
సాక్షి, హైదరాబాద్: రైళ్లు నిలిచిపోవటంతో పనుల్లేక ఇబ్బంది పడుతున్న రైల్వే కూలీలకు ఆ శాఖ సిబ్బంది ఆపన్నహస్తం అందించారు. లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని రైళ్లు నిలిచిపోయాయి. దీంతో పనుల్లేక రైల్వే పోర్టర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రయాణికులు ఇచ్చే డబ్బులు తప్ప వీరికి ప్రత్యేకంగా జీతం అంటూ ఉండదు. దీంతో వీరికి ఆదాయం లేక వారి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. దీన్ని గుర్తించిన దక్షిణ మధ్య రైల్వే కమర్షియల్ విభాగం సిబ్బంది డబ్బులు పోగు చేసి నిత్యావసర వస్తువులు కొని వారికి అందించారు. కొంత నగదు కూడా అందజేశారు.
హైదరాబాద్ డివిజన్‌లో 101 మందికి బియ్యం, పప్పు, నూనె ప్యాకెట్లు, గోధుమ పిండి, ఉప్పు, సబ్బులు, శానిటరీ కిట్లతో పాటు మరికొన్ని వస్తువులను ప్యాకెట్లుగా చేసి వారికి అందజేశారు. వీటితోపాటు ఒక్కొక్కరికి రూ. 2,600 చొప్పున నగదు కూడా అందజేశారు. గుంతకల్లు డివిజన్‌లో 40 మందికి సరుకులతోపాటు రూ.500 నగదు, గుంటూరు డివిజన్ పరిధిలో 33 మందికి సరుకులతోపాటు రూ. 1,500 నగదు, నాందేడ్ డివిజన్ పరిధిలో 33 మందికి సరుకులు అందజేశారు. కమర్షియల్ విభాగం సిబ్బంది వితరణను దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment