Otan account budget
-
నేడు మంత్రివర్గ సమావేశం!
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం మంత్రివర్గ సమావేశం జరగనున్నట్లు సమాచారం. శాసనసభ, మండలిలో శనివారం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్నట్లు అధికారవర్గాల సమాచారం. కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. శుక్రవారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఆమోదం పొందాక.. మంత్రివర్గ సమావేశం జరుగుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. -
అనవసర వ్యయం వద్దు: ఏపీ ఆర్ధికశాఖ
సాక్షి, అమరావతి: కోవిడ్ నేపథ్యంలో అనవసర వ్యయాన్ని కట్టడి చేయాలని అన్ని శాఖలకు ఆర్ధికశాఖ సూచించింది. కోవిడ్ వల్ల ఆదాయ వనరులు తగ్గిపోయినందున ప్రాధాన్యతలను గుర్తించి ఆ రంగాలకే వ్యయం చేయాలని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి రావత్ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. ఓటాన్ అకౌంట్ కేటాయింపుల మేరకే పనులకు సంబంధించిన బిల్లులను సమర్పించాలని, కేటాయింపుల్లేని పనులకు బిల్లులను సమర్పించరాదని స్పష్టం చేశారు. ఏప్రిల్ నుంచి జూన్ చివరి వరకు ‘ఓటాన్ అకౌంట్’లో తిరిగి కేటాయింపులకు అనుమతించేది లేదన్నారు. వేతనాలు, పెన్షన్లు, గౌరవ వేతనాలు తదితరాలకు నియంత్రణ నుంచి మినహాయింపు ఇచ్చామన్నారు. -
రూ.70,983.11కోట్లతో ఓటాన్ అకౌంట్
సాక్షి, అమరావతి: రానున్న ఆర్థిక సంవత్సరం 2021 – 22లో తొలి మూడు నెలల (ఏప్రిల్ – జూన్) కాలానికి వివిధ శాఖలు, రంగాల వారీగా వ్యయానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.70,983.11 కోట్లను కేటాయించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మార్చిలో నిర్వహించడం సాధ్యం కాలేదు. మరోవైపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఇంకా మిగిలిపోయి ఉండటం, కోవిడ్ – 19 వ్యాక్సినేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో 2021 – 22 తొలి మూడు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ జారీకి శుక్రవారం కేబినెట్ ఆమోదం తెలిపి గవర్నర్‌కు పంపగా ఆదివారం ఆయన ఆమోదముద్ర వేశారు. దీంతో న్యాయశాఖ ఆర్డినెన్స్ గెజిట్ పబ్లికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ ఏప్రిల్ నుంచి జూన్ వరకు అన్ని రంగాల వ్యయానికి సంబంధించి ఓటాన్ అకౌంట్ కేటాయింపులతో ఆదివారం జీవో జారీ చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఆర్ధిక సంవత్సరంలో తొలి మూడు నెలలకు రూ.70,983.11 కోట్ల వ్యయం అవుతుందని కానుందని ఓటాన్ అకౌంట్లో పేర్కొన్నారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు నవరత్నాలకు సంబంధించి వివిధ పథకాలకు ఓటాన్ అకౌంట్లో వ్యయాలను ప్రతిపాదించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సేవల కోసం అదనంగా రూ.7,955.66 కోట్లను మంజూరు చేస్తూ ఆర్డినెన్స్‌కు కూడా గవర్నర్ ఆమోదం తెలపడంతో ఆర్థిక శాఖ జీవో జారీ చేసింది. -
‘ఓటాన్’పై యనమల విమర్శలు అర్థరహితం: బుగ్గన
బనగానపల్లె: ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు విమర్శలు అర్థరహితమని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం యాగంటి క్షేత్రంలో శుక్రవారం మంత్రి విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగంలో ‘ఓటాన్ అకౌంట్’ ఒక ప్రొవిజన్ అని, బడ్జెట్‌ను అమలు చేయలేని సమయంలో ఉద్యోగుల జీతభత్యాలు, అత్యవసరాలకోసం ఓటాన్ అకౌంట్‌ను అమలు చేసే విషయం మాజీ మంత్రి యనమలకు తెలిసిందేనన్నారు. రాజకీయ దురుద్దేశంతో యనమల విమర్శలు చేయడం సబబు కాదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే విషయంలో ఎస్ఈసీ నుంచి స్పష్టత రాకపోవడం, కరోనా సమస్యతో బడ్జెట్ సమావేశాలు జరిపే అవకాశాల్లేకపోవడంతో ఓటాన్ అకౌంట్‌ను అమలు చేయాల్సి వచ్చిందని మంత్రి స్పష్టం చేశారు. -
మూడు నెలల వ్యయానికి.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్
సాక్షి, అమరావతి: 2021–22 ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై ఆర్డినెన్స్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా 2021–22 ఆర్థిక సంవత్సరానికి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి నెలలో నిర్వహించడానికి సాధ్యపడని విషయం తెలిసిందే. అదే సమయంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ ఇంకా మిగిలిపోయి ఉండడంతోపాటు కోవిడ్–19 వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితుల్లో 2021–22 ఆర్థిక సంవత్సరానికి తొలి మూడు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు సంబంధించి ఆర్డినెన్స్‌ను జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఏప్రిల్ నుంచి జూన్ వరకు అన్ని రంగాలకు వ్యయం చేసేందుకుగాను ఆర్టికల్ 213(1) ప్రకారం రాజ్యాంగానికి అనుగుణంగా ఆర్డినెన్స్ జారీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆన్లైన్లో సర్క్యులేషన్ ద్వారా కేబినెట్ శుక్రవారం ఆర్డినెన్స్‌ను ఆమోదించింది. అనంతరం ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదానికి పంపించారు. గవర్నర్ నుంచి ఆమోదం రాగానే గెజిట్ నోటిఫికేషన్ జారీ కానుంది. ఏప్రిల్ 1వ తేదీతో ప్రారంభం కానున్న 2021–22 ఆర్థిక సంవత్సరంలో తొలి మూడు నెలలు.. అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లతోపాటు నవరత్నాల పథకాలకు, ఇతర రంగాలకు అవసరమైన వ్యయానికి ఆర్డినెన్స్ ద్వారా ఆమోదం పొందనున్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలోనూ కరోనా వైరస్ వ్యాప్తితో నెలకొన్న అత్యవసర పరిస్థితుల దృష్ట్యా తొలి మూడు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. -
ఓటాన్ అకౌంట్‌కు గవర్నర్ ఓకే
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఆమోదించిన 2014-15 సంవత్సరపు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు గవర్నర్ నరసింహన్ ఆమోద ముద్ర వేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి గురువారం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పటికీ ఆరునెలల వ్యయానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్‌కు మాత్రమే సభ ఆమోదం ఉన్నందున, బడ్జెట్ కేటాయింపుల్లో ఆరునెలలకు మించి వ్యయం కాకుండా అన్ని శాఖల చీఫ్ కంట్రోలింగ్ అధికారులు చూడాలని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పేర్కొన్నారు. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఆరు నెలలకు మించి నిధులను వ్యయం చేయరాదని, ఆరునెలల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్‌కు ఆమోదం పొందుతామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదనపు వ్యయాలకు అసెంబ్లీ ఆమోదానికి సంబంధించిన ఉత్తర్వులను కూడా ఆర్థిక శాఖ జారీ చేసింది. -
లెక్కలతో మోసం చేశారు... : డీఏ సోమయాజులు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పూర్తి నిరాశాజనకంగా ఉందని, ఆయన తన లెక్కలతో పార్లమెంటును మోసం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డీఏ సోమయాజులు విమర్శించారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై ఆయన స్పందిస్తూ 2013-14 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును 4.8 అంచనా వేయగా అది 4.6 శాతానికి తగ్గించినట్లు గొప్పగా టీవీ చానళ్లన్నింటిలో చెప్పుకుంటున్నారని వాస్తవానికి ఈ లోటు తొలి 8 నెలల్లోనే (ఏప్రిల్ నుంచి నవంబర్-2013 వరకు) 5 శాతంగా ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక నివేదికలో వెల్లడించిన అధికార డాక్యుమెంటులోనే ఉందన్నారు. పదేళ్లపాటు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఈ విధంగా ప్రజలను ఎలా తప్పు పట్టించారని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సవరించిన అంచనాల ప్రకారం 2013-14 ఆర్థిక సంవత్సరానికి రూ.105 లక్షల కోట్ల మేరకు జీడీపీ ఉంటే తొలి 8 నెలల్లోనే 59,557 కోట్ల మేరకు ద్రవ్యలోటు ఉందన్నారు. దీని ప్రకారమే 5 శాతం ద్రవ్యలోటు ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. ఇంకా మిగిలి ఉన్న నాలుగు నెలల ఆర్థిక సంవత్సరానికి కనీసం ఎంత లేదన్నా మరో రెండున్నర శాతం అదనంగా అంటే కనీసం 7 నుంచి 7.5 శాతం వరకూ ఉంటుందని వివరించారు. నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో జీడీపీ పెరిగే అవకాశం లేదని అందుకు కారణం యూపీఏ ప్రభుత్వ నిర్ణయ కార్యశూన్యతే కారణమని వ్యాఖ్యానించారు. నిర్ణయాలు తీసుకోకుంటే జీడీపీ పెరగదని, అది పెరగకుంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయన్నారు. ద్రవ్యలోటు రెవెన్యూలోటు కూడా పెరుగుతాయన్నారు. గత ఏడాదితో పోలిస్తే పారిశ్రామికాభివద్ధి సూచీ మైనస్ ఒక్క శాతంగా ఉందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో 1.5 నుంచి 2 శాతం మేరకు మాత్రమే వృద్ధిరేటు ఉందనేది అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు. 80 శాతం మంది ఆధారపడి ఉన్న పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లోనే వృద్ధిరేటు ఇంత అధ్వానంగా ఉందన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఎలాగూ వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇంటికి పంపేస్తారన్నారు. సీబీఐ కేసులు పెడుతుందని, కాగ్ ప్రశ్నిస్తుందనే భయంతో గత మూడేళ్లుగా ప్రధాని మన్మోహన్సింగ్ ప్రభుత్వం అభివృద్ధికి పనికి వచ్చే ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం లేదన్నారు. -
19న ‘టీ’ ఓటు ?
-
19న ‘టీ’ ఓటు ?
అదే రోజు బిల్లుపై లోక్‌సభలో చర్చ... మూజువాణి ఓటుతో ఆమోదం! ఆ వెంటనే రాజ్యసభకు పంపి.. అక్కడా అలాగే ఆమోదింపచేసే ఆలోచన 17న ఓటాన్ అకౌంట్ బడ్జెట్.. 18న ఇతర బిల్లులకు ఆమోదంతో సరి పార్లమెంటు ముగిసే ఒక రోజు ముందే టీ-బిల్లును గట్టెక్కించే వ్యూహం సీమాంధ్ర కేంద్రమంత్రుల ఆందోళననూ అనుకూలంగా మార్చుకునే ఆలోచన బిల్లు ఆమోదంపై ప్రతిపక్ష బీజేపీతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అవగాహన? న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును గురువారం నాడు జరిగిన ఘర్షణ మధ్య లోక్‌సభలో ప్రవేశపెట్టారా? లేదా? అనే అంశంపై ఒకవైపు వివాదం నడుస్తుండగానే.. కేంద్ర ప్రభుత్వం బిల్లు విషయంలో మరింత దూకుడుగా ముందుకెళ్లేందుకు సిద్ధమైంది. పార్లమెంటు సమావేశాలు ఈ నెల 17న (సోమవారం) తిరిగి ప్రారంభమవుతున్నప్పటికీ.. ఆ రోజు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నందున తెలంగాణ అంశాన్ని అజెండాలో చేర్చలేదు. మరుసటి రోజు అంటే ఈ నెల 18న సభలో ప్రవేశపెట్టి ఆమోదించుకోవాల్సిన బిల్లులు అనేకం ఉన్నాయి. వాటిని మాత్రమే లోక్‌సభ అజెండాలో చేర్చినందున ఆ రోజు కూడా సభలో విభజన బిల్లు చర్చకు వచ్చే అవకాశాలు కనిపించటం లేదు. కేంద్రవర్గాలు చెప్తున్న దాని ప్రకారం ఈ నెల 19న లోక్‌సభలో తెలంగాణ బిల్లుపై చర్చను ప్రారంభించి వెనువెంటనే ఆమోదింప జేసుకునేలా కాంగ్రెస్, యూపీఏ సర్కారు పెద్దలు ప్రణాళిక రూపొందిస్తున్నారు. అవసరమైతే అదే రోజు రాజ్యసభకు విభజన బిల్లును పంపాలనీ యోచిస్తున్నారు. మొత్తమ్మీద ఓటాన్ అకౌంట్ సమావేశాలు ముగియటానికి ఒక రోజు ముందే (ఈ నెల 20 నాటికే) ఉభయ సభల్లోనూ విభజన బిల్లును గట్టెక్కించే దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఉభయసభల్లోనూ ఓటింగ్‌తో పనిలేకుండా మూజువాణి ఓటుతోనే తెలంగాణ బిల్లును ఆమోదింపజేసే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే సీమాంధ్ర ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేసినందున.. బిల్లును ఆమోదింపజేసుకునేందుకు పెద్దగా అవరోధాలేమీ ఉండవనే ధీమాతో ఉన్నట్లు సమాచారం. సీమాంధ్ర కేంద్ర మంత్రులను ఈ విషయంలో దారికి తెచ్చుకోవటం పెద్ద కష్టం కాదని భావిస్తున్న కాంగ్రెస్ నాయకత్వం.. ఒకవేళ ఆ ప్రాంత కేంద్రమంత్రులు వెల్‌లోకి వచ్చి గొడవ చేస్తే ఏం చేయాలనే దానిపైనా వ్యూహం రూపొందిస్తున్నట్లు తెలిసింది. అదే జరిగితే కేంద్రం నెత్తిన పాలుపోసినట్లేనని, చర్చ లేకుండానే మూజువాణి ఓటుతో బిల్లును పాస్ చేయించుకోవచ్చని భావిస్తున్నట్లు చెప్తున్నారు. విభజన బిల్లు విషయంలో పూర్తిగా తమకే రాజకీయ లబ్ధి దక్కే విధంగా కాంగ్రెస్ వ్యూహాన్ని అమలు చేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విపక్షాలు, సొంత పార్టీ నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా లెక్క చేయకుండా తెలంగాణ ఇచ్చామనే సంకేతాలను ఆ ప్రాంత ప్రజల్లోకి వెళ్లేలా చేస్తున్నారని.. ఈ విషయంలో బీజేపీని కూడా ముద్దాయిగా చేర్చేందుకు యత్నిస్తున్నారని.. వారు అంటున్నారు. ఇప్పటికే బీజేపీ తెలంగాణ విషయంలో స్వరం మార్చుకుందని విమర్శిస్తున్న కాంగ్రెస్ పెద్దలు.. ఏ కారణాలవల్లనైనా విభజన బిల్లు అర్థంతరంగా నిలిచిపోతే అందుకు బీజేపీనే పూర్తి బాధ్యురాలిని చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్-బీజేపీ అవగాహన!: మరోవైపు తెలంగాణ విషయంలో కాంగ్రెస్-బీజేపీ అంతర్గతంగా ఒక అవగాహనకు వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌తో పాటు కాంగ్రెస్ పెద్దలు అహ్మద్‌పటేల్, దిగ్విజయ్‌సింగ్, కమల్‌నాథ్ తదితరులు బీజేపీ నేతలు అద్వానీ, సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌ల తో మాట్లాడినప్పుడే ఇరు పార్టీలూ ఒక అంగీకారానికి వచ్చాయని, ఆ తరువాతే విభజన బిల్లును కేంద్రం లోక్సభలోప్రవేశపెట్టిందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇరు పార్టీలు ఏకమయ్యాయనే సంకేతాలు ప్రజల్లోకి వెళితే నష్టమనే భావనతో ఉన్న కాంగ్రెస్, బీజేపీలు పైకి మాత్రం పరస్పరం కత్తులు దూసుకుంటూ రాజకీయ లబ్ధి కోసం యత్నిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
బడ్జెట్‌తో సరిపెట్టాలి అద్వానీ
న్యూఢిల్లీ: లోక్‌సభలో గురువారం చోటుచేసుకున్న కనీవినీ ఎరుగని సంఘటనలు విచారకరమని, పార్లమెంటు ప్రతిష్టకే మచ్చ అని బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ ఆవేదన వెలిబుచ్చారు. దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్‌దేనని ఆరోపించారు. సభ్యులను సస్పెండ్ చేసో, లేదంటే బహిష్కరించైనా ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ బిల్లును ఆమోదించుకోవాలని కాంగ్రెస్ మూర్ఖంగా వ్యవహరిస్తోందంటూ దుమ్మెత్తిపోశారు. బిల్లును ఆమోదించుకునే పద్ధతి ఇది కానే కాదన్నారు. ప్రస్తుత గందరగోళ పరిస్థితుల్లో పార్లమెంటులో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మినహా మరే బిల్లునూ చేపట్టరాదని డిమాండ్ చేశారు. -
బిల్లు పెట్టటానికి ముందే స్క్రిప్ట్ !
* కమల్‌నాథ్ స్క్రిప్ట్‌కు ప్రధాని ఆమోదం * సభలో మార్షల్స్ అవతారమెత్తిన * కాంగ్రెస్ ఇతర రాష్ట్రాల ఎంపీలు * స్పీకర్‌కు, హోంమంత్రికి రక్షణ * కవచంగా 30 మంది మోహరింపు * షిండే బిల్లును ప్రవేశపెడుతుండగా * దూసుకొచ్చిన సీమాంధ్ర ఎంపీలు * వారిని తోసివేసిన ‘రక్షణ ఎంపీలు’... * ఘర్షణకు దిగిన టీ-ఎంపీలు న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీక అయిన పార్లమెంటు యుద్ధభూమిగా మారటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 67 ఏళ్ల భారత స్వాతంత్య్ర చరిత్రలో మునుపెన్నడూ జరగని అసాధారణమైన పరిణామాలకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు కారణమైతే.. దీనిని ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ అనుసరించిన విధానం విపక్షాలు సహా రాజకీయ విశ్లేషకులందరినీ విస్మయానికి గురిచేసింది. సభ సజావుగా సాగేందుకు క్రియాశీల పాత్ర పోషించాల్సిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ గురువారం నాటి పరిణామాలకు స్క్రిప్టును రూపొందించగా.. సాక్షాత్తు ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ఆమోదం తెలపటంతో కాంగ్రెస్ ఎంపీలు యాక్షన్‌లోకి దిగి లోక్‌సభను కురుక్షేత్రంగా మార్చారు. పార్లమెంటు సంప్రదాయాలు గంగలో కలిసినప్పటికీ.. తెలంగాణ, సీమాంధ్ర ఎంపీలు బాహాబాహీకి దిగినప్పటికీ.. మునుపెన్నడూ లేని అసాధారణ పరిణామాలతో పార్లమెంటు ప్రతిష్ట మసకబారేలా చేసినప్పటికీ తాము అనుకున్న స్క్రిప్టు విజయవంతంగా అమలైనందుకు కాంగ్రెస్ పెద్దల్లో విజయదరహాసం వెల్లివిరుస్తోంది. కమల్‌నాథ్ స్క్రిప్ట్‌కు ప్రధాని ఆమోదం... పార్లమెంటు ఓటాన్ అకౌంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉన్నప్పటికీ సీమాంధ్ర ఎంపీల ఆందోళనతో గత వారం రోజులుగా సాధ్యం కాలేదు. గురువారం సభ ఆరంభమైన వెంటనే అదే సీన్ పునరావృతం కావటంతో మంత్రి కమల్‌నాథ్ ఒక స్క్రిప్టును తయారు చేశారు. సభలో విభజన బిల్లును ప్రవేశపెట్టే సమయంలో ఏం చేయాలో కాగితంపై స్కెచ్ వేశారు. దానిని ప్రధానమంత్రి ముందుంచారు. సీనియర్ మంత్రులతో సమావేశమైన ప్రధాని.. కమల్‌నాథ్ స్క్రిప్ట్‌కు ఆమోదం తెలిపారు. ఇంతకీ ఆ స్క్రిప్టులో ఏముందంటే... సభ తిరిగి ప్రారంభం కాగానే ఇతర రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్, మిత్రపక్ష పార్టీల ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌కు, ట్రెజరీ బెంచ్ (మంత్రులు కూర్చునే స్థానాలు)కు రక్షణ కవచంగా నిలవాలి. హోంమంత్రి బిల్లును ప్రవేశపెట్టే సమయంలో ఆయన వద్దకు ఎవరూ రాకుండా చూడాలి. సభలో ఎవరైనా గందరగోళం చేస్తే వారిని అడ్డుకోవాలి. అవసరమైతే బాహాబాహీకి దిగాలి. విభజన బిల్లు ప్రక్రియ ముగిసే వరకు ఇదే వ్యూహాన్ని అమలు చేయాలన్నదే కమల్‌నాథ్ వ్యూహం. ప్రధాని గ్రీన్‌సిగ్నల్ ఇవ్వటంతో ఏఐసీసీ కార్యదర్శి దీపక్బబ్బారియా, జమ్మూకాశ్మీర్‌కు చెందిన లాల్‌సింగ్ సహా 30 మంది ఎంపీలు సభ తిరిగి ప్రారంభం కావటానికి ముందే మార్షల్స్ అవతారమెత్తారు. లోక్‌సభ స్పీకర్ పోడియం, హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే టేబుల్ చుట్టూ రక్షణ వలయంగా నిలబడ్డారు. స్పీకర్ సభలోకి రావటంతోనే షిండే విభజన బిల్లును ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. ఆయన ఆ ప్రకటన చేస్తున్న సమయంలోనే సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు వెల్‌లోకి దూసుకువచ్చారు. షిండే బిల్లు పెట్టకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎంపీలను రక్షణ వలయంలో ఉన్న ఎంపీలు తోసివేశారు. విభజన బిల్లుపై చర్చ జరిగేనా? పార్లమెంటు సమావేశాలు సోమవారం తిరిగి సమావేశమైన తర్వాత నుంచి విభజన బిల్లుపై చర్చ జరుగుతుందా? లేదా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సోమవారం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆ రోజు చర్చ జరిగే అవకాశాల్లేవు. మంగళవారం నాటి ఎజెండాను ఇంకా ఖరారు చేయలేదు. గత వారం రోజులుగా పార్లమెంటులో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఏ ఒక్క అంశంపైనా చర్చ జరిగిన దాఖ లాల్లేవు. రైల్వే బడ్జెట్ మొదలు అనేక బిల్లులు మూజువాణి ఓటుతోనే ఆమోదం పొందాయి. విభజన బిల్లు విషయంలోనూ చర్చ జరిగే అవకాశాలు కనిపించటం లేదు. బిల్లుపై చర్చ జరగాల్సిందేనని ప్రధాన ప్రతిపక్షం బీజేపీ పట్టుపడుతుండగా.. చర్చ జరిగితే బిల్లులోని లోపాలన్నీ బయటపడతాయని భావిస్తున్న కాంగ్రెస్ ఏదో ఒకరకంగా మూజువాణి ఓటుతోనే బిల్లును ఆమోదించాలని యోచిస్తోంది. సోమవారం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు సభ పరిమితం అవుతుండటంతో.. ఈ నెల 21వ తేదీతో ముగియనున్న సమావేశాల్లో ఇక నాలుగు రోజులే మిగులుతాయి. ఈ నాలుగు రోజుల్లో విభజన బిల్లుతో పాటు అవినీతి నిరోధక బిల్లులు, న్యాయవ్యవస్థకు సంబంధించిన పలు బిల్లులను ఆమోదింపజేసుకోవాల్సిన అవసరం యూపీఏ సర్కారుకు ఉంది. ఉన్న కొద్ది సమయంలో విభజన బిల్లుపై ఇటు లోక్‌సభ, అటు రాజ్యసభల్లో చర్చ జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో బీజేపీతో పాటు ప్రతిపక్షాల వైఖరి ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. సీమాంధ్ర కేంద్రమంత్రులపై ఒత్తిడి సీమాంధ్రకు చెందిన 14 మంది ఎంపీలు సస్పెన్షన్‌కు గురికావడంతో విభజన బిల్లును అడ్డుకునే బాధ్యత ఆ ప్రాంత సీమాంధ్ర కేంద్ర మంత్రులపై పడింది. కేంద్ర మంత్రులుగా ఉంటూ వెల్‌లోకి వెళ్లి గొడవ చేయటం వారికి ఇబ్బందికరమే. అదే సమయంలో వారిని సస్పెండ్ చేయాలా? వద్దా? అనే విషయమూ స్పీకర్ కు సంకటంగా మారుతుంది. మరోవైపు సస్పెండైన ఎంపీల ందరూ సోమవారం నాటి సమావేశానికి హాజరై బిల్లును అడ్డుకోవాలని యోచిస్తున్నారు. పార్లమెంటులో మార్షల్స్‌ను ఉపయోగించటం ఎంపీలు అవమానకరంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో స్పీకర్ సస్పెండైన ఎంపీలను సభ నుంచి పంపేందుకు ఏం చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సిందే! సభ సాఫీగా సాగేలా చూడండి మంత్రి కమల్‌నాథ్‌కు ప్రధాని సూచన న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును వ్యతిరేకిస్తున్న ఎంపీలను సస్పెండ్ చేసినందువల్ల ఇకమీదటైనా (సోమవారం నుంచి శుక్రవారం దాకా) పార్లమెంట్ సమావేశాలు సాఫీగా సాగేలా చూడాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్‌కు ప్రధాని మన్మోహన్ సూచించారు. తెలంగాణతో సహా కీలక బిల్లులు ఆమోదం పొందాల్సి ఉన్నందున సభకు అంతరాయాలు లేకుండా చూడాలన్నారు. గురువారం లోక్‌సభ వాయిదా అనంతరం మన్మోహన్ సీనియర్ మంత్రులు షిండే, చిదంబరం, మొయిలీ, కమల్‌నాథ్‌లతో లోక్‌సభలో చోటుచేసుకున్న పరిణామాలను సమీక్షించారు. మిగిలిన ఐదు రోజుల్లో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. -
5 నిమిషాల్లో బడ్జెట్ పద్దులకు ఆమోదం
చర్చ లేకుండానే... ముగింపు సాక్షి, హైదరాబాద్: శాసనసభలో ఎలాంటి చర్చ లేకుండానే గందరగోళం మధ్య బడ్జెట్ పద్దులకు బుధవారం ఆమోదముద్ర పడింది. ఉదయం సభ ప్రారంభమైన వెంటనే టీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిలబడి.. ‘ఇదేం సభ.. సీమాంధ్ర సభ’ ‘సీమాంధ్ర సీఎం మాకొద్దు’ ‘జెతైలంగాణ’.. అంటూ నినాదాలు చేశారు. సభ సజావుగా సాగడానికి సహకరించాలని స్పీకర్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవడంతో తొలి 5 నిమిషాల్లోనే వాయిదా పడింది. అంతకుముందు వివిధ పార్టీలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. 11.45 గంటలకు తిరిగి సభ ప్రారంభమైనా పరిస్థితిలో మార్పు రాలేదు. గందరగోళం మధ్యే ఆరు నెలల కాలానికి అవసరమయ్యే రూ.79 వేల కోట్ల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పద్దుకు ఆమోదం తెలిపే తీర్మానాన్ని ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సభలో ప్రవేశపెట్టారు. సాధారణంగా బడ్జెట్ పద్దులపై సుదీర్ఘ చర్చ జరుగుతుంది. ఆర్థిక మంత్రి సమాధానం ఇచ్చిన తర్వాత సభ ఆమోదానికి ప్రవేశపెడతారు. ఈసారి మాత్రం ఎలాంటి చర్చ లేకుండానే తీర్మానాన్ని సభ ఆమోదానికి పెట్టినట్లు స్పీకర్ పేర్కొన్నారు. అనంతరం మూజువాణి ఓటుతో సభ ఆమోదం తెలిపిందని ప్రకటించారు. ఈ వ్యవహారం మొత్తం ఐదు నిమిషాల్లో ముగిసింది. అనంతరం సభను గురువారానికి స్పీకర్ వాయిదా వేశారు. ‘ద్రవ్య బాధ్యత’ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం: వివిధ శాఖలు ఇష్టానుసారం పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేయకుండా నియంత్రించే ‘ద్రవ్య బాధ్యత, బడ్జెట్ నిర్వహణ (సవరణ) బిల్లు’కు శాసనసభ బుధవారం ఆమోదం తెలిపింది. ఫలితంగా.. బడ్జెట్ కేటాయింపులకు 3 రెట్లకు మించకుండా మాత్రమే పనులకు పాలనా అనుమతులు ఇవ్వాలనే నిబంధన అమల్లోకి వచ్చింది. మూడు రెట్లకు మించితే తప్పనిసరిగా శాసనసభ ఆమోదం పొందాల్సి ఉంటుంది. -
మనకు మళ్లీ అరకొరే
రాష్ట్రానికి మొండిచెయ్యి ప్రత్యేకాకర్షణగా 2 డబుల్ డెక్కర్ రైళ్లు ప్రభావం చూపలేకపోయిన కోట్ల సాక్షి, హైదరాబాద్: పేరుకు ప్రకటించింది 16 రైళ్లు. కానీ వాటిల్లో 15 కేవలం రాష్ట్రం మీదుగా ప్రయాణించేవే. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది 7 కాగా వాటిలో రోజూ తిరిగేవి... రెండంటే రెండే! చూస్తుంటే ‘పంచ పాండవులు మంచంకోళ్లు’ సామెత గుర్తొస్తోంది కదూ! మధ్యంతర రైల్వే బడ్జెట్లో మనకు జరిపిన కేటాయింపుల పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉంది. సంఖ్యాపరంగా గొప్పగా కనిపిస్తున్నా ప్రయోజనం అంతంతమాత్రమే. కొత్తగా కొన్ని రైళ్లను ప్రకటించటం మినహా ప్రాజెక్టులపరంగా రాష్ట్రానికి రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే నయా పైసా విదల్చలేదు. ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ కాబట్టి పెద్దగా ప్రాజెక్టుల ప్రకటన ఉండదని ముందే ఊహించినా కనీసం ఒకట్రెండు అంశాలనైనా ప్రస్తావిస్తారని అంతా ఊహించారు. కానీ నిరాశే మిగిలింది. గత రైల్వే బడ్జెట్లో కర్నూలు ప్రకటించిన కోచ్ మిడ్ లైఫ్ రిహాబిలిటేషన్ యూనిట్‌కైనా ఈసారి నిధులు కేటాయిస్తారని భావించారు. పైగా అది రైల్వే సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశరెడ్డి ఇలాకా గనుక నిధుల కేటాయింపు తథ్యమనుకున్నారు. కానీ ఖర్గే మాత్రం కరుణించలేదు. ఇక కొత్త మార్గాలు, డబ్లింగ్, ట్రిప్లింగ్, సర్వేల ఊసే ఎత్తలేదు. గత బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాజెక్టులు దక్కేలా చూడటంలో పూర్తిగా విఫలమైన కోట్ల ఈసారైతే అసలే ప్రభావం చూపలేకపోయారు. కర్నూలు మీదుగా ఒక డబుల్ డెక్కర్ రైలు వేయించుకోవటం మినహా కనీసం తన ప్రాంతానికి కూడా ఏమీ చేయలేకపోయారు. కాజీపేట వ్యాగన్ యూనిట్, హైదరాబాద్‌లో రెండో దశ ఎంఎంటీఎస్ విస్తరణ, సికింద్రాబాద్‌లో రైల్ నీర్ బాట్లింగ్ యూనిట్, సికింద్రాబాద్‌లో రైల్వే అధికారులకు ప్రత్యేక శిక్షణ, అధ్యయన కేంద్రం, నగరంలో రైల్వే వైద్య కళాశాల, నర్సింగ్ కేంద్రం తదితర పెండింగ్ ప్రాజెక్టుల ఊసే లేకుండా పోయింది. ప్రత్యేక ఆకర్షణగా డబుల్ డెక్కర్ రైళ్లు... ప్రత్యేక ఆకర్షణగా భావించే డబుల్ డెక్కర్ రైళ్లను రాష్ట్రానికి కేటాయించటం ఒక్కటే కాస్త ఊరట. వాస్తవానికి గత అక్టోబరులోనే హైదరాబాద్-తిరుపతి మధ్య డబుల్ డెక్కర్ రైలు ప్రారంభం కావాల్సింది. కానీ చివరి నిమిషంలో దాన్ని మధ్యప్రదేశ్‌కు కేటాయించారు. ఈసారి దక్షిణ మధ్య రైల్వే అధికారులు బోర్డుపై తీవ్ర ఒత్తిడి తేవడంతో తాజా బడ్జెట్లో ఆ రైలుతో పాటు సికింద్రాబాద్-గుంటూరు మధ్య మరో డబుల్ డెక్కర్‌ను కూడా మంజూరు చేయటం విశేషం. అయితే ఈ రెండూ వారానికి రెండు రోజులే తిరుగుతాయి. అయితే వీటి విషయంలో ప్రత్యేకంగా ఏసీ అని పేర్కొన లేదు. దాంతో సాధారణ డబుల్ డెక్కర్లయి ఉంటాయనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. రోజూ నడిచే రైళ్లు రెండే... తాజా బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించి 15 కొత్త రైళ్లను ప్రకటించినా అందులో సికింద్రాబాద్-గుల్బర్గా ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్టణం-గుణపురం రైళ్లు మాత్రమే రోజూ నడిచేవి. రెండు డబుల్డెక్కర్లు సహా మూడు రైళ్లు వారానికి రెండు రోజులు చొప్పున, మిగతావి వారానికి ఒకరోజు చొప్పున తిరిగేవే కావటం విశేషం. వాస్తవం ఇలా ఉంటే, మొత్తం కొత్త రైళ్ల కేటాయింపుల్లో దక్షిణ మధ్య రైల్వేకు ఏకంగా 28 శాతం వాటా దక్కిందంటూ అధికారులు గొప్పలు పోవడం కొసమెరుపు! ప్రత్యేకంగా రాష్ట్రానికి కేటాయించిన ఎక్స్‌ప్రెస్ రైళ్లు - ఔరంగాబాద్-రేణిగుంట (వారానికో రోజు) - హైదరాబాద్-గుల్బర్గా ఇంటర్సిటీ (ప్రతి రోజూ) - కాచిగూడ-నాగర్‌కోయిల్ ఎక్స్‌ప్రెస్ -వయా కరూర్, నమక్కల్,సేలం (వారానికో రోజు) - సికింద్రాబాద్-విశాఖపట్టణం ఏసీ ఎక్స్‌ప్రెస్- వయా కాజీపేట్, విజయవాడ (వారానికొకరోజు) డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. - కాచిగూడ-తిరుపతి ఎక్స్‌ప్రెస్ (వారానికి రెండు రోజులు) - కాచిగూడ-గుంటూరు ఎక్స్‌ప్రెస్ (వారానికి రెండు రోజులు) ప్యాసింజర్ రైళ్లు.. - విశాఖపట్టణం - గుణపురం (ఒరిస్సా) (ప్రతిరోజూ) రాష్ట్రం మీదుగా ప్రయాణించే ప్రీమియం ఎక్స్‌ప్రెస్ రైళ్లు - పాట్నా-బెంగళూరు ఎక్స్‌ప్రెస్- వయా విజయవాడ, వరంగల్, రామగుండం (వారానికో రోజు) - యశ్వంత్‌పూర్-కాట్రా ఎక్స్‌ప్రెస్ -వయా కాచిగూడ, గుల్బర్గా, నాగ్‌పూర్ (వారానికోరోజు) - యశ్వంత్‌పూర్-జైపూర్ ఏసీ ఎక్స్‌ప్రెస్ - వయా గుంతకల్, గుల్బర్గా (వారానికోరోజు) - కామాఖ్య-చెన్నై ఏసీ ఎక్స్‌ప్రెస్ -వయా విశాఖపట్టణం, హౌరా (వారానికోరోజు) రాష్ట్రం మీదుగా ఎక్స్‌ప్రెస్ రైళ్లు 1. హౌరా-యశ్వంత్‌పూర్ ఏసీ ఎక్స్‌ప్రెస్ వయా విశాఖపట్టణం, గూడూరు, కట్పాడి (వారానికో రోజు) 2. వారణాసి-మైసూరు ఎక్స్‌ప్రెస్ -వయా గుంతకల్, దౌండ్ (వారానికి రెండు రోజులు) 3. ముంబై-చెన్నై ఎక్స్‌ప్రెస్ -వయా గుంతకల్, వాడి (వారానికో రోజు) 4.మన్నార్గుడి-జోధ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ -వయా విజయవాడ (వారానికో రోజు) ఫ్రీక్వెన్సీ పెరిగిన రైళ్లు (ఇవన్నీ ఇప్పటిదాకా వారానికి మూడు రోజులు నడుస్తుండగా, ఇకపై రోజూ తిరుగుతాయి) 1.బీదర్-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (16571/16572) 2.విజయవాడ-హుబ్లీ ఎక్స్‌ప్రెస్ (17225/17226) 3.సికింద్రాబాద్-హుబ్లీ ఎక్స్‌ప్రెస్ ((17319/17320) ఇవి దక్షిణ మధ్య రైల్వే పరిధిలోవే గానీ రాష్ట్రానికి ప్రయోజనం శూన్యం - నాందేడ్ - ఔరంగాబాద్ ఎక్స్‌ప్రెస్ (వారానికోరోజు) వయా-పూర్ణ, పర్బణి. (దక్షిణ మధ్య రైల్వేకు మంజూరైన ఈ రైలు రాష్ట్రం మీదుగా వెళ్లదు) - లాతూరు రోడ్డు - కుర్దువాడి, పర్బణి - పర్లి మధ్య డబ్లింగ్ లైన్ నిర్మాణానికి సర్వే పనులు మంజూరయ్యాయి. ఈ రెండు కూడా రాష్ట్రం వెలుపల ఉన్నవే. వైష్ణోదేవి ప్రయాణికులకు రైలు వైష్ణోదేవి ఆలయ బేస్ క్యాంప్ అయిన కాత్రా వెళ్లేందుకు కాశ్మీర్ రైల్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ఉధంపూర్-కాట్రా రైలు మార్గ నిర్మాణం పూర్తయిందని, యాత్రికుల కోసం అతి త్వరలోనే ప్యాసింజర్ రైళ్లను ప్రారంభమవుతాయని ఖర్గే తెలిపారు. ఈ మార్గంలో రైళ్లను ప్రయోగాత్మకంగా నడుపుతున్నామని, ఇది అందుబాటులోకి వస్తే లక్షలాది యాత్రికులకు ప్రయోజనముంటుందని అన్నారు. పార్సిల్ రైళ్లలో పాల రవాణా పార్సిల్ రవాణా అవకాశాలను అందిపుచ్చుకోవడానికి దేశవ్యాప్తంగా ప్రత్యేక పార్సిల్ రైళ్లలో పాల రవాణా చేపట్టనున్నట్లు ఖర్గే వెల్లడించారు. పాల రవాణాను ప్రోత్సహించడం, పార్సిల్ రవాణాను పెంచడానికి కొత్త విధానాన్ని రూపొందించనున్నట్లు తెలిపారు. రైల్వే టారిఫ్ అథారిటీ ఏర్పాటు రైల్వే ప్రయాణ, రవాణా చార్జీలను సహేతుకంగా నిర్ణయించడంలో ప్రభుత్వానికి సలహా ఇచ్చేందుకు స్వతంత్రప్రతిపత్తి గల రైల్వే టారిఫ్ అథారిటీ(ఆర్టీఏ)ను ఏర్పాటు చేస్తున్నట్లు ఖర్గే తెలిపారు. చార్జీల నిర్ణయంలో పారదర్శకతకు ఇది దోహదపడుతుందన్నారు. ఆర్టీఏ ఏర్పాటు విప్లవాత్మకమని, చార్జీల ఖరారు ఇక చాటుమాటు వ్యవహారం కాబోదని అన్నారు. అగ్ని, పొగ గుర్తింపు వ్యవస్థ అగ్ని, పొగను పసిగట్టే సమగ్ర విధానాన్ని రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నామని, పరీక్షలు విజయవంతమైతే త్వరలో అన్ని పెద్ద రైళ్లలో ఈ విధానాన్ని ప్రవేశపెడతామని ఖర్గే చెప్పారు. రైళ్లు ఢీకొనకుండా నివారించేందుకు దేశీయంగా అభివృద్ధిపరచిన పరికరాన్ని కూడా అమర్చుతామన్నారు. అగ్ని నిరోధక పరికరాలు, ఎలక్ట్రిక్ సర్క్యూట్ల భద్రతకు బహుళ అంచెల రక్షణ అమలు వంటి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైల్వే క్రాసింగ్‌ల వద్ద రైళ్ల రాక గురించి దృశ్య-శ్రవణ రూపంలో హెచ్చరికలు జారీ చేసే వ్యవస్థను ప్రవేశపెట్టాలనుకుంటున్నట్లు తెలిపారు. కాపలా లేని క్రాసింగ్‌ల తొలగింపు ప్రమాదాల నివారణకు నిర్దిష్ట కాలపరిమితిలోగా కాపలా లేని అన్ని క్రాసింగ్లను తొలగించనున్నట్లు ఖర్గే తెలిపారు. క్రాసింగ్‌ల తొలగింపు, లేదా వాటి వద్ద కాపలా ఉంచడం, రద్దీ మార్గాల్లోని కాపలా క్రాసింగ్లను ఓవర్, అండర్బ్రిడ్జిలుగా మార్చడం రైల్వే లక్ష్యమన్నారు. దేశంలో మొత్తం 18,672 క్రాసింగ్‌లు ఉన్నాయని, వీటిలో 12,582 కాపలా లేనివని తెలిపారు. గత ఐదేళ్లలో 5,400 కాపలా లేని క్రాసింగ్లను తొలగించామన్నారు. తప్పుడు హామీలు: మమత కోల్‌కతా: ఓటాన్ అకౌంట్‌గా ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ ఇంటికి వెళ్లిపోతున్న ప్రభుత్వ తప్పుడు హామీ అని రైల్వే మాజీ మంత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. వచ్చే నాలుగు నెలల కోసం ఖర్చులకు పార్లమెంటు అనుమతి తీసుకోవడానికి పెట్టే బడ్జెట్లో హామీలివ్వడం రాజ్యాంగ విరుద్ధం, అనైతికమని ఫేస్బుక్లో విమర్శించారు. ప్రయోజనం లేదు: దత్తాత్రేయ సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే బడ్జెట్‌కు రంగు, రుచి, వాసన లేదని, ప్రజలకు ప్రయోజనం లేదని బీజేపీ నేత బండారు దత్తాత్రేయ పెదవి విరిచారు. ఎన్నికలే లక్ష్యంగా ప్రయాణికుల సౌకర్యాలను పట్టించుకోకుండా బడ్జెట్‌ను రూపొందించారని, ఆంధ్రప్రదేశ్‌కి మరోసారి మొండి చెయ్యి చూపారని విమర్శించారు. భారతీయ రైల్వే విశేషాలు... - {పపంచంలోని అతి పెద్ద రైల్వే నెట్వర్కుల్లో ఒకటి - రోజూ 2.3 కోట్ల మంది ప్రయాణికులను గమ్యాలకు చేరవేస్తోంది. 26.5 లక్షల టన్నుల సరుకులను రవాణా చేస్తోంది - రోజూ 12 వేల ప్యాసింజర్ రైళ్లు, 7,000 గూడ్స్ రైళ్లు నడుపుతోంది. రైల్వేలో 1.4 లక్షల మంది ఉద్యోగులున్నారు -
నేడే రైల్వే బడ్జెట్: ఖర్గే
ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న ఖర్గే న్యూఢిల్లీ: రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే బుధవారం పార్లమెంటులో తన మొట్టమొదటి రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రైల్వే చార్జీల భారం పెద్దగా మోపకపోవచ్చని భావిస్తున్నారు. ఎన్నికల సంవత్సరం కావడంతో లోటు బడ్జెట్‌లా కాకుండా, దీన్ని అభివృద్ధి దాయక బడ్జెట్‌లా రూపొందించారని రైల్వే శాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే, 2013 ఏప్రిల్, డిసెంబర్ నెలల మధ్య ప్రయాణికులు, సరుకుల రవాణా ఆదాయం భారీగా తగ్గినందువల్ల ప్రయాణికుల చార్జీల తగ్గింపు ఉండకపోవచ్చని తెలిపాయి. గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ప్రయాణ చార్జీల ఆదాయంలో రూ. 4 వేల కోట్లు, సరకుల రవాణా ఆదాయంలో రూ. 850 కోట్ల తగ్గుదల కనిపించింది. రైల్వే వర్గాలు తెలిపిన ఇతర వివరాలు.. ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రజాకర్షక ప్రకటనలు ఉండకపోవచ్చు. మరిన్ని రైళ్లు, రైల్వే లైన్లు, ప్రయాణికుల సౌకర్యాలను ప్రకటించవచ్చు. {పయాణికుల భద్రతకు సంబంధించిన పలు చర్యలను ప్రకటించవచ్చు. ఎంపీల డిమాండ్ మేరకు పలు లైన్ల పొడిగింపు, కొత్త లైన్ల కొరకు సర్వే తదితర ప్రకటనలు ఉండొచ్చు. మరో 1500 కిమీల రైల్వేలైన్ విద్యుదీకరణకు నిర్ణయం తీసుకోవచ్చు. మొత్తం 65 వేల కి.మీ.ల రైల్వేలైన్‌లో ఇప్పటివరకు కేవలం 24 వేల కి.మీ.ల లైన్‌ను మాత్రమే విద్యుదీకరించారు. రద్దీ అధికంగా ఉండే మార్గాల్లోని 20 ప్రధాన రైళ్లలో డిమాండ్ ఆధారిత చార్జీల విధానం అమలు చేసి.. ఆదాయ లోటును తగ్గించుకునే దిశగా ఒక ప్రకటన ఉండొచ్చని భావిస్తున్నారు. 2009 ఎన్నికల సంవత్సరం నాటి బడ్జెట్లో అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రయాణికుల చార్జీలను 2 శాతం తగ్గించారు. అయితే, ఈ సారి ఆశించిన ఆదాయం లేకపోవడంతో తగ్గుదల నిర్ణయం ఉండకపోవచ్చు. {పయాణికులపై భారం తగ్గించే దిశలో ఇంధన సర్దుబాటు చార్జీలో మార్పులు చేయొచ్చు. పలు రైళ్లలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదాలను కూడా రైల్వేమంత్రి తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ.. ముఖ్యమైన రైళ్లలో అగ్నిప్రమాదాల నిరోధానికి చేపట్టిన చర్యలను వివరించే అవకాశముంది. అన్ని స్టేషన్లలో ఆధునీకరించిన రైల్వే సమాచార వ్యవస్థ ఏర్పాటు, ప్రధానస్టేషన్లలో ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్ల ఏర్పాటుపై ప్రకటన చేయొచ్చు. సంస్కరణలు కోరుకునే మంత్రిగా పేరున్న ఖర్గే.. రైల్వే ఆదాయాన్ని పెంచే దిశగా ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇంధన సర్దుబాటు చార్జీలు, దురంతో ట్రైన్ల చార్జీల్లో పెంపు మొదలైనవి అందులో ఉన్నాయి. అలాగే, ఢిల్లీ- ముంబై మార్గంలో ప్రత్యేక రైళ్లలో డిమాండ్ ఆధారిత చార్జీల విధానం అమలు చేయడం వల్ల దాదాపు 35 శాతం అధిక ఆదాయం లభించింది. తప్పుడు నిర్ణయాలతో రైల్వేకు రూ. 2,486 కోట్ల నష్టం: కాగ్ న్యూఢిల్లీ: సరుకుల రవాణాలో ద్వంద్వ చార్జీల విధానానికి సంబంధించి అవకతవక నిర్ణయాల వల్ల రైల్వేశాఖకు 2008-12 మధ్యకాలంలో రూ. 2486.68 కోట్ల నష్టం వాటిల్లిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) వెల్లడించింది. ముడి ఇనుము ఖనిజ రవాణాకు తగ్గింపు చార్జీలను వర్తింపజేయడం వల్ల ఈ నష్టం జరిగినట్లు పేర్కొం ది. కాగ్ పేర్కొన్న వివరాలు.. 2008 మేలో రైల్వే శాఖలో ద్వంద్వ చార్జీల విధానాన్ని ప్రారంభిం చారు. దీనివల్ల ముడి ఇనుము ఖనిజం ఎగుమతి రవాణా చార్జీలు.. దేశీయ అవసరాల కోసం జరిపే రవాణా చార్జీల కన్నా 3 రెట్లు ఎక్కువ. దేశీయ రేట్ల వర్తింపునకు అర్హత కల్పించే ఎలాంటి పత్రాలను సమర్పించకపోయినా.. 358 సంస్థలకు దేశీయ రేట్లను వర్తింపజేశారు. వాటిలో 153 సంస్థలు అసలే పత్రాలను అందించలేదు. వీటికి తగ్గింపు చార్జీలను వర్తింపజేయడం వల్ల 2008-12 మధ్య రూ.258.38 కోట్లను రైల్వేశాఖ నష్టపోయింది. 205 సంస్థలు కొన్ని డాక్యుమెంట్లను అందించాయి. వీటికి దేశీయ రేట్లను అంగీకరించడంతో రూ.2,228.30 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ ఏడాది ‘ప్లాన్ హాలిడే’: దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాత్సవ గుంతకల్లు, న్యూస్‌లైన్: రైల్వే బడ్జెట్‌కోసం ఆర్థిక అంశాలతో ముడిపడిన ఏ కొత్త ప్రతిపాదనను పంపలేదని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పీకే శ్రీవాత్సవ తెలిపారు. ఆయన మంగళవారం రాత్రి గుంతకల్లులో విలేకరులతో మాట్లాడారు. 15 రోజులక్రితం న్యూఢిల్లీలోని రైల్వే బోర్డు కార్యాలయంలో జనరల్ మేనేజర్ల సమావేశంలో గత ప్రతిపాదనలపై లోతుగా చర్చించినట్లు తెలిపారు. ఇప్పటికే నడుస్తున్న ప్రాజెక్టులకు ప్రాధాన్యతివ్వాలని ఆ భేటీలో నిర్ణయించినట్లు చెప్పారు. కొత్త ప్రాజెక్టులను ప్రతిపాదిస్తే భారీగా నిధులు అవసరమవుతాయని, అందువల్ల ఆ ప్రయత్నాన్ని ఈ ఏడాది విరమించామని చెప్పారు. ఈ ఏడాది రైల్వేలో పరోక్షంగా ‘ప్లాన్ హాలిడే’ ప్రకటించినట్లు తెలిపారు. కర్నూలు జిల్లాలో కోచ్ రీహాబిలిటేషన్ ఫ్యాక్టరీకి అవసరమైన రూ.250 కోట్లను ఈ బడ్జెట్లో కేటాయించే అవకాశముం దన్నారు. డీజిల్ ధరలు బాగా పెరిగిపోవడంతో రైల్వేపై భారం పడుతోందని, దీంతో విద్యుదీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. -
కూత పెట్టేనా?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తాజాగా ప్రకటించే రైల్వే బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహానగరంలో కీలక భాగమైన జిల్లాకు ప్రత్యేక రైళ్లు వస్తాయనే ఆశలు జిల్లావాసుల్లో చిగురిస్తున్నాయి. అదేవిధంగా సర్వే పనులు పూర్తయిన వికారాబాద్- కృష్ణా(121.7 కిలోమీటర్లు) బ్రాడ్‌గేజి రైలుమార్గం పనులు, ఎంఎంటీఎస్ విస్తరణ పనులకు మోక్షం వస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. మరికొన్ని గంటల్లో పార్లమెంట్లో రైల్వేబడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ఆ శాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. తాజా బడ్జెట్‌పై జిల్లా వాసులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఇప్పటికే పలు ప్రతిపాదనలు రైల్వే శాఖ వద్ద ఉండగా.. కొత్త డిమాండ్లు సైతం ప్రజాప్రతినిధులు లేవనెత్తారు. ఈ నేపథ్యంలో తాజా బడ్జెట్లో ఏయే ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుందో వేచిచూడాలి. ప్రతిపాదనలివే.. వికారాబాద్-కృష్ణా మధ్య కొత్తగా బ్రాడ్‌గేజ్ రైలుమార్గాన్ని నిర్మించాలన్న ప్రతిపాదనలపై యంత్రాంగం సర్వే పూర్తిచేసింది. ఈ రైలు మార్గం నిర్మించాలంటే రూ.787.80 కోట్లు అవసరమని తేల్చిన రైల్వేశాఖ.. సరుకు రవాణాకు ఈ లైన్ అంతగా ఉపయోగపడదని స్పష్టం చేసింది. ప్రయాణికుల నిష్పత్తి కూడా అంతంతమాత్రంగా ఉంటుందనే అభిప్రాయానికి వచ్చింది. ప్రాజెక్టు వ్యయంలో సగం రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు ముందుకొచ్చినప్పటికీ కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రైలు మార్గాన్ని అనుసంధానం చేయాలని గతంలో నిర్ణయించినా.. ఇప్పటికీ మోక్షం లేదు. ఎయిర్‌కార్గో హబ్‌గా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేస్తున్నారు. ఈ క్రమంలో సరుకు రవాణాకు అనువుగా రైల్వేలైన్లను విస్తరించాలని భావించినా.. రైల్వేశాఖ వద్ద ఫైళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా విజయవాడకు ప్రత్యేక రైల్వేలైన్‌ను నిర్మించాలని జీఎంఆర్ సంస్థ ప్రతిపాదించినా.. కేంద్రం నుంచి స్పందన లేదు. 2006లో ప్రతిపాదించిన మల్టీమోడల్ ట్రాన్సిట్‌సిస్టమ్ (ఎంఎంటీఎస్) రెండోదశ విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. వీటికి ప్రత్యేక నిధులు కేటాయించాల్సి ఉంది. ఫల క్‌నుమా- ఉమ్దానగర్ వరకు ఉన్న రైలు మార్గాన్ని శంషాబాద్ వరకు విస్తరించాలని నిర్ణయించారు. ఫలక్‌నుమా- ఉమ్దానగర్ -శంషాబాద్ (20కి.మీ) వరకు కొత్త లైన్ వేయడమేగాకుండా, ప్రస్తుత మార్గాన్ని డబ్లింగ్, విద్యుద్ధీకరణ చేయాలని నిర్ణయించినప్పటికీ ఎలాంటి పురోగతి లేదు. సికింద్రాబాద్- బొల్లారం -మేడ్చల్ (28కి.మీ), మౌలాలి -ఘట్కేసర్ (12.2 కి.మీ.)వరకు పొడగించాలని ప్రతిపాదించిన ఎంఎంటీఎస్‌కు ఇంకా ప్రతిబంధకాలు తొలగిపోలేదు. ఆదర్శ స్టేషన్ల నిర్మాణంలోనూ రైల్వేశాఖ అంతులేని జాప్యం చేస్తోంది. అరకొర నిధుల కేటాయింపులతో నిర్మాణ పనులను ఏళ్ల తరబడి సాగదీస్తోంది. 2011-12లో ప్రకటించిన పనులు కూడా ఇప్పటివరకు పూర్తికాలేదు. వికారాబాద్, శంకర్పల్లి, మల్కాజిగిరి, శేరిలింగంపల్లి ఆదర్శ స్టేషన్లు అధికారుల నిర్లక్ష్యానికి అద్దంలా నిలుస్తున్నాయి. కొన్నింటికి ఇప్పటివరకు పునాది రాయే పడలేదు. వికారాబాద్, తాండూరును కలుపుతూ పొరుగు రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లు వేసేందుకు కేంద్రం సానుకూలంగా ఉంది. తాజా బడ్జెట్లో వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి. -
ఆనం గారడీ
జలయజ్ఞానికి నామమాత్రపు నిధులు సోమశిల, పెన్నా, సంగం బ్యారేజీల నిర్మాణం కష్టమే సాక్షి, నెల్లూరు: ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి నాల్గోసారి ప్రవేశ పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంకెల గారడీ అనే విమర్శలు వెల్లువెత్తాయి. పాత లెక్కలు మార్చి మసిపూసి మారేడుకాయ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్థికమంత్రి జిల్లా వాసైనప్పటికీ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు పలు ప్రధాన అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు నామమాత్రమే. పురోగతిలేని జలయజ్ఞం నిర్మాణ పనులే ఇందుకు ఉదాహరణ. ప్రధానంగా వైఎస్సార్ హయాంలో జిల్లాలో జలయజ్ఞం పనులు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా పెన్నా, సంగం బ్యారేజీ పనులు ప్రారంభమై ఐదేళ్లు గడిచాయి. ఇప్పటికీ ఆ పనులు పూర్తి అయ్యే పరిస్థితి లేదు. సంగం బ్యారేజీ పనులు 30 శాతం, పెన్నా బ్యారేజీ పనులు 70 శాతానికి మించి పూర్తి కాలేదు. ఇవి ఎప్పటికి పూర్తి అవుతాయో తెలియని అయోమయ పరిస్థితి. తాజాగా మెట్ట ప్రాంతాల అభివృద్ధి పేరుతో సోమశిల హైలెవల్ కెనాల్‌కు రూప కల్పన చేశారు. దాదాపు రూ.1400 కోట్ల మేర అంచనాలతో ఇటీవలే పనులకు టెండర్లు పిలిచారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి, ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కలిసి ఈ ప్రాజెక్టుకు ఆర్భాటంగా శంకుస్థాపన చేశారు. కాని నిధుల కేటాయించిన పాపాన పోలేదు. ఈ ఏడాది కొత్త బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధుల కేటాయించి అన్ని జలయజ్ఞం పనులు పూర్తి చేస్తామని ఆనం ప్రకటించారు. ఆర్థిక మంత్రి హోదాలో నాల్గోసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆనం జలయజ్ఞం పనులకు నామమాత్రంగానే నిధులు కేటాయించడం విమర్శలకు తావిస్తోంది. సోమశిల ప్రాజెక్టుకు కేవలం రూ.400 కోట్లు మాత్రమే కేటాయించినట్టు చూపారు. పెన్నా రివర్ కెనాల్ అభివృద్ధి పనులకు నామమాత్రంగా రూ. 150 కోట్లు, తెలుగు గంగ ప్రాజెక్టుకు రూ.154 కోట్లు మాత్రమే కేటాయిస్తున్నట్టు లెక్కలు చూపారు. ఈ లెక్కన జిల్లాలో మరో ఐదేళ్లకు కూడా జలయజ్ఞం పనులు కూడా పూర్తి అయ్యే పరిస్థితి కానరావడం లేదు. జిల్లాలో వేల కోట్ల జలయజ్ఞం పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. కేవలం నెల్లూరు నగరంతో పాటు మంత్రి సొంత నియోజక వర్గం ఆత్మకూరులో మాత్రమే వందల కోట్లు వెచ్చించి రోడ్లు నిర్మిస్తున్నారే తప్ప జిల్లా వ్యాప్తంగా ఉన్న రోడ్ల సంగతి మాత్రం ఆనం సోదరులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. తాజా బడ్జెట్లో రోడ్ల అభివృద్ధికి నిధుల కేటాయింపు నామమాత్రంగానే ఉండటం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో తాగునీటి సమస్య అధికంగా ఉంది. రానున్నది వేసవిలో ఈ సమస్య మరింత తీవ్రం కానుంది. ఇప్పటికే వెంకటగిరి, గూడూరు, ఆత్మకూరు మున్సిపాలిటీలతో పాటు ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉంది. నెల్లూరు నగరంలో కూడా నీటి సమ్య తప్పడం లేదు. వేసవిని దృష్టిలో పెట్టుకుని శాశ్వత తాగునీటి పథకాలకు మరిన్ని నిధులు కేటాయిస్తారనుకుంటే ఈ బడ్జెట్లో కూడా నామమాత్రంగా కూడా నిధుల కేటాయించలేదు. నెల్లూరు నగరంలో భూగర్భ డ్రైనేజీ సమస్య ఇప్పట్లో పరిష్కారమయ్యేలా కనిపించడం లేదు. గతంలో రూ.440 కోట్లతో భూగర్భ డ్రైనేజీ పనులు చేపట్టనున్నట్టు ప్రభుత్వం ప్రకటించినా పనులు ప్రారంభం కాలేదు. సీఎం కిరణ్ గతంలో నెల్లూరు పర్యటన సందర్భంగా రూ.600 కోట్లతో భూగర్భ డ్రైనేజీ పూర్తి చేయనున్నట్టు ప్రకటించారు. ఇంత వరకూ అతీగతీ లేదు. తాజాగా రూ.770 కోట్లతో ప్రతి పాదనలు సిద్ధం చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ బడ్జెట్లో కూడా ఈ పథకానికి నామమాత్రంగా కూడా నిధుల కేటాయించలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే సవాలక్ష సమస్యలు న్నాయి. ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కూడా నిధుల కేటాయింపులు లేకపోవడంతో ఈ పనులు పూర్తికావడం ప్రశ్నార్థకమైంది. ఏళ్ల కొద్ది పెండిగ్లో ఉన్న జలయజ్ఞం పనులు, మెడికల్ కాలేజీ, దుగరాజపట్నం ఓడరేవు తదితర వాటి గురించి పదే పదే ప్రచారం చేసుకోవడం తప్ప పూర్తి అయ్యేలా బడ్జెట్లో కేటాయింపులు చేయక పోవడం ఆనం మార్కు బడ్జెట్‌ను తేట తెల్లం చేసింది. మోసపూరిత బడ్జెట్ ఇది పూర్తిగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. కార్మిక, కర్షక, రైతు వ్యతిరేక బడ్జెట్. గత ఏడాది రూ.1.61లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ దఫా అంకెలను మార్చి గొప్ప కోసం రూ.1.82 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. కేటాయింపులే తప్ప ఖర్చు చేయడం లేదు. గత ఏడాది ఎస్సీ సబ్‌ప్లాన్ కింద రూ.8,600 కోట్లను కేటాయించారు. ఇప్పటికి రూ.2,600 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అలాగే ఎస్టీలకు రూ.3,600 కేటాయించి కేవలం రూ.882 కోట్లు ఖర్చు చేశారు. వ్యవసాయానికి బడ్జెట్ కేటాయింపులే జరగలేదు. అందుకే ఇది మోసపూరిత బడ్జెట్. -చండ్ర రాజగోపాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రజలకు పనికిరాని బడ్జెట్ ప్రభుత్వం పేరుకు మాత్రమే లక్షా ఎనభైవేల కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో సగం ఉద్యోగుల జీత భత్యాలకే పోతుంది. ఎనిమిది వందల కోట్లను ఎన్నికల కోసం కేటాయించారు. కేవలం ప్రచారానికి పనికి వచ్చేలా ఉంది. ప్రజలను మభ్యపెడుతూ ‘ఐ’వాష్ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం రూపొం దించింది. ఈ బడ్జెట్‌తో రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదు. ప్రాజెక్టులకు నిర్ధిష్టమైన నిధుల కేటాయింపులు జరగలేదు. తాగు, సాగు నీరు, ఉద్యోగకల్పనలకు చోటు దక్కక పోవడం శోచనీయం. -వి.రామరాజు, సీపీఐ జిల్లా కార్యదర్శి -
నిధులు పారలె
నీటిపారుదల ప్రాజెక్టులకు పాత బడ్జెటే జలయజ్ఞంపై చిన్నచూపు ఖర్చుల్లో జీతభత్యాలదే సింహభాగం వివరాల్లేని చిన్న నీటిపారుదల బడ్జెట్ సాక్షి ప్రతినిధి, నల్లగొండ సార్వత్రిక ఎన్నికలు ముంగిట్లో నిలిచిన దశలో.. సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ జిల్లాకు మోసుకొచ్చిన వరాలేమీ లేవు. ఒకవిధంగా ఇది ఎన్నికల బడ్జెట్ అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అయ్యింది. ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కావడం, ఎన్నికల తర్వాత కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెడుతుంది కాబట్టి కేటాయింపుల విషయంలో పెద్దగా కసరత్తు చేసిన దాఖలాల్లేవన్న అభిప్రాయమూ వ్యక్తమయ్యింది. ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి శాసనసభలో సోమవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ (2014-15)లో జిల్లాకు జరిగిన కేటాయింపులు నివ్వెర పరిచేలా ఉన్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మాత్రమే గత బడ్జెట్ కంటే కొంత మెరుగైన కేటాయింపులు జరిగాయి. సాగునీటి ప్రాజెక్టుల కేటాయింపులను పరిశీలిస్తే ఏమాత్రం మార్పుల్లేకుండా బడ్జెట్ విదిల్చినట్లు కనిపిస్తుంది. నాగార్జునసాగర్, ఎస్ఎల్బీసీ, ఎస్సారెస్పీ-2, తదితర ప్రాజెక్టులకు కేటాయించిన బడ్జెట్ నామమాత్రంగానే ఉంది. పులించింతల ప్రాజెక్టు కేటాయింపుల్లోనూ మార్పులేదు. మధ్యతరహా, చిన్న నీటి ప్రాజెక్టులకు కేటాయింపులపై స్పష్టత లేని కారణంగా, ఆ రెండు రంగాలకు పెద్దగా ఒరిగేదేమీ లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నాగార్జునసాగర్‌కు రూ.43కోట్లు అధికం నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించలేదు. గత బడ్జెట్లో రూ.700 కోట్లివ్వగా, ఈ బడ్జెట్లో కొద్దిగా పెంచుతూ రూ.743కోట్లు కేటాయించింది. సాగర్ ఆధునికీకరణ పనుల కోసం రూ.4,444 కోట్ల అంచనా వ్యయంతో పనులు ఎప్పుడో మొదలయ్యాయి. ప్రపంచబ్యాంకు, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో చేపడుతున్న పనులు కొనసాగుతున్నాయి. కానీ, ఆధునికీకరణ పనులు మొదలైనప్పటి నుంచి అరకొరగా బడ్జెట్ కేటాయిస్తుండడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇక ప్రాజెక్టు నిర్వహణ, ప్రపంచ బ్యాంకు పనులు మొదలుపెట్టక ముందు ప్రారంభించిన పనులు, సిబ్బంది జీతభత్యాలు, కరెంటు చార్జీలు ఇతరత్రా ఖర్చుల కోసం సాగర్ సీఈ పరిధిలో ఈ సారి కేటాయింపులను ప్రకటించలేదు. ఎస్సారెస్పీ -2 తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలకు సాగునీరు అందించాల్సిన శ్రీరాంసాగర్ (ఎస్ఆర్ఎస్పీ) రెండోదశకు బడ్జెట్ కేటాయింపులు నిరాశాజనకంగానే ఉన్నాయి. గత ఏడాది బడ్జెట్లో రూ.40కోట్లు మాత్రమే ఇవ్వగా, ఈ సారి బడ్జెట్లోనూ రూ.40కోట్లే కేటాయించింది. రెండోదశ పనులు పూర్తయితే, నాలుగు నియోజకవర్గాల్లో 2.21లక్షల పైచిలుకు ఎకరాలకు సాగునీరు అందుతుంది. రూ. 1,043కోట్ల పైచిలుకు అంచనా వ్య యంతో మొదలు పెట్టిన ఈ పనులను సకాలంలో పూర్తిచేయడానికి అవసరమైనం తగా నిధుల కేటాయింపు మాత్రం ఉండడం లేదు. కేటాయింపుల ఊసే లేని చిన్న నీటి పారుదల రంగం మీడియం ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్‌కు చేసిన కేటాయింపులపై స్పష్టత లేదు. జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టులైన డిండి, మూసీ ప్రాజెక్టులకు ఎంత కేటాయించారన్న ప్రకటన లేదు. చిన్ననీటి పారుదల విభాగంలోని పిలాయిపల్లి కాల్వ, కోటప్పమత్తడి, బునాదిగాని కాల్వ, శేషులేటి వాగు, వేమూలూరు ప్రాజెక్టు, భీమలింగం, ఆసిఫ్‌నహర్ వంటి ప్రాజెక్టుల కేటాయింపుల ప్రకటన లేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 556 (వంద ఎకరాల విస్తీర్ణం పైబడినవి)చెరువులు , 4076 (వంద ఎకరాల విస్తీర్ణానికి లోబడి) కుంటలు ఉన్నాయి. వీటికి కేటాయించిన బడ్జెట్ వివరాలు కూడా అందాల్సి ఉంది. కొత్త ప్రభుత్వం ఆ తర్వాత ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్లో జరిగే కేటాయింపులను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని, ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయినందున పెద్దగా నిరాశపడాల్సిన అవసరం కూడా లేదన్న అభిప్రాయం అధికారవర్గాలు వ్యక్తం చేశాయి. మున్ముందు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సి ఉన్నందున ఆయా ప్రాజెక్టుల ఉన్నతాధికారుల నుంచి కూడా ఎలాంటి ప్రతిపాదనలనూ స్వీకరించలేదని జిల్లాలోని ఓ ప్రాజెక్టు సీఈ ‘సాక్షి’కి వివరించారు. కాకులను కొట్టి గద్దలకు.. కాకులను కొట్టి గద్దలకు వేసేలా ఈ బడ్జెట్ ఉంది. పరిశ్రమాధిపతులకు, కార్పొరేట్ సంస్థలకు, కాంట్రాక్టర్లకు లబ్ధి కలిగించేలా కేటాయింపులు జరిగాయి. బడ్జెట్ పరి మాణం పెంచి ప్రజలపై పెనుభారం మోపింది. దళిత, గిరిజన, మైనార్టీ, బలహీన వర్గాల సంక్షేమానికి నిధులు కేటాయించకుండా ఏ రకంగా సంక్షేమాన్ని కాపాడుతారు. ఎస్ఎల్బీసీ, ఏఎమ్మార్ ప్రాజెక్టులు, శ్రీరాం సాగర్ రెండు, మూడో దశలు, ఉదయసముద్రం ఎత్తిపోతల పథకాలకు నిర్ణయిం చిన కాలవ్యవధి పూర్తయ్యింది. వీటిని ఇంకెప్పుడు పూర్తి చేశారు? నక్కలగండి ఎత్తిపోతల పథకం కాగితాలకే పరిమితమైంది. - నంద్యాల నర్సింహారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రాజెక్టులపై శీతకన్ను సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరిగింది. ఇప్పటికే నిధులు లేక పనులు మందగించాయి. అప్పుల సంద్రంలో నట్టేట మునిగిన రైతులకు ఇది శరాఘాతమే. చివరకు సంక్షేమ పథకాలపై కూడా శీతకన్ను వేసింది. నాలుగేళ్లుగా చతికిలపడ్డ సంక్షేమ పథకాల అమలు గాడిలో పడే పరిస్థితి కనిపించడంలేదు. కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కొండంత బడ్జెట్‌ని చూపిస్తున్నారు. ఓట్లు రాల్చుకోవాలని చూస్తున్నారు. అంతేతప్ప సామాన్యుడికి ఊరటనిచ్చే ఒక్క అంశమూ బడ్జెట్లో లేదు. -గట్టు శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎన్నికల బడ్జెట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అంకెల గారడీ చేసింది. ఏ ప్రాజెక్టుకు ఎంత కేటాయించారో స్పష్టంగా చెప్పడం లేదు. కనీసం ఇప్పటివరకు ఎంత ఖర్చు చేశారో లెక్కలు లేవు. ప్రణాళికేతర వ్యయాన్నే చూపిస్తున్నారు. మున్సిపాలిటీల్లో కన్నా అధికంగా పన్నులు పెంచి సామాన్యుల నడ్డి విరగొట్టింది. కనీసం మైనర్ ఇరిగేషన్‌కూ పూర్తిస్థాయిలో నిధులు కేటాయించలేదు. - బండా నరేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఓటర్లకు గాలం వేయడానికే రాబోయే ఎన్నికల్లో ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు ఉంది. పెరుగుతున్న ధరలను అదుపులో పెట్టేందుకు బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన చేయలేదు. గత బడ్జెట్లో కేటాయించిన నిధులనే సక్రమంగా ఖర్చు చేయలేదు. ఇప్పుడు నిధులను పూర్తిగా ఖర్చు చేస్తారనడం నమ్మశక్యంగా లేదు. పేరు గొప్ప ఊరుదిబ్బ అన్న చందంగా... బడ్జెట్ ఎంత కేటాయించామన్నది కాదు. వాటిని ఖర్చు చేస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది. - బిల్యా నాయక్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్ఎల్బీసీకి అరకొరే.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో చొరవతో ప్రారంభించిన శ్రీశైలం ఎడమగట్టు బ్రాంచ్ కెనాల్ (ఎస్ఎల్బీసీ- టన్నెల్) పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం ఏ కోశానా ఆలోచిస్తున్నట్లు కనిపించడం లేదు. గత బడ్జెట్లో *420కోట్లు ఇవ్వగా, ఈ సారి కూడా ఒక్క రూపాయి పెంచకుండా అంతే మొత్తం కేటాయించారు. రూ.2813కోట్ల పరిపాలనా అనుమతి ఉన్న ఈ ప్రాజెక్టుకు అరకొరగా నిధులు ఇస్తుండడంతో 2010లో పూర్తి కావాల్సిన ప్రాజెక్టుకు 2014వరకు గడువు పెంచారు. అయినా, నిధుల కేటాయింపు నిరాశాజనకంగా ఉండడంతో అసలు ఈ ప్రాజెక్టు పూర్తవుతుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రూ.232కోట్లు ఖర్చు కాగల డిండి ఎత్తిపోతల పథకం ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో అంతర్భాగంగానే ఉంది. ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం (ఏఎమ్మార్పీ) నిర్వహణ సైతం ఎస్ఎల్బీసీలో అంతర్భాగం. అదే మాదిరిగా రూ.561.96 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఉదయసముద్రం ఎత్తిపోతల పథకం కూడా ఎస్ఎల్బీసీలో అంతర్భాగమే. మరి ఇంత పెద్ద ప్రాజెక్టుకు పెద్దమొత్తంలో నిధులు అవసరం పడుతుండగా ప్రభుత్వం కంటి తుడుపుగా రూ.420కోట్లు మాత్రమే కేటాయించడం గమనార్హం. పులిచింతలకు కాస్త ఊరట పులిచింత ప్రాజెక్టు ద్వారా ముంపు మినహా, జిల్లాలో ఒక్క ఎకరాకూ సాగునీరు అందే పరిస్థితి లేదు. ముంపు పరిహారం, పునరావాసం విషయంలో మాత్రమే పులిచింతల ప్రాజెక్టు కేటాయింపులకు జిల్లాకు సంబంధం. గత బడ్జెట్లో రూ. 208కోట్ల బడ్జెట్ కేటాయించగా, ఈ సారి అదనంగా మరో రూ.94లక్షలు పెంచి రూ.208.94కోట్లు కేటాయించింది. ఈ నిధులను ప్రాజెక్టు పెండింగ్ పనులు, పునరావాసం, ముంపు పరిహారం కోసం ఖర్చు చేయనున్నారు. -
జస్ట్..విదిల్చారు..!
జిల్లా ప్రాజెక్టులకు... బడ్జెట్లో అరకొర నిధులే వేసవిలో ప్రాజెక్టుల పనులకు కీలక సమయం రానున్న ఖరీఫ్ నాటికి పనులను పూర్తి చేయాల్సిన లక్ష్యం ప్రాధాన్యతను మర్చి నిదుల కేటాయింపులో చూపని శ్రద్ద కేటాయించిన నిధులతో ఖరీఫ్ నాటికి ప్రాజెక్టుల సిద్ధం కష్టమే గద్వాల, న్యూస్‌లైన్ : వచ్చే ఖరీఫ్ నాటికి మూడు భారీ ఎత్తిపోతల పథకాల ద్వారా నీటి విడుదలకు అవసరమైన పనులను సిద్ధం చేయాల్సిన తరుణంలో, నీటిపారుదల శాఖ జిల్లాలోని ఆరు ప్రాజెక్టులకు రూ.1774 కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపగా, ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ప్రభుత్వం కనీసం సగం మేరకు కూడా నిధులు కేటాయించకుండా కేవలం రూ.417 కోట్లను మాత్రమే విదిల్చింది. దీంతో వచ్చే ఖరీఫ్ నాటికి ప్రాజెక్టుల పనులు పూర్తి చేయడం కష్టమే. 2012 సెప్టెంబర్ నెలలో 14,15,16 తేదీలలో నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి మూడు భారీ ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వం జాతికి అంకితం చేసింది. నాటి నుంచి నేటి వరకు ఈ ప్రాజెక్టుల పరిధిలో ఆయకట్టుకు నీళ్లివ్వలేకపోయింది. ఈ వేసవిలో ఖరీఫ్ ఆయకట్టుకు నీళ్లిచ్చేలా మూడు ప్రాజెక్టులను సిద్ధంృచేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇంతటి కీలక సమయంలో మూడు భారీ ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం నిధులు ఇవ్వడంలో ఏమాత్రం ప్రాధాన్యమివ్వలేదు. అధికారులు కోరిన రూ.1774 కోట్లలో కనీసం సగం మేరకు కూడా ఇవ్వలేకపోయింది. దీంతో ఈ మూడు ప్రాజెక్టుల పరిధిలో వేసవిలో చేయాల్సిన పనులకు గ్రహణం పట్టేలా ఉంది. ఈ వేసవి నాటికి పనులు పూర్తి చేయలేకపోతే ఆగస్టు నుంచి ప్రాజెక్టుల పరిధిలో పనులను కొనసాగించేందుకు వీలు కాదు. మళ్లీ డిసెంబర్ తరువాతనే పనులు కొనసాగించేందుకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నిధుల కేటాయింపులో చూపిన నిర్లక్ష్యం కారణంగా నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలలో వచ్చే ఖరీఫ్ నాటికి లక్ష్యం మేరకు ఆయకట్టుకు నీళ్లివ్వడం సమస్యనే. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టులలో జూరాల ప్రాజెక్టు మరమ్మతులు, ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు రూ.318 కోట్లు ఇవ్వాలని అధికారులు కోరినా, కేవలం రూ.49 కోట్లు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు రూ.31 కోట్లు ఇవ్వాలని కోరగా, రూ.20 కోట్లు, ఆర్డీఎస్ నిర్వాహణకు రూ.15 కోట్లు అడుగగా ఇందులోనూ కోత విధిస్తూ రూ.13 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశారు. ఈ అరకొర కేటాయింపులపై జిల్లా వ్యాప్తంగా వివిధ వర్గాలనుంచి నిరసన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రైతు సంఘాలు, ప్రజాల సంఘాలవారు గట్టిగా విమర్శిస్తున్నారు. -
జిల్లాకు మళ్లీ మొండి‘చెయ్యి’..
సాగునీటి ప్రాజెక్టులకు పెరగని కేటాయింపులు.. గతేడాది విదిల్చినట్లుగానే ఈ‘సారీ’.. ఊసేలేని పెన్‌గంగా ప్రాజెక్టు ‘రిమ్స్’కు కేటాయించినా.. నిర్వహణ, జీతభత్యాలకే సరి సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మరికొద్ది నెలల్లో సాధారణ ఎన్నికలు.. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్‌కు ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు. ఈ నేపథ్యంలో సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్‌తో జిల్లాకు ఒరిగిందేమీ లేదు. కిరణ్ ప్రభుత్వం మరోమారు మొండి‘చెయ్యి’ చూపింది. ఎన్నికల ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినా.. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు అరకొరగానే నిధులు విదిల్చారు. ఏటా మాదిరిగానే ఈసారీ మమ అనిపించారు. సోమవారం ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ఓసారి పరిశీలిస్తే.. ఆదిలాబాద్, శ్రీకాకుళంలోని నర్సింగ్ కళాశాలల భవనాల నిర్మాణానికి ఈసారి బడ్జెట్లో రూ.రెండు కోట్లు కేటాయించారు. ఇందులో జిల్లాకు రూ.కోటికి మించి వచ్చే అవకాశాలులేవు. ఈ ఒక్క అంశం మినహా ఈ బడ్జెట్లో జిల్లాకు ప్రత్యేక కేటాయింపులేవీ లేవు. ఆదిలాబాద్, ప్రకాశం, శ్రీకాకుళంలోని రిమ్స్ల్లో ఆధునిక పరికరాల కొనుగోలుకు మొత్తం రూ.4.5 కోట్లు కేటాయించారు. ఇందులో జిల్లాలోని రిమ్స్‌కు రూ.1.5 కోట్లు మించి వచ్చే అవకాశాలు లేవు. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో కూడా ఇందుకోసం రూ.1.5 కోట్లే కేటాయించారు. రిమ్స్ ఆస్పత్రికి గతేడాది కేటాయించినట్లుగానే ఈసారి కూడా రూ. 20.92 కోట్లు విదిల్చారు. రిమ్స్ వైద్య కళాశాలకు కూడా రూ.20.92 కోట్లు నిధులు వచ్చాయి. ఈ నిధులు కేవలం ఉద్యోగులు, సిబ్బంది జీతభత్యాలు, నిర్వహణకే సరిపోతాయే తప్ప, పెద్దగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీలు లేకుండా పోయింది. ఊసేలేని పెన్‌గంగా : సర్వే దశలోనే ఉన్న ఆంధ్ర-మహారాష్ట్ర సరిహద్దుల్లో నిర్మించతలపెట్టిన పెన్‌గంగా అంతర్రాష్ట్ర ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు ఈ బడ్జెట్లోనూ ఊసే లేకుండా పోయింది. 50 వేల ఎకరాల బీడు భూములను సాగులోకి తెవాలనే లక్ష్యంతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల కేటాయించడంలో ప్రభుత్వం ఈసారి కూడా మొండి చేయి చూపింది. దీంతో ఈ సర్కారు హాయంలో ఈ ప్రాజెక్టు కేవలం సర్వేకే పరిమితమైనట్లవుతోంది. {పాణహిత-చేవెళ్ల : తెలంగాణ వరప్రదాయనిగా పేరున్న ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు కేటాయింపులకు ఈసారి రూ.1,051.05 కోట్లుకు పెరిగినా.. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేవలం రెండు ప్యాకేజీల పనులు మాత్రమే జిల్లాలో కొనసాగుతున్నాయి. స్వర్ణ ప్రాజెక్టు, ప్రధాన కాలువ ఆధునికీకరణకు రూ.14.88 కోట్లతో చేపట్టిన పనులకు ఈ బడ్జెట్లో రూ.1.20 కోట్లు కేటాయించారు. సాత్నాల ఆధునికీకరణకు గతేడాది మాదిరే ఈసారీ రూ.కోటి కేటాయించారు. గడ్డెన్నవాగు (సుద్ద వాగు) ప్రాజెక్టు ప్రధాన కాలువ సిమెంట్ లైనింగ్ పనులకు కూడా ఇంతకు ముందుసారి మాదిరిగానే ఈసారి కూడా రూ.10 కోట్లు కేటాయించారు. మధ్య తరహా ప్రాజెక్టులకు.. జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టులకు గతేడాది కేటాయింపులే ఈ ఆర్థిక సంవత్సరంలో పునరావృతమయ్యాయి. ర్యాలీవాగు ప్రాజెక్టుకు రూ.కోటి, గొల్లవాగుకు రూ.ఐదు కోట్లు, నీల్వాయి ప్రాజెక్టుకు రూ.35 కోట్లు, కొమురంభీమ్ ప్రాజెక్టుకు రూ.32 కోట్లు, పెద్దవాగుకు రూ.2 కోట్ల మేరకు కేటాయింపులు జరిగాయి. ఎన్టీఆర్ సాగర్ ప్రాజెక్టు రీ మోడలింగ్ పనులకు రూ.50 లక్షలు, దహెగాంలోని పీపీరావు ప్రాజెక్టుకు రూ.1.40 కోట్లు కేటాయించారు. -
కేటాయింపులు అంతంతే
నిరాశపర్చిన ఓటాన్ బడ్జెట్ జిల్లాకు నిధుల కేటాయింపు అరకొరే సాగునీటి ప్రాజెక్టులకు మొండిచేయి ప్రతిపాదనలతో పొంతనలేని మంజూరు రాయలసీమ యూనివర్సిటీ, పెద్దాసుపత్రిలపై శీతకన్ను సాక్షి, కర్నూలు: ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ జిల్లా ప్రజానీకానికి నిరాశ మిగిల్చింది. వచ్చే ఆరు నెలల కాలానికి ఉద్దేశించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో జిల్లాకు అరకొర కేటాయింపులతో సరిపెట్టారు. జలయజ్ఞం ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తారని భావించిన రైతుల అంచనాలు తలకిందులయ్యాయి. హంద్రీనీవా, కేసీ కెనాల్, ఎస్ఆర్బీసీ, తెలుగు గంగ ప్రాజెక్టులకు తప్ప ఎల్ఎల్సీ, గాజులదిన్నె తదితర ప్రాజెక్టులన్నింటికీ నిధుల్లో కోత పెట్టారు. ఇక ఆరు జిల్లాలకు పెద్దదిక్కుగా వైద్య సేవలందిస్తున్న కర్నూలు ప్రభుత్వాసుపత్రికి రూ.2 కోట్ల మాత్రమే విదిల్చడం విమర్శలకు తావిస్తోంది. కర్నూలు జిల్లాలో 80వేల ఎకరాలు, అనంతపురం జిల్లాలో 1.80 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే హంద్రీనీవాకు రూ.416 కోట్లు కేటాయించారు. ప్రాజెక్టుకు సంబంధించి డిస్ట్రిబ్యూటరీ, పంట కాలువలు, లిఫ్ట్‌ల వద్ద తాత్కాలిక మరమ్మతులు, ప్రధాన కాలువ లైనింగ్ పనులకు రూ.900 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. అయితే గత ఏడాది తరహాలోనే 50 శాతానికి పైగా కోత పెట్టారు. కర్నూలు-అనంతపురం జిల్లాలకు సాగు, తాగునీటిని అందించే హంద్రీనీవాకు గత ఏడాది కేటాయించిన నిధుల్లో 60 శాతం కూడా వ్యయం చేయలేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అదేవిధంగా జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీటిని అందించే తెలుగుగంగ ప్రాజెక్టుకు ఈ ఏడాది కూడా రూ.154 కోట్లు మాత్రమే కేటాయించారు. జిల్లాతో పాటు చెన్నైవాసులకు తాగునీటిని అందించే ఈ ప్రాజెక్టుకు ఏటా అరకొర నిధులను కేటాయిస్తుండటంతో ప్రధాన కాలువ లైనింగ్ పనులకు ఇప్పట్లో మోక్షం లభించే పరిస్థితి కనిపించడం లేదు. శ్రీశైలం కుడిగట్టు కాలువ పనులకు రూ.70 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారు. ఈ కాలువతో గోరుకల్లు, అవుకు జలాశయాలను నింపి నంద్యాల, బనగానపల్లె, కోవెలకుంట్ల, వైఎస్ఆర్ కడప జిల్లాలోని జమ్మలమడుగు పరిధిలో 200 గ్రామాలకు సాగునీటిని అందిస్తున్నారు. అరకొర నిధుల కారణంగా కాలువ ఆధునికీకరణ పనులు పూర్తి కాకపోవడంతో 15 శాతం గ్రామాలకు కూడా తాగునీటిని అందించలేకపోతున్నారు. ఇక కర్నూలుతో పాటు కడప జిల్లాకు తాగు, సాగునీటిని అందించే కేసీ కెనాల్‌కూ రూ.70 కోట్లతో సరిపెట్టారు. 2.75 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే కాలువకు పలుచోట్ల లైనింగ్ దెబ్బతినడం.. మరమ్మతులకు నోచుకోకపోవడంతో చివరి ఆయకట్టుకు నీరందని పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ పూర్తి స్థాయిలో నిధులు కేటాయించకపోవడం గమనార్హం. తుంగభద్ర దిగువ కాలుల పరిధిలో 1.51 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే ఎల్ఎల్సీ కాలువ ఆధునికీకరణ పనులకు బడ్టెట్‌లో రూ.35 కోట్లు మాత్రమే కేటాయించారు. పైనున్న కర్ణాటక రాష్ట్రంలో నీటి చౌర్యంతో పాటు కాలువ ఆధునికీకరణ పనులు పూర్తి కాకపోవడంతో 75వేల ఎకరాలకు నీరందడం లేదు. ఈ పరిస్థితుల్లోనూ నిధులు పెంచకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘రాయలసీమ’కు రూ.5 కోట్లు రాయలసీమ విశ్వవిద్యాలయానికి సంబంధించి సుమారు రూ.170 కోట్లు కేటాయించాలని గత ఏడాది ప్రతిపాదనలు పంపారు. అయితే బడ్జెట్లో రూ.5 కోట్లు మాత్రమే కేటాయించడం చూస్తే విద్యాభివృద్ధికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తోంది. కర్నూలు పెద్దాసుపత్రికి రూ.2కోట్లే ఆరు జిల్లాలకు పెద్దదిక్కుగా వైద్య సేవలు అందిస్తున్న కర్నూలు ప్రభుత్వాసుపత్రి తక్షణ అవసరాలకు రూ.2 కోట్ల బడ్జెట్‌తో సరిపెట్టారు. ఇప్పటికీ సరిపడా పడకలు లేక రోగుల ఇక్కట్లు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. ఇదే సమయంలో సరైన సౌకర్యాలు కరువై ప్రత్యక్ష నరకం కనిపిస్తోంది. అయినప్పటికీ ప్రభుత్వం అత్తెసరు నిధులతోనే సరిపెట్టింది. -
బడ్జెట్లో ప్రాధాన్యతేదీ..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ప్రకాశం జిల్లాకు ప్రాధాన్యత లేదని జిల్లావాసులు అభిప్రాయపడుతున్నారు. ఆక్వా, పొగాకు, ఉప్పు రైతులు జిల్లాలో అనేక మంది ఉండగా..వారి గురించి అసలు పట్టించుకోలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై జిల్లా వాసులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్‌పై ఏ ఒక్కరూ సానుకూలంగా స్పందించక పోవడం గమనార్హం. పేలవమైన బడ్జెట్ ఇప్పటి బడ్జెట్ చాలా పేలవంగా ఉంది. జిల్లా అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోంది. ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తన సొంత జిల్లాకు పోర్టును తరలించుకెళ్లారు. ఇప్పటికే నెల్లూరులో ఒక పోర్టు ఉంది. ప్రకాశం జిల్లాలో పోర్టు ఏర్పాటు చేసి ఉంటే జిల్లా అభివృద్ధి చెంది ఉండేది. - అక్తర్ బాషా, ఒంగోలు రామ్‌నగర్ మహిళలకు ఎటువంటి లబ్ధి లేదు ఈ బడ్జెట్ వల్ల మహిళలకు ఎటువంటి లబ్ధి చేకూరలేదు. ఇప్పటి వరకు ఆర్థిక మంత్రి చేసిన ప్రసంగంలో మహిళల గురించి ఎటువంటి ప్రస్తావన రాలేదు. దాదాపు అన్ని జిల్లాల్లో మహిళా ఓటర్లే ఎక్కువ ఉన్నారు. - వేదవతి, ఒంగోలు భాగ్యలక్ష్మీనగర్ గత బడ్జెట్ నిధులే ఉపయోగించలేదు... రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ. 474 కోట్ల మిగులు చూపడం హాస్యాస్పదంగా ఉంది. గత బడ్జెట్లో కేటాయించిన నిధులు కూడా ఉపయోగించే తీరిక రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం సిగ్గుచేటు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీకి తిరగడానికే పూర్తిగా సమయం కేటాయిస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించిన నిధులు కూడా ఉపయోగించలేకపోయారు. - శ్రీనివాసరావు, వ్యాపారి, కనిగిరి బడ్జెట్లో కొత్తదనం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఆరోగ్యశ్రీ ఇస్తున్నట్లు ప్రకటించిందని అయితే ఇది ఇప్పటికే పూర్తయిన కసరత్తు. ఇందులో కొత్తదేమీ లేదు. సీఎం కిరణ్ నిధులన్నీ తన నియోజకవర్గానికి మళ్లించుకుంటున్నారు..దీంతో ఇతర జిల్లాల పట్ల శ్రద్ధ చూపలేదు. - చదలవాడ రామారావు, గిద్దలూరు -
మొండిచేయి
ఒంగోలు, న్యూస్‌లైన్: జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. నిధుల కేటాయింపులో అంకెల గారడీ తప్ప ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న శ్రద్ధ ప్రభుత్వ పెద్దల్లో కనిపించడం లేదు. గత ఏడాది కేటాయించిన నిధుల్లో కనీసం పాతిక శాతం కూడా ఖర్చు చేయకపోగా..తాజా ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కూడా అంతంత మాత్రంగానే నిధులు విదిల్చారు. ఇదేనా న్యాయం: 6 జిల్లాలో కందుల ఓబుల్‌రెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయరు ప్రాజెక్టుకు మొత్తం అంచనా వ్యయం రూ.592.18 కోట్లు. అందులో ఇప్పటి వరకు ఖర్చు చేసింది రూ.535.68 కోట్లు. అయితే 2013-14లో రూ.29 కోట్లు కేటాయించారు. కానీ ఇంతవరకు ఇందులో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. మళ్లీ మరో రూ.29 కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది అంకెల గారడీనే అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 6 పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు రూ. 5150 కోట్లు అవసరం. కానీ ఇంత వరకు ఖర్చుచేసింది రూ.3378.12 కోట్లు మాత్రమే. దీనికితోడు 2013-14 బడ్జెట్లో రూ. 402 కోట్లు అన్నారు. కానీ విడుదల చేసింది కేవలం రూ. 105.48 కోట్లు మాత్రమే. ప్రస్తుతం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో రూ. 402 కోట్లు అంటూ ప్రకటించడం గమనార్హం. 6యర్రం చినపోలిరెడ్డి కొరిశపాడు ఎత్తిపోతల పథకానికి సంబంధించి రూ.177 కోట్లు అవసరమని భావించగా ఇప్పటి వరకు ఖర్చుచేసిన మొత్తం రూ.90.47 కోట్లు మాత్రమే. 2013-14 సంవత్సరంలో రూ.17 కోట్లు కేటాయించారు. కానీ అందులో ఇప్పటి వరకు ఖర్చుచేసిన మొత్తం రూ.2.91 కోట్లే. తాజాగా దీనికి మరో రూ.17 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో ఇదీ పరిస్థితి: కృష్ణా వెస్ట్రన్ డెల్టా కాలువల అభివృద్ధి పనులకు రూ. 130.22 కోట్లకు అగ్రిమెంట్ అయింది. కానీ ఇంతవరకు కేవలం రూ. 10 కోట్ల లోపు మాత్రమే ఖర్చుచేశారు. చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లోని డ్రైనేజీ కాలువల అభివృద్ధి కోసం దాదాపు రూ.140 కోట్లు కేటాయించగా ఇప్పటి వరకు అందులో ఖర్చుచేసింది రూ. 40 కోట్లలోపు మాత్రమే. ఇంకా వీటికి సంబంధించి కొన్నిచోట్ల టెండరు వేసేందుకు సైతం ఎవరూ ముందుకు రాని పరిస్థితి. 6మాగుంట సుబ్బరామిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయరుకు 2013-14లో కోటి రూపాయల నిధులు కేటాయించారు. కానీ ఇంత వరకు ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయకపోవడం గమనార్హం. 6 శ్రీపోతుల చెంచయ్య పాలేరు రిజర్వాయరు ప్రాజెక్టుకు రూ. 50.50 కోట్లు అవసరమని భావించగా ఇంతవరకు కేటాయించిన మొత్తం రూ.10.85 కోట్లు. 2013-14లో రూ.9 కోట్లు కేటాయించారు. కానీ ఖర్చుచేసిన మొత్తం రూ.15 లక్షలు కావడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. 6 ఒంగోలులో పోతురాజు కాలువ అభివృద్ధికి రెండో దశలో రూ. 18 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదించినా దీనికి సంబంధించి జాడ కూడా లేకపోవడం గమనార్హం. -
అంతంతే
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జనాకర్షక పథకాలుంటాయని భావించిన వారికి నిరాశే మిగిల్చిం ది బడ్జెట్. ఈ బడ్జెట్లో జిల్లాకు అంతగా ప్రాధాన్యత దక్కలేదు. బడ్జెట్ కేటాయింపుల మిగులును కలుపుకొని అదనంగా అరకొరగానే నిధులు కేటాయించా రు. ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి పథకానికి రూ. 1,051 కోట్లు కేటాయించినా, జిల్లాకు సంబంధించిన 20, 21, 22 ప్యాకేజీలకు దక్కేది కొసరంతే. ఎస్సారెస్పీ స్టేజ్-1 కోసం గత బడ్జెట్లోని మిగులుకు అదనంగా కేటాయించింది రూ. 20 కోట్లే. నిజాంసాగర్ ఆధునీకరణకు మాత్రం రూ.180 కోట్లు కేటాయించారు. మిగిలిన ప్రాజెక్టులకు అంతంత మాత్రంగానే నిధులిచ్చి నిరాశపరిచారు. నిండా నిర్లక్ష్యం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం జలయజ్ఞం నిర్లక్ష్యానికి గురవుతోంది. సోమవారం ఆనం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ దీనికి నిదర్శనం. ప్రాజెక్టులకు నామమాత్రం గా నిధులు కేటాయించారు. ఎన్నికల సంవత్సరంలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో జిల్లాకు అరకొరగానే కేటాయింపులు చేశారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తుండడంతో జిల్లాలోని నీటి పారుదల రంగానికి భారీ వాటా దక్కుతుందని భావించినా.. నిరాశే మిగిలింది. బడ్జెట్లో మనకు ఏడు జిల్లాలలో 16.40 లక్షల ఎకరాలకు సాగునీరందించే ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి పథకానికి ఈసారి మొక్కుబడిగానే కేటాయింపులు జరిగాయి. 2013-14 బడ్జెట్లో ప్రాణహిత-చేవెళ్లకు రూ.737 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈసారి మిగులు కలిపి రూ.1051 కోట్లుగా పేర్కొంది. అయితే జిల్లాలో 3.04 లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో చేపట్టిన 20, 21, 22 ప్యాకేజీలకు అరకొర వాటానే దక్కనుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు స్టేజ్-1 కోసం రూ. 160 కోట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్లో పేర్కొన్నా.. గత బడ్జెట్లో మిగులుకు ఇది రూ. 20 కోట్లే అదనం. అంతర్రాష్ట్ర లెండి ప్రాజెక్టుకు రూ.45 కోట్లు, చౌటపల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ. 10 కోట్లు, అర్గుల రాజారాం గుత్ప ఎత్తిపోతలకు రూ. 8 కోట్లు, అలీసాగర్‌కు రూ. 4 కోట్లు కేటాయించారు. పోచారం లేక్‌కు రూ.కోటి, రామడుగుకు రూ. 95 లక్షలు, నల్లవాగు మత్తడికి రూ. 50 లక్షలు. నిజాంసాగర్ ఆధునికీకరణ పనులు, కాలువల మరమ్మతులు మాత్రం ఊపందుకునే అవకాశాలున్నాయి. ఇందుకోసం ఈ బడ్జెట్లో రూ.180 కోట్ల రూపాయలు కేటాయించారు. తెలంగాణ యూనివర్సిటీలో భవనాల నిర్మాణం కోసం రూ. 5 కోట్లు, మెడికల్ కాలేజీ కోసం రూ.7 కోట్ల కేటాయించారు. -
‘ఆనం’దం ఏమీలేదు..
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మరికొద్ది నెలల్లో సాధారణ ఎన్నికలు.. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్‌కు ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు. ఈ నేపథ్యంలో సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్‌తో జిల్లాకు ఒరిగిందేమీ లేదు. కిరణ్ ప్రభుత్వం మరోమారు మొండి‘చెయ్యి’ చూపింది. ఎన్నికల ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినా.. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు అరకొరగానే నిధులు విదిల్చారు. ఏటా మాదిరిగానే ఈసారీ మమ అనిపించారు. సోమవారం ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ఓసారి పరిశీలిస్తే.. ఆదిలాబాద్, శ్రీకాకుళంలోని నర్సింగ్ కళాశాలల భవనాల నిర్మాణానికి ఈసారి బడ్జెట్లో రూ.రెండు కోట్లు కేటాయించారు. ఇందులో జిల్లాకు రూ.కోటికి మించి వచ్చే అవకాశాలులేవు. ఈ ఒక్క అంశం మినహా ఈ బడ్జెట్లో జిల్లాకు ప్రత్యేక కేటాయింపులేవీ లేవు. ఆదిలాబాద్, ప్రకాశం, శ్రీకాకుళంలోని రిమ్స్ల్లో ఆధునిక పరికరాల కొనుగోలుకు మొత్తం రూ.4.5 కోట్లు కేటాయించారు. ఇందులో జిల్లాలోని రిమ్స్‌కు రూ.1.5 కోట్లు మించి వచ్చే అవకాశాలు లేవు. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో కూడా ఇందుకోసం రూ.1.5 కోట్లే కేటాయించారు. రిమ్స్ ఆస్పత్రికి గతేడాది కేటాయించినట్లుగానే ఈసారి కూడా రూ. 20.92 కోట్లు విదిల్చారు. రిమ్స్ వైద్య కళాశాలకు కూడా రూ.20.92 కోట్లు నిధులు వచ్చాయి. ఈ నిధులు కేవలం ఉద్యోగులు, సిబ్బంది జీతభత్యాలు, నిర్వహణకే సరిపోతాయే తప్ప, పెద్దగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీలు లేకుండా పోయింది. ఊసేలేని పెన్‌గంగా : సర్వే దశలోనే ఉన్న ఆంధ్ర-మహారాష్ట్ర సరిహద్దుల్లో నిర్మించతలపెట్టిన పెన్‌గంగా అంతర్రాష్ట్ర ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు ఈ బడ్జెట్లోనూ ఊసే లేకుండా పోయింది. 50 వేల ఎకరాల బీడు భూములను సాగులోకి తెవాలనే లక్ష్యంతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల కేటాయించడంలో ప్రభుత్వం ఈసారి కూడా మొండి చేయి చూపింది. దీంతో ఈ సర్కారు హాయంలో ఈ ప్రాజెక్టు కేవలం సర్వేకే పరిమితమైనట్లవుతోంది. {పాణహిత-చేవెళ్ల : తెలంగాణ వరప్రదాయనిగా పేరున్న ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు కేటాయింపులకు ఈసారి రూ.1,051.05 కోట్లుకు పెరిగినా.. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేవలం రెండు ప్యాకేజీల పనులు మాత్రమే జిల్లాలో కొనసాగుతున్నాయి. స్వర్ణ ప్రాజెక్టు, ప్రధాన కాలువ ఆధునికీకరణకు రూ.14.88 కోట్లతో చేపట్టిన పనులకు ఈ బడ్జెట్లో రూ.1.20 కోట్లు కేటాయించారు. సాత్నాల ఆధునికీకరణకు గతేడాది మాదిరే ఈసారీ రూ.కోటి కేటాయించారు. గడ్డెన్నవాగు (సుద్ద వాగు) ప్రాజెక్టు ప్రధాన కాలువ సిమెంట్ లైనింగ్ పనులకు కూడా ఇంతకు ముందుసారి మాదిరిగానే ఈసారి కూడా రూ.10 కోట్లు కేటాయించారు. మధ్య తరహా ప్రాజెక్టులకు.. జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టులకు గతేడాది కేటాయింపులే ఈ ఆర్థిక సంవత్సరంలో పునరావృతమయ్యాయి. ర్యాలీవాగు ప్రాజెక్టుకు రూ.కోటి, గొల్లవాగుకు రూ.ఐదు కోట్లు, నీల్వాయి ప్రాజెక్టుకు రూ.35 కోట్లు, కొమురంభీమ్ ప్రాజెక్టుకు రూ.32 కోట్లు, పెద్దవాగుకు రూ.2 కోట్ల మేరకు కేటాయింపులు జరిగాయి. ఎన్టీఆర్ సాగర్ ప్రాజెక్టు రీ మోడలింగ్ పనులకు రూ.50 లక్షలు, దహెగాంలోని పీపీరావు ప్రాజెక్టుకు రూ.1.40 కోట్లు కేటాయించారు. -
ప్రయోజనం లేని బడ్జెట్...
రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో సామాన్యులకు ఒరిగిందేమి లేదని వివిధ రాజకీయ పార్టీల నేతలు పేర్కొన్నారు. సంక్షేమాన్ని విస్మరించి అంకెలగారడీతో ఢంకా భజాయించుకున్నారని ఎద్దేవా చేశారు. ఇదీ ముమ్మాటికీ ఎన్నికల బడ్జెటేనని అన్నారు. నేతల అభిప్రాయాలు వారి మాటల్లోనే.. రైతు సంక్షేమాన్ని విస్మరించారు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ద్వారా తన నిజస్వరూపాన్ని ప్రదర్శించింది. రైతుల సంక్షేమాన్ని విస్మరించింది. మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఆశయాలకు తూట్లు పొడిచేలా ఈ బడ్జెట్ ఉంది. ప్రాజెక్టుల నిర్మాణానికి అరకొరగా నిధులు కేటాయించారు. సంక్షేమ పథకాలకు మొండి చెయ్యిచూపారు. దిశ, నిర్దేశం లేని బడ్జెట్ ఇది. అంకెల గారడీతో రాష్ట్ర ప్రజలను మోసం చేయడమే. ఇది కేవలం ఎన్నిక బడ్జెట్‌గానే ఉంది. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వైఎస్సార్సీపీ ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త ఇది ధనవంతుల బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ధనవంతుల బడ్జెట్ మాదిరిగా ఉంది. జలయజ్ఙం పేరిట ప్రాజెక్ట్‌లను నిర్మించడం కాంట్రాక్ట్దారులను బాగు చేయడం కోసమే. ఈ బడ్జెట్లో సంక్షేమ పథకాల ఊసే లేదు. ఇప్పటి వరకు ప్రజాసమస్యలను పట్టించుకోని ప్రభుత్వం ఎన్నికల ముందు రాజకీయ లబ్ధికోసం ఈ బడ్జెట్‌ను రూపొందించునట్టు ఉంది. -పోటు రంగారావు, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ప్రజలకు ప్రయోజనం లేదు ప్రభుత్వం ఏటా లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతున్నా మారుమూలన ఉన్న ప్రజలకు ఈ బడ్జెట్ ఫలం అందడంలేదు. ప్రధాన రం గాలను ప్రభుత్వం విస్మరిస్తోంది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అంటూ ప్రభుత్వం ఊదరగొట్టినా నిధుల కేటాయింపు మాత్రం చేయడంలేదు. -దిండిగాల రాజేందర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎన్నికల బడ్జెట్ ప్రజావిశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓట్లు సంపాదించేందుకు బడ్జెట్ పెట్టినట్లు ఉంది. వ్యవసాయ రంగాన్ని విస్మరించారు. గతేడాది ప్రకటించిన నిధులే ఇప్పటి వరకు విడుదల చేయలేదు. ఆర్థిక మంత్రి మసిపూసి మారేడు కాయ చేశారు. -కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రజా సంక్షేమాన్ని విస్మరించారు ప్రజా సంక్షేమాన్ని విస్మరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ఉంది. బడ్జెట్లో సంక్షేమ పథకాల ఊసే లేదు. ఈ ఐదేళ్ళలో ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ వల్ల పేదలకు ఒరిగిందేమి లేదు. ఎన్నికల ముందు ఆర్భాటంగా బడ్జెట్‌ను ప్రవేశ పెట్టి చేతులు దులుపుకున్నారు. - భాగం హేమంతరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి బ్రహ్మాండమైన బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ బ్రహ్మాండంగా ఉంది. ప్రజాసంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీఠ వేస్తుందని మరోసారి రుజువు చేసింది. ఎస్సీ, ఎస్టీలు, బీసీ, ఇతర వెనకబడిన వర్గాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపొందించారు. మహిళలకు, రైతుల సంక్షేమానికి అధిక నిధులు కేటాయించడం శుభ సూచికం. -వనమా వెంకటేశ్వర్రావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రజా వ్యతిరేక బడ్జెట్ ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్. కొత్తసీసాలో పాతసార అన్నట్లుగా ఉంది. సంక్షేమపథకాలనుమరిచారు. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓట్లు, సీట్ల కోసమే హడావిడి గా రూపొందించారు. గొప్పులు చెప్పుకోవడానికే కాం గ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ప్రజామోద యోగ్యంగా లేదు. -పాయం వెంకటేశ్వర్లు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఇది అంకెల గారడీ ప్రభుత్వం అట్టహాసంగా రూ.1.83 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టి అంకెలగారడీ చేసింది. దీనివల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. ప్రభుత్వ చర్యలతో నానాటికీ ప్రజలపై అప్పులభారం పడుతోంది. గత ఏడాది ఇరిగేషన్, వ్యవసాయ శాఖలకు సంబంధించిన బడ్జెట్‌నే ఖర్చు చేయలేదు. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కి నిధులే లేవు. - కొండబాల కోటేశ్వరరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పసలేని బడ్జెట్ ఇది కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పెట్టిన బడ్జెట్. ఇందులో పసలేదు. లక్ష్యం కన్పించడంలేదు. తెలంగాణ అభివృద్ధికి నిధులు కేటాయించలేదు. సాగునీటి రంగానికి కంటితుడుపుగా నిధులిచ్చారు. వీటితో ప్రాజెక్టు కట్టే కూలీలకు ఇచ్చే డబ్బులకు కూడా సరిపోవు, సంక్షేమ పథకాలను కుదింపు చేశారు. -ప్రొఫెసర్ కనకాచారి, తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ సామాన్యులకు ఒరిగిందేమిటి..? రాష్ట్ర బడ్జెట్ వల్ల సామాన్యులకు ఒరిగింది ఏమిలేదు. బడ్జెట్ అంతా తప్పుల తడకగా ఉంది. నిరుద్యోగులకు రాజీవ్యువకిరణాలు పథకం ద్వారా వేల ఉద్యోగాలు కల్పించామని ఆర్థిక మంత్రి చెప్పడం విడ్డూరంగా ఉంది. కేవలం ఇది ధనవంతుల బడ్జెట్ మాత్రమే. - పోతినేని సుదర్శన్ రావు, సీపీఎం జిల్లా కార్యదర్శి -
బడ్జెట్టు.. కనికట్టు
సాక్షి, ఏలూరు: రాష్ట్ర శాసనసభలో సోమవారం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో జిల్లాకు ఇచ్చిన కేటాయింపులు కేవలం ఓట్ల కోసం చేసిన అంకెల గారడీగా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ బడ్జెట్ వల్ల జిల్లాకు ఒరిగిందేమీ లేదు. అరకొర కేటాయింపులతోనే సరిపెట్టారు. అది కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులకు మొక్కుబడిగా నిధులు విదిల్చారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ 1నుంచి సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉండేలా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం విదితమే. నాలుగు జిల్లాల ప్రజల చిరకాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను కొనసాగించేందుకు రూ.457.50 కోట్లు కేటాయిస్తున్నట్టు ఈ బడ్జెట్లో పేర్కొన్నారు. తాడిపూడి, చింతలపూడి ఎత్తిపోతల పథకాలకు సైతం నామమాత్రంగానే నిధులు కేటాయించారు. డెల్టా ఆధునికీకరణకు కంటి తుడుపుగా రూ.180 కోట్లు ఇస్తున్నట్టు చూపించారు. పోలవరానికి అంతంతే.. ఏటా బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు అరకొర కేటాయింపులే ఇస్తున్నారు. 2012-13 బడ్జెట్లో రూ.850 కోట్లు కేటాయిస్తే.. 2013-14లో రూ.800 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఈసారి ఓట్ ఆన్ బడ్జెట్లో రూ.457.50 కోట్లు కేటాయించారు.పోలవరం మండలం రామయ్యపేట గ్రామంలో చేపట్టిన ప్రాజెక్టు పనులు పూర్తయితే ఉభయగోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాల్లోని 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఆస్కారం ఏర్పడుతుంది. 80 టీఎంసీల గోదావరి నీటిని కుడి ప్రధాన కాలువ ద్వారా కృష్ణానదికి, 23.44 టీఎంసీల నీటిని విశాఖ పరిసర 560 గ్రామాల్లో తాగునీటి, పరిశ్రమల అవసరాలకు ఎడమ కాలువ ద్వారా సరఫరా అవుతారుు. ఈ నాలుగు జిల్లాల్లో పర్యాటకం, చేపల పెంపకం, జలరవాణా వంటివి అభివృద్ధి చెందుతాయి. ప్రాజెక్టు వ్యయం రూ.17,500 కోట్లుగా నిర్ణయించారు. రూ.16,010 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి వచ్చింది. దాదాపు 14 వందల ఎకరాల భూసేకరణ ఇంకా జరగాల్సి ఉంది. నిర్వాసితులకు ఇప్పటివరకూ పూర్తిగా పునరావాసం చూపించలేదు. ఇటీవల ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి రూ.4,054 కోట్ల విలువైన పనులను అప్పగించారు. డెల్టా ఆధునికీకరణ ఇంకెలా.. ఎన్నో ఏళ్లుగా పంటలకు సాగునీరు అందక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. కాలువలు, డ్రెయిన్లు పూడకుపోయూయి. చాలా చోట్ల గట్లు తెగిపోతున్నాయి. చిన్నపాటి వర్షాలకే చేలల్లోకి నీరుచేరి పంటలు రోజుల తరబడి ముంపులోనే ఉంటున్నాయి. ఈ సమస్యలన్నీ తీరాలంటే డెల్టా ఆధునికీకరణ ఒక్కటే శరణ్యం. అయితే మూడేళ్లుగా ఆధునికీకరణ పనులు ఆశించిన స్థాయిలో జరగటం లేదు. ఎప్పటికప్పుడు పంట ఆలస్యం కావడం, వెంటనే రెండో పంట వేసేస్తుండటంతో సమయం సరిపోవడం లేదు. దీంతో పనులు మధ్యలోనే ఆపేయాల్సి వస్తోంది. డెల్టా ఆధునికీరణ పనులను జిల్లా అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. లాంగ్ క్లోజర్ ఇద్దామనుకున్నా రైతులు అంగీకరించకపోవడంతో షార్ట్ క్లోజర్ ద్వారా అయినా పనులు చేయాలనుకుంటున్నారు. అయితే ఓటాన్ బడ్జెట్లో డెల్టా ఆధునికీకరణకు రూ.180 కోట్లు మాత్రమే కేటాయించారు. ఉభయగోదావరి జిల్లాల్లో సాగునీటి అవసరాలకు కాలువలు, డ్రెయిన్లే ప్రధాన ఆధారం. 2007-08లో వీటిని ఆధునీకరించాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రతిపాదించగా 2008-09లో ఆమోదం లభించింది. పశ్చిమలో డెల్టా ఆధునికీకరణ పనుల కోసం రూ.1,383 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ఆధునీకరణ పూర్తి చేసేందుకు రూ.1464.44 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఐదేళ్లలో 2 లాంగ్ క్లోజర్లు (180 రోజుల చొప్పున), 2 షార్టు క్లోజర్లు (70 రోజుల చొప్పున) ఇచ్చి పనులు చేయాల్సి ఉంది. కానీ.. 2011-12లో ఒక్కసారి మాత్రమే లాంగ్ క్లోజర్ ఇచ్చి పనులు చేశారు. 2008-09లో రూ.23.20 కోట్లు, 2009-10లో రూ.8.65 కోట్లు, 2010-11లో రూ.16.60 కోట్లు, 2011-12లో రూ.68.63 కోట్లు, 2012-13లో రూ.115.08 కోట్లు, 2013-14లో రూ.91.25 కోట్ల విలువైన పనులు చేశారు. ఆధునికీకరణకు సంబంధించి ఇప్పటివరకూ మొత్తం రూ.323.41 కోట్ల విలువైన పనులు మాత్రమే పూర్తయ్యూరుు. ఈ ఏడాది రూ.1,824 కోట్ల విలువైన పనులకు ప్యాకేజీలు ఖరారయ్యాయి. ‘పశ్చిమ’లో రూ.వెరుు్య కోట్లతో డెల్టాను ఆధునికీరించాలనుకుంటున్నారు. కానీ కేటాయించిన రూ.180 కోట్లు ఏ మూలకూ సరిపోవు. చింతలపూడికి ఎత్తిపోతలకు రూ.70 కోట్లు ప్రస్తుత ఓట్ ఆన్ బడ్జెట్లో చింతలపూడి ఎత్తిపోతల పథకానికి రూ.70 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,701కోట్లు. 2012-13 బడ్జెట్లో రూ.70 కోట్లు, గతేడాది బడ్జెట్లో దాదాపు రూ.70 కోట్లు కేటాయించారు. 2015లో ఈ ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉంది. కానీ ప్రస్తుత బడ్జెట్లో కేటాయింపులు అరకొరగా ఉండటంతో ఇప్పటివరకూ దాదాపు రూ.280 కోట్లు ఖర్చు చేశారు. తాడిపూడికి రూ.60 కోట్లు తాడిపూడి ఎత్తిపోతల పథకానికి రూ.60 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.526.27 కోట్లు కాగా, 2012-13 బడ్జెట్లో రూ.61 కోట్లు, గతేడాది బడ్జెట్లో దాదాపు రూ.40 కోట్లు కేటాయించారు. గతేడాదే పూర్తికావాల్సిన ఈ ప్రాజెక్టు నేటికీ సాగుతోంది. కృష్ణా డెల్టా ఆధునికీకరణకు రూ.332.51కోట్లు కృష్ణా డెల్టా ఆధునికీకరణకు (కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలకు కలిపి) ఈ బడ్జెట్లో రూ.332.51కోట్లు కేటాయించారు. ఈ నిధుల్లో కొంత మన జిల్లాలో పనులకు ఉపయోగిస్తారు. ఏలూరు కాలువను 2 ప్యాకేజీలుగా విభజించి 2008లో పనులు చేపట్టారు. ప్యాకేజీ విలువ మన జిల్లాలో రూ.65.52 కోట్లు. నిధులు చాలక పనులు పూర్తికాకపోవడంతో గతేడాది గడువు పొడిగించినా పూర్తికాలేదు. 2012లో రూ.4.15కోట్లు, 2013లో 9.72 కోట్లు విలువైన పనులు మాత్రమే పూర్తిచేశారు. -
మురిగిన నిధులే తిరిగొచ్చాయి
సాక్షి, సంగారెడ్డి: ఈసారీ అవే విదిలింపులు. పాత కేటాయింపులతోనే సరిపుచ్చారు. ఆర్థిక శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్(2014-15) జిల్లావాసులను ఉసూరుమనిపించింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజల ముందుకు వచ్చిన ఈ బడ్జెట్లో జిల్లాకు కొత్తగా ప్రత్యేక కేటాయింపులేవి లేకపోవడం తీవ్ర నిరాశను కలిగించింది. 2013-14 బడ్జెట్‌లాగానే ఈ బడ్జెట్లో సింగూర్ ప్రాజెక్టు, సుల్తాన్పూర్ జేఎన్టీయూలకు పాత కేటాయింపులు కేటాయించారు. జిల్లాలో మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు సింగూర్‌కు రూ.40 కోట్లు, పుల్కల్ మండలం సుల్తాన్‌పూర్‌లో నిర్వహిస్తున్న జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలకు రూ.121 కోట్ల నిధులను ఈ బడ్జెట్లో కేటాయించారు. జహీరాబాద్ మండలం చిరాగ్పల్లితో పాటు రాష్ట్రంలో మరో రెండు ప్రాంతాల్లో సమీకృత చెక్‌పోస్టుల నిర్మాణాల కోసం రూ.25 కోట్ల నిధులు కేటాయించారు. ఇవి మినహా జిల్లాకు ప్రత్యేక కేటాయింపులేవీ లేవు. మళ్లీ అదే కథ.. సింగూర్ ప్రాజెక్టుపై కాల్వలతోపాటు ఎత్తిపోతల పథకం పనులు జరుగుతున్నాయి. సుమారు రూ.58.36 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన సింగూర్ కాల్వల పథకం పనులు 55 శాతం మాత్రమే పూర్తయ్యాయి. ఈ పథకం పూర్తి కావాలంటే ఇంకా రూ.26 కోట్ల నిధులు అవసరం. రూ.20.36 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఎత్తిపోతల పనులు 42 శాతం పూర్తయ్యాయి. ఎత్తిపోతల పూర్తికావాలంటే రూ.12 కోట్లు నిధులు అవసరం. దాదాపు రూ.38 కోట్ల నిధులను ఖర్చు చేస్తే ఈ రెండు నిర్మాణాలు పూర్తయి ఆయకట్టుకు నీళ్లు పారనున్నాయి. గతేడాది కింద ఈ పనుల ఏ స్థితిలో ఉన్నాయో ప్రస్తుతం అలానే ఉన్నాయి. పనుల్లో ఏమాత్రం పురోగతి లేకపోవడంతో గతేడాది బడ్జెట్లో కేటాయించిన రూ.40 కోట్ల నిధులు మురిగిపోయాయి. దీంతో సింగూర్ ప్రాజెక్టు గత బడ్జెట్లో కేటాయించిన రూ.40 కోట్లనే ఈ ‘సారీ’ విదిలించారు. వచ్చే ఏడాదికాలంలోనైనా ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తే కేటాయించిన నిధులు వినియోగంలోకి రానున్నాయి. సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల పరిస్థితి కూడా దాదాపు అంతే. గత బడ్జెట్లో కేటాయించిన రూ.121 కోట్ల నిధులను పూర్తిగా వినియోగించుకోకపోవడంతో మళ్లీ వాటినే తిరిగి కేటాయించారు. ప్రాణ‘హిత’మే ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టుకు ఈసారి కేటాయింపులు పెరిగాయి. గత బడ్జెట్లో రూ.737.05 కోట్లు కేటాయించగా ఈ బడ్జెట్లో రూ. 1051.05 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో 16.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనున్నాయి. ఒక్క మెదక్ జిల్లాలోనే 5,19,152 ఎకరాల ఆయకట్టుకు నీరు పారనున్నాయి. కేటాయించిన నిధులను సకాలంలో వినియోగించుకుంటేనే సమీప భవిష్యత్తులో ప్రాజెక్టు పనులు పూర్తయ్యే అవకాశాలున్నాయి. -
అధ్యక్షా..
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : సాధారణ ఎన్నికలు ముంచుకొస్తుండటం, తెలంగాణ ఏర్పాటుపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో సోమవారం నుంచి ఆరంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2014-15) ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రతిపాదించనుంది. ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలల వ్యయానికి సంబంధించి ఓటాన్ అకౌంట్‌కు సభ ఆమోదం పొందుతారు. ఈ సమావేశాలకు జిల్లాలోని ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండాలని, ఆయా పార్టీల అసెంబ్లీ ఫ్లోర్ లీడర్లు సమాచారం అందించడంతో జిల్లా ప్రజాప్రతినిధులు భాగ్యనగరం బాట పట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, ఆత్రం సక్కు, టీడీపీ ఎమ్మెల్యేలు గేడం నగేష్, సుమన్ రాథోడ్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, వేణుగోపాలాచారి, కావేటి సమ్మయ్య, నల్లాల ఓదేలు, అరవిందరెడ్డి, సీపీఐ శాసనసభా పక్షనేత, బెల్లంపల్లి ఎమ్మెల్యే గుండా మల్లేష్లు పాల్గొననున్నారు. కాగా బడ్జెట్ సమావేశాలు రెండు మూడు రోజులే నిర్వహించి ప్రభుత్వం సమస్యలపై చర్చించకుండా చేతులు దులుపుకోవాలని చూస్తుందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. గడువు పొడిగించాలి.. సోమవారం నుంచి ప్రారంభమవుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కాలం పొడిగించాలనే డిమాండ్ వెల్లువెత్తుతోంది. ఈ ఏడాది ఎన్నికలు జరగనుండడంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నిర్వహించడం జరుగుతోంది. దీంట్లో కేవ లం జీత భత్యాలు, ప్రభుత్వ నిర్వహణ నిధులపైనే ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఆమోదం పొందనున్నాయి. అయితే ప్రభుత్వం ప్రజల సమస్యలను పక్కన బెట్టి కేవలం బడ్జెట్‌ను ఆమోదించుకుని పక్కకు తప్పుకోవాలని చూస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ సమావేశాలను పది రోజులపాటు పొడిగించి రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు. నష్టపరిహారంపై చర్చించాలి.. జిల్లాలో ప్రధానంగా గతేడాది ఆగస్టు, సెప్టెంబర్లలో కురిసిన భారీ వర్షాలకు 61 వేల హెక్టార్లలో రూ.63 కోట్ల పంటలు రైతులు నష్టపోయారు. ఆరు నెలలు దాటినా పంట నష్టపరిహారం అందలేదు. దీంతో వచ్చే ఖరీఫ్ నాటికి పంట సాగుకు చేతిలో పైసలు లేక రైతన్నలు దిగులు చెందుతున్నారు. ఈ పరిస్థితిలో రైతుల సమస్యలపై చర్చించి పంట నష్టపరిహారం అందజేసే విషయంలో ప్రభుత్వం మెడలువంచుతారని భావిస్తే కేవలం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో ప్రభుత్వం సమస్యలపై దృష్టి సారించకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా రబీలో విద్యుత్ కోతల కారణంగా పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ఇటు పరిహరం రాక, అటు పంట నష్టంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గడిచిన ఖరీఫ్ నుంచి ఇప్పటివరకు 50 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరోవైపు అప్పట్లో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని రోడ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. రవాణ వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. సమావేశాలు బహిష్కరిస్తాం.. : టీఆర్ఎస్ ఈ పరిస్థితుల్లో జిల్లాలోని రోడ్ల అభివృద్ధి విషయంలో దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రవేశపెట్టనుండగా, తెలంగాణపై తప్పుడు లెక్కలు చూయిస్తే సమావేశాలు బహిష్కరిస్తామని టీఆర్ఎస్ హెచ్చరిస్తుంది. ఇంకోపక్క రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ సీమాంధ్ర శాసనసభ్యులు తీర్మానం చేయడాన్ని తెలంగాణ శాసనసభ్యులు జీర్ణించుకోవడం లేదు. అయితే సోమవారం ఆయా పార్టీలు తీసుకునే నిర్ణయం ఆధారంగా సమావేశాల్లో పాల్గొనాలా వద్దా అనేది నిర్ణయించుకునే అవకాశం ఉంది. ఇంకో పక్కా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే చివరి శాసనసభ సమావే శం అవుతుందని పలువురు జిల్లా నేతలు పేర్కొంటున్నారు. -
ఫిబ్రవరి మొదటివారంలో ఓటాన్ అకౌంట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ ముగించిన ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై దృష్టి సారించింది. ఫిబ్రవరి మొదటి వారంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశముందని ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గురువారం విలేకరులకు తెలిపారు. దీనిని సభలో ప్రవేశపెట్టేందుకు ఆర్థిక శాఖ సిద్ధంగా ఉందన్నారు. సీఎం తుది నిర్ణయం తీసుకోవలసి ఉందన్నారు. పునర్వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీలో తాము స్పీకర్‌కు అందించినవి అఫిడవిట్లు కాదని, కేవలం స్టేట్‌మెంట్లేనని ఆనం చెప్పారు. అఫిడవిట్లు వేరు, స్టేట్మెంట్లు వేరన్నారు. -
ఆరు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్!
వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటంతో ఆర్థిక శాఖ ప్రతిపాదన {పస్తుత ఆర్థిక సంవత్సరం కేటాయింపులే.. అయితే ఆరునెలలకే రాష్ట్రం విడిపోతే వేర్వేరు బడ్జెట్లు సాక్షి, హైదరాబాద్: 2014లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆరు నెలల కాల పరిమితితో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రూపొందించాలని ఆర్థిక శాఖ అధికారులు ప్రతిపాదించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలతో ఫైలును ఆర్థిక శాఖ సిద్ధం చేసింది. ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రి ఆమోదం అనంతరం అందుకు అనుగుణంగా బడ్జెట్‌ను రూపొందించనున్నారు. 2009 సాధారణ ఎన్నికల సందర్భంగా కూడా ఆరు నెలల పరిమితితో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రూపొందించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేటాయింపులనే వచ్చే ఆర్థిక సంవత్సరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్లోనూ పొందుపరుస్తారు. అయితే ఆరు నెలలకు మాత్రమే కేటాయింపులను పరిమితం చేయనున్నారు. ఏ పథకానికి కానీ, కార్యక్రమానికి కానీ కేటాయింపులను పెంచడం కానీ, తగ్గించడం కాని ఉండదని ఆర్థిక శాఖ వర్గాలు బుధవారం తెలిపాయి. అలాగే కొత్త కార్యక్రమాలు, పథకాలకు కేటాయింపులు ఉండవని పేర్కొన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రణాళిక, ప్రణాళికేతర పద్దుల కింద 1,61,368 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది. ఇందులో ప్రణాళిక వ్యయం కింద 59,442 కోట్ల రూపాయలు, ప్రణాళికేతర వ్యయం కింద 1,01,926 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆరు నెలలకు అంటే ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం కింద 80,684 కోట్ల రూపాయలకు మాత్రమే వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ బడ్జెట్‌ను రూపొందించనున్నారు. ఒక వేళ అప్పటికి రాష్ర్టం విడిపోయి రెండు ప్రభుత్వాలు ఏర్పాటైతే రెండు ప్రభుత్వాలు వేర్వేరుగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రూపొందించుకుంటాయని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.