రైల్వే సిబ్బందికి 78 రోజుల బోనస్
- సీబీఈసీ ఐటీ ప్రాజెక్టుకు ఆమోదం
- కేంద్ర కేబినెట్ నిర్ణయాలు
న్యూఢిల్లీ: రైల్వే ఉద్యోగులకు శుభవార్త. 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గత ఐదు సంవత్సరాలుగా ఇదే మొత్తంలో రైల్వే ఉద్యోగులకు కేంద్రం బోనస్ అందిస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి గానూ అర్హులైన నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు(ఆర్పీఎఫ్, ఆర్పీఎస్‌ఎఫ్ సిబ్బందిని మినహాయించి) 78 రోజుల వేతనాన్ని ఉత్పాదకత ఆధారిత బోనస్(పీఎల్‌బీ)గా ఇవ్వనున్నారు. దసరా ముందు దాదాపు 12 లక్షల మంది రైల్వే ఉద్యోగులు ఈ బోనస్‌ను అందుకోనున్నారు. ఈ బోనస్ వల్ల రూ. 2090.96 కోట్ల భారం పడనుంది. తాము డిమాండ్ చేసిన మొత్తాన్ని బోనస్‌గా ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించడంపై ‘నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్’ సంస్థ ప్రధాన కార్యదర్శి ఎం రాఘవయ్య హర్షం వ్యక్తం చేశారు.
‘సాక్ష్యం’ ప్రాజెక్టుకు ఓకే
వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వ్యవస్థతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్, కస్టమ్స్(సీబీఈసీ)ను అనుసంధానించేందుకు ఉద్దేశించిన ఐటీ ప్రాజెక్టు ‘సాక్ష్యం’కు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రాజెక్టు వ్యయం రూ. 2,256 కోట్లు.
‘జీఎంబీఎం’ను అంగీకరించం
పౌర విమానయానరంగ కార్బన్‌డై ఆక్సైడ్ ఉద్గారాల స్థాయిని 2020 నాటికి కనిష్టస్థాయికి తగ్గించాలన్న నిర్ణయానికి భారత్ తలొగ్గబోదని, అది అన్యాయమని కేబినెట్ భేటీ అనంతరం జవదేకర్ స్పష్టం చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశంగా తమకు మరింత సమయం అవసరమన్నారు. ఐరాసకు చెందిన ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ప్రతిపాదిస్తున్న ‘గ్లోబల్ మార్కెట్ బేస్‌డ్ మెజర్స్(జీఎంబీఎం)’ తమకు ఆమోదనీయం కాదని తేల్చిచెప్పారు. కేబినెట్ భేటీలో జీఎంబీఎంపై చర్చించామన్నారు.
పారిస్ ఒప్పందానికి ఓకే
చరిత్రాత్మక పారిస్ వాతావరణ ఒప్పందానికి కేంద్ర కేబినెట్ అధికారికంగా ఆమోదం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా భూతాపోన్నతిని తగ్గించే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై అంతర్జాతీయ స్థాయిలో ఈ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. వాతావరణ మార్పుపై పోరులో భారత్ నాయకత్వ స్థాయిని ఈ నిర్ణయం ప్రతిఫలిస్తుందని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. కనీసం 55 దేశాలు అధికారికంగా ఈ ఒప్పందాన్ని ధ్రువీకరించాల్సి ఉంది. కాగా, సృజనాత్మకత, సాంకేతిక అభివృద్ధిలో పరస్పర సహకారానికి ఉద్దేశించి సింగపూర్‌తో కుదుర్చుకోనున్న అవగాహన ఒప్పందానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.