సాక్షి, న్యూఢిల్లీ: 5జీ టెలికాం సేవల కోసం ఎదురుచూస్తున్న వారికి కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. ఎప్పటినుంచో ఊరిస్తున్న 5జీ సేవలు 4జీ కంటే దాదాపు 10 రెట్లు వేగంతో త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన స్పెక్ట్రమ్ వేలానికి క్యాబినెట్ బుధవారం తుది ఆమోదం తెలిపింది.
5జీ సేవల బిడ్డర్‌లకు స్పెక్ట్రమ్‌ను కేటాయించే స్పెక్ట్రమ్ వేలాన్ని నిర్వహించాలనే టెలికమ్యూనికేషన్స్ శాఖ ప్రతిపాదనను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల వ్యాపార వ్యయాన్ని తగ్గించేందుకు జూలై చివరి నాటికి 20 సంవత్సరాల చెల్లుబాటుతో మొత్తం 72097.85 MHz స్పెక్ట్రమ్‌ను వేలం వేయనున్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్రైవేట్ 5జీ నెట్‌వర్క్‌లను ఆపరేట్ చేయడానికి వారికి మార్గం సుగమం చేస్తూ, సంస్థలకు నేరుగా ఎయిర్‌వేవ్‌లను కేటాయించే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూలై నెలాఖరులోగా 5జీ స్పెక్ట్రమ్ వేలాన్నినిర్వహించనుంది. దేశంలోని మూడు ముఖ్య టెలికాం సేవల సంస్థలు జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా ఈ వేలంలో పాల్గొంటాయని భావిస్తున్నారు.
ఎయిర్‌వేవ్‌ల కోసం ముందస్తు చెల్లింపును కూడా రద్దు చేసింది ప్రభుత్వం. అలాగే ప్రస్తుతం ఉన్న 13, 15, 18, 21 GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లలో సాంప్రదాయ మైక్రోవేవ్ బ్యాక్‌హాల్ క్యారియర్‌ల సంఖ్యను రెట్టింపు చేయాలని నిర్ణయించింది. నిర్దేశిత సొమ్మును 5జీ స్పెక్ట్రమ్ బిడ్డర్లు 20 నెలవారీ వాయిదాలలో (EMI) చెల్లించవచ్చు. లో, మిడ్, హై అనే మూడు విభాగాల్లో ఈ 5జీ స్పెక్ట్రమ్ వేలం జరగనుంది.
కొత్త శకానికి నాంది
5జీ సేవల స్పెక్ట్రమ్ వేలం భారత టెలికాం రంగంలో కొత్త శకానికి నాంది పలుకుతుందని సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.5జీ స్పెక్ట్రమ్ వేలం జూలై 26న ప్రారంభమవుతుందన్నారు. ప్రధాని డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రకటించిన స్పెక్ట్రమ్ వేలం భారత్‌కా 5జీ ఈకో సిస్టం సాధనలోఅంతర్భాగమని మంత్రి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment