రస్తుత సభలో అదే జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు, సీమాంధ్ర ప్రాంత అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. అందుకు ఆ పార్టీకి చెందిన సభ్యులే సభను అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధికి ఇదే మంచి ఉదాహరణ అని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఎంత ముఖ్యమో, సీమాంధ్రకు సంపూర్ణ న్యాయం చేయడం కూడా అంతే ముఖ్యమని ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. సీమాంధ్ర బిల్లు ప్రతులను బుధవారం లోక్‌సభలో సభ్యులకు పంచిపెట్టారు. మరో వైపు సభలో రైల్వే మంత్రి మల్లిఖార్జున ఖార్గే రైల్వే బడ్జెట్ చదువుతున్నారు. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ఎంపీలు, కేంద్ర మంత్రులు సభ వెల్ లోకి దూసుకొచ్చి స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. అక్కడ సమైక్యాంధ్రకు మద్దతుగా పెద్దపెట్టున్న నినాదాలు చేశారు. సభ కార్యక్రమాలకు అడ్డుతగులుతున్న ఆరుగురు సీమాంధ్ర ఎంపీలను మంగళవారం సస్పెన్షన్ చేసినట్లు, కేంద్రమంత్రులను కూడా బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఎంపీ ప్రకాశ్ జావదేకర్ సూచించారు. -
ఇలా సవరిస్తే సరే!
' ప్రధానికి సీమాంధ్ర కేంద్ర మంత్రుల విజ్ఞప్తి ' జీెహచ్ఎంసీ పదేళ్ల తాత్కాలిక యూటీ ' పోలవరం ముంపు గ్రామాలన్నీ సీమాంధ్రలో ' పలు డిమాండ్లతో మెమోరాండం ' సీమాంధ్రకు న్యాయం చేస్తామన్న ప్రధాని ' ప్రత్యేక ప్రోత్సాహకాలు, ఆర్థిక ప్యాకేజీకి హామీ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టరాదన్న తమ డిమాండ్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో దిగొచ్చిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు బిల్లులో సీమాంధ్రకు న్యాయం జరిగేలా పలు సవరణలు చేయాలని ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు విన్నవించారు. సీమాంధ్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తుకు భరోసా, వారి ప్రయోజనాల రక్షణ, అభివృద్ధికి వీలుగా సవరణలు సూచించిన సీమాంధ్ర మంత్రులు, వాటిని బిల్లులో చేరిస్తే పార్లమెంట్లో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు మద్దతు తెలుపుతామని స్పష్టంచేశారు. విభజన బిల్లులో సవరణలు చేసేందుకు శుక్రవారం సాయంత్రం కేంద్ర కేబినెట్ ప్రత్యేకంగా సమావేశం కానున్న నేపథ్యంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులంతా ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ఉభయసభలు వాయిదాపడిన అనంతరం ప్రధానితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు సవరణలతో కూడిన మెమోరాండాన్ని సమర్పించారు. సీమాంధ్రుల ప్రయోజనాలకు తాము పెద్దపీట వేస్తున్నామని, వారికి సరైనన్యాయం చేయాలన్నదే తమ నిర్ణయమని ప్రధాని తెలిపినట్లుగా తెలుస్తోంది. ప్రధానిని కలిసిన వారిలో కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, జేడీ శీలం, కిల్లి కృపారాణి, చిరంజీవిలు ఉన్నారు. అనంతరం జేడీ శీలం మీడియాతో మాట్లాడుతూ... తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని, కానీ విభజన చేస్తున్న తీరే బాధాకరంగా ఉందని చెప్పారు. సమస్యలపై నక్సల్స్‌తో చర్చించిన ప్రభుత్వం మాతో చర్చించలేదా..? అని ప్రశ్నించారు. సీమాంధ్ర మంత్రులు కోరిన సవరణలు ఇవే.. 1. ఖమ్మం జిల్లా భద్రాచలం రెవెన్యూ గ్రామాలు, పాల్వంచ డివిజన్ గ్రామాలను సీమాంధ్రలో కలపాలి. 2. రాయలసీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలి. 3. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి పథకం ప్రకటించాలి. 4. జీహెచ్ఎంసీ ప్రాంతాన్ని పదేళ్లు తాత్కాలిక కేంద్ర పాలితప్రాంతంగా ప్రకటించి తటస్థ పాలన ఏర్పాటుచేయాలి. 5. కొత్తగా ఏర్పడే రాష్ట్రంలో 225, తెలంగాణలో 153 అసెంబ్లీ స్థానాలు ఏర్పాటు చేయాలి. రాజకీయ సుస్థిరత కోసం ఈ ప్రక్రియ అవసరం. 6. ఆర్థికాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి హైదరాబాద్ పరిసరాల్లోనే కేంద్రీకృతమైన నేపథ్యంలో సీమాంధ్రకు ఆర్థికభారం కలగకుండా ఉండాలంటే రెండు రాష్ట్రాలమధ్య ప్రత్యేక యంత్రాంగంద్వారా ఆదాయ వనరుల పంపిణీ చేపట్టాలి. 7. సీమాంధ్రకు ఆదాయపన్ను పంపిణీ, సెంట్రల్ ఎక్సైజ్, ఆదాయపన్ను చెల్లింపుల నుంచి పదేళ్ల మినహాయింపు ఇవ్వాలి. పెట్టుబడులపై 15% సబ్సిడీ 20 ఏళ్లపాటు ఇవ్వాలి. పరిశ్రమల ఏర్పాటుకు 20 ఏళ్లపాటు 50% పౌరసబ్సిడీ ఇవ్వాలి. 8. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో పొందుపరిచినట్టుగా 2 రాష్ట్రాలకు బడ్జెట్ మద్దతును ప్రతి పథకానికి అందించాలి. 9. పోలవరం ప్రాజెక్టుకు కొత్తగా ఏర్పాటయ్యే తెలంగాణ రాష్ట్రం అనుమతి ఇచ్చినట్టుగానే భావించాలి. రాష్ట్రం ఏర్పడిన మూడేళ్లలోగా పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం పూర్తిచేయాలి. 10. సీమాంధ్రలో కొత్త రాజధాని ఏర్పడేవరకు ఉన్నతవిద్యారంగంలో ఇప్పుడున్న కోటా ప్రకారమే ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ కళాశాలల్లో ప్రవేశాలు జరగాలి. ఉన్నత విద్య, సాంకేతిక, మెడికల్ విద్యారంగంలో అడ్మిషన్ల విధానం కొనసాగాలి. 11. పదవ షెడ్యూల్ కింద ఏర్పాటైన వివిధ ప్రభుత్వ సంస్థలు... ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడే వరకూ అందులో పనిచేసే ఉద్యోగులను ఇక్కడే కొనసాగించాలి. 12. ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక ప్రగతికి కచ్చితంగా రోజుకు 20 మిలియన్ క్యూబిక్ మీటర్ల (ఎంసీఎండీ) గ్యాసును కేటాయించాలి. 13. ఆంధ్రప్రదేశ్‌లో ఐఐటీ, నిట్, ఐఐఎం, ఐఐఐటీ, ఐఐఎస్ఈఆర్, కేంద్ర యూనివర్సిటీతోపాటు ఒక కేంద్ర వ్యవసాయ వర్సిటీని ఏర్పాటు చేయాలి. ఎయిమ్స్ తరహాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కమ్ టీచింగ్ ఇనిస్టిట్యూషన్‌ను నెలకొల్పాలి. ఒక గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఇటు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఏర్పాటు చేయాలి. నల్సార్, పెట్రోలియం వర్సిటీని కేంద్రం నెలకొల్పాలి. 13(బి). దశలవారీగా 2018 నాటికి దుగ్గరాయపట్నంతో పాటు వాడరేవు, రామాయపట్నం, నిజాంపట్నం ఓడరేవులను అభివృద్ధి చేయాలి. కడపలో సెయిల్ ద్వారా ఒక స్టీలు ప్లాంటు నెలకొల్పాలి. వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేయాలి. వైజాగ్, తిరుపతి, విజయవాడ విమానాశ్రయాలను అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చేయాలి. రైల్వేజోన్‌తో పాటు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటయ్యే కొత్త రాజధాని నుంచి హైదరాబాద్‌తో పాటు ఇతర అన్ని నగరాలకు ర్యాపిడ్ రైలు, రోడ్డు మార్గాన్ని అభివృద్ధి చేయాలి. -
రేపు ఢిల్లీలో సీఎం దీక్ష
-
రేపు ఢిల్లీలో సీఎం దీక్ష
* దీక్షకు సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు * వారిని రప్పించే బాధ్యత మంత్రులకు అప్పగింత * వేదిక ఇందిరాగాంధీ స్మారక చిహ్నమైన శక్తిస్థల్ * బిల్లుపై సుప్రీం కోర్టుకు వెళ్లే యోచన? * నేడు వార్‌రూమ్ భేటీకి కేంద్రమంత్రులు, సీఎం, పీసీసీ చీఫ్‌లు సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట విభజన వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఢిల్లీలో దీక్ష చేయాలని సీమాంధ్ర కాంగ్రెస్‌నేతలు నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ఈ నెల ఐదో తేదీన ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్మారక చిహ్నమైన శక్తిస్థల్ వద్ద నిరసన దీక్షను చేపట్టనున్నట్లు సమాచారం. ఢిల్లీలో తాము చేపట్టాల్సిన కార్యక్రమాలపై ముఖ్యమంత్రి గత రెండురోజులుగా కొందరు మంత్రులు, ఇతర నేతలతో సమావేశమై చర్చించారు. బిల్లుకు మద్దతు పలకరాదని కోరేందుకు ఇతర పార్టీల నేతలను కలవాలా? లేదా? అన్న అంశంపై తర్జనభర్జనలు సాగించారు. ఢిల్లీలో ఎంపీలతో భేటీ అయ్యాక తుది నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయానికి వచ్చారు. అలాగే బిల్లులోని లోపాలను ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టుకు విన్నవించాలన్న అంశంపైనా చర్చించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన విధివిధానాలు, ఇతర అంశాలను మరోసారి న్యాయనిపుణులతో చర్చించాకనే ముందుకు వెళ్దామని సీఎం చెప్పినట్లు సమాచారం. * ప్రాథమికంగా నిర్ణయమైన కార్యక్రమాల ప్రకారం సీఎం నేతృత్వంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఈ నెల 5వ తేదీన ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్మారక చిహ్నమైన శక్తిస్థల్ వద్ద నిరసన దీక్షను చేపట్టనున్నారు. దీనికి సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యేలా చూడాలని, వారందరినీ ఢిల్లీకి రప్పించే ఏర్పాట్లను సీఎం తన కోటరీలోని మంత్రులకు అప్పగించారు. * ఈ మేరకు సీమాంధ్ర ప్రాంత మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, గంటా శ్రీనివాసరావు, టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, సాకే శైలజానాధ్ తదితర మంత్రులు ఇతర నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హస్తినకు వెళ్లారు. *రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఐదో తేదీకి ఖరారైన నేపథ్యంలో ఆ రోజు ఉదయం ఢిల్లీ వెళ్లాలని సీఎం భావించారు. అయితే అధిష్టానం పిలుపుతో ఒకరోజు ముందే మంగళవారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. * రాజ్యాంగపరంగానే కాకుండా న్యాయపరంగా కూడా బిల్లులో అనేక లోపాలున్నాయని రాష్ట్రపతికి విన్నవిస్తామని మంత్రి సాకే శైలజానాధ్, విప్ రుద్రరాజు పద్మరాజు తెలిపారు. * అయితే పార్లమెంటుకు సంబంధం లేని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎంతమంది ఢిల్లీలో నిరసన దీక్షలకు దిగినా ఫలితం ఉండదని, ఎంపీలు కేంద్రమంత్రులపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. * ఈ నేపథ్యంలో బిల్లుకు వ్యతిరేకంగా కేంద్రమంత్రులెలా వ్యవహరిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఎంపీలకు తోడు సీమాంధ్ర కేంద్రమంత్రులు కూడ కలసివస్తేనే ఫలితం ఉంటుందని అంచనా వేస్తున్నారు. * నిరసన దీక్షలతోపాటు రాష్ట్రపతి వద్దకు తమతో కలసిరావాల్సిందిగా కేంద్రమంత్రులను కూడా కోరనున్నామని శైలజానాధ్ తెలిపారు. వారు కూడా తమతో వస్తారన్న నమ్మకముందని చెప్పారు. * మరోవైపు విభజన బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్న కాంగ్రెస్ అధిష్టానం మంగళవారం రాత్రి వార్‌రూమ్‌లో రాష్ట్ర నేతలతో ఒక సమావేశం నిర్వహిస్తోంది. ఇందులో సీఎంతోపాటు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. -
అంతన్నాడు... ఇంతన్నాడే.. గంగరాజు..
-
సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఫెయిల్.. ఇప్పుడు కొత్త డ్రామా
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే విషయంలో పరీక్ష రాశామని, అందులో పాసయ్యామా, ఫెయిలయ్యామా అన్న విషయం త్వరలోనే తెలుస్తుందని గప్పాలు కొట్టిన కేంద్ర మంత్రులంతా సదరు పరీక్షలో దారుణంగా ఫెయిలయ్యారు. రాజీనామాల పేరుతో గతంలో ఆడిన డ్రామాలనే మరోసారి తెరమీదకు తెచ్చారు. అది కూడా అందరూ కాదు.. గట్టిగా నలుగురంటే నలుగురే. గతంలో తాము సమర్పించిన రాజీనామాలనే ఆమోదింపజేసుకుంటామని కేంద్ర మంత్రులు చిరంజీవి, పల్లంరాజు, పురందేశ్వరి, కావూరి సాంబశివరావు కొత్త పల్లవి అందుకున్నారు. గతంలో ప్రధానమంత్రికి రాజీనామా లేఖలు ఇవ్వగా, ఈసారి నేరుగా రాష్ట్రపతికి ఇస్తామంటున్నారు. సమైక్యాంధ్ర కోసం తామంతా చిత్తశుద్ధితో కృషి చేశామని, మంత్రి పదవులను కూడా త్యజించామని వాళ్లు చెబుతున్నా.. అదంతా డొల్ల వాదనేనని తేలిపోయింది. వాస్తవానికి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన అన్ని పార్టీల ఎంపీలు నిజాయితీగా రాజీనామాలు చేసి ఉంటే కేంద్ర ప్రభుత్వానికి తగినంత బలం ఉండేది కాదు, ఈ పాటికి పడిపోయి కూడా ఉండేది. ఏకంగా తొమ్మిది మందికి కేంద్ర మంత్రిపదవులు లభించిన వైనాన్ని చూస్తే, వీళ్లందరికీ పదవుల ఎర వేసి.. కేంద్రం ముందుగానే వీళ్లందరినీ జేబుల్లో వేసుకుందన్న ప్రచారం గట్టిగా ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత స్థాయిలో ప్రకటన వచ్చిన తర్వాత కూడా కేంద్ర మంత్రుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని సీమాంధ్ర ప్రాంత వాసులు మండిపడుతున్నారు. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ముందు కొంతమంది మంత్రులు తమ డిసెంట్ నోట్ ఇస్తామని చెప్పినట్లు సమాచారం వినిపించింది. దాన్ని కూడా కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు. తమ ప్రాంతానికి చెందిన ప్రజల ప్రయోజనాలను నెరవేర్చకుండా.. పదవులను పట్టుకుని వేలాడటానికి, తమ సొంత ప్రయోజనాలు నెరవేర్చుకోడానికే మంత్రులు పెద్దపీట వేశారన్న విమర్శలు వినవస్తున్నాయి. తనకు మంత్రి పదవి రానంత వరకు సమైక్యాంధ్ర మంత్రాన్ని గట్టిగా జపించిన కావూరి సాంబశివరావు.. ఆ తర్వాత అసలు ఆ విషయాన్ని పట్టించుకోవడమే మానేశారు. మరో కేంద్ర మంత్రి పురందేశ్వరి కూడా ప్రభుత్వం తెలంగాణ ఇచ్చేస్తానంటుంటే ఇంకా సమైక్యాంధ్ర అంటూ పట్టుకుని వేలాడాలా అని వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి చూస్తే కేంద్ర మంత్రులు పోషించిన పాత్ర ఏంటన్నది తెలిసిపోతుంది. -
'సీమాంధ్ర కేంద్రమంత్రులకు చీము, నెత్తురు లేదు'
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలపడం పట్ల సచివాలయంలోని సీమాంధ్ర ఉద్యోగులు నిప్పులు చెరిగారు. శుక్రవారం కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తు సచివాలయంలో విధులను బహిష్కరించారు. అనంతరం సచివాలయంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా సీమాంధ్ర కేంద్ర మంత్రులపై వారు తీవ్రస్థాయిలో ధ్వజమేత్తారు. సీమాంధ్ర కాంగ్రెస్‌నేతలకు చీము,నెత్తురు లేదని వారు ఆరోపించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే నిజాయితీతో పని చేస్తున్నారని వెల్లడించారు. వైఎస్ జగన్‌కు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. -
సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఫెయిలే
చిరంజీవి సహా మొత్తం సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులందరూ ఫెయిలయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే విషయంలో తాము ఇప్పటికే పరీక్ష రాశామని, అందులో పాసా, ఫెయిలా అనేది త్వరలోనే తెలుస్తుందని కాంగ్రెస్ పార్టీ నేత, కేంద్ర మంత్రి చిరంజీవి శనివారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. సమైక్యాంధ్ర కోసం తామంతా చిత్తశుద్ధితో కృషి చేశామని, మంత్రి పదవులను కూడా త్యజించామని ఆయన చెప్పినా, అదంతా డొల్ల వాదనేనని తేలిపోయింది. వాస్తవానికి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన అన్ని పార్టీల ఎంపీలు నిజాయితీగా రాజీనామాలు చేసి ఉంటే కేంద్ర ప్రభుత్వానికి తగినంత బలం ఉండేది కాదు, ఈ పాటికి పడిపోయి కూడా ఉండేది. ఏకంగా తొమ్మిది మందికి కేంద్ర మంత్రిపదవులు లభించిన వైనాన్ని చూస్తే, వీళ్లందరికీ పదవుల ఎర వేసి.. కేంద్రం ముందుగానే వీళ్లందరినీ జేబుల్లో వేసుకుందన్న ప్రచారం గట్టిగా ఉంది. కేంద్రం ప్రభుత్వం నుంచి ఇంత స్థాయిలో ప్రకటన వచ్చిన తర్వాత కూడా కేంద్ర మంత్రుల నుంచి ఏమాత్రం స్పందన రాకపోవడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా కనపడుతోంది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ముందు కొంతమంది మంత్రులు తమ డిసెంట్ నోట్ ఇస్తామని చెప్పినట్లు సమాచారం వినిపించింది. దాన్ని కూడా కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు. దీన్ని బట్టి చూస్తే.. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు ఉత్త చవటలన్న విమర్శలు సీమాంధ్ర ప్రాంతంలో వినిపిస్తున్నాయి. తమ ప్రాంతానికి చెందిన ప్రజల ప్రయోజనాలను ఏమాత్రం నెరవేర్చకుండా.. కేవలం మంత్రి పదవులను పట్టుకుని వేలాడటానికి, తమ సొంత ప్రయోజనాలు నెరవేర్చుకోడానికే మంత్రులు పెద్దపీట వేశారన్న విమర్శలు వినవస్తున్నాయి. తనకు మంత్రి పదవి రానంత వరకు సమైక్యాంధ్ర మంత్రాన్ని గట్టిగా జపించిన కావూరి సాంబశివరావు.. ఆ తర్వాత అసలు ఆ విషయాన్ని పట్టించుకోవడమే మానేశారు. మరో కేంద్ర మంత్రి పురందేశ్వరి కూడా ప్రభుత్వం తెలంగాణ ఇచ్చేస్తానంటుంటే ఇంకా సమైక్యాంధ్ర అంటూ పట్టుకుని వేలాడాలా అని వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి చూస్తే కేంద్ర మంత్రులు పోషించిన పాత్ర ఏంటన్నది తెలిసిపోతుంది. -
హైదరాబాద్‌ను ఢిల్లీ తరహా యూటీ చేయండి: జేడీశీలం
ఢిల్లీ: రాష్ట్రవిభజనపై కేంద్రం వేగం పెంచిన నేపథ్యంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు కొత్తరాగం వినిపిస్తున్నారు. హైదరాబాద్‌ను ఢిల్లీ తరహా యూటీ చేయాలంటూ సీమాంధ్ర కేంద్రమంత్రి జేడీ శీలం డిమాండ్ చేశారు. దీనిపై రాజ్యాంగ సవరణ అందుకు అవసరమని అన్నారు. అయితే తాము చెప్పే అంశాలను జీ వోఎమ్ పట్టించుకోవడం లేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒప్పుకుంటామని పేర్కొన్నారు. కాకపోతే హైదరాబాద్‌ను కనీసం ఐదేళ్లయినా యూటీ చేయాలంటూ కొత్తరాగాన్ని లెవనెత్తారు. రాష్ట్రవిభనపై ఓడిపోయాం లేదా గెలిచామని కాదు.. సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నామని శీలం తెలిపారు. ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు ఓ ఉద్యోగి.. ఆయనకు కొన్ని హద్దులుంటాయని అన్నారు. అయితే కేంద్రపాలిత బాధ్యతను కేబినెట్ మంత్రులపైనే పెట్టామని ఆయన చెప్పారు. రాయలతెలంగాణ అంశాన్ని.. రాయలసీమ నేతలే తేల్చుకోవాలిని శీలం పేర్కొన్నారు. కేంద్రం ఏర్పాటు చేసిన సీడబ్య్లూసీ తీర్మానంలో 10 జిల్లాల తెలంగాణయే ఉందిని జేడీ శీలం స్పష్టం చేశారు. -
హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ప్రతిపాదన
-
హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ప్రతిపాదన
న్యూఢిల్లీ: సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఈ ఉదయం కేంద్ర మంత్రి, జిఓఎం సభ్యుడు జైరామ్ రమేష్‌ను కలిశారు. వారి మధ్య చర్చ ప్రధానంగా హైదరాబాద్ పైనే జరిగింది. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం(యూటీ) చేయాలని సీమాంధ్ర కేంద్రమంత్రులు కోరారు. అలా కాని పక్షంలో పరిమిత ఆంక్షలతో హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేయాలని ప్రతిపాదించారు. జైరామ్ రమేష్‌ను కలిసినవారిలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు పల్లంరాజు, పనబాక లక్ష్మి, చిరంజీవి, కిల్లి కృపారాణి, పురందేశ్వరి, జెడి శీలం ఉన్నారు. కావూరి సాంబశివరాలు విదేశీ పర్యటనలో ఉన్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్‌లో శాంతిభద్రతలు, విద్యా, ఉద్యోగ అంశాలు కేంద్ర పరిధిలో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. జిఓఎం ఈ విధమైన ప్రతిపాదన చేస్తుందని భావిస్తున్నారు. -
'కేంద్రమంత్రులు, ఎంపీలను ఓడించడమే లక్ష్యం'
సమైక్యాంధ్రకు విరుద్దంగా వ్యవహరిస్తోన్న కాంగ్రెస్ ఎంపీలు, కేంద్రమంత్రులకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని ఏపీఎన్జీవో ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి హెచ్చరించారు. ఆదివారం హైదరాబాద్ అబిడ్స్‌లో ఏపీఎన్జీవో హోంలో సీమాంధ్రలోని 13 జిల్లాలకు చెందిన ఏపీఎన్జీవోల నేతలు ఆయన సమావేశమైయ్యారు. ఈ సందర్బంగా ఆయన చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ...రానున్న ఎన్నికలల్లో వారిని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని చంద్రశేఖరరెడ్డి వెల్లడించారు. బయట ఓ రకంగా మాట్లాడుతూ... లోపల మరోలా వ్యవహరిస్తున్నారని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలపై ఆయన ధ్వజమెత్తారు. ఆ సమావేశానికి ఏపీఎన్జీవోలతోపాటు సీమాంధ్రలోని దాదాపు 150 ఉద్యోగ సంఘాలు ఆ భేటీలో పాల్గొన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చేస్తే సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలని, అలాగే హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలని సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులు,ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర మంత్రులు అనుసరిస్తున్న వైఖరిపై ఏపీఎన్జీవో నాయకులు ఆదివారం మండిపడ్డారు. -
కేంద్ర మంత్రుల ఓటమే మా లక్ష్యం: ఏపీఎన్జీవో నేతలు
సమైక్య రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉన్న కేంద్ర మంత్రులను ఓడించే లక్ష్యంగా పనిచేస్తామని ఏపీ ఎన్జీవో నేతలు హెచ్చరించారు. కేంద్ర మంత్రులను రాజకీయంగా సమాధి చేస్తామని, వారికంటే తమ స్థాయే పెద్దదని తెలిపారు. అసెంబ్లీకి బిల్లు వచ్చే సమయంలో చలో హైదరాబాద్‌ను నిర్వహిస్తామని, అలాగే పార్లమెంట్లో బిల్లు వచ్చే సమయంలో చలో పార్లమెంట్ నిర్వహిస్తామని చెప్పారు. సమ్మెతో పాటు అన్ని అంశాలపై ఈ నెల 24న కీలక సమావేశం నిర్వహిస్తామని, అందులో తీసుకునే నిర్ణయాలు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తోడ్పడతాయని భావిస్తున్నట్లు ఏపీఎన్జీవో నేతలు చెప్పారు. -
కేంద్రమంత్రుల చేతగానితనం వల్లే విభజన
సీమాంధ్ర కేంద్ర మంత్రుల చేతగానితనం వల్లనే విభజన ప్రక్రియ ముందుకు వెళ్తోందని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని అశోక్ బాబు ఆధ్వర్యంలో ఏపీఎన్జీవో నేతలు సచివాలయంలో కలిశారు. విభజనకు సహకరిస్తే అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ సందర్భంగా అశోక్ బాబు అన్నారు. సీమాంధ్ర నేతలకు చేతకాకుంటే ఢిల్లీలోనే కూర్చోవాలని అశోక్‌బాబు విమర్శించారు. విభజనకు ఒప్పుకున్న సీమాంధ్ర నేతలకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 24న సమైక్య జేఏసీ సమావేశంలో మలివిడత సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. -
'తెలుగు బిడ్డలా లేక ఇటలీ బిడ్డలా'
-
'తెలుగు బిడ్డలా లేక ఇటలీ బిడ్డలా'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన విషయంలో కేంద్ర మంత్రులు, సీఎం కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబులు అనుసరిస్తున్న వైఖరి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆదివారం నిప్పులు చెరిగారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ... విభజన విషయంలో సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రలు తెలుగు బిడ్డల్లా కాకుండా ఇటాలీయన్ బిడ్డల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పినట్లు కేంద్ర మంత్రులు నడుకుంటున్నారా లేక కేంద్ర మంత్రులు చెప్పినట్లు బాబు నడుచుకుంటున్నారో అర్థం కావటం లేదని వ్యాఖ్యానించారు. తెలుగు ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు ఇంత మంది ఉండి కూడా విభజనను ఆప లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఓ విధంగా తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కేంద్రమంత్రులు తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని గతంలో కేంద్రమంత్రులు చేసిన భీష్మ ప్రతిజ్ఞలు ఏ గాలికి కొట్టుకుపోయాయని ఆమె ఎద్దేవా చేశారు. తడి గుడ్డతో గొంతులు కోసే వ్యక్తి ఎవరైన ఉన్నారంటే అందుకు అత్యుత్తమ ఉదాహరణ ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అని అభివర్ణించారు. ప్రజల ఓట్లతో కాకుండా పైరవి నుంచి వచ్చిన సీఎం కాబట్టే కిరణ్ అధిష్టానం వద్ద విభజన అని, రాష్ట్రంలో మాత్రం సమైక్యం అంటు పాట పాడుతున్నారని ఆరోపించారు. విభజనలో కిరణ్ ఓ పావు మాత్రమే అని అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి బినామీల పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నారన్ని అన్నారు. విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చిన కాంగ్రెస్ నేతలను ఏమనాలని ఆమె ప్రశ్నించారు. ఆ నేతలను వారివారి కుటుంబసభ్యులే ఛీదరించుకుంటున్న సంగతిని ఆమె గుర్తు చేశారు. అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ ప్రాంతాల్లో ఓట్లు, సీట్లు ముఖ్యమని చంద్రబాబు భావిస్తున్నారని అన్నారు. అందుకే విభజన కోసం ప్యాకేజీలు, సమన్యాయం అంటూ మాట్లాడుతున్నారని ఆరోపించారు. అలాగే ఓ రాష్ట్రంలో ఓట్లతో కొడుకును ప్రధాని చేయడానికి యూపీఏ అధ్యక్షురాలు సోనియా ఆలోచిస్తుందని అన్నారు. సమైక్యానికి మద్దతుగా ఎందుకు లేఖ ఇవ్వలేకపోతున్నారంటూ చంద్రబాబును వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. రాష్ట్ర సమైక్యత కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని ఆమె గుర్తు చేశారు. విభజనపై కేంద్ర ప్రభుత్వ పెత్తనం ఏమిటని రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారని, వారికి ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నించారు. -
రాజ్యాంగ విరుద్ధంగా విభజన
‘ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం’ భేటీలో జేఏసీలు సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్రాన్ని విభజించడమంటే కొత్తగా ఓ జిల్లాను సృష్టించడం లాంటిదనుకుంటున్నారా? ప్రజల అభిప్రాయాలకు విలువ లేదు. అవి ప్రతిఫలించాల్సిన అసెంబ్లీలో చర్చ లేదు. పార్లమెంటులో చర్చకు అవకాశమివ్వలేదు. మన రాష్ట్రంతో సంబంధం లేని నేతలు, మన సంస్కృతేమిటో అవగాహన లేని సోనియాలు కలిసి, రాజకీయ లబ్ధి కోసం విభజన నిర్ణయం తీసుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోవాలా? అబద్ధాలతో మభ్యపెట్టి విభజిస్తే తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడే సీమాంధ్ర, తెలంగాణ రెండూ తీవ్రంగా నష్టపోతాయి. కేంద్రానికి అమ్ముడుపోయిన సీమాంధ్ర కేంద్ర మంత్రుల వైఖరి, అక్కడి ఇతర నేతల వైఫల్యమే ఈ దుస్థితికి కారణం. విభజన ప్రక్రియ ఆగిపోకుంటే మన తెలుగు సాంస్కృతిక ఔన్నత్యమే ప్రమాదంలో పడుతుంది. సోదరభావంతో కలిసుండాల్సిన తెలుగువాళ్లు నీళ్ల కోసం కొట్టుకు చస్తారు’’ అని సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్న వివిధ జేఏసీలు తీవ్ర ఆవేదనను, ఆందోళనను వ్యక్తం చేశాయి. ‘ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం’ శనివారం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వివిధ జేఏసీలు, సీమాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న ప్రముఖులు హాజరై కేంద్రం అనుసరిస్తున్న తీరును ఎండగట్టారు... నీటి కొట్లాటలు తప్పవు ‘‘విభజనతో తెలంగాణ తీవ్రంగా నష్టపోతుంది. మధ్యప్రదేశ్‌లో ఓడిపోయిన నేత, కాశ్మీర్లో గెలవలేని వ్యక్తి, గుజరాత్లో ఎవరో కూడా తెలియని మరో నేత కలిసి తెలుగు వారితో ప్రమేయం లేకుండా విభజన చేస్తున్నారు’’ - విశాలాంధ్ర మహాసభ ప్రతినిధి, రిటైర్డ్ ఐపీఎస్ ఆంజనేయరెడ్డి విభజనకు తెలంగాణలోనూ వ్యతిరేకత ‘‘తెలంగాణ ప్రజల్లో చాలామంది విభజనకు వ్యతిరేకం. ముసాయిదా బిల్లు అసెంబ్లీకి రాగానే మళ్లీ ఉద్యమిస్తాం. ప్రజాకాంక్షకు వ్యతిరేకంగా విభజన జరిగితే భవిష్యత్తులో ప్రజాయుద్ధం తప్పదు’’ - ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు సుప్రీం పట్టించుకుంటుంది ‘‘ఎన్డీఏ హయాంలో మూడు రాష్ట్రాల ఏర్పాటులో అసెంబ్లీల అభిప్రాయాల మేరకు వ్యవహరించారు. ఇప్పుడలా చేయకపోవడాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకునే అవకాశం లేకపోలేదు’’ - సీవీ మోహన్‌రెడ్డి, సమైక్యాంధ్ర న్యాయవాదుల జేఏసీ అధ్యక్షుడు మభ్యపెడుతున్నారు ‘‘కేంద్రం తీరు అక్షయ పాత్ర తీసుకుని సీమాంధ్రకు భిక్షా పాత్ర ఇస్తున్నట్టుగా ఉంది’’ - చలసాని శ్రీనివాసరావు, ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు -
ప్యాకేజీకి సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఓకే!
-
ప్యాకేజీకి సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఓకే!
ఇన్నాళ్ల సమైక్యవాదమంతా బూటకమే వ్యతిరేకతను తట్టుకోవడానికి ‘ప్యాకేజీ’ డ్రామా సోనియా డెరైక్షన్.. చంద్రబాబు అడుగుజాడల్లో.. సీమాంధ్ర అభివృద్ధికి ప్యాకేజీ కోరాలని నిర్ణయం నేడు ప్రధానికి, రేపు జీవోఎంకు వినతిపత్రం సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రుల సమైక్యవాదం బూటకమేనని, ఆ ముసుగులో వారు ఇన్నాళ్లుగా చెప్పిన మాటలన్నీ నీటి మూటలేనని తేలిపోయింది. విభజనకు అనుకూలంగా కేంద్ర మంత్రుల బృందం ముందుకు వెళ్లాలని మంగళవారం వారు తీసుకున్న నిర్ణయంతో వారి అసలు రూపం బయటపడింది. దాంతో, సోనియాగాంధీ డెరైక్షన్‌లో విభజన ప్రక్రియలో ఒక్కో ఘట్టంలో ఒక్కోలా సీమాంధ్ర కేం ద్ర మంత్రులు ఆడిన నాటకాలకు కూడా తెరపడింది. సోనియా డెరైక్షన్‌లో, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అడుగుజాడల్లో పకడ్బందీ స్క్రీన్‌ప్లేతో ఈ నాటకాన్ని రక్తి కట్టించడంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఇంతకాలంగా తమ వంతు పాత్రను విజయవంతంగా పోషించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర విభజనకు బహిరంగంగా అంగీకారం తెలపాలని మం త్రులు కావూరి సాంబశివరావు, ఎంఎం పల్లంరాజు, పనబాక లక్ష్మి, డి.పురందేశ్వరి, కిల్లికృపారాణి నిర్ణయించారు. వారంతా మంగళవారం కావూరి కార్యాలయంలో సమావేశమై భావి కార్యాచరణపై చర్చిం చారు. విభజనకు అంగీకరిస్తూ జీవోఎం ముందుకు వెళ్లడానికి అవసరమైన భూమిక తయారీకి కసరత్తు చేశారు. విభజనను సమర్థించడంతో పాటు సీమాంధ్రకు మెరుగైన ప్యాకేజీ సాధనకు ప్రయత్నించాలని నిర్ణయించారు. దానికోసం గట్టిగా ప్రయత్నిస్తున్నామనే సంకేతాలు పంపించడం ద్వారా... ప్రజల్లో తమ పట్ల వ్యక్తమవుతున్న వ్యతిరేకతను తగ్గించాలని ప్రణాళిక రూపొందించారు. సీమాంధ్రకు భారీగా ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు, నిధులు, పన్నుల మినహాయింపు, ఉపాధి కల్పన ప్రాజెక్టులు తదితరాలు ఇవ్వాలంటూ వినతిపత్రం రూపొందించాలని నిర్ణయించారు. ఈ జాబితాను బుధవారం ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ను కలిసి అందజేయనున్నారు. గురువారం నాటి జీవోఎం భేటీలో కూడా దాన్ని సమర్పించాలని నిర్ణయించారు. జీవోఎంకు నివేదిక ఇవ్వడంపై ఎలాంటి చర్చా చేయలేదని భేటీ అనంతరం పనబాక చెప్పారు. సమైక్యాంధ్ర కోసం మరోమారు ప్రధాని, సోనియా, రాహుల్‌లను కలుస్తామన్నారు. దిగ్విజయ్‌తో శీలం, కేవీపీ మంతనాలు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో శీలం, ఎంపీ కేవీపీ రామచంద్రరావు మంగళవారం విడిగా భేటీ అయ్యారు. అసెంబ్లీ తీర్మానం లేకుండా విభజన ప్రక్రియపై కేంద్రం ముందుకెళ్లడాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తప్పుబడుతున్నారని చెప్పారు. కనీసం బిల్లునైనా అసెంబ్లీకి పంపుతారా, లేదా అన్న అనుమానం వ్యక్తమవుతోందన్నారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. విభజనతో ముడిపడిన ప్రధాన సమస్యలపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండానే వేగంగా ప్రక్రియను ముగించడాన్ని తప్పుబట్టారంటున్నారు. సీమాంధ్రకు సమన్యాయం ఎలా చేస్తారో చెప్పకుండా, ఏమేం కావాలో చెప్పాలంటే ఎవరూ ముందుకు రారని చెప్పారని సమాచారం. సీమాంధ్రకు న్యాయం చేసే అన్ని అంశాల ప్రస్తావనా పీసీసీ తరఫున జీవోఎంకు ఇచ్చే నివేదికలోనే ఉంటుందని దిగ్విజయ్ వారికి హామీ ఇచ్చినట్టు తెలిసింది. తెలుగుజాతి ఔన్నత్యం, పురోగతి సమైక్యాంధ్రలోనే సాధ్యమని అనంతరం కేవీపీ మీడియాతో అన్నారు. మంత్రుల విన్నపాలివీ.. - హైదరాబాద్‌పై అన్ని ప్రాంతాల ప్రజలకూ సమాన హక్కు కల్పించాలి. అందుకు దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలి - సీమాంధ్రలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలి - జల వివాదాల పరిష్కారానికి చట్టబద్ధమైన ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి - సీమాంధ్ర రాజధాని ఏర్పాటుకు కేంద్రం భారీగా ఆర్థిక సాయం అందించాలి - రెండు దశాబ్దాల పాటు సీమాంధ్రకు పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వాలి - 20 ఏళ్ల పాటు కేంద్రం నుంచి ఏటా నిర్దిష్ట మొత్తంలో సీమాంధ్రకు నిధులు వచ్చేలా స్పష్టమైన హామీ ఇవ్వాలి - ఎయిమ్స్ (ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్) తరహాలో ప్రత్యేక వైద్య, పరిశోధన విద్యా సంస్థలను నెలకొల్పాలి - వాల్తేరును ప్రత్యేక రైల్వే డివిజనుగా ప్రకటించాలి - తిరుపతి, విజయవాడ విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చేయాలి - పెట్రోలియం, కెమికల్స్ అండ్ పెట్రో కెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్(పీసీపీఐఆర్) అభివృద్ధికి తగిన నిధులివ్వాలి - విశాఖకు మెట్రో రైల్ ప్రాజెక్టు మంజూరు చేయాలి - రాయలసీమ, ఉత్తర కోస్తా జిల్లాల వెనకబాటుతనం నిర్మూలనకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాలి - విశాఖ, అనంతపురం జిల్లాల్లో ఐటీఐఆర్ నెలకొల్పాలి -
'విభజన అనివార్యమని దమ్ముంటే ప్రజల్లోకి వెళ్లి చెప్పాలి'
రాష్ట్ర విభజన అనివార్యం అంటున్న సీమాంధ్ర కేంద్రమంత్రులు దమ్ముంటే ఆ విషయాన్ని ప్రజల్లోకి వెళ్లి చెప్పాలని రాష్ట్ర మంత్రి ఎస్.శైలజానాథ్ బుధవారం హైదరాబాద్‌లో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశంపై కేంద్రమంత్రుల్ని కలసే ఆలోచన సీమాంధ్ర కాంగ్రెస్ సమన్వయ కమిటీకి లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు చేపట్టాల్సిన కార్యచరణపై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. అందుకోసం రేపు మధ్యాహ్నం మినిస్టర్స్ క్వార్టర్స్‌లో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని శైలజానాథ్ వెల్లడించారు. -
'ఎన్నికల కోసమే కేంద్రమంత్రుల రాజీనామా డ్రామాలు'
వచ్చే ఎన్నికల్లో గెలుపొందేందుకు సీమాంధ్ర కేంద్రమంత్రులు రాజకీయ డ్రామాలు అడుతున్నారని డిప్యూటీ సీఎం దామోదర రాజ నర్సింహ ఆరోపించారు. మంగళవారం న్యూఢిల్లీలో రాజనర్సింహ విలేకర్లతో మాట్లాడుతూ... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అంశం గతంలో కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఉందని గుర్తు చేశారు. ఆ విషయాన్ని రాజీనామాలు చేసిన కేంద్రమంత్రులు గుర్తించుకోవాలని ఆయన హితవు పలికారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలోనే ఉన్నారని, ఆయన ఆ విషయాన్ని గుర్తుంచుకుని మసులుకుంటే మంచిదని డిప్యూటీ సీఎం రాజ నర్సింహ పేర్కొన్నారు. -
కేంద్ర మంత్రుల డ్రామా
-
ఇది మరో డ్రామానా?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ప్రకటించి 50 రోజులు గడిచిన తరువాత ఎట్టకేలకు సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపిలు రాజీనామాలు చేయడానికి సిద్ధపడ్డారు. మరో పక్క ఎంపి లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ పార్లమెంటులో తెలంగాణ బిల్లును వ్యతిరేకించడానికి రాజీనామాలు చేయకుండా ఉండాలని అంటున్నారు. వారి మాటలలో స్పష్టత లోపించినట్లు కనిపిస్తోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు 2009 డిసెంబర్ 9న అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటించారు. దానికి కొనసాగింపుగా ఈ ఏడాది జులై 30న రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆ రోజు నుంచి సీమాంధ్రలో సమైక్యాంధ్ర ప్రజా ఉద్యమం ఊపందుకుంది. అప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసేశారు. ఉద్యమం మొదటి నుంచి ఇప్పటి వరకు ఏ రాజకీయ నేత అండలేకుండా ప్రజలే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. ఆ తరువాత ఎన్జీఓలు, వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలు మొదలు పెట్టారు. దాంతో ఉద్యమం ఉధృతమైంది. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, కాంగ్రెస్, టిడిపి ఎంపిలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని సమైక్యవాదులు డిమాండ్ చేస్తున్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఎదోఒకటి చెబుతూ ఇప్పటి వరకు నెట్టుకొచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై కేంద్ర మంత్రి మండలి నోట్ సిద్ధమైనట్లు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఈ రోజు ప్రకటించడంతో సీమాంధ్ర కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపిలలో కలకలం మొదలైంది. వాస్తవానికి షిండే మొదటి నుంచి విభజన ప్రక్రియ ఆగదని చెబుతూనే ఉన్నారు. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో సమైక్యోద్యమం ఉధృతంగా సాగుతున్నప్పటికీ రాష్ట్రాన్ని విభజించాలన్న కాంగ్రెస్ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను మరో 20 రోజుల్లోగా కేంద్ర మంత్రివర్గ పరిశీలనకు సమర్పించబోతున్నట్లు ఈ నెల 3న ప్రకటించారు. నోట్ రూపకల్పనలో ఎలాంటి జాప్యం జరగదని కూడా చెప్పారు. ఆ ప్రకారంగా 20 రోజులు కూడా కాక ముందే నోట్ సిద్దమైనట్లు ప్రకటించారు. హైదరాబాద్‌పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కూడా షిండే చెప్పారు. అయితే రేపు జరిగే మంత్రి మండలి సమావేశంలో ఈ అంశం చర్చకు రాదని చెప్పారు. నోట్‌ను పరిశీలించిన తరువాత న్యాయశాఖ పరిశీలనకు పంపుతామన్నారు. షిండే ప్రకటనతో సీమాంధ్ర ప్రజాప్రతినిధులలో కదలిక వచ్చింది. నోట్‌పై మంత్రి మండలి చర్చిస్తే పరిస్థితి విషమించుతుందన్న ఆందోళన వారిలో మొదలైంది. అందరితో చర్చలు జరిపి సమస్యను కేంద్రం పరిష్కరిస్తుందని భావించారు. కాని ఇప్పుడు అలాంటి అవకాశాలు కనిపించడం లేదు. సీమాంధ్ర ప్రజలలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తమ అభ్యంతరాలను, నిరసనలను అధిష్టానం బేఖాతరు చేయడంతో సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపిలు తీవ్ర నిరాశకు లోనయ్యారు. వారందరూ కలిసి ఈరోజు సమావేశమై ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం ఒక్క అడుగు ముందుకు వేసినా రాజీనామాలు చేయాలని నిర్ణయించుకున్నారు. కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, దగ్గుబాటి పురంధేశ్వరి, జెడి శీలం, పల్లం రాజు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కిల్లి కృపారాణిలు ఒక అడుగు ముందుకు వేసి రాజీనామా లేఖపై సంతకాలు కూడా చేశారు. ఆ లేఖను పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ ద్వారా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించాడానికి సిద్ధపడ్డారు. ఈ నెల 24న లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్‌ను కూడా కలవాలని వారు నిర్ణయించుకున్నారు. ఆ తరువాత ఎంపి లగడపాటి మాట్లాడుతూ అంతిమ విజయం సమైక్యవాదానిదేనన్నారు. సమైక్యాంధ్ర మినహా హైదరాబాబ్ కేంద్ర పాలిత ప్రాంతం గానీ, మరే ఇతర ప్రత్యామ్నాయానికి తాము అంగీకరించం అని చెప్పారు. విభజన దిశగా ఒక్క అడుగు ముందుకేసినా తమ రాజీనామాలు ఆమోదించాలని స్పీకర్ వద్ద మొండికేసుకొని కూర్చుంటామన్నారు. ఆంటోనీ కమిటీ నివేదిక ఇవ్వకుండా ముందుకు ఎలా వెళతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో 80 శాతం మంది సమైక్యవాదులేనన్నారు. శిలాశాసనానికి చోటులేదు-ప్రజా శాసనానికే చోటు అన్నారు. తమని గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటామని, పార్టీ అధిష్టానాన్ని వ్యతిరేకిస్తామని చెప్పారు. తెలంగాణ అంశంలో కేంద్రం ముందుకెళ్లదని భరోసా కల్పిస్తేనే రాజీనామా ప్రతిపాదన విరమించుకుంటామని చెప్పారు. షిండే కేబినెట్ నోట్ నిజమని తేలితే రాజీనామా చేస్తామని చెప్పారు. ఇన్ని మాటలు చెప్పిన లగడపాటి చివరగా పార్లమెంటులో బిల్లును అడ్డుకోవడానికి తాము ఉండి తీరాలన్నారు. లగడపాటి చూస్తే స్పష్టత లేకుండా మాట్లాడుతున్నారు. మంత్రులు తమ రాజీనామా పత్రాలు స్పీకర్ ఫార్మాట్లో ఇవ్వలేదు. దాంతో ఈ వ్యవహారం అంతా పలు అనుమానాలకు తావిస్తోంది. ఇవన్నీ ఉత్తుత్తి రాజీనామా ప్రకటనలుగా భావించవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనిని మరో డ్రామాగా పలువురు భావిస్తున్నారు. -
రాజీనామాలకు సిద్ధపడిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు
-
రాజీనామాలకు సిద్ధపడిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపిలు
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై కేంద్ర మంత్రి మండలి నోట్ సిద్ధమైనట్లు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చేసి వ్యాఖ్యలు సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపిలలో కలకలం రేపాయి. రేపటి కేంద్ర మంత్రి మండలి సమావేశంలో తెలంగాణ అంశం అనధికారంగా చర్చించే అవకాశం ఉందని తెలియడంతో వారందరూ రాజీనామాలు చేయడానికి సిద్ధపడ్డారు. వారందరూ కలిసి ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. కావూరి సాంబశివరావు, పురంధేశ్వరి, జెడి శీలం, పల్లం రాజు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి రాజీనామా లేఖలపై సంతకాలు కూడా చేశారు. ఈ రాత్రి 9 గంటలకు వారు పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్‌ను కలిసి రాజీనామా పత్రాలు అందజేస్తారు. దిగ్విజయ్ సింగ్ ద్వారా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాజీనామా పత్రాలు పంపాలని భావిస్తున్నారు. ఈ నెల 24న లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్‌ను కూడా కలవాలని వారు నిర్ణయించుకున్నారు. -
విభజన జరిగిపోయింది... మీకేం కావాలో చెప్పండి
-
విభజన జరిగిపోయింది... మీకేం కావాలో చెప్పండి
* సీమాంధ్ర కేంద్ర మంత్రులకు ఆంటోనీ కమిటీ స్పష్టీకరణ * మీ ప్రాంత ప్రజల ప్రయోజనాలు కాపాడుకునే ప్రతిపాదనలు చేయండి * రెండో ఎస్సార్సీ ఏర్పాటు ప్రతిపాదనకు నో చెప్పిన హైకమాండ్ పెద్దలు సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలన్న కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు చెందిన కేంద్ర మంత్రుల డిమాండ్‌ను ఆంటోనీ కమిటీ తిరస్కరించింది. రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని లేదా దేశంలో ‘ప్రత్యేక’ డిమాండ్లనన్నింటినీ పరిశీలించేందుకు రెండో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్(ఎస్సార్సీ)ని ఏర్పాటు చేసి సీమాంధ్రలో కాంగ్రెస్‌ను కాపాడుకొనే ప్రయత్నం చేయాలన్న సూచనను కూడా అధిష్టానం పెద్దలు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చినట్లు తెలిసింది. పార్టీలో అత్యున్నత స్థాయిలో నిర్ణయం జరిగిపోయినందున మీ ప్రాంత ప్రజల ప్రయోజనాలను కాపాడుకొనేందుకు అవసరమైన ప్రతిపాదనలు మాత్రమే చేయాలని ఆంటోనీ కమిటీ సీమాంధ్ర ప్రతినిధులకుస్పష్టంచేసింది. రాష్ట్ర విభజనతో సీమాంధ్రులకు ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకే సంప్రదింపుల ప్రక్రియను చేపట్టామని తెలిపింది. గురువారం కాంగ్రెస్ వార్‌రూమ్‌లో రాత్రి పొద్దుపోయిన తర్వాత కమిటీ సభ్యులైన ఏకే ఆంటోనీ, వీరప్ప మొయిలీ, అహ్మద్ పటేల్, దిగ్విజయ్‌సింగ్‌లతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, వి.కిశోర్‌చంద్ర దేవ్, ఎం.ఎం.పల్లంరాజు, చిరంజీవి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, జె.డి.శీలం, దగ్గుబాటి పురందేశ్వరి, పనబాక లక్ష్మి, తిరుపతి ఎంపీ చింతా మోహన్ సమావేశమయ్యారు. దాదాపు గంటన్నరకుపైగా ఈ భేటీ సాగింది. సమావేశంలో ముందుగా కావూరి సాంబశివరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను, వివిధ వర్గాలలో వ్యక్తమవుతున్న అభిప్రాయాలను వివరించినట్లు తెలిసింది. రాజకీయ కారణాలతో రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయం తీసుకోవడాన్ని కిశోర్‌చంద్ర దేవ్ ప్రశ్నించినట్లు సమాచారం. పార్టీ నిర్ణయం వెలువడినప్పటి నుంచీ కోస్తా, రాయలసీమల్లో ఉధృతంగా సాగుతున్న సమైక్య ఉద్యమం తీరుతెన్నులను మిగిలిన మంత్రులు వివరించారు. రాష్ట్రాన్ని విడదీస్తూ కాంగ్రెస్ సీమాంధ్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచిందనే భావన ప్రజల్లో బలంగా నాటుకుందని, ప్రజలు తమంతట తాముగా స్వచ్ఛందంగా వీధుల్లోకి వస్తున్నారని, ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు, అన్ని వర్గాలు ప్రజల ఆందోళనలు చేస్తున్నారని, పార్టీని, పదవులను వదులుకోవాల్సిందిగా తమపై విపరీతమైన ఒత్తిడి ఉందని పేర్కొన్నారు. విభజన అనివార్యమైతే హైదరాబాద్‌ను రెండు రాష్ట్రాల శాశ్వత రాజధానిగా కొనసాగించేందుకు కేంద్ర పాలిత ప్రాంతంగా లేదా ఢిల్లీ తరహాలో ప్రకటించాలన్న వాదనను కూడా కమిటీ సభ్యులు కొట్టిపారేసినట్లు తెలిసింది. హైదరాబాద్ లేకుండా రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ రాష్ట్ర శాసనసభలో 80, 90 స్థానాలు మాత్రమే ఉంటాయని, దానివల్ల నిరంతరం రాజకీయ అస్థిరత సమస్య తలెత్తే ప్రమాదముందని ఆంటోనీ అభిప్రాయపడినట్లు సమాచారం. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించినంత కాలం మాత్రం ైెహ దరాబాద్ పరిధిలో శాంతిభద్రతల వంటి కొన్ని శాఖలు గవర్నర్ అధీనంలో ఉంచుతామని ఆయన స్పష్టంచేసినట్లు సమాచారం. ప్రజల ఆందోళనలను వివరించాం: పల్లంరాజు, చిరంజీవి రాష్ట్ర విభజనతో ఎదురయ్యే తీవ్రమైన సమస్యలను ఆంటోనీ కమిటీకి వివరించామని, ప్రజలు రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని గట్టిగా కోరుకొంటున్నారన్న విషయాన్ని చెప్పినట్లు కేంద్ర మంత్రి పల్లంరాజు వెల్లడించారు. తాము ప్రస్తావించిన సమస్యలను పరిశీలించి తగిన పరిష్కారాలు కనుగొనే ప్రయత్నం చేస్తామని కమిటీ హామీ ఇచ్చినట్లు చెప్పారు. రైతులు, ఉద్యోగులు, విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలు, హైదరాబాద్‌లో నివసిస్తున్న సీమాంధ్ర ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆందోళనలను కమిటీ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా చూడాలని, తుది నిర్ణయం ఏదైనా ఉభయతారకంగా ఉండాలని చెప్పినట్లు మరో కేంద్ర మంత్రి చిరంజీవి చెప్పారు. సమన్యాయం అంటే రాష్ట్ర విభజనకు అంగీకరించి సమస్యలను పరిష్కరించమని కోరినట్లేనా అన్న విలేకరుల ప్రశ్నలకు ఆయన సూటిగా సమాధానమివ్వలేదు. సమన్యాయం అంటే ఎవరికీ అన్యాయం జరగకుండా చూడడమని అర్థం అంటూ దాటవేశారు. వార్ రూమ్‌లో రేణుకా చౌదరి ఆంటోనీ కమిటీతో సీమాంధ్ర నేతల సమావేశం ప్రారంభమైన సమయంలోనే తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకురాలు, ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి కాంగ్రెస్ వార్‌రూమ్‌కు రావడం చర్చనీయాంశమైంది. అయితే, తాను ఇతర పార్టీ పనులపై మాత్రమే వార్‌రూమ్‌కు వచ్చానని, ఆంటోనీ కమిటీతో సీమాంధ్ర నేతల సమావేశానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని పది నిమిషాలలో బయటకు వచ్చిన ఆమె చెప్పారు. త్వరలో హైదరాబాద్ వెళ్తా: దిగ్విజయ్ సమావేశంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు తమ అభిప్రాయాలను, వాదనలను గట్టిగా వినిపించారని, వారు లేవనెత్తిన అంశాలన్నింటినీ కమిటీ అధ్యక్షుడు ఆంటోనీ నోట్ చేసుకొన్నారని భేటీ అనంతరం దిగ్విజయ్ విలేకరులకు తెలిపారు. రాష్ట్ర విభజన సమస్యపై ఆంటోనీ కమిటీ సంప్రదింపులు ఈనెల 19, 20 తేదీల్లో కూడా కొనసాగుతాయని, ఈరోజు చర్చలకు హాజరు కాలేకపోయిన సీమాంధ్ర ఎంపీల వాదనలను సోమ, మంగళవారాలలో తెలుసుకొంటామని చెప్పారు. రాష్ట్రస్థాయిలో ఇతర నేతలతో, వివిధ వర్గాలు, ప్రజాసంఘాల ప్రతినిధుల అభిప్రాయాలను సేకరించేందుకు కమిటీ తరపున త్వరలో హైదరాబాద్ సందర్శిస్తానని సీమాంధ్ర మంత్రులకు హామీ ఇచ్చారు. -
జేఏసీ నేతలతో 'వట్టి' మాటలు
కేంద్రంలోని పెద్దలతో చర్చించిన తర్వాత రాజీనామా నిర్ణయాన్ని ప్రకటిస్తానని రాష్ట్ర మంతి వట్టి వసంత కుమార్ స్పష్టం చేశారు. గురువారం ఏలూరులో ఆయన జేఏసీ నేతలతో సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పదవికి రాజీనామా చేయాలని జేఏసీ నేతలు వట్టిని డిమాండ్ చేశారు. దాంతో మంత్రి వట్టి వసంత కుమార్‌పై విధంగా స్పందించారు. పశ్చిమగోదావరి జిల్లాలో సమైకాంధ్ర ఉద్యమం రోజురోజూకు ఉగ్రరూపం దాలుస్తుంది. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రజాప్రతినిధుల వ్యవహారశైలిని ఎండగడుతూ సమైక్యవాదులు నిరసన తెలిపారు. అందులోభాగంగా కేంద్రమంత్రులు మాస్క్‌లతో మాక్ కోర్టును నిర్వహించారు. పోలీస్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న స్వాతంత్ర్య వేడుకలను ఏలూరు నగరంలోని పలు విద్యాసంస్థలు బహిష్కరించాయి. ప్రైవేట్, మేనేజ్మెంట్ స్కూల్ యాజమాన్యాలు చేపట్టిన రిలేదీక్షలు గురువారం 13వ రోజుకు చేరుకున్నాయి. అయితే ఈ నెల 20 నుంచి స్థానిక ఎమ్మెల్యే ఆళ్లనాని ఆమరణ దీక్ష చేయనున్నారు. -
సోనియాతో సీమాంధ్ర కేంద్ర మంత్రుల భేటీ
న్యూఢిల్లీ: సీమాంధ్రకు చెందిన ఏడుగురు కేంద్ర మంత్రులు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. రాష్ట్రం విభజిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన నేపధ్యంలో సీమాంధ్రలో చెలరేగిన ఉద్యమం గురించి మంత్రులు క్షేత్రస్థాయిలో సోనియాకు వివరించారు. సమైక్యాంధ్ర వాణి వినిపించారు. రాజధాని, హైదరాబాద్ అంశం, నదీజలాలు, ఉద్యోగుల భద్రతపై వారు చర్చించారు. కేంద్రం నుంచి స్పష్టత కావాలని సీమాంధ్ర మంత్రులు సోనియాను కోరారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు పల్లంరాజు, కావూరి సాంబశివరావు, పనబాక లక్ష్మి, పురందేశ్వరీ, కిల్లి కృపారాణి, చిరంజీవి, జెడి శీలం పాల్గొన్నారు. కేంద్ర సహాయమంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి హాజరుకాలేదు. ఆయన ఉదయం కర్నూలు జిల్లా నేతలతో కలిసి వెళ్లి సోనియాను కలిశారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపిలు నిన్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్‌ను కలిన విషయం తెలిసిందే. వారందరూ సమైక్యవాదాన్ని వినిపించారు. నిన్న దిగ్విజయ్ సింగ్‌ను కలిసినవారిలో ఈ ఏడుగురు మంత్రులతోపాటు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కూడా ఉన్నారు. సమైక్యాంధ్ర తీర్మానాన్ని వారు దిగ్విజయ్ సింగ్‌కు అందజేశారు. అనంతరం కేంద్ర మంత్రి చిరంజీవి, జెడి శీలం విలేకరులతో మాట్లాడుతూ ఎవరికి అన్యాయం జరుగకుండా అందరికీ న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు. హైదరాబాద్‌పై తాము లేవనెత్తి అంశాలను లిఖితపూర్వకంగా తెలియజేయమని దిగ్విజయ్ సింగ్ కోరినట్లు చెప్పారు. హైలెవల్ కమిటీ ముందు త్వరలోనే తమ వాదనలను వినిపిస్తామన్నారు. -
చిదంబరంను కలిసిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు
-
విభజనపై కేంద్రమంత్రులు వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటుగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు శనివారం హైదరాబాద్‌లో విమర్శించారు. సీఎం,పీసీసీ అధ్యక్షుడు, ఎంపీలు,ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే కేంద్రం దిగొస్తుందన్నారు. రాష్ట్ర విభజనపై చర్చ లేకుండా విభజన జరిగితే ప్రాజెక్ట్‌లు ఏడారులుగా మారతాయని అభిప్రాయపడ్డారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికలో ఉన్న రహస్య చాఫ్టర్‌ను బహిర్గంతం చేయాలని యూపీఏ సర్కార్‌ను మరో సారి డిమాండ్ చేశారు. టీడీపీ నేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు పుండుమీద కారం జల్లే విధంగా ఉన్నాయన్నారు.