మనకు మళ్లీ అరకొరే | Train bonanza in interim rail budget for Andhra Pradesh to wipe away split blues | Sakshi
Sakshi News home page

మనకు మళ్లీ అరకొరే

Published Thu, Feb 13 2014 3:44 AM | Last Updated on Mon, Oct 8 2018 9:17 PM

మనకు మళ్లీ అరకొరే - Sakshi

మనకు మళ్లీ అరకొరే

రాష్ట్రానికి మొండిచెయ్యి
ప్రత్యేకాకర్షణగా 2 డబుల్ డెక్కర్ రైళ్లు
ప్రభావం చూపలేకపోయిన కోట్ల

 
 సాక్షి, హైదరాబాద్: పేరుకు ప్రకటించింది 16 రైళ్లు. కానీ వాటిల్లో 15 కేవలం రాష్ట్రం మీదుగా ప్రయాణించేవే. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది 7 కాగా వాటిలో రోజూ తిరిగేవి... రెండంటే రెండే! చూస్తుంటే ‘పంచ పాండవులు మంచంకోళ్లు’ సామెత గుర్తొస్తోంది కదూ! మధ్యంతర రైల్వే బడ్జెట్‌లో మనకు జరిపిన కేటాయింపుల పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉంది. సంఖ్యాపరంగా గొప్పగా కనిపిస్తున్నా ప్రయోజనం అంతంతమాత్రమే. కొత్తగా కొన్ని రైళ్లను ప్రకటించటం మినహా ప్రాజెక్టులపరంగా రాష్ట్రానికి రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే నయా పైసా విదల్చలేదు. ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ కాబట్టి పెద్దగా ప్రాజెక్టుల ప్రకటన ఉండదని ముందే ఊహించినా కనీసం ఒకట్రెండు అంశాలనైనా ప్రస్తావిస్తారని అంతా ఊహించారు. కానీ నిరాశే మిగిలింది. గత రైల్వే బడ్జెట్‌లో కర్నూలు ప్రకటించిన కోచ్ మిడ్ లైఫ్ రిహాబిలిటేషన్ యూనిట్‌కైనా ఈసారి నిధులు కేటాయిస్తారని భావించారు. పైగా అది రైల్వే సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశరెడ్డి ఇలాకా గనుక నిధుల కేటాయింపు తథ్యమనుకున్నారు. కానీ ఖర్గే మాత్రం కరుణించలేదు. ఇక కొత్త మార్గాలు, డబ్లింగ్, ట్రిప్లింగ్, సర్వేల ఊసే ఎత్తలేదు. గత బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రాజెక్టులు దక్కేలా చూడటంలో పూర్తిగా విఫలమైన కోట్ల ఈసారైతే అసలే ప్రభావం చూపలేకపోయారు. కర్నూలు మీదుగా ఒక డబుల్ డెక్కర్ రైలు వేయించుకోవటం మినహా కనీసం తన ప్రాంతానికి కూడా ఏమీ చేయలేకపోయారు. కాజీపేట వ్యాగన్ యూనిట్, హైదరాబాద్‌లో రెండో దశ ఎంఎంటీఎస్ విస్తరణ, సికింద్రాబాద్‌లో రైల్ నీర్ బాట్లింగ్ యూనిట్, సికింద్రాబాద్‌లో రైల్వే అధికారులకు ప్రత్యేక శిక్షణ, అధ్యయన కేంద్రం, నగరంలో రైల్వే వైద్య కళాశాల, నర్సింగ్ కేంద్రం తదితర పెండింగ్ ప్రాజెక్టుల ఊసే లేకుండా పోయింది.


 ప్రత్యేక ఆకర్షణగా డబుల్ డెక్కర్ రైళ్లు...
 ప్రత్యేక ఆకర్షణగా భావించే డబుల్ డెక్కర్ రైళ్లను రాష్ట్రానికి కేటాయించటం ఒక్కటే కాస్త ఊరట. వాస్తవానికి గత అక్టోబరులోనే హైదరాబాద్-తిరుపతి మధ్య డబుల్ డెక్కర్ రైలు ప్రారంభం కావాల్సింది. కానీ చివరి నిమిషంలో దాన్ని మధ్యప్రదేశ్‌కు కేటాయించారు. ఈసారి దక్షిణ మధ్య రైల్వే అధికారులు బోర్డుపై తీవ్ర ఒత్తిడి తేవడంతో తాజా బడ్జెట్‌లో ఆ రైలుతో పాటు సికింద్రాబాద్-గుంటూరు మధ్య మరో డబుల్ డెక్కర్‌ను కూడా మంజూరు చేయటం విశేషం. అయితే ఈ రెండూ వారానికి రెండు రోజులే తిరుగుతాయి. అయితే వీటి విషయంలో ప్రత్యేకంగా ఏసీ అని పేర్కొన లేదు. దాంతో సాధారణ డబుల్ డెక్కర్లయి ఉంటాయనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.


 రోజూ నడిచే రైళ్లు రెండే...
 తాజా బడ్జెట్‌లో రాష్ట్రానికి సంబంధించి 15 కొత్త రైళ్లను ప్రకటించినా అందులో సికింద్రాబాద్-గుల్బర్గా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్టణం-గుణపురం రైళ్లు మాత్రమే రోజూ నడిచేవి. రెండు డబుల్‌డెక్కర్లు సహా మూడు రైళ్లు వారానికి రెండు రోజులు చొప్పున, మిగతావి వారానికి ఒకరోజు చొప్పున తిరిగేవే కావటం విశేషం. వాస్తవం ఇలా ఉంటే, మొత్తం కొత్త రైళ్ల కేటాయింపుల్లో దక్షిణ మధ్య రైల్వేకు ఏకంగా 28 శాతం వాటా దక్కిందంటూ అధికారులు గొప్పలు పోవడం కొసమెరుపు!
 
 ప్రత్యేకంగా రాష్ట్రానికి కేటాయించిన ఎక్స్‌ప్రెస్ రైళ్లు
-    ఔరంగాబాద్-రేణిగుంట (వారానికో రోజు)
-    హైదరాబాద్-గుల్బర్గా ఇంటర్‌సిటీ (ప్రతి రోజూ)
-    కాచిగూడ-నాగర్‌కోయిల్ ఎక్స్‌ప్రెస్ -వయా కరూర్, నమక్కల్,సేలం (వారానికో రోజు)
-    సికింద్రాబాద్-విశాఖపట్టణం ఏసీ ఎక్స్‌ప్రెస్- వయా కాజీపేట్, విజయవాడ (వారానికొకరోజు)
 
 డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు..

-    కాచిగూడ-తిరుపతి ఎక్స్‌ప్రెస్ (వారానికి రెండు రోజులు)
-    కాచిగూడ-గుంటూరు ఎక్స్‌ప్రెస్ (వారానికి రెండు రోజులు)
 ప్యాసింజర్ రైళ్లు..
-    విశాఖపట్టణం - గుణపురం (ఒరిస్సా) (ప్రతిరోజూ)
 
 రాష్ట్రం మీదుగా ప్రయాణించే ప్రీమియం ఎక్స్‌ప్రెస్ రైళ్లు
-    పాట్నా-బెంగళూరు ఎక్స్‌ప్రెస్- వయా విజయవాడ, వరంగల్, రామగుండం (వారానికో రోజు)
-    యశ్వంత్‌పూర్-కాట్రా ఎక్స్‌ప్రెస్ -వయా కాచిగూడ, గుల్బర్గా, నాగ్‌పూర్ (వారానికోరోజు)
-    యశ్వంత్‌పూర్-జైపూర్ ఏసీ ఎక్స్‌ప్రెస్ - వయా గుంతకల్, గుల్బర్గా (వారానికోరోజు)
-    కామాఖ్య-చెన్నై ఏసీ ఎక్స్‌ప్రెస్ -వయా విశాఖపట్టణం, హౌరా (వారానికోరోజు)
 
 రాష్ట్రం మీదుగా ఎక్స్‌ప్రెస్ రైళ్లు
 1. హౌరా-యశ్వంత్‌పూర్ ఏసీ ఎక్స్‌ప్రెస్ వయా విశాఖపట్టణం, గూడూరు, కట్పాడి (వారానికో రోజు)
 2. వారణాసి-మైసూరు ఎక్స్‌ప్రెస్ -వయా గుంతకల్, దౌండ్ (వారానికి రెండు రోజులు)
 3. ముంబై-చెన్నై ఎక్స్‌ప్రెస్ -వయా గుంతకల్, వాడి (వారానికో రోజు)
 4.మన్నార్‌గుడి-జోధ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ -వయా విజయవాడ  (వారానికో రోజు)


 ఫ్రీక్వెన్సీ పెరిగిన రైళ్లు
 (ఇవన్నీ ఇప్పటిదాకా వారానికి మూడు రోజులు నడుస్తుండగా, ఇకపై రోజూ తిరుగుతాయి)
 1.బీదర్-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (16571/16572)
 2.విజయవాడ-హుబ్లీ ఎక్స్‌ప్రెస్ (17225/17226)
 3.సికింద్రాబాద్-హుబ్లీ ఎక్స్‌ప్రెస్ ((17319/17320)
 
 ఇవి దక్షిణ మధ్య రైల్వే పరిధిలోవే గానీ రాష్ట్రానికి ప్రయోజనం శూన్యం

 -    నాందేడ్ - ఔరంగాబాద్ ఎక్స్‌ప్రెస్ (వారానికోరోజు) వయా-పూర్ణ, పర్బణి. (దక్షిణ మధ్య రైల్వేకు మంజూరైన  ఈ రైలు రాష్ట్రం మీదుగా వెళ్లదు)
 -    లాతూరు రోడ్డు - కుర్దువాడి, పర్బణి - పర్లి మధ్య డబ్లింగ్ లైన్ నిర్మాణానికి సర్వే పనులు మంజూరయ్యాయి. ఈ రెండు కూడా రాష్ట్రం వెలుపల ఉన్నవే.
 
 వైష్ణోదేవి ప్రయాణికులకు రైలు
 వైష్ణోదేవి ఆలయ బేస్ క్యాంప్ అయిన కాత్రా వెళ్లేందుకు కాశ్మీర్ రైల్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ఉధంపూర్-కాట్రా రైలు మార్గ నిర్మాణం పూర్తయిందని, యాత్రికుల కోసం అతి త్వరలోనే ప్యాసింజర్ రైళ్లను ప్రారంభమవుతాయని ఖర్గే తెలిపారు. ఈ మార్గంలో రైళ్లను ప్రయోగాత్మకంగా నడుపుతున్నామని, ఇది అందుబాటులోకి వస్తే లక్షలాది యాత్రికులకు ప్రయోజనముంటుందని అన్నారు.
 
 పార్సిల్ రైళ్లలో పాల రవాణా
 పార్సిల్ రవాణా అవకాశాలను అందిపుచ్చుకోవడానికి దేశవ్యాప్తంగా ప్రత్యేక పార్సిల్ రైళ్లలో పాల రవాణా చేపట్టనున్నట్లు ఖర్గే వెల్లడించారు. పాల రవాణాను ప్రోత్సహించడం, పార్సిల్ రవాణాను పెంచడానికి కొత్త విధానాన్ని రూపొందించనున్నట్లు తెలిపారు.
 
 రైల్వే టారిఫ్ అథారిటీ ఏర్పాటు
 రైల్వే ప్రయాణ, రవాణా చార్జీలను సహేతుకంగా నిర్ణయించడంలో ప్రభుత్వానికి సలహా ఇచ్చేందుకు స్వతంత్రప్రతిపత్తి గల రైల్వే టారిఫ్ అథారిటీ(ఆర్టీఏ)ను ఏర్పాటు చేస్తున్నట్లు ఖర్గే తెలిపారు. చార్జీల నిర్ణయంలో పారదర్శకతకు ఇది దోహదపడుతుందన్నారు. ఆర్టీఏ ఏర్పాటు విప్లవాత్మకమని, చార్జీల ఖరారు ఇక చాటుమాటు వ్యవహారం కాబోదని అన్నారు.   
 
 అగ్ని, పొగ గుర్తింపు వ్యవస్థ
 అగ్ని, పొగను పసిగట్టే సమగ్ర విధానాన్ని రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నామని, పరీక్షలు విజయవంతమైతే త్వరలో అన్ని పెద్ద రైళ్లలో ఈ విధానాన్ని ప్రవేశపెడతామని ఖర్గే చెప్పారు. రైళ్లు ఢీకొనకుండా నివారించేందుకు దేశీయంగా అభివృద్ధిపరచిన పరికరాన్ని కూడా అమర్చుతామన్నారు. అగ్ని నిరోధక పరికరాలు, ఎలక్ట్రిక్ సర్క్యూట్ల భద్రతకు బహుళ అంచెల రక్షణ అమలు వంటి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైల్వే క్రాసింగ్‌ల వద్ద రైళ్ల రాక గురించి దృశ్య-శ్రవణ రూపంలో హెచ్చరికలు జారీ చేసే వ్యవస్థను ప్రవేశపెట్టాలనుకుంటున్నట్లు తెలిపారు.
 
 కాపలా లేని క్రాసింగ్‌ల తొలగింపు
 ప్రమాదాల నివారణకు  నిర్దిష్ట కాలపరిమితిలోగా కాపలా లేని అన్ని క్రాసింగ్‌లను తొలగించనున్నట్లు ఖర్గే తెలిపారు. క్రాసింగ్‌ల తొలగింపు, లేదా వాటి వద్ద కాపలా ఉంచడం, రద్దీ మార్గాల్లోని కాపలా క్రాసింగ్‌లను ఓవర్, అండర్‌బ్రిడ్జిలుగా మార్చడం రైల్వే లక్ష్యమన్నారు. దేశంలో మొత్తం 18,672 క్రాసింగ్‌లు ఉన్నాయని, వీటిలో 12,582 కాపలా లేనివని తెలిపారు. గత ఐదేళ్లలో 5,400 కాపలా లేని క్రాసింగ్‌లను తొలగించామన్నారు.
 
 తప్పుడు హామీలు: మమత
 కోల్‌కతా: ఓటాన్ అకౌంట్‌గా ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ ఇంటికి వెళ్లిపోతున్న ప్రభుత్వ తప్పుడు హామీ అని రైల్వే మాజీ మంత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. వచ్చే నాలుగు నెలల కోసం ఖర్చులకు పార్లమెంటు అనుమతి తీసుకోవడానికి పెట్టే బడ్జెట్‌లో హామీలివ్వడం రాజ్యాంగ విరుద్ధం, అనైతికమని ఫేస్‌బుక్‌లో విమర్శించారు.  
 
 ప్రయోజనం లేదు: దత్తాత్రేయ
 సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే బడ్జెట్‌కు  రంగు, రుచి, వాసన లేదని, ప్రజలకు ప్రయోజనం లేదని బీజేపీ నేత బండారు దత్తాత్రేయ పెదవి విరిచారు. ఎన్నికలే లక్ష్యంగా ప్రయాణికుల సౌకర్యాలను పట్టించుకోకుండా బడ్జెట్‌ను రూపొందించారని, ఆంధ్రప్రదేశ్‌కి మరోసారి మొండి చెయ్యి చూపారని విమర్శించారు.
 
 భారతీయ రైల్వే విశేషాలు...
 -    {పపంచంలోని అతి పెద్ద రైల్వే నెట్‌వర్కుల్లో ఒకటి
 -    రోజూ 2.3 కోట్ల మంది ప్రయాణికులను గమ్యాలకు చేరవేస్తోంది. 26.5 లక్షల టన్నుల సరుకులను రవాణా చేస్తోంది
 -    రోజూ 12 వేల ప్యాసింజర్ రైళ్లు, 7,000 గూడ్స్ రైళ్లు నడుపుతోంది. రైల్వేలో 1.4 లక్షల మంది ఉద్యోగులున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement