సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఫెయిల్.. ఇప్పుడు కొత్త డ్రామా
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే విషయంలో పరీక్ష రాశామని, అందులో పాసయ్యామా, ఫెయిలయ్యామా అన్న విషయం త్వరలోనే తెలుస్తుందని గప్పాలు కొట్టిన కేంద్ర మంత్రులంతా సదరు పరీక్షలో దారుణంగా ఫెయిలయ్యారు. రాజీనామాల పేరుతో గతంలో ఆడిన డ్రామాలనే మరోసారి తెరమీదకు తెచ్చారు. అది కూడా అందరూ కాదు.. గట్టిగా నలుగురంటే నలుగురే. గతంలో తాము సమర్పించిన రాజీనామాలనే ఆమోదింపజేసుకుంటామని కేంద్ర మంత్రులు చిరంజీవి, పల్లంరాజు, పురందేశ్వరి, కావూరి సాంబశివరావు కొత్త పల్లవి అందుకున్నారు. గతంలో ప్రధానమంత్రికి రాజీనామా లేఖలు ఇవ్వగా, ఈసారి నేరుగా రాష్ట్రపతికి ఇస్తామంటున్నారు.
సమైక్యాంధ్ర కోసం తామంతా చిత్తశుద్ధితో కృషి చేశామని, మంత్రి పదవులను కూడా త్యజించామని వాళ్లు చెబుతున్నా.. అదంతా డొల్ల వాదనేనని తేలిపోయింది. వాస్తవానికి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన అన్ని పార్టీల ఎంపీలు నిజాయితీగా రాజీనామాలు చేసి ఉంటే కేంద్ర ప్రభుత్వానికి తగినంత బలం ఉండేది కాదు, ఈ పాటికి పడిపోయి కూడా ఉండేది. ఏకంగా తొమ్మిది మందికి కేంద్ర మంత్రిపదవులు లభించిన వైనాన్ని చూస్తే, వీళ్లందరికీ పదవుల ఎర వేసి.. కేంద్రం ముందుగానే వీళ్లందరినీ జేబుల్లో వేసుకుందన్న ప్రచారం గట్టిగా ఉంది.
కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత స్థాయిలో ప్రకటన వచ్చిన తర్వాత కూడా కేంద్ర మంత్రుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని సీమాంధ్ర ప్రాంత వాసులు మండిపడుతున్నారు. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ముందు కొంతమంది మంత్రులు తమ డిసెంట్ నోట్ ఇస్తామని చెప్పినట్లు సమాచారం వినిపించింది. దాన్ని కూడా కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు. తమ ప్రాంతానికి చెందిన ప్రజల ప్రయోజనాలను నెరవేర్చకుండా.. పదవులను పట్టుకుని వేలాడటానికి, తమ సొంత ప్రయోజనాలు నెరవేర్చుకోడానికే మంత్రులు పెద్దపీట వేశారన్న విమర్శలు వినవస్తున్నాయి. తనకు మంత్రి పదవి రానంత వరకు సమైక్యాంధ్ర మంత్రాన్ని గట్టిగా జపించిన కావూరి సాంబశివరావు.. ఆ తర్వాత అసలు ఆ విషయాన్ని పట్టించుకోవడమే మానేశారు. మరో కేంద్ర మంత్రి పురందేశ్వరి కూడా ప్రభుత్వం తెలంగాణ ఇచ్చేస్తానంటుంటే ఇంకా సమైక్యాంధ్ర అంటూ పట్టుకుని వేలాడాలా అని వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి చూస్తే కేంద్ర మంత్రులు పోషించిన పాత్ర ఏంటన్నది తెలిసిపోతుంది.