ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : సాధారణ ఎన్నికలు ముంచుకొస్తుండటం, తెలంగాణ ఏర్పాటుపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో సోమవారం నుంచి ఆరంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2014-15) ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రతిపాదించనుంది. ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలల వ్యయానికి సంబంధించి ఓటాన్ అకౌంట్‌కు సభ ఆమోదం పొందుతారు.
ఈ సమావేశాలకు జిల్లాలోని ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండాలని, ఆయా పార్టీల అసెంబ్లీ ఫ్లోర్ లీడర్లు సమాచారం అందించడంతో జిల్లా ప్రజాప్రతినిధులు భాగ్యనగరం బాట పట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, ఆత్రం సక్కు, టీడీపీ ఎమ్మెల్యేలు గేడం నగేష్, సుమన్ రాథోడ్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, వేణుగోపాలాచారి, కావేటి సమ్మయ్య, నల్లాల ఓదేలు, అరవిందరెడ్డి, సీపీఐ శాసనసభా పక్షనేత, బెల్లంపల్లి ఎమ్మెల్యే గుండా మల్లేష్‌లు పాల్గొననున్నారు. కాగా బడ్జెట్ సమావేశాలు రెండు మూడు రోజులే నిర్వహించి ప్రభుత్వం సమస్యలపై చర్చించకుండా చేతులు దులుపుకోవాలని చూస్తుందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.
గడువు పొడిగించాలి..
సోమవారం నుంచి ప్రారంభమవుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కాలం పొడిగించాలనే డిమాండ్ వెల్లువెత్తుతోంది. ఈ ఏడాది ఎన్నికలు జరగనుండడంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నిర్వహించడం జరుగుతోంది. దీంట్లో కేవ లం జీత భత్యాలు, ప్రభుత్వ నిర్వహణ నిధులపైనే ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో ఆమోదం పొందనున్నాయి. అయితే ప్రభుత్వం ప్రజల సమస్యలను పక్కన బెట్టి కేవలం బడ్జెట్‌ను ఆమోదించుకుని పక్కకు తప్పుకోవాలని చూస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ సమావేశాలను పది రోజులపాటు పొడిగించి రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు.
నష్టపరిహారంపై చర్చించాలి..
జిల్లాలో ప్రధానంగా గతేడాది ఆగస్టు, సెప్టెంబర్‌లలో కురిసిన భారీ వర్షాలకు 61 వేల హెక్టార్లలో రూ.63 కోట్ల పంటలు రైతులు నష్టపోయారు. ఆరు నెలలు దాటినా పంట నష్టపరిహారం అందలేదు. దీంతో వచ్చే ఖరీఫ్ నాటికి పంట సాగుకు చేతిలో పైసలు లేక రైతన్నలు దిగులు చెందుతున్నారు. ఈ పరిస్థితిలో రైతుల సమస్యలపై చర్చించి పంట నష్టపరిహారం అందజేసే విషయంలో ప్రభుత్వం మెడలువంచుతారని భావిస్తే కేవలం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో ప్రభుత్వం సమస్యలపై దృష్టి సారించకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
కాగా రబీలో విద్యుత్ కోతల కారణంగా పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ఇటు పరిహరం రాక, అటు పంట నష్టంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గడిచిన ఖరీఫ్ నుంచి ఇప్పటివరకు 50 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరోవైపు అప్పట్లో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని రోడ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. రవాణ వ్యవస్థ పూర్తిగా స్తంభించింది.
సమావేశాలు బహిష్కరిస్తాం.. : టీఆర్‌ఎస్
ఈ పరిస్థితుల్లో జిల్లాలోని రోడ్ల అభివృద్ధి విషయంలో దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రవేశపెట్టనుండగా, తెలంగాణపై తప్పుడు లెక్కలు చూయిస్తే సమావేశాలు బహిష్కరిస్తామని టీఆర్‌ఎస్ హెచ్చరిస్తుంది. ఇంకోపక్క రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లుపై చర్చలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ సీమాంధ్ర శాసనసభ్యులు తీర్మానం చేయడాన్ని తెలంగాణ శాసనసభ్యులు జీర్ణించుకోవడం లేదు. అయితే సోమవారం ఆయా పార్టీలు తీసుకునే నిర్ణయం ఆధారంగా సమావేశాల్లో పాల్గొనాలా వద్దా అనేది నిర్ణయించుకునే అవకాశం ఉంది. ఇంకో పక్కా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే చివరి శాసనసభ సమావే శం అవుతుందని పలువురు జిల్లా నేతలు పేర్కొంటున్నారు.
అధ్యక్షా..
Published Mon, Feb 10 2014 2:52 AM | Last Updated on Sat, Sep 2 2017 3:31 AM
Advertisement
Advertisement