బిల్లు పెట్టటానికి ముందే స్క్రిప్ట్ !
* కమల్‌నాథ్ స్క్రిప్ట్‌కు ప్రధాని ఆమోదం
* సభలో మార్షల్స్ అవతారమెత్తిన
* కాంగ్రెస్ ఇతర రాష్ట్రాల ఎంపీలు
* స్పీకర్‌కు, హోంమంత్రికి రక్షణ
* కవచంగా 30 మంది మోహరింపు
* షిండే బిల్లును ప్రవేశపెడుతుండగా
* దూసుకొచ్చిన సీమాంధ్ర ఎంపీలు
* వారిని తోసివేసిన ‘రక్షణ ఎంపీలు’...
* ఘర్షణకు దిగిన టీ-ఎంపీలు
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీక అయిన పార్లమెంటు యుద్ధభూమిగా మారటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 67 ఏళ్ల భారత స్వాతంత్య్ర చరిత్రలో మునుపెన్నడూ జరగని అసాధారణమైన పరిణామాలకు ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు కారణమైతే.. దీనిని ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ అనుసరించిన విధానం విపక్షాలు సహా రాజకీయ విశ్లేషకులందరినీ విస్మయానికి గురిచేసింది.
సభ సజావుగా సాగేందుకు క్రియాశీల పాత్ర పోషించాల్సిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ గురువారం నాటి పరిణామాలకు స్క్రిప్టును రూపొందించగా.. సాక్షాత్తు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ఆమోదం తెలపటంతో కాంగ్రెస్ ఎంపీలు యాక్షన్‌లోకి దిగి లోక్‌సభను కురుక్షేత్రంగా మార్చారు. పార్లమెంటు సంప్రదాయాలు గంగలో కలిసినప్పటికీ.. తెలంగాణ, సీమాంధ్ర ఎంపీలు బాహాబాహీకి దిగినప్పటికీ.. మునుపెన్నడూ లేని అసాధారణ పరిణామాలతో పార్లమెంటు ప్రతిష్ట మసకబారేలా చేసినప్పటికీ తాము అనుకున్న స్క్రిప్టు విజయవంతంగా అమలైనందుకు కాంగ్రెస్ పెద్దల్లో విజయదరహాసం వెల్లివిరుస్తోంది.
కమల్‌నాథ్ స్క్రిప్ట్‌కు ప్రధాని ఆమోదం...
పార్లమెంటు ఓటాన్ అకౌంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉన్నప్పటికీ సీమాంధ్ర ఎంపీల ఆందోళనతో గత వారం రోజులుగా సాధ్యం కాలేదు. గురువారం సభ ఆరంభమైన వెంటనే అదే సీన్ పునరావృతం కావటంతో మంత్రి కమల్‌నాథ్ ఒక స్క్రిప్టును తయారు చేశారు. సభలో విభజన బిల్లును ప్రవేశపెట్టే సమయంలో ఏం చేయాలో కాగితంపై స్కెచ్ వేశారు. దానిని ప్రధానమంత్రి ముందుంచారు. సీనియర్ మంత్రులతో సమావేశమైన ప్రధాని.. కమల్‌నాథ్ స్క్రిప్ట్‌కు ఆమోదం తెలిపారు.
ఇంతకీ ఆ స్క్రిప్టులో ఏముందంటే...
సభ తిరిగి ప్రారంభం కాగానే ఇతర రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్, మిత్రపక్ష పార్టీల ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌కు, ట్రెజరీ బెంచ్ (మంత్రులు కూర్చునే స్థానాలు)కు రక్షణ కవచంగా నిలవాలి. హోంమంత్రి బిల్లును ప్రవేశపెట్టే సమయంలో ఆయన వద్దకు ఎవరూ రాకుండా చూడాలి. సభలో ఎవరైనా గందరగోళం చేస్తే వారిని అడ్డుకోవాలి. అవసరమైతే బాహాబాహీకి దిగాలి. విభజన బిల్లు ప్రక్రియ ముగిసే వరకు ఇదే వ్యూహాన్ని అమలు చేయాలన్నదే కమల్‌నాథ్ వ్యూహం. ప్రధాని గ్రీన్‌సిగ్నల్ ఇవ్వటంతో ఏఐసీసీ కార్యదర్శి దీపక్‌బబ్బారియా, జమ్మూకాశ్మీర్‌కు చెందిన లాల్‌సింగ్ సహా 30 మంది ఎంపీలు సభ తిరిగి ప్రారంభం కావటానికి ముందే మార్షల్స్ అవతారమెత్తారు. లోక్‌సభ స్పీకర్ పోడియం, హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే టేబుల్ చుట్టూ రక్షణ వలయంగా నిలబడ్డారు. స్పీకర్ సభలోకి రావటంతోనే షిండే విభజన బిల్లును ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. ఆయన ఆ ప్రకటన చేస్తున్న సమయంలోనే సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు వెల్‌లోకి దూసుకువచ్చారు. షిండే బిల్లు పెట్టకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎంపీలను రక్షణ వలయంలో ఉన్న ఎంపీలు తోసివేశారు.
విభజన బిల్లుపై చర్చ జరిగేనా?
పార్లమెంటు సమావేశాలు సోమవారం తిరిగి సమావేశమైన తర్వాత నుంచి విభజన బిల్లుపై చర్చ జరుగుతుందా? లేదా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సోమవారం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆ రోజు చర్చ జరిగే అవకాశాల్లేవు. మంగళవారం నాటి ఎజెండాను ఇంకా ఖరారు చేయలేదు. గత వారం రోజులుగా పార్లమెంటులో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఏ ఒక్క అంశంపైనా చర్చ జరిగిన దాఖ లాల్లేవు. రైల్వే బడ్జెట్ మొదలు అనేక బిల్లులు మూజువాణి ఓటుతోనే ఆమోదం పొందాయి. విభజన బిల్లు విషయంలోనూ చర్చ జరిగే అవకాశాలు కనిపించటం లేదు.
బిల్లుపై చర్చ జరగాల్సిందేనని ప్రధాన ప్రతిపక్షం బీజేపీ పట్టుపడుతుండగా.. చర్చ జరిగితే బిల్లులోని లోపాలన్నీ బయటపడతాయని భావిస్తున్న కాంగ్రెస్ ఏదో ఒకరకంగా మూజువాణి ఓటుతోనే బిల్లును ఆమోదించాలని యోచిస్తోంది. సోమవారం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు సభ పరిమితం అవుతుండటంతో.. ఈ నెల 21వ తేదీతో ముగియనున్న సమావేశాల్లో ఇక నాలుగు రోజులే మిగులుతాయి. ఈ నాలుగు రోజుల్లో విభజన బిల్లుతో పాటు అవినీతి నిరోధక బిల్లులు, న్యాయవ్యవస్థకు సంబంధించిన పలు బిల్లులను ఆమోదింపజేసుకోవాల్సిన అవసరం యూపీఏ సర్కారుకు ఉంది. ఉన్న కొద్ది సమయంలో విభజన బిల్లుపై ఇటు లోక్‌సభ, అటు రాజ్యసభల్లో చర్చ జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో బీజేపీతో పాటు ప్రతిపక్షాల వైఖరి ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.
సీమాంధ్ర కేంద్రమంత్రులపై ఒత్తిడి
సీమాంధ్రకు చెందిన 14 మంది ఎంపీలు సస్పెన్షన్‌కు గురికావడంతో విభజన బిల్లును అడ్డుకునే బాధ్యత ఆ ప్రాంత సీమాంధ్ర కేంద్ర మంత్రులపై పడింది. కేంద్ర మంత్రులుగా ఉంటూ వెల్‌లోకి వెళ్లి గొడవ చేయటం వారికి ఇబ్బందికరమే. అదే సమయంలో వారిని సస్పెండ్ చేయాలా? వద్దా? అనే విషయమూ స్పీకర్ కు సంకటంగా మారుతుంది. మరోవైపు సస్పెండైన ఎంపీల ందరూ సోమవారం నాటి సమావేశానికి హాజరై బిల్లును అడ్డుకోవాలని యోచిస్తున్నారు. పార్లమెంటులో మార్షల్స్‌ను ఉపయోగించటం ఎంపీలు అవమానకరంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో స్పీకర్ సస్పెండైన ఎంపీలను సభ నుంచి పంపేందుకు ఏం చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సిందే!
సభ సాఫీగా సాగేలా చూడండి
మంత్రి కమల్‌నాథ్‌కు ప్రధాని సూచన
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును వ్యతిరేకిస్తున్న ఎంపీలను సస్పెండ్ చేసినందువల్ల ఇకమీదటైనా (సోమవారం నుంచి శుక్రవారం దాకా) పార్లమెంట్ సమావేశాలు సాఫీగా సాగేలా చూడాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్‌కు ప్రధాని మన్మోహన్ సూచించారు. తెలంగాణతో సహా కీలక బిల్లులు ఆమోదం పొందాల్సి ఉన్నందున సభకు అంతరాయాలు లేకుండా చూడాలన్నారు. గురువారం లోక్‌సభ వాయిదా అనంతరం మన్మోహన్ సీనియర్ మంత్రులు షిండే, చిదంబరం, మొయిలీ, కమల్‌నాథ్‌లతో లోక్‌సభలో చోటుచేసుకున్న పరిణామాలను సమీక్షించారు. మిగిలిన ఐదు రోజుల్లో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.