ఒంగోలు, న్యూస్‌లైన్: పార్లమెంట్‌లో బుధవారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు మళ్లీ మొండిచేయే చూపారు. దీంతో జిల్లాలో రైల్వే ప్రయాణికులే కాకుండా రైల్వే కార్మికులు కూడా తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఒంగోలు రైల్వేస్టేషన్ అభివృద్ధి గురించి పట్టించుకుంటున్న అధికారులు లేరు.
ఒక రకంగా చెప్పాలంటే అభివృద్ధి ఊసే మరిచారు. ఇటీవల భారీ వర్షాలకు ఒంగోలు రైల్వేస్టేషన్లోని ట్రాక్‌పై కూడా నీరు నిలిచి రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. క్వార్టర్లలో నివాసం ఉండే రైల్వే ఉద్యోగుల ఇళ్లు మొత్తం నీటలోనే మునిగిపోయాయి. రైల్వే ఉద్యోగుల కోసం ఒంగోలు రైల్వేస్టేషన్లో ఉన్న హాస్పిటల్‌లో సరైన మెటీరియల్ కూడా ఉండదు. బీపీ, షుగర్ బిళ్లలు సైతం అంతంత మాత్రమే. రైల్వేస్టేషన్‌లో మరో‘సారీ’..
ఫుట్ ఓవర్ బ్రిడ్జి మాత్రమే ఉండడంతో వికలాంగులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరిగే సమయంలోనే మెట్లతోపాటు ర్యాంప్ కూడా ఏర్పాటు చేయాలని జీఎం చెప్పిన మాటలు సైతం నీటిమూటలే అయ్యాయి.
జిల్లాలో శ్రీకాళహస్తి-నడికుడి రైల్వే లైను పశ్చిమ ప్రకాశానికి ఎంతో ఉపయోగం. గత బడ్జెట్‌లో దీనికి మోక్షం కలిగింది. రాష్ట్ర ప్రభుత్వం- రైల్వేశాఖ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు అంగీకరించాయి. ఆరు నెలల క్రితం అద్దంకి మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ విజ్ఞప్తి మేరకు అద్దంకిని కూడా ఈ లైన్‌లో చేర్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం స్థల సేకరణకు సంబంధించి సరైన చర్యలు చేపట్టని కారణంగా ఈ లైను పెండింగ్‌లోనే ఉంది. తాజా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో కూడా ఎప్పుడు పనులు మొదలు పెడతారో స్పష్టం చేయలేదు.
ఇక ఒంగోలు-దొనకొండ మార్గంపై సర్వేకు కూడా అధికారులు ఆదేశించకపోవడంతో కొత్త రైల్వే లైన్లకు సంబంధించి జిల్లాకు మొండిచేయే మిగిలింది. జిల్లాలోని చాలా రైల్వేస్టేషన్లలో మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటు చేస్తామని ప్రకటించారే గానీ ఆ దిశగా చర్యలు కూడా లేవు. ఇక భద్రత పరంగా రైల్వేస్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేసినా సిబ్బంది సంఖ్యను మాత్రం పూర్తిగా పెంచలేదు.
రైల్వే మంత్రి హామీ నెరవేరలేదు
ప్రస్తుత బడ్జెట్‌లో జిల్లాకు పెద్దగా ఉపయోగపడే ప్రాజెక్టులు ఏమీ లేవు. ప్రత్యేకించి మార్కాపురానికి పనికి వచ్చే నూతన రైళ్ల ఏర్పాటు, ట్రాక్‌ల అభివృద్ధిపై బడ్జెట్‌లో ప్రస్తావనే లేదు. కేవలం అమరావతి -హుబ్లీ ప్రతి రోజు నడపటం, విజయవాడ -కాచిగూడ డబుల్ డెక్కర్ రైలు ఏర్పాటు చేయడం తప్ప ఆశించిన స్థాయిలో బడ్జెట్‌లో పేర్కొనలేదు. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి గత ఏడాది మార్కాపురం పర్యటన సందర్భంగా మేము ఇచ్చిన వినతి పత్రానికి స్పందించి వచ్చే బడ్జెట్‌లో (ప్రస్తుత) మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
హామీలు మాత్రం నెరవేరలేదు. ప్రధానంగా కర్నూలు నుంచి విజయవాడ వరకు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్, విజయవాడ నుంచి ముంబై వయా గుంతకల్ మీదుగా ఎక్స్‌ప్రెస్ రైలు, గుంటూరు -హైదరాబాదు ఎక్స్‌ప్రెస్ రైలు, మార్కాపురం రైల్వేస్టేషన్‌ను మోడల్‌స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని మంత్రికి విన్నవించగా, కొన్ని మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చి ఒక్కటి కూడా చేయించలేదు. -ఓ.ఎ.మల్లిక్, మార్కాపురం ప్యాసింజర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
ఉపయోగం లేని బడ్జెట్
ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల వారు శ్రీశైలం వెళ్లాలంటే మార్కాపురం రైల్వేస్టేషన్‌లో దిగాల్సిందే. మూడో ట్రాక్ ఏర్పాటు, మోడల్ రైల్వేస్టేషన్‌గా మార్పు, విద్యుదీకరణ గురించి ప్రస్తుత బడ్జెట్‌లో పేర్కొనలేదు. గుంటూరు- తిరుపతి వయా డోన్ మీదుగా రైలు ఏర్పాటు చేయాలని దశాబ్ద కాలంగా కోరుతున్నా స్పందన లేదు. శ్రీశైలం రైలు మార్గంపై కూడా బడ్జెట్‌లో పేర్కొనకపోవడం శోచనీయం. - కె.ప్రసాద్, కఫార్డ్ సంస్థ చైర్మన్
మరో‘సారీ’..
Published Thu, Feb 13 2014 3:40 AM | Last Updated on Mon, Oct 8 2018 9:17 PM
Advertisement