సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జనాకర్షక పథకాలుంటాయని భావించిన వారికి నిరాశే మిగిల్చిం ది బడ్జెట్.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జనాకర్షక పథకాలుంటాయని భావించిన వారికి నిరాశే మిగిల్చిం ది బడ్జెట్. ఈ బడ్జెట్‌లో జిల్లాకు అంతగా ప్రాధాన్యత దక్కలేదు. బడ్జెట్ కేటాయింపుల మిగులును కలుపుకొని అదనంగా అరకొరగానే నిధులు కేటాయించా రు. ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి పథకానికి రూ. 1,051 కోట్లు కేటాయించినా, జిల్లాకు సంబంధించిన 20, 21, 22 ప్యాకేజీలకు దక్కేది కొసరంతే. ఎస్సారెస్పీ స్టేజ్-1 కోసం గత బడ్జెట్‌లోని మిగులుకు అదనంగా కేటాయించింది రూ. 20 కోట్లే. నిజాంసాగర్ ఆధునీకరణకు మాత్రం రూ.180 కోట్లు కేటాయించారు. మిగిలిన ప్రాజెక్టులకు అంతంత మాత్రంగానే నిధులిచ్చి నిరాశపరిచారు.
నిండా నిర్లక్ష్యం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం జలయజ్ఞం నిర్లక్ష్యానికి గురవుతోంది. సోమవారం ఆనం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ దీనికి నిదర్శనం. ప్రాజెక్టులకు నామమాత్రం గా నిధులు కేటాయించారు. ఎన్నికల సంవత్సరంలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌లో జిల్లాకు అరకొరగానే కేటాయింపులు చేశారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తుండడంతో జిల్లాలోని నీటి పారుదల రంగానికి భారీ వాటా దక్కుతుందని భావించినా.. నిరాశే మిగిలింది.
బడ్జెట్‌లో మనకు
ఏడు జిల్లాలలో 16.40 లక్షల ఎకరాలకు సాగునీరందించే ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి పథకానికి ఈసారి మొక్కుబడిగానే కేటాయింపులు జరిగాయి. 2013-14 బడ్జెట్‌లో ప్రాణహిత-చేవెళ్లకు రూ.737 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈసారి మిగులు కలిపి రూ.1051 కోట్లుగా పేర్కొంది. అయితే జిల్లాలో 3.04 లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో చేపట్టిన 20, 21, 22 ప్యాకేజీలకు అరకొర వాటానే దక్కనుంది.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు స్టేజ్-1 కోసం రూ. 160 కోట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్‌లో పేర్కొన్నా.. గత బడ్జెట్‌లో మిగులుకు ఇది రూ. 20 కోట్లే అదనం. అంతర్రాష్ట్ర లెండి ప్రాజెక్టుకు రూ.45 కోట్లు, చౌటపల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ. 10 కోట్లు, అర్గుల రాజారాం గుత్ప ఎత్తిపోతలకు రూ. 8 కోట్లు, అలీసాగర్‌కు రూ. 4 కోట్లు కేటాయించారు. పోచారం లేక్‌కు రూ.కోటి, రామడుగుకు రూ. 95 లక్షలు, నల్లవాగు మత్తడికి రూ. 50 లక్షలు.
నిజాంసాగర్ ఆధునికీకరణ పనులు, కాలువల మరమ్మతులు మాత్రం ఊపందుకునే అవకాశాలున్నాయి. ఇందుకోసం ఈ బడ్జెట్‌లో రూ.180 కోట్ల రూపాయలు కేటాయించారు. తెలంగాణ యూనివర్సిటీలో భవనాల నిర్మాణం కోసం రూ. 5 కోట్లు, మెడికల్ కాలేజీ కోసం రూ.7 కోట్ల కేటాయించారు.