రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు మొండిచేయి
కాజీపేట రూరల్, న్యూస్‌లైన్ : కేంద్ర రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశించిన రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు మరోసారి మొండిచేయి చూపారు. కాజీపేటను డివిజన్ కేంద్రంగా మార్చాలని చేసిన ప్రతిపాదన ప్రస్తావనకే రాలేదు. ఇక కాజీపేటలో రైల్వే వ్యాగన్‌షెడ్ కోచ్ ప్యాక్టరీ మంజూరవుందని ఎన్నో కలలు కన్న జిల్లా వాసులకు నిరాశే ఎదురైంది. ఈ బడ్జెట్‌లో కాజీపేట, వరంగల్ రైల్వేస్టేషన్లతో పాటు జిల్లాలో ప్రధాన రైల్వేస్టేషన్ల అభివృద్ధి ప్రస్తావనే రాలేదు.
కాజీపేట మీదుగా వెళ్తున్న నాన్‌స్టాప్ రైళ్లకు ఇక్కడ హాల్టింగ్ కల్పిస్తారని భావించిన ప్రయాణికుల ఆశలు గల్లంతయ్యాయి. పద్మావతి, కరీంనగర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను తిరుపతికి రోజూ నడుపుతారనే ఆశలు ఫలిం చలేదు. కాజీపేట జంక్షన్ మీదుగా సికింద్రాబాద్, విజయవాడ, న్యూఢిల్లీ రూట్లలో కొత్త రైళ్ల ప్రస్తావనే రాలేదు. ఎక్స్‌ప్రెస్ రైళ్లలో మహిళలు, వికలాంగులకు అదనపు జనరల్ బోగీల విషయం పక్కన పెట్టారు. కాజీపేట జంక్షన్‌లో నిర్మించబోయే 24 బోగీల ఫిట్‌లైన్ నిర్మాణానికి నిధులు మంజూరు కాకపోవడంతో పెండింగ్‌లో పడినట్లయింది.
ఈ ఫిట్‌లైన్ వస్తే కాజీపేట జంక్షన్ నుంచే నేరుగా రెండు కొత్త రైళ్లను ప్రారంభించవచ్చు. జిల్లాలోని పెండింగ్ రైల్వే లైన్లు, సర్వే అయిన రైల్వే లైన్లకు నిధుల మంజూరు, కొత్త రైళ్ల ప్రస్తావన కూడా బడ్జెట్‌లో చోటు చేసుకోలేదు. బల్లార్షా నుంచి విజయవాడకు వయా కాజీపేట మీదుగా వెళ్లే మూడో రైల్వే లైన్ మార్గానికి నిధులు మంజూరు కాలేదు. కాగా, రానున్న రోజుల్లో రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఖర్గే ప్రకటించారు. రైల్వే కార్మికులు, రైల్వే కార్మికుల పిల్లలకు ఎలాంటి రైల్వే పథకాలు లేకపోవడంతో కార్మికులకు నిరాశే మిగిలింది. మొత్తానికి ఖర్గే రైల్వే బడ్జెట్‌పై జిల్లా ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రెండు రైళ్లతో ఊరట
కొత్తగూడెం-లక్నో ఎక్స్‌ప్రెస్ రైలు జిల్లా మీదుగా వారం లో మూడు రోజులు. అలాగే, కాజీపేట మీదుగా సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్టణం వరకు వీక్లి రైలును ప్రవేశపెడుతున్నట్లు ఖర్గే బడ్జెట్‌లో ప్రకటించారు. ఇదిలా ఉంటే ఎలాంటి రైలు చార్జీలు, రవాణా చార్జీలు పెంచడం లేదని చెప్పడంతో ప్రయాణికులు కొంత ఊరట చెందారు.
ఫలించని ఎంపీల ప్రతిపాదనలు
జిల్లాలోని వివిధ రైల్వే ప్రాజెక్టుల విషయంలో రైల్వే బోర్డుకు పంపించిన ఎంపీల ప్రతిపాదనలు ఫలించలేదు. ఉన్న ప్రాజెక్టులకు నిధులు మంజూరు కావాలని, కొత్త రైల్వే లైన్లు, కొత్త రైళ్లు, పలు స్టేషన్లలో రైళ్ల హాల్టింగ్ లు, రైళ్ల పొడిగింపు అంశాలపై చేసిన ప్రతిపాదనలు ఖర్గే బడ్జెట్‌లో ప్రస్తావనకు రాలేదు.