' ప్రధానికి సీమాంధ్ర కేంద్ర మంత్రుల విజ్ఞప్తి
' జీెహచ్‌ఎంసీ పదేళ్ల తాత్కాలిక యూటీ
' పోలవరం ముంపు గ్రామాలన్నీ సీమాంధ్రలో
' పలు డిమాండ్లతో మెమోరాండం
' సీమాంధ్రకు న్యాయం చేస్తామన్న ప్రధాని
' ప్రత్యేక ప్రోత్సాహకాలు, ఆర్థిక ప్యాకేజీకి హామీ
రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టరాదన్న తమ డిమాండ్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో దిగొచ్చిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు బిల్లులో సీమాంధ్రకు న్యాయం జరిగేలా పలు సవరణలు చేయాలని ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు విన్నవించారు. సీమాంధ్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తుకు భరోసా, వారి ప్రయోజనాల రక్షణ, అభివృద్ధికి వీలుగా సవరణలు సూచించిన సీమాంధ్ర మంత్రులు, వాటిని బిల్లులో చేరిస్తే పార్లమెంట్‌లో రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లుకు మద్దతు తెలుపుతామని స్పష్టంచేశారు. విభజన బిల్లులో సవరణలు చేసేందుకు శుక్రవారం సాయంత్రం కేంద్ర కేబినెట్ ప్రత్యేకంగా సమావేశం కానున్న నేపథ్యంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులంతా ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ఉభయసభలు వాయిదాపడిన అనంతరం ప్రధానితో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయనకు సవరణలతో కూడిన మెమోరాండాన్ని సమర్పించారు. సీమాంధ్రుల ప్రయోజనాలకు తాము పెద్దపీట వేస్తున్నామని, వారికి సరైనన్యాయం చేయాలన్నదే తమ నిర్ణయమని ప్రధాని తెలిపినట్లుగా తెలుస్తోంది. ప్రధానిని కలిసిన వారిలో కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, జేడీ శీలం, కిల్లి కృపారాణి, చిరంజీవిలు ఉన్నారు. అనంతరం జేడీ శీలం మీడియాతో మాట్లాడుతూ... తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని, కానీ విభజన చేస్తున్న తీరే బాధాకరంగా ఉందని చెప్పారు. సమస్యలపై నక్సల్స్‌తో చర్చించిన ప్రభుత్వం మాతో చర్చించలేదా..? అని ప్రశ్నించారు.
సీమాంధ్ర మంత్రులు కోరిన సవరణలు ఇవే..
1. ఖమ్మం జిల్లా భద్రాచలం రెవెన్యూ గ్రామాలు, పాల్వంచ డివిజన్ గ్రామాలను సీమాంధ్రలో కలపాలి.
2. రాయలసీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలి.
3. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి పథకం ప్రకటించాలి.
4. జీహెచ్‌ఎంసీ ప్రాంతాన్ని పదేళ్లు తాత్కాలిక కేంద్ర పాలితప్రాంతంగా ప్రకటించి తటస్థ పాలన ఏర్పాటుచేయాలి.
5. కొత్తగా ఏర్పడే రాష్ట్రంలో 225, తెలంగాణలో 153 అసెంబ్లీ స్థానాలు ఏర్పాటు చేయాలి. రాజకీయ సుస్థిరత కోసం ఈ ప్రక్రియ అవసరం.
6. ఆర్థికాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి హైదరాబాద్ పరిసరాల్లోనే కేంద్రీకృతమైన నేపథ్యంలో సీమాంధ్రకు ఆర్థికభారం కలగకుండా ఉండాలంటే రెండు రాష్ట్రాలమధ్య ప్రత్యేక యంత్రాంగంద్వారా ఆదాయ వనరుల పంపిణీ చేపట్టాలి.
7. సీమాంధ్రకు ఆదాయపన్ను పంపిణీ, సెంట్రల్ ఎక్సైజ్, ఆదాయపన్ను చెల్లింపుల నుంచి పదేళ్ల మినహాయింపు ఇవ్వాలి. పెట్టుబడులపై 15% సబ్సిడీ 20 ఏళ్లపాటు ఇవ్వాలి. పరిశ్రమల ఏర్పాటుకు 20 ఏళ్లపాటు 50% పౌరసబ్సిడీ ఇవ్వాలి.
8. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో పొందుపరిచినట్టుగా 2 రాష్ట్రాలకు బడ్జెట్ మద్దతును ప్రతి పథకానికి అందించాలి.
9. పోలవరం ప్రాజెక్టుకు కొత్తగా ఏర్పాటయ్యే తెలంగాణ రాష్ట్రం అనుమతి ఇచ్చినట్టుగానే భావించాలి. రాష్ట్రం ఏర్పడిన మూడేళ్లలోగా పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం పూర్తిచేయాలి.
10. సీమాంధ్రలో కొత్త రాజధాని ఏర్పడేవరకు ఉన్నతవిద్యారంగంలో ఇప్పుడున్న కోటా ప్రకారమే ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్ కళాశాలల్లో ప్రవేశాలు జరగాలి. ఉన్నత విద్య, సాంకేతిక, మెడికల్ విద్యారంగంలో అడ్మిషన్ల విధానం కొనసాగాలి.
11. పదవ షెడ్యూల్ కింద ఏర్పాటైన వివిధ ప్రభుత్వ సంస్థలు... ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడే వరకూ అందులో పనిచేసే ఉద్యోగులను ఇక్కడే కొనసాగించాలి.
12. ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక ప్రగతికి కచ్చితంగా రోజుకు 20 మిలియన్ క్యూబిక్ మీటర్ల (ఎంసీఎండీ) గ్యాసును కేటాయించాలి.
13. ఆంధ్రప్రదేశ్‌లో ఐఐటీ, నిట్, ఐఐఎం, ఐఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్, కేంద్ర యూనివర్సిటీతోపాటు ఒక కేంద్ర వ్యవసాయ వర్సిటీని ఏర్పాటు చేయాలి. ఎయిమ్స్ తరహాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కమ్ టీచింగ్ ఇనిస్టిట్యూషన్‌ను నెలకొల్పాలి. ఒక గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఇటు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఏర్పాటు చేయాలి. నల్సార్, పెట్రోలియం వర్సిటీని కేంద్రం నెలకొల్పాలి.
13(బి). దశలవారీగా 2018 నాటికి దుగ్గరాయపట్నంతో పాటు వాడరేవు, రామాయపట్నం, నిజాంపట్నం ఓడరేవులను అభివృద్ధి చేయాలి. కడపలో సెయిల్ ద్వారా ఒక స్టీలు ప్లాంటు నెలకొల్పాలి. వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేయాలి. వైజాగ్, తిరుపతి, విజయవాడ విమానాశ్రయాలను అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చేయాలి. రైల్వేజోన్‌తో పాటు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటయ్యే కొత్త రాజధాని నుంచి హైదరాబాద్‌తో పాటు ఇతర అన్ని నగరాలకు ర్యాపిడ్ రైలు, రోడ్డు మార్గాన్ని అభివృద్ధి చేయాలి.
ఇలా సవరిస్తే సరే!
Published Sat, Feb 8 2014 3:21 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement