జిల్లా ప్రాజెక్టులకు...
బడ్జెట్‌లో అరకొర నిధులే
వేసవిలో ప్రాజెక్టుల
పనులకు కీలక సమయం
రానున్న ఖరీఫ్ నాటికి పనులను
పూర్తి చేయాల్సిన లక్ష్యం
ప్రాధాన్యతను మర్చి నిదుల
కేటాయింపులో చూపని శ్రద్ద
కేటాయించిన నిధులతో
ఖరీఫ్ నాటికి ప్రాజెక్టుల సిద్ధం కష్టమే
గద్వాల, న్యూస్‌లైన్ : వచ్చే ఖరీఫ్ నాటికి మూడు భారీ ఎత్తిపోతల పథకాల ద్వారా నీటి విడుదలకు అవసరమైన పనులను సిద్ధం చేయాల్సిన తరుణంలో, నీటిపారుదల శాఖ జిల్లాలోని ఆరు ప్రాజెక్టులకు రూ.1774 కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపగా, ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో ప్రభుత్వం కనీసం సగం మేరకు కూడా నిధులు కేటాయించకుండా కేవలం రూ.417 కోట్లను మాత్రమే విదిల్చింది. దీంతో వచ్చే ఖరీఫ్ నాటికి ప్రాజెక్టుల పనులు పూర్తి చేయడం కష్టమే. 2012 సెప్టెంబర్ నెలలో 14,15,16 తేదీలలో నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి మూడు భారీ ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వం జాతికి అంకితం చేసింది. నాటి నుంచి నేటి వరకు ఈ ప్రాజెక్టుల పరిధిలో ఆయకట్టుకు నీళ్లివ్వలేకపోయింది. ఈ వేసవిలో ఖరీఫ్ ఆయకట్టుకు నీళ్లిచ్చేలా మూడు ప్రాజెక్టులను సిద్ధంృచేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇంతటి కీలక సమయంలో మూడు భారీ ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం నిధులు ఇవ్వడంలో ఏమాత్రం ప్రాధాన్యమివ్వలేదు. అధికారులు కోరిన రూ.1774 కోట్లలో కనీసం సగం మేరకు కూడా ఇవ్వలేకపోయింది. దీంతో ఈ మూడు ప్రాజెక్టుల పరిధిలో వేసవిలో చేయాల్సిన పనులకు గ్రహణం పట్టేలా ఉంది.
ఈ వేసవి నాటికి పనులు పూర్తి చేయలేకపోతే ఆగస్టు నుంచి ప్రాజెక్టుల పరిధిలో పనులను కొనసాగించేందుకు వీలు కాదు. మళ్లీ డిసెంబర్ తరువాతనే పనులు కొనసాగించేందుకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నిధుల కేటాయింపులో చూపిన నిర్లక్ష్యం కారణంగా నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలలో వచ్చే ఖరీఫ్ నాటికి లక్ష్యం మేరకు ఆయకట్టుకు నీళ్లివ్వడం సమస్యనే. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టులలో జూరాల ప్రాజెక్టు మరమ్మతులు, ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు రూ.318 కోట్లు ఇవ్వాలని అధికారులు కోరినా, కేవలం రూ.49 కోట్లు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు రూ.31 కోట్లు ఇవ్వాలని కోరగా, రూ.20 కోట్లు, ఆర్డీఎస్ నిర్వాహణకు రూ.15 కోట్లు అడుగగా ఇందులోనూ కోత విధిస్తూ రూ.13 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశారు. ఈ అరకొర కేటాయింపులపై జిల్లా వ్యాప్తంగా వివిధ వర్గాలనుంచి నిరసన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రైతు సంఘాలు, ప్రజాల సంఘాలవారు గట్టిగా విమర్శిస్తున్నారు.
జస్ట్..విదిల్చారు..!
Published Tue, Feb 11 2014 5:47 AM | Last Updated on Sat, Sep 2 2017 3:35 AM
Advertisement
Advertisement