సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పార్లమెంటులో ఈ సారి రైలు కూత గట్టిగానే వినిపించింది. రైల్వే మంత్రి మల్లిఖార్జున ఖర్గే బుధవారం ప్రవేశపెట్టిన 2014-15 బడ్జెట్ రైలు ప్రయాణికులకు ఊరటనిచ్చింది. స్వస్థలం మీద ప్రేమో.. సొంత నియోజకవర్గంపై అభిమానమో తెలియదు కానీ.. మన జిల్లా గుండా కర్ణాటకకు వెళ్లేలా రెండు కొత్త రైళ్లను ఈ ఏడాది ప్రార ంభించనున్నట్లు ఖర్గే ప్రకటించారు. అలాగే ఇప్పటికే నడుస్తున్న రెండు రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచుతున్నట్లు వెల్లడించారు.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఏడు కొత్త ట్రైన్లు ప్రకటించగా.. అందులో రెండు మన జిల్లా నుంచి రాకపోకలు సాగించేవి ఉండడం గమనార్హం. గుల్బర్గా లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్లిఖార్జున ఖర్గే.. స్వరాష్ట్రానికి రైల్వే బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. కొత్త రైళ్ల జాడ కనిపించినా.. రైల్వే లైన్ల ప్రతిపాదనలకు మాత్రం మోక్షం కలగలేదు. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న వికారాబాద్- కృష్ణా కొత్త లైన్‌కు నయాపైసా కేటాయించలేదు. ఈసారి బడ్జెట్‌లో ఈ లైన్‌కు ఆమోదం లభిస్తుందని గంపెడాశతో ఎదురుచూసిన రైలు ప్రయాణికులకు నిరాశే మిగిలింది.
లైన్ నిర్మాణ వ్యయంలో సగం భరించేందుకు రాష్ట్ర సర్కారు ముందుకొచ్చినా.. కేంద్రం ఈసారి కూడా మొండిచేయే చూపింది. మరోవైపు వికారాబాద్ వరకు పొడిగిస్తారని భావించిన ఎంఎంటీఎస్ రైలు విషయాన్ని రైల్వే శాఖ పట్టించుకోలేదు. వికారాబాద్‌లో వ్యాగన్ ఫ్యాక్టరీ, హైటెక్ రైల్వే స్టేషన్ అంశాన్ని కూడా పట్టించుకోకపోవడం జిల్లా ప్రజలకు అసంతృప్తి మిగిల్చింది.
కొత్త రైళ్లు ఇవే..
ఔరంగాబాద్ - రేణిగుంట వయా వికారాబాద్
హైదరాబాద్ - గుల్బర్గా వయా శంకర్‌పల్లి, వికారాబాద్, తాండూరు
{ఫీక్వెన్సీ పొడగింపు
ఇక ప్రతి రోజూ..
వారానికి 3 రోజులు నడిచే బీదర్- యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ వారానికి మూడు రోజులు తిరిగే సికింద్రాబాద్- హూబ్లీ ఎక్స్‌ప్రెస్