న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం జౌళి పరిశ్రమకు ఊతమిచ్చే నిర్ణయం తీసుకుంది. ఆహార ధాన్యాలను తప్పనిసరిగా జనపనార బస్తాల్లోనే నిల్వ చేయాలనే నిబంధనను పొడగించే ప్రతిపాదనకు గురువారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ‘100 శాతం ఆహార ధాన్యాలను, 20% పంచదారను కచ్చితంగా జనపనార సంచుల్లోనే నిలువ చేసే నిబంధనను పొడగించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది’ అని ఆ భేటీ అనంతరం ఒక అధికారిక ప్రకటన వెలువడింది.
పశ్చిమబెంగాల్, బిహార్, ఒడిశా, అస్సాం, ఆంధ్రప్రదేశ్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లోని రైతులు, కార్మికులకు ఈ నిర్ణయం లబ్ధి చేకూరుస్తుందని కేంద్ర మంత్రి జవదేకర్ తెలిపారు. రూ. 7500 కోట్ల విలువైన జౌళి సంచులను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. జౌళి సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. ‘జ్యూట్ ఐకేర్’ ద్వారా రైతులకు ఆధునిక సాగు విధానాలను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇటీవలనే భారత జౌళి కార్పొరేషన్ 10 వేల క్వింటాళ్లæ విత్తనాల పంపిణీ కోసం నేషనల్ సీడ్స్ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
డ్యామ్‌ల నిర్వహణకు ఆమోదం
రానున్న పదేళ్లలో 19 రాష్ట్రాల్లోని 736 ఆనకట్టల నిర్వహణ, ఆధునీకరణ కార్యక్రమానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పదేళ్ల ప్రణాళికలో భాగంగా రూ. 10,211 కోట్లతో ఈ కార్యక్రమ రెండో, మూడో దశ పనులు పూర్తి చేస్తామని కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ, మరో సంస్థ 80% నిధులు సమకూర్చాయని వెల్లడించారు. ఈ పథకం తొలి దశ 2020లో ముగిసిందని పేర్కొన్నారు. తొలి దశలో ఏడు రాష్ట్రాల్లోని 223 ఆనకట్టల నిర్వహణ చేపట్టామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment