
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. రైల్వేశాఖలోని ఉద్యోగులకు 78 రోజుల ఉత్పాదకత ఆధారిత బోనస్(పీఎల్‌బీ) అందించాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో సమావేశమైన కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ..‘78 రోజుల ఉత్పాదకత ఆధారిత బోనస్ ఇవ్వాలన్న నిర్ణయం కారణంగా రైల్వేశాఖలో 11.52 లక్షలమందికిపైగా ఉద్యోగులు లబ్ధి పొందుతారు. దీనివల్ల కేంద్రం ప్రభుత్వంపై రూ.2,024.40 కోట్ల అదనపు భారం పడనుంది. ఈ బోనస్‌తో ఉద్యోగులు మరింత ఉత్సాహంతో పనిచేయడానికి వీలవుతుంది. తద్వారా రైల్వేశాఖలో ఉత్పాదకత పెరుగుతుంది’ అని తెలిపారు.
అయితే కేంద్రం కేవలం 78 రోజుల బోనస్ మాత్రమే ప్రకటించడంపై రైల్వే యూనియన్లు అసంతృప్తి వ్యక్తంచేశాయి. ఈ విషయమై అఖిలభారత రైల్వే ఉద్యోగుల సమాఖ్య స్పందిస్తూ..‘రైల్వే ఉద్యోగుల పనితీరు, ఉత్పాదకత ఆధారంగా బోనస్ అందించాలని మేం కోరాం. ఈ విషయంలో రైల్వేబోర్డు ఉన్నతాధికారులతో చర్చలు కూడా జరిపాం. రైల్వే ఉద్యోగులు కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో పగలు–రాత్రి తేడా లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. మేం న్యాయమైన బోనస్‌నే కోరాం. కానీ దురదృష్టవశాత్తూ అది అమలుకాలేదు’ అని విమర్శించింది.
Comments
Please login to add a commentAdd a comment