కేబినెట్‌లో 19కొత్త ముఖాలు!
- నేడే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ
- మంత్రివర్గంలో భారీ మార్పులు
- దళిత ఎంపీలకు పెద్దపీట
సాక్షి, న్యూఢిల్లీ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కేంద్ర కేబినెట్ విస్తరణ, పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది. ‘రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం ఉదయం 11 గంటలకు కేబినెట్ విస్తరణ జరగనుంది’ అని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఫ్రాంక్ నొరొన్హా సోమవారం ట్విటర్‌లో తెలిపారు. పలువురు కొత్త ముఖాలకు చోటు దక్కనుండగా, దళిత ఎంపీలకు ప్రధాని మోదీ పెద్దపీట వేసే అవకాశముంది. 19 కొత్త ముఖాలకు చోటుకల్పిస్తారని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. దీంతో కేబినెట్‌లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. నలుగురు స్వతంత్ర మంత్రులకు పదోన్నతి కల్పించే అవకాశముండగా, ఆరుగురిపై వేటుపడే అవకాశముందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌తోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కసరత్తు జరిగినట్లు సమాచారం. మోదీ కేబినెట్‌లో ఇది రెండో విస్తరణ.
కొత్త వారికి అవకాశం.. రిపబ్లికన్ పార్టీకి చెందిన దళిత ఎంపీ రామ్‌దాస్ అథవాలే (మహారాష్ట్ర), అప్నా దళ్‌కు చెందిన అనుప్రియా పటేల్‌కు మంత్రి పదవులు దాదాపుగా ఖరారయ్యాయని తెలుస్తోంది. బీజేపీకి చెందిన ఎస్‌ఎస్ అహ్లూవాలియా(పశ్చిమబెంగాల్-లోక్‌సభ), పురుషోత్తం రుపాలా (గుజరాత్ రాజ్యసభ ఎంపీ) లాంటి కొత్తముఖాలనూ చేర్చుకునే అవకాశముంది. యూపీ నుంచి దళిత మహిళా ఎంపీ క్రిష్ణరాజ్, బ్రాహ్మణ వర్గానికి చెందిన మహేంద్రనాథ్ పాండేలనూ చేర్చుకోవచ్చని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్ నుంచి దళిత ఎంపీ అజయ్ తమ్తా పేరు వినిపిస్తోంది.
అర్జున్ రామ్ మేఘవాల్ (ఉత్తరాఖండ్ దళిత ఎంపీ), సుభాష్ రామ్‌రావ్ భామ్రే(మహారాష్ట్ర), మన్‌సుఖ్‌భాయ్ మాండవీయ (గుజరాత్ రాజ్యసభ ఎంపీ), జశ్వంత్ సింగ్ భాబోర్ (గుజరాత్)కూ బెర్తులు దక్కొచ్చు. వీరితోపాటు రాజ్యసభ ఎంపీలు విజయ్ గోయల్, ఎంజే అక్బర్, అనిల్ మాధవ్ దవే, భూపేందర్ యాదవ్ పేర్లూ వినిపిస్తున్నాయి. పీపీ చౌదరీ (రాజస్తాన్), రాజేన్ గొహైన్ (అస్సాం), సీఆర్ చౌదరి (గుజరాత్) కర్ణాటక దళిత ఎంపీ రమేశ్ చంద్రప్ప జిగజినగీ, మధ్యప్రదేశ్ ఎంపీ ఫగన్‌సింగ్ కులస్తే కూడా ఆశావహుల జాబితాలో ఉన్నారు. వీరిలో చాలామంది సోమవారం బీజేపీ చీఫ్ అమిత్‌షాతో భేటీ అయినట్లు సమాచారం. అనంతరం షా ఆరెస్సెస్ కీలక నేతలతో భేటీ అయి విస్తరణపై చర్చించారు. కేబినెట్ విస్తరణ తర్వాత పార్టీ పునర్‌వ్యవస్థీకరణను చేపట్టనున్నట్లు తెలిసింది.
ఆరుగురిపై వేటు!..స్వతంత్ర హోదాతో బాధ్యతలు నిర్వర్తిస్తున్న నలుగురు మంత్రులకు పదోన్నతి కల్పిస్తారని ప్రచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం స్వతంత్ర హోదాతో ఉన్న పీయుష్ గోయల్ (ఇంధన శాఖ), ధర్మేంద్ర ప్రధాన్(పెట్రోలియం), నిర్మలా సీతారామన్(వాణిజ్యం, పరిశ్రమలు), ముక్తార్ అబ్బాస్ నఖ్వీ (మైనారిటీ వ్యవహారాలు)లకు కేబినెట్ హోదా కల్పిస్తారని తెలుస్తోంది. కొత్తవారికి కేబినెట్ హోదా ఇవ్వరని సమాచారం. అలాగే కనీసం ఆరుగురు మంత్రులపై వేటుపడొచ్చని, అయితే కీలక మంత్రులను కదిలించే అవకాశంలేదని పార్టీ వర్గాలు చెప్పాయి. మరికొంతమంది శాఖలను మార్చవచ్చన్నాయి. అలాగే క్రీడల మంత్రి సర్వానంద సోనోవాల్ అస్సాం సీఎం బాధ్యతలు చేపట్టడంతో ఆ పదవీ ఖాళీగా ఉంది. విస్తరణపై కొన్ని వారాలుగా ఊహాగానాలు చెలరేగిన సంగతి తెలిసిందే. కేబినెట్‌లో ప్రస్తుతం మోదీతో కలిపి 64 మంది మంత్రులున్నారు. రాజ్యాంగ పరిమితి ప్రకారం కేబినెట్‌లో 82 మందికి అవకాశముంది. మొదటి విస్తరణ 2014 నవంబర్‌లో జరిగింది.
నజ్మా, కల్‌రాజ్‌లపై వేటు.. 75 ఏళ్లు పైబడిన వారిని కేబినెట్ నుంచి పంపే అవకాశమున్నట్లు తెలుస్తోంది. యూపీ నుంచి నుంచి యువ రక్తాన్ని మంత్రి వర్గంలో చేర్చుకోవాలని మోదీ నిర్ణయించారని, అందువల్ల కల్‌రాజ్ మిశ్రాతోపాటు నజ్మాహెప్తుల్లాకు ఉద్వాసన తప్పదని బీజేపీ వర్గాలంటున్నాయి. వారికి గవర్నర్ పదవులు దక్కుతాయని, మిశ్రాను మధ్యప్రదేశ్ గవర్నర్‌గా పంపొచ్చని అన్నాయి.
ప్రాథమ్యాలను ప్రభావితం చేస్తుంది: మోదీ
బడ్జెట్ ఫోకస్, ప్రభుత్వ ప్రాథమ్యాలను కేబినెట్ విస్తరణ ప్రభావితం చేస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. సోమవారం తనను కలసిన కొంతమంది జర్నలిస్టులతో కేబినెట్ విస్తరణతోపాటు ఢాకా ఉగ్రదాడిపై మోదీ మాట్లాడినట్లు సమాచారం. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు ప్రపంచం ఏకమవ్వాల్సిన పరిస్థితిని ఢాకా ఉదంతం తేటతెల్లం చేసిందన్నారు. ఫైళ్లను పెద్దఎత్తున క్లియర్ చేసేందుకు ‘కనీస ప్రభుత్వం గరిష్ట పాలన’పై దృష్టిపెట్టామని చెప్పారని, దీంతోపాటు నాలుగు అంశాల ఎజెండా గురించి మోదీ మాట్లాడినట్లు తెలిసింది. ‘దేశంలో ఆర్థిక వృద్ధి రేటు జాబ్‌లెస్‌గా ఉంటుందనడం అవాస్తవం. రిటైల్ రంగంలో ఉద్యోగాల కల్పనపై దృష్టిపెట్టాం. ఇప్పటికే మోడల్ చట్టం కూడా ఆమోదం పొందింది’ అని మోదీ అన్నారు.