Railway workers
-
రైల్వే పోర్టర్లకు ఆపన్నహస్తం
సాక్షి, హైదరాబాద్: రైళ్లు నిలిచిపోవటంతో పనుల్లేక ఇబ్బంది పడుతున్న రైల్వే కూలీలకు ఆ శాఖ సిబ్బంది ఆపన్నహస్తం అందించారు. లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని రైళ్లు నిలిచిపోయాయి. దీంతో పనుల్లేక రైల్వే పోర్టర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రయాణికులు ఇచ్చే డబ్బులు తప్ప వీరికి ప్రత్యేకంగా జీతం అంటూ ఉండదు. దీంతో వీరికి ఆదాయం లేక వారి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. దీన్ని గుర్తించిన దక్షిణ మధ్య రైల్వే కమర్షియల్ విభాగం సిబ్బంది డబ్బులు పోగు చేసి నిత్యావసర వస్తువులు కొని వారికి అందించారు. కొంత నగదు కూడా అందజేశారు. హైదరాబాద్ డివిజన్లో 101 మందికి బియ్యం, పప్పు, నూనె ప్యాకెట్లు, గోధుమ పిండి, ఉప్పు, సబ్బులు, శానిటరీ కిట్లతో పాటు మరికొన్ని వస్తువులను ప్యాకెట్లుగా చేసి వారికి అందజేశారు. వీటితోపాటు ఒక్కొక్కరికి రూ. 2,600 చొప్పున నగదు కూడా అందజేశారు. గుంతకల్లు డివిజన్లో 40 మందికి సరుకులతోపాటు రూ.500 నగదు, గుంటూరు డివిజన్ పరిధిలో 33 మందికి సరుకులతోపాటు రూ. 1,500 నగదు, నాందేడ్ డివిజన్ పరిధిలో 33 మందికి సరుకులు అందజేశారు. కమర్షియల్ విభాగం సిబ్బంది వితరణను దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా అభినందించారు. -
రైల్వే కార్మిక సమస్యలపై కేంద్రం మొండి వైఖరి
హైదరాబాద్: రైల్వే కార్మికుల సమస్యలపట్ల కేంద్రం మొండివైఖరి కనబరుస్తోందని ఎన్.ఎఫ్.ఐ.ఆర్, దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య అన్నారు. శుక్రవారం ఇక్కడ లాలాగూడ వర్క్‌షాప్ ఎస్సీఆర్ఈఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదం సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో సౌత్ ఇన్స్టిట్యూట్లో 20వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్మికులు భారీ ర్యాలీగా ఇన్స్టిట్యూట్కు చేరుకున్నారు. రాఘవయ్య మాట్లాడుతూ 7వ వేతన కమిషన్‌లో రైల్వే కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని విచారం వ్యక్తం చేశారు. రైల్వేలోని రెండున్నర లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకుండా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కేంద్రం ఓ వైపు ‘మేకిన్ ఇండియా’ అంటూనే రైల్వేను ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. అప్రెంటీస్లకు ఉద్యోగాలిచ్చే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, వర్క్‌షాప్‌లో పనిచేసే ఇంజనీర్లు, సూపర్వైజర్లు, వర్కర్లకు ఇన్సెంటివ్స్, బోనస్‌లను పెంచాలని డిమాండ్ చేశారు. లాలాగూడ వర్క్‌షాప్‌లో పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతిచెందిన కార్మికుడి కుటుంబసభ్యులకు సంఘ్ ఆధ్వర్యంలో రూ.2 లక్షల చెక్కు అందజేశారు. కార్యక్రమంలో సంఘ్ జోనల్ ప్రెసిడెంట్ ప్రభాకర్ ఆండ్రూ, సెక్రటరీ ఎం.జి.అరుణ్‌కుమార్, సంఘ్ ప్రతినిధులు సాంబశివరావు, హేమంత్‌కుమార్, నర్సింగ్‌రెడ్డి, మోహన్‌రావు, హైమరాజన్, గుణాకర్, బుచ్చాగౌడ్, ముస్తఫా, రమణ, స్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఈసారైనా..
జిల్లా వాసుల ఆశలు పట్టాలెక్కేనా.. కాజీపేట రూరల్ : ఉత్తర, దక్షిణ భారతదేశ ప్రాంతాలకు గేట్వేగా ఉన్న కాజీపేట జంక్షన్‌కు ఈ సారి రైల్వే బడ్జెట్లో న్యాయం జరగాలని ఈ ప్రాంత ప్రజలు, రైల్వే కార్మికులు ఆశిస్తున్నారు. కాజీపేట జంక్షన్లో మూడు ఫ్లాట్‌ఫాంలు మాత్రమే ఉన్నాయి. అదనంగా మరో మూడు ప్లాట్‌ఫాంలు కావాలనే డిమాండ్ ఉంది. ఈ బడ్జెట్లో అదనపు ప్లాట్‌ఫాంలు మంజూరైతే రైళ్ల సంఖ్య ఇక్కడి నుంచి పెరగడమే కాకుండా వచ్చిన రైళ్లకు ట్రాఫిక్ అంతరాయం ఉండదు. అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి తిరుపతికి కాజీపేట జంక్షన్ మీదుగా వెళ్లే పద్మావతి ఎక్స్‌ప్రెస్ వారానికి రెండు రోజులు ఉండదు. జిల్లా నుంచి తిరుమలకు వెళ్లే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న దృష్ట్యా పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ను వారం రోజుల పాటు పొడిగించితే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది. ఎస్కలేటర్ ఎప్పుడో.. ఈ జంక్షన్ నుంచి ప్రతి రోజు సుమారు 15 వేల మంది ప్రయాణికులు వివిధ రైళ్ల ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు. కాజీపేటలో చంటి పిల్లవాడి నుంచి వృద్ధుల వరకు పుట్ఓవర్ బ్రిడ్జి మీదుగానే వెళ్లాలి. ఇక్కడ ఎస్కలేటర్ నిర్మాణం జరిగితే అందరికీ సౌకర్యంగా ఉంటుంది. అదేవిధంగా డీజిల్ లోకోషెడ్, ఎలక్ట్రిక్ లోకోషెడ్ల సామర్థ్యం నిర్వాహణ మరింత పెరిగేందుకు బడ్జెట్లో నిధులు మంజూరు కావాలని కార్మికులు కోరుతున్నారు. అప్రెంటీస్ ట్రైనింగ్ సెంటర్ అయ్యేనా.. కాజీపేటలో ఆక్ట్ అప్రంటీస్ ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని గత పదేళ్ల నుంచి డిమాండ్ ఉంది. కాజీపేటలో ఎక్కువ శాతం రైల్వే కార్మికుల పిల్లలు ఐటీఐ చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నారు. ఇక్కడ అప్రంటీస్ ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కాజీపేట–బెల్లంపల్లికి పుష్పుల్ వచ్చేనా.. కాజీపేట నుంచి బెల్లంపల్లి వరకు పుష్పుల్ ప్యాసింజర్ కావాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు పాట్నా ఎక్స్‌ప్రెస్ తర్వాత సాయంత్రం 5.30 గంటలకు భాగ్యనగర్ వరకు ఒక్క రైలు లేదు. ఈ మధ్యకాలంలో పుష్పుల్ వేస్తే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది. కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్‌కు చోటు దొరికేనా.. కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్‌ను 2006లో నిర్మించారు. అప్పటి నుంచి ఈ స్టేషన్ నుంచి ఒక్కటే ప్యాసింజర్ రాకపోకలు చేస్తుంది. ఈ టౌన్ స్టేషన్ మీదుగా న్యూఢిల్లీ–విజయవాడ, హైదరాబాద్ మార్గంలో వందల రైళ్లు రాకపపోకలు సాగిస్తాయి. ఇక్కడ కొన్ని రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని, స్టేషన్‌ను కూడా అభివృద్ధి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. పలు రైళ్లకు హాల్టింగ్ లభించేనా.. కాజీపేటలో ఆగకుండా వెళ్తున్న సికింద్రాబాద్–కాకినాడ ఏసీ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–విశాఖ వెళ్లే దురంతో, సికింద్రాబాద్–విశాఖపట్నం వెళ్లే గరీభ్‌రథ్, సికింద్రాబాద్–గౌహతి వెళ్లే గౌహతి, సికింద్రాబాద్–నిజాముద్దీన్ వెళ్లే దురంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కాజీపేటలో హాల్టింగ్ కల్పించాలని ఈ ప్రాంత ప్రయాణికులు కోరుతున్నారు. -
క్షణం ఆలస్యమైతే ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి!
రైల్వే ట్రాక్ ను దాటబోతున్న సైక్లిస్ట్ ను ఓ రైల్వే వర్కర్ ప్రాణాలకు తెగించి కాపాడాడు. ఈ సంఘటన చైనాలో చోటు చేసుకుంది. ట్రాక్ వెంబడి ఉన్న సీసీటీవీల్లో ఈ ఘటన మొత్తం రికార్డు అయింది. మత్తులో ఉన్న ఓ సైక్లిస్ట్ దారిలో అడ్డం వచ్చిన ఓ రైల్వే ట్రాక్ దాటబోయాడు. తాగిన మత్తులో ఏం చేస్తున్నాడో అర్ధంకాక ట్రాక్ తగిలి మధ్యలో పడిపోయాడు. మళ్లీ పైకి లేచి సైకిల్ ను ట్రాక్ అవతలి వైపు విసేరేశాడు. ఇంతలో అతని వెనుకగా రైలు వస్తోంది. ఇది గమనించిన అక్కడ పనిచేసే రైల్వే కార్మికుడు తొలుత రైలు శబ్దానికి సైక్లిస్ట్ పక్కకు తప్పుకుంటాడని భావించాడు. రైలు సమీపిస్తున్న సైక్లిస్ట్ ట్రాక్ మధ్యలో నిలబడిపోవడంతో పరుగెత్తుకు వచ్చి అతన్ని పక్కకు నెట్టాడు. కళ్లు మూసి తెరిచి లోపు సమయంలో ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఆ తర్వాత కొంత సమయం వరకూ ఇద్దరూ షాక్ కు గురైనట్లు కనిపించారు. ఈ వీడియో ఇప్పుడు ఆన్ లైన్ లో వైరల్ అయింది. అయితే, కొంతమంది మాత్రం రైలును మరింత దగ్గరగా చూపించేలా వీడియోను ఎడిట్ చేసి ఉంటారని అంటున్నారు. -
క్షణం ఆలస్యమైతే ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి!
-
రైల్వే సిబ్బందికి 78 రోజుల బోనస్
- సీబీఈసీ ఐటీ ప్రాజెక్టుకు ఆమోదం - కేంద్ర కేబినెట్ నిర్ణయాలు న్యూఢిల్లీ: రైల్వే ఉద్యోగులకు శుభవార్త. 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గత ఐదు సంవత్సరాలుగా ఇదే మొత్తంలో రైల్వే ఉద్యోగులకు కేంద్రం బోనస్ అందిస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి గానూ అర్హులైన నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు(ఆర్పీఎఫ్, ఆర్పీఎస్ఎఫ్ సిబ్బందిని మినహాయించి) 78 రోజుల వేతనాన్ని ఉత్పాదకత ఆధారిత బోనస్(పీఎల్బీ)గా ఇవ్వనున్నారు. దసరా ముందు దాదాపు 12 లక్షల మంది రైల్వే ఉద్యోగులు ఈ బోనస్‌ను అందుకోనున్నారు. ఈ బోనస్ వల్ల రూ. 2090.96 కోట్ల భారం పడనుంది. తాము డిమాండ్ చేసిన మొత్తాన్ని బోనస్‌గా ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించడంపై ‘నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్’ సంస్థ ప్రధాన కార్యదర్శి ఎం రాఘవయ్య హర్షం వ్యక్తం చేశారు. ‘సాక్ష్యం’ ప్రాజెక్టుకు ఓకే వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వ్యవస్థతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్, కస్టమ్స్(సీబీఈసీ)ను అనుసంధానించేందుకు ఉద్దేశించిన ఐటీ ప్రాజెక్టు ‘సాక్ష్యం’కు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రాజెక్టు వ్యయం రూ. 2,256 కోట్లు. ‘జీఎంబీఎం’ను అంగీకరించం పౌర విమానయానరంగ కార్బన్‌డై ఆక్సైడ్ ఉద్గారాల స్థాయిని 2020 నాటికి కనిష్టస్థాయికి తగ్గించాలన్న నిర్ణయానికి భారత్ తలొగ్గబోదని, అది అన్యాయమని కేబినెట్ భేటీ అనంతరం జవదేకర్ స్పష్టం చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశంగా తమకు మరింత సమయం అవసరమన్నారు. ఐరాసకు చెందిన ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ప్రతిపాదిస్తున్న ‘గ్లోబల్ మార్కెట్ బేస్డ్ మెజర్స్(జీఎంబీఎం)’ తమకు ఆమోదనీయం కాదని తేల్చిచెప్పారు. కేబినెట్ భేటీలో జీఎంబీఎంపై చర్చించామన్నారు. పారిస్ ఒప్పందానికి ఓకే చరిత్రాత్మక పారిస్ వాతావరణ ఒప్పందానికి కేంద్ర కేబినెట్ అధికారికంగా ఆమోదం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా భూతాపోన్నతిని తగ్గించే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై అంతర్జాతీయ స్థాయిలో ఈ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. వాతావరణ మార్పుపై పోరులో భారత్ నాయకత్వ స్థాయిని ఈ నిర్ణయం ప్రతిఫలిస్తుందని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. కనీసం 55 దేశాలు అధికారికంగా ఈ ఒప్పందాన్ని ధ్రువీకరించాల్సి ఉంది. కాగా, సృజనాత్మకత, సాంకేతిక అభివృద్ధిలో పరస్పర సహకారానికి ఉద్దేశించి సింగపూర్‌తో కుదుర్చుకోనున్న అవగాహన ఒప్పందానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. -
రైల్వే కార్మికులకు శుభవార్త
-2014-15 నాటి బోనస్ బకాయి మంజూరు కాజీపేట రూరల్ : కేంద్ర ప్రభుత్వం రైల్వే కార్మికులకు 2014-15 సంవత్సరం నాటి బోనస్ పాత బకాయిలను మంజూరు చేసింది. ఈ మేరకు కాజీపేట రైల్వే మజ్దూర్ యూనియన్ కార్యాలయంలో శుక్రవారం రైల్వే మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ జోనల్ అధ్యక్షుడు కాల్వ శ్రీనివాస్, కాజీపేట మజ్దూర్ యూనియన్ కోఆర్డినేటర్ పి.రవిందర్ విలేకరులతో మాట్లాడారు. ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ (ఏఐఆర్ఎఫ్) ఢిల్లీ నేతృత్వంలో రైల్వే కార్మికులకు రూ.3,500 సీలింగ్‌తో బోనస్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేయగా కేంద్రం పార్లమెంట్లో బోనస్ చట్టం ఆమోదించి రూ.7,000 సీలింగ్‌తో బోనఽఽస్ ఇచ్చేందుకు అంగీకరించిందని తెలిపారు. దీంతో 2014-15 సంవత్సరం 78 రోజుల బోనస్‌కు రూ.7000 సీలింగ్‌తో రూ.17,951లు మంజూరు చేసిందని చెప్పారు. గత సంవత్సరం బోనస్‌లో రూ.8,975 రైల్వే కార్మికులు తీసుకున్నారని, మిగిలిన బకాయి బోనస్‌ను రూ.8,975 అక్టోబర్ నెల వేతనంలో రైల్వే కార్మికులకు రానున్నట్లు తెలిపారు. 2015-16 సంవత్సరానికి గాను ప్రతి దసరా పండుగకు అనవాయితీగా రైల్వే కార్మికులకు ఇచ్చే బోనస్ రైల్వే శాఖ ఇంక ప్రకటించలేదని, త్వరలో రూ.7,000 సీలింగ్ పద్ధతిన బోనస్‌ను కేంద్రం మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఏఐఆర్ఎఫ్ కృషి ఫలితంగానే కార్మికులకు పాత బకాయి బోనస్ మంజూరు అయిందని తెలిపారు. -రైల్వే కార్మికులకు మరో రెండు రెఫరెల్ ఆస్పత్రులు కాజీపేట రైల్వే ఆస్పత్రి కేంద్రంగా వైద్యం అందుకుంటున్న రైల్వే కార్మికులకు నగరంలో మరో రెండు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను రెఫరెల్‌గా చేయాలని సికింద్రాబాద్ రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని శ్రీనివాస్ తెలిపారు. త్వరలో ఈ రెండు ఆస్పత్రులకు సంబంధించిన అనుమతి కోసం రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు వెళ్లాయని, కొద్ది రోజులలో బోర్డు అనుమతి పొంది రెండు రెఫరెల్ ఆస్పత్రులు మంజూరు కానున్నాయని చెప్పారు. -
రామగుండంలో ప్రధాని దిష్టిబొమ్మ దహనం
రామగుండం: ఏడో వేతన సంఘం సిఫారసుల్లో అన్యాయం జరిగిందంటూ రైల్వే కార్మికులు, సిబ్బంది కరీంనగర్ జిల్లా రామగుండంలో ఆందోళనకు దిగారు. స్థానిక రైల్వేస్టేషన్ ఎదురుగా గురువారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
హై‘టెన్షన్’ బతుకులు
రైల్వేస్టేషన్ : రైల్వేలో విద్యుత్ విభాగం కీలకమైంది. హైటెన్షన్ వైర్లుతో విద్యుత్ సరఫరా అవుతుంటోంది. అయితే అంతరాయం కలిగినప్పుడు కార్మికులు ప్రాణాలుకు కూడా లెక్కచేయకుండా పనిచేయాలి. విభాగంలో సమన్వయలోపంతోనూ ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. దీంతో కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. రైల్వే ట్రాక్ మీద ఉన్న ఇరవై ఐదు వేల కిలోవాట్స్ విద్యుత్ లైన్లో ఆరు నెలల కాలంలో పలువురు కార్మికులు ప్రమాదాలకు లోనయ్యారు. 25 వేల కిలో వాట్స్ విద్యుత్ లైన్లో పనిచేసే కార్మికులకు పూర్తిస్థాయిలో రక్షణ కరువైంది. గతంలో విజయవాడకు చెందిన సీనియర్ సెక్షన్ ఇంజినీరు ఓహెచ్ఈ ఒకరు గన్నవరం రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వే యార్డులో విధులు నిర్వహిస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఇదే డిపోలో హెల్పర్‌గా పనిచేస్తున్న కార్మికుడు కొండపల్లి యార్డులో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. విజయవాడ డివిజన్ పరిధిలోని రేగుపాలెంలో ఒక కార్మికుడు ప్రమాదానికి గురయ్యాడు. డిసెంబర్ నుంచి విజయవాడ డివిజన్ పరిధిలోని ఓహెచ్ఈ విద్యుత్ విభాగంలోని పనిచేస్తున్న కార్మికులు ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదాలకు గురవుతూనే ఉన్నారు. ఎంతో ప్రమాదకరమైన విద్యుత్ లైన్లో పనిచేస్తున్న కార్మికుల భద్రత విషయంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
‘రైల్వే కార్మికులకూ ఓఆర్ఓపీ ఇవ్వాలి’
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే కార్మికులకు వన్ ర్యాంక్-వన్ పెన్షన్ వర్తింపుచేసేలా పథకాన్ని రూపొందించాలని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ (ఎన్ఎఫ్ఐఆర్) కేంద్రాన్ని డిమాండ్ చేసింది. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని కోరింది. ఈ రెండు డిమాండ్లపై ప్రధానికి మోదీకి లేఖను పంపింది. ఎన్ఎఫ్ఐఆర్ ప్రధాన కార్యదర్శి ఎం.రాఘవయ్య విలేకర్లతో మాట్లాడుతూ.. రైల్వే కార్మికులకు కూడా వన్‌ర్యాంక్-వన్ పెన్షన్ అమలు చేయాలన్నారు. రైల్వేలోని 13.2 లక్షల మంది రైల్వే కార్మికులు సైన్యం తరహాలోనే దేశ సేవ చేస్తున్నారని చెప్పారు. -
మరో‘సారీ’..
ఒంగోలు, న్యూస్‌లైన్: పార్లమెంట్లో బుధవారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో జిల్లాకు మళ్లీ మొండిచేయే చూపారు. దీంతో జిల్లాలో రైల్వే ప్రయాణికులే కాకుండా రైల్వే కార్మికులు కూడా తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఒంగోలు రైల్వేస్టేషన్ అభివృద్ధి గురించి పట్టించుకుంటున్న అధికారులు లేరు. ఒక రకంగా చెప్పాలంటే అభివృద్ధి ఊసే మరిచారు. ఇటీవల భారీ వర్షాలకు ఒంగోలు రైల్వేస్టేషన్‌లోని ట్రాక్‌పై కూడా నీరు నిలిచి రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. క్వార్టర్లలో నివాసం ఉండే రైల్వే ఉద్యోగుల ఇళ్లు మొత్తం నీటలోనే మునిగిపోయాయి. రైల్వే ఉద్యోగుల కోసం ఒంగోలు రైల్వేస్టేషన్లో ఉన్న హాస్పిటల్లో సరైన మెటీరియల్ కూడా ఉండదు. బీపీ, షుగర్ బిళ్లలు సైతం అంతంత మాత్రమే. రైల్వేస్టేషన్లో మరో‘సారీ’.. ఫుట్ ఓవర్ బ్రిడ్జి మాత్రమే ఉండడంతో వికలాంగులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరిగే సమయంలోనే మెట్లతోపాటు ర్యాంప్ కూడా ఏర్పాటు చేయాలని జీఎం చెప్పిన మాటలు సైతం నీటిమూటలే అయ్యాయి. జిల్లాలో శ్రీకాళహస్తి-నడికుడి రైల్వే లైను పశ్చిమ ప్రకాశానికి ఎంతో ఉపయోగం. గత బడ్జెట్లో దీనికి మోక్షం కలిగింది. రాష్ట్ర ప్రభుత్వం- రైల్వేశాఖ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు అంగీకరించాయి. ఆరు నెలల క్రితం అద్దంకి మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ విజ్ఞప్తి మేరకు అద్దంకిని కూడా ఈ లైన్లో చేర్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం స్థల సేకరణకు సంబంధించి సరైన చర్యలు చేపట్టని కారణంగా ఈ లైను పెండింగ్‌లోనే ఉంది. తాజా ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కూడా ఎప్పుడు పనులు మొదలు పెడతారో స్పష్టం చేయలేదు. ఇక ఒంగోలు-దొనకొండ మార్గంపై సర్వేకు కూడా అధికారులు ఆదేశించకపోవడంతో కొత్త రైల్వే లైన్లకు సంబంధించి జిల్లాకు మొండిచేయే మిగిలింది. జిల్లాలోని చాలా రైల్వేస్టేషన్లలో మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటు చేస్తామని ప్రకటించారే గానీ ఆ దిశగా చర్యలు కూడా లేవు. ఇక భద్రత పరంగా రైల్వేస్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేసినా సిబ్బంది సంఖ్యను మాత్రం పూర్తిగా పెంచలేదు. రైల్వే మంత్రి హామీ నెరవేరలేదు ప్రస్తుత బడ్జెట్లో జిల్లాకు పెద్దగా ఉపయోగపడే ప్రాజెక్టులు ఏమీ లేవు. ప్రత్యేకించి మార్కాపురానికి పనికి వచ్చే నూతన రైళ్ల ఏర్పాటు, ట్రాక్‌ల అభివృద్ధిపై బడ్జెట్లో ప్రస్తావనే లేదు. కేవలం అమరావతి -హుబ్లీ ప్రతి రోజు నడపటం, విజయవాడ -కాచిగూడ డబుల్ డెక్కర్ రైలు ఏర్పాటు చేయడం తప్ప ఆశించిన స్థాయిలో బడ్జెట్లో పేర్కొనలేదు. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి గత ఏడాది మార్కాపురం పర్యటన సందర్భంగా మేము ఇచ్చిన వినతి పత్రానికి స్పందించి వచ్చే బడ్జెట్లో (ప్రస్తుత) మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. హామీలు మాత్రం నెరవేరలేదు. ప్రధానంగా కర్నూలు నుంచి విజయవాడ వరకు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్, విజయవాడ నుంచి ముంబై వయా గుంతకల్ మీదుగా ఎక్స్‌ప్రెస్ రైలు, గుంటూరు -హైదరాబాదు ఎక్స్‌ప్రెస్ రైలు, మార్కాపురం రైల్వేస్టేషన్‌ను మోడల్‌స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని మంత్రికి విన్నవించగా, కొన్ని మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చి ఒక్కటి కూడా చేయించలేదు. -ఓ.ఎ.మల్లిక్, మార్కాపురం ప్యాసింజర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉపయోగం లేని బడ్జెట్ ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల వారు శ్రీశైలం వెళ్లాలంటే మార్కాపురం రైల్వేస్టేషన్లో దిగాల్సిందే. మూడో ట్రాక్ ఏర్పాటు, మోడల్ రైల్వేస్టేషన్‌గా మార్పు, విద్యుదీకరణ గురించి ప్రస్తుత బడ్జెట్లో పేర్కొనలేదు. గుంటూరు- తిరుపతి వయా డోన్ మీదుగా రైలు ఏర్పాటు చేయాలని దశాబ్ద కాలంగా కోరుతున్నా స్పందన లేదు. శ్రీశైలం రైలు మార్గంపై కూడా బడ్జెట్లో పేర్కొనకపోవడం శోచనీయం. - కె.ప్రసాద్, కఫార్డ్ సంస్థ చైర్మన్ -
సమ్మె చేద్దాం!
సాక్షి, చెన్నై:రైల్వే కార్మికులు సమ్మెకు జై కొట్టారు. 86.8 శాతం మంది సమ్మెకు ఆమోదం తెలియజేశారు. బ్యాలెట్ ఓటింగ్‌తో సమ్మె నిర్ణయానికి విజయం చేకూర్చారు. ఏఐఆర్ఎఫ్ సభల్లో చర్చ అనంతరం రైల్వే శాఖకు సమ్మె నోటీసు జారీ చేయనున్నట్లు ఎస్ఆర్ఎంయూ ప్రధాన కార్యదర్శి ఎన్.కన్నయ్య ప్రకటించారు. తమ డిమాండ్ల సాధన కోసం రైల్వే కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు. ఇటీవల చేపట్టిన ఆందోళనతో కేంద్రం మెట్టు దిగి వచ్చింది. 38 డిమాండ్లలో రెండింటినీ మాత్రమే అంగీకరించింది. మిగిలిన 36 డిమాండ్లను కేంద్రం పెడచెవిన పెట్టింది. ఇందులో వీఆర్ఎస్ తీసుకునే సిబ్బంది వారసులకు విద్యార్హత ఆధారంగా ఉద్యోగ కల్పన, పెన్షన్ విధానంలో ఎన్పీఎస్ను రద్దు చేసి జీపీఎస్‌ను అమలు చేయాలి, ఆర్ఆర్బీ, ఆర్‌ఆర్‌సీలో రైల్వే ఉద్యోగులకు 20 శాతం సీట్లు కేటాయించాలి, రైల్వేలో ఖాళీలన్నింటనీ భర్తీ చేయాలి, సీసీఎల్‌ను ఎఫ్‌సీఎల్‌గా మార్చాలన్న డిమాండ్లు ఉన్నాయి. ఈ డిమాండ్ల సాధనే లక్ష్యంగా సమ్మె సైరన్ మొగించేందుకు రైల్వే కార్మికులు నిర్ణయించారు.ఓటింగ్ : ఇటీవల ఢిల్లీలో జరిగిన అఖిల భారత రైల్వే కార్మికుల సమాఖ్య మహానాడులో చేసిన తీర్మానం మేరకు సమ్మెకు వెళ్లే ముందు కార్మికుల అభిప్రాయం తెలుసుకునేందుకు నిర్ణయించారు. ఏఐఆర్ఎఫ్ పిలుపు మేరకు దక్షిణ రైల్వే పరిధిలో ఓటింగ్‌కు ఎస్ఆర్ఎంయూ చర్యలు తీసుకుంది. ఈనెల 20,21 తేదీల్లో దక్షిణ రైల్వే పరిధిలోని వెయ్యి చోట్ల బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించారు. చెన్నై, అరక్కోణం, కాట్పాడి, జోలార్‌పేట, చెంగల్పట్టు , దిండివనం, పెరంబూరు తదితర ప్రాంతాల్లో జరిగిన ఓటింగ్‌లో పెద్ద సంఖ్యలో కార్మికులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 85 శాతం సమ్మెకు సిద్ధం : దక్షిణ రైల్వే పరిధిలో ఉపయోగించిన బ్యాలెట్ బాక్సుల్ని చెన్నైకు తెప్పించి ఆది, సోమ వారాల్లో ఓట్ల లెక్కింపు చేశారు. ఇందులో మెజారిటీ శాతం మంది సమ్మెకు జై కొట్టారు. మంగళవారం ఫలితాల్ని ఎస్ఆర్ఎంయూ ప్రధాన కార్యదర్శి కన్నయ్య మీడియాకు విడుదల చేశారు. దక్షిణ రైల్వే పరిధిలో 89,100 మంది కార్మికులు ఉండగా, 82,147 మంది తమ బ్యాలెట్ ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఇందులో 542 ఓట్లు తిరస్కరణకు గురి అయ్యాయి. 81,605 ఓట్లను పరిగణనలోకి తీసుకున్నారు. 91.6 శాతం ఓటింగ్ నమోదు అయింది. ఫలితాల్లో 77,361 మంది సమ్మెకు జై కొట్టగా, 4244 మంది సమ్మె వద్దు అని ఓటు వేశారు. 86.8 శాతం మంది సమ్మెకు అనుకూలంగా ఓటింగ్ వేయడంతో సైరన్ మొగించేందుకు ఎస్ఆర్ఎంయూ సన్నద్ధం అవుతోంది. కార్మిక లోకం నిర్ణయాన్ని అఖిల భారత సమాఖ్యకు పంపుతున్నామని కన్నయ్య పేర్కొన్నారు. ఆ సమాఖ్య మహా సభ జనవరిలో జరగనున్నదని, ఇందులో తీసుకునే నిర్ణయం మేరకు సమ్మె నోటీసునురైల్వే శాఖకు జారీ చేస్తామని పేర్కొన్నారు. -
సమ్మె చేద్దామా... వద్దా..
సాక్షి, హైదరాబాద్: డిమాండ్ల సాధనకు రైల్వే కార్మికులు సమ్మె బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా కార్మికుల అభిప్రాయం తెలుసుకునేందుకు ఆలిండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ దేశవ్యాప్తంగా 17 రైల్వే జోన్లలో స్ట్రైక్ బ్యాలెట్ నిర్వహిస్తోంది. శుక్రవారం ప్రారంభమైన ఈ కార్యక్రమం శనివారం కూడా కొనసాగుతుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 80 వేల మంది ఇందులో పాల్గొననున్నారు. శుక్రవారం దాదాపు 30 వేల మంది ఓటు వేసినట్టు సమాచారం. సికింద్రాబాద్, హైదరాబాద్, వరంగల్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, గుంతకల్, తిరుపతి లాంటి ముఖ్య స్టేషన్లలో వేలాదిగా కార్మికులు పాల్గొన్నారు. దీనిలో వ్యక్తమైన అభిప్రాయంపై చర్చించి సమ్మెపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు ద.మ. రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శంకరరావు ‘సాక్షి’తో చెప్పారు.